‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ

“వారం వారం వచన కవితల పోటీ – 3” కి ఇచ్చిన అంశం: దేశభక్తి

25 మంది కవితలు పంపారు. ఏడుగురు కవుల వచన కవితలు బాగున్నాయి. విజేతలు సింగరాజు శ్రీనివాసరావు, గోలి హనుమచ్ఛాస్త్రి, జయసుధ కోసూరి, ఆకెపోగు నాగరాజు, చిత్తలూరి, డా . నల్లాన్ చక్రవర్తుల సుధా మైధిలి, ఎనికేపల్లి శివకుమార్.

పోటీకి జత పరచిన మూల్యాంకనం స్కేలులోని అంశాలు ఒక అవగాహనకు మాత్రమే. ప్రతి కవితలో అన్ని అంశాలు ఉండాలని లేదు. చెబుతున్న విషయం అందంగా చెప్పటానికి అవసరమైన అంశాలు ఉంటే చాలు.

మినీ కవితల పోటీలలో పాల్గొన్నట్లే వచన కవితల పోటీలలో కూడా ఉత్సాహంగా పాలు పంచుకోవాలని కవులకు మనవి. మినీ కవితలలాగే… బాగున్న వచన కవితలు కూడా పత్రికలలో ప్రచురణ అయ్యేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెల నెలా “వచన కవిత” పేరుతో అంతర్జాల సంచికలు కూడా వస్తాయి. ఈ వచన కవితల పోటీలు జూన్ వరకు కొనసాగుతాయి. తరువాత ఫలితాల విశ్లేషణలు, మంచి కవితలుగా ఎంపికైన కవితలతో పాటు మరి కొన్ని కవితలతో “వచన కవిత వెలుగులు” పేరుతో పుస్తకం కూడా వస్తుంది.

మూడు నెలల పోటీలు పూర్తయ్యాక ప్రత్యేకించి ముగ్గురు కవులకు వచన కవిత ప్రతిభా పురస్కారాలు “అమరావతి సాహితీ మిత్రులు” అందిస్తారు. అందరికీ కృతజ్ఞతలు.

“దేశభక్తి” గురించి కవులు రాసిన కవితల్ని పోటీ ప్రకటన పోస్టులో చదవవచ్చు.

ఇక ఈ వారం అందిన కవితల విశ్లేషణ చూద్దాం.

పచ్చబొట్టు (శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు)
___________________________________________________

మైకులకు మూర్ఛలు వచ్చి
తలలు వాల్చుకున్నాయి…

దొరికిన చాక్లెట్లను జేబులో వేసుకుని
ఎగురుతున్న గుడ్డకు సెల్యూట్ చేశాడా కుర్రాడు,
ఆ పసివాడికి తెలిసినది ఒక్కటే
జెండా ఎగిరితే అది చాక్లెట్ల పండుగని!
జిజియా బాయిలా దేశాన్ని గూర్చి చెప్పలేదు తల్లి
ఆంగ్లాన్ని నూరి గొంతులో పోస్తున్నది…

పాఠాలను బట్టీ పట్టించాడే తప్ప
దేశభక్తి బీజాక్షరాలను వ్రాయించలేదు గురువు
అందుకేనేమో ఈ నేల పక్షులు
పరాయి నేలలకు ఎగిరిపోతున్నాయి,,,

పుట్టిన భూమి మీద మమకారం
తల్లి గోరుముద్దలో నేతిబొట్టు కావాలి,
అమ్మలను కన్న అవని తల్లి మీద
ప్రేమతో కూడిన భక్తి సిరలలో నిండిపోవాలి…

దేశభక్తి అనేది మాటల పైపూత కారాదు
ప్రతి పౌరుని గుండెల హృదయ స్పందన కావాలి
దేశభక్తి గగనంలో ఎగిరే పతాకపు నీడలో కాదు
దేశంలోని ప్రతి వ్యక్తి ఎదపై పచ్చబొట్టుగా మారాలి…

దేశభక్తి అనగానే లేనిది, కనిపించనిది… ఉన్నట్లు చెప్పటం లేదు కవి. వాస్తవంగా పౌరులలో దేశభక్తి లోపించటం కవి గమనించారు. అందుకు కారణాలను ఈ వచన కవితలో చెప్పటం విశేషం. దేశభక్తి గురించి మనవాళ్ళు చెప్పే అతిశయోక్తులను “మైకులకు మూర్చలు వచ్చి” అని చెప్పటం ద్వారా గుర్తు చేస్తున్నారు. “మైకులు తలలు వాల్చుకున్నాయి” అంటే దుర్మార్గులు దేశద్రోహులు కూడా దేశభక్తి గురించి ప్రసంగాలు చేస్తుంటే మైకులు సిగ్గు పడుతున్నాయని భావం. పిల్లవాడికి స్వతంత్రం పండగ అంటే తినటానికి పనికొచ్చే చాక్లెట్ ఇచ్చేది అని మాత్రమే అర్థం. పిల్లాడికి జెండా అంటే కేవలం ఒక రంగు గుడ్డ అని మాత్రమే. ఇందుకు కారణం మన పెంపకంలోని లోపం అని తెగేసి చెబుతున్నారు కవి. శివాజీకి తల్లి దేశభక్తి అంటే ఏమిటో స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పింది. అందుకు దేశానికి పౌరులు ఏమి చెయ్యాలో కూడా చెప్పింది. కాని నేడు మన తల్లులు డబ్బు సంపాదన గురించి మాత్రమే చెబుతున్నారు. చదువు అనేది డబ్బు సంపాదనకు మాత్రమే అని చెబుతున్నారు కాని డబ్బు కన్నా మించిన సంస్కారం ఒకటి ఉండాలని చెప్పటం లేదు. దేశభక్తిని బీజాక్షరాలు అని గొప్పగా చెప్పారు. దేశభక్తి తెలియని ఈ దేశం పక్షులు పరాయి దేశాలకు వలస పోతున్నాయి అని కవితాత్మకంగా చెప్పారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్ని “ఈ దేశం పక్షులు” అన్నారు. వలసను “ఎగిరిపోవటం”గా వర్ణించారు. గురువులు సరిగా దేశభక్తి నేర్పటంలేదు అంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా దేశభక్తి నేర్పేదిలా లేదు అని కవి ఆవేదన. ఇందుకు పరిష్కారంగా పుట్టిన గడ్డ మీద మమకారం “తల్లి గోరుముద్దలోని నేతి బొట్టు” కావాలి అని చాల అందంగా చెప్పారు. నేతి బొట్టు మనిషికి ఎంతో బలవర్ధకం. అలాగే దేశభక్తి కూడా మనిషి పురోగతికి అవసరం అని వ్యవస్థ తెలియజేయాలి, సిరలలో రక్తం ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యంగా ప్రవహించాలి అని కవి కోరుకుంటున్నారు. కవిత ప్రారంభంలో చెప్పిన భావం కవిత ముగింపులో మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని చక్కని సందేశం ఇచ్చారు. దేశభక్తి మాటల పైపూత కాదు, బడాయి ప్రచారం కాదు. గుండెల కదలిక కావాలి అని చెప్పటం కవిత్వం. ప్రతి వ్యక్తి హృదయం మీద ఎప్పటికీ చెరగని, ఎవ్వరూ మాయ మాటలతో చెరపలేని గొప్ప ముద్రగా ఉండాలి అని చెప్పటానికి “ఎదపై పచ్చబొట్టుగా మారాలి” అని బాగా చెప్పి కవిత ముగించారు. మంచి వచన కవిత ఇది.

దే(హ)శ భక్తి (గోలి హనుమచ్చాస్త్రి, గుంటూరు)
________________________________________________

ఓ దేశమా!
నీ కులమేదో చెప్పు,
ఒంటికి హత్తుకుంటాం!
నీ మతమేదో చెప్పు,
నెత్తికెత్తుకుంటాం!
నీ పార్టీ ఏదో చెప్పు,
జెండా పట్టుకుంటాం!

నీవు నాకు ఏమౌతావో చెప్పు,
అక్కున చేర్చుకుంటాం!
నీవు నాకు ఏమిస్తావో చెప్పు,
దండం పెట్టుకుంటాం!
దేవుడైనా, దేశమైనా
కులమో, మతమో, పార్టీనో,
బంధమో, అనుబంధమో
లేకుంటే ఎలా?

అయినా, జెండా ఎగరేసి
మా “కర్మ”ను మరువకుండా
ఏడాదికి రెండు “దినాలు”
పెడుతున్నాం దండాలు!
ఇది “దేశభక్తి” కాదంటావా?

“దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్”
మేమే కదా ఈ దేశం
మా “దేహ” భక్తియే “దేశ భక్తి”!!!

ఈ కవితను చదువుతుంటే ముందు మనకు ఏమిటి ఇలా రాసారు అనిపిస్తుంది. మనుషుల్లో తరిగిపోతున్న దేశ భక్తిని ఇలా వ్యంగ్యంగా చెబుతున్నారు. ఎవడికి వాడికి ఉపయోగపడితే దేశం గొప్పది, ఏమైనా బాధ్యతలు గుర్తు చేస్తే అది నచ్చదు అనే విషయం చెప్పాలని కవి ఉద్దేశం. ముందు నెమ్మదిగా మొదలు పెట్టి క్రమంగా వేగం పెంచి చివరకు చాలా మంది మనుషుల్లో ఉన్న అసలు విషయం బయట పెట్టేసారు. కులం మతం పార్టీలకు ఇచ్చే ప్రాధాన్యం దేశానికీ ఇవ్వటం లేదనే భావం నిక్కచ్చిగా చెప్పారు. ఏదో ఒకటి ఇస్తేనే దేశ భక్తీ తలచుకుంటారు, అవి ఉచితాలు వగైరా ఏవైనా కావచ్చు. న్యాయ బద్ధమైనవి కాకపోయినా పరవాలేదు జనాలకు ఇస్తుంటే సంతోషంగా ఉంటారు. అలాంటివి ఏవీ ఇవ్వకపోతే దేశం సరైన దారిలో వెళుతున్నట్లు కాదు. ఏడాదికి రెండు రోజులు పండుగ జరుపుతున్నారు. ఆ పండుగలను “దినాలు” అని వ్యంగ్యంగా చెబుతున్నారు. స్వతంత్రం వచ్చిన రోజు, రిపబ్లిక్ డే … ఈ రెండు రోజులు మరిచిపోకుండా దినాలు చేసుకుంటారు. మా “కర్మ”ను మాత్రం వదిలివేయకుండా… అంటున్నారు. అంటే మేము చేసే అన్యాయ అక్రమ కార్య కలాపాలు మాత్రం చేస్తూనే ఉంటాం అని చెప్పటం. దేశమంటే మట్టి కాదు, మనుషులన్న మహా కవి మాట గుర్తుకు తెస్తూ మనుషులకు ఏదో ఒకరకంగా మంచిదైనా ముంచేదైనా దేశాన్ని ముంచేదైనా పరవాలేదు, తమ స్వార్ధాన్ని అత్యాశల్ని ముంచనివి అయితే చాలు, దేశభక్తి గురించి ఎంతయినా మాట్లాడుతుంటారు. దేశమంటే మనుషులు కాబట్టి మనుషుల “దేహ భక్తీ” అంటేనే “దేశభక్తి” అనే ఎక్కువ మంది ప్రజల వైఖరిని ఎండగడుతూ రాసిన కవిత ఇది. కవితలో పెద్దగా వర్ణనలు వగైరాలు ఏమీ లేవు. కానీ కవిత అంతా వ్యంగ్యం నిండి ఉంది. మనుషుల వైఖరి నిర్మాణాత్మకంగా ప్రవహించాలి అనేది పరోక్షంగా చెప్పాలని ప్రయత్నిస్తున్న ఈ వచన కవిత మంచిదే.

దేశభక్తి (సుధ కోసూరి)
___________________________________

ఓ నెత్తుటి వాగొకటి కొత్త నడక ప్రారంభించింది.
ఒత్తు లేసిన కళ్ళకు చమురై హద్దుల కాపలా కాస్తుంది.
పేగు బంధాలకు ఓదార్పు లేపనం పూసి
ఒంటరిగా దేశ సేవకై ఆకుపచ్చని చొక్కా తొడుక్కుంది..!
ప్రాణాన్ని తుపాకీ గుళ్ళుగా ఎక్కించి
శత్రు మూకల తుదముట్టించేందుకు ఊపిరి నెగరేస్తుంది.
భరత మాత చను బాలను తాగిన కృతజ్ఞత
పొరలు పొరలుగా దేహాన్ని పరుచుకొని
పోరాట శకానికి తెరదీసింది..!
ప్రేమతో అమ్మ పెట్టిన నాలుగు ముద్దల బువ్వ
ఆప్యాయతను గుర్తు చేస్తుంటే…
కన్నీళ్లు దాటని కళ్ళు ముష్కరుల రాకను ముందే పసిగడుతున్నాయి..!
భుక్తినిచ్చిన దేశం కోసం శక్తిని ధారబోసి శత్రువుని గెలిచిన ఓ ధైర్యం,
ఏ తూనికరాయీ తూచ లేని బాధను మోస్తూ..
అర్పించిన ప్రాణం..
ఓ గర్వపు పావురాయై
జాతీయ పతాకం ఫై వాలింది!!

కవిత నిండా చక్కని వ్యక్తీకరణ విశేషాలు ఉన్నాయి. చిక్కని కవిత్వం అయినా ఎక్కడా అస్పష్టత లేదు. ఒక పెద్ద వ్యాసం రాయదగ్గ కవిత. కవితలోని కొన్ని కొన్ని భావాలని కొన్ని కొన్ని స్టాంజాలుగా విభజించుకొని వుంటే పాఠకులకు విషయం ఇంకా బాగా తేలికగా అందుతుంది. మంచి వచన కవిత ఇది.

దేశభక్తి (చిత్తలూరి)
__________________________

దేశభక్తి
తనలో తను గొణుక్కుంటోంది
దేశమంటే‌ మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయని
చదువుకున్నప్పుడు . . .

దేశాన్ని ప్రేమించటమే
నిజమైన దేశభక్తని
అనుకున్నప్పుడు . . .

మరి దేశంలో వున్న
ప్రతి మనిషినీ ప్రేమించటమే
దేశభక్తి కావాలిగా..!
దేశభక్తి
తనలో తను గొణుక్కుంటోంది!

దేశభక్తిని ఇక్కడ కవి “పర్సానిఫికేషన్”. అంతే కాదు, నిజమైన ఒక దేశభక్తుడిని ఒక మూలాన కూర్చోబెట్టారు. అప్పుడు ఆ దేశభక్తుడు ఇలా గొణుక్కుంటూ ఉన్నాడని కూడా స్ఫురిస్తుంది. దేశంలోని మనుషుల్ని అందరినీ ఎలాంటి కుల మత ప్రాంత ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా ప్రేమించటమే అసలైన దేశభక్తి అని కవి గుర్తు చేస్తున్నారు. కవిత కొంచెం చిన్నదే అయినా మంచి వచన కవిత.

దేశభక్తి (ఆకెపోగు నాగరాజు)

నేను నడిచిన నేల యిదే
నేను పీల్చిన గాలి యిదే
నేను త్రాగిన నీళ్ళు యివే…

అణువణువున ప్రాణమై
నా తను వొక వేణువై
సమతా సప్త స్వరాలను
పలికించినవి యివే…

గుడులే నాకు బడులై
నుడులు నాకు నేర్పించెను
కడదాకా నన్ను నడిపించెను…

మట్టిలో మణులు పండించు
గట్టి మనుషుల కష్టాలు
పుట్టిన దేశానికి పున్నములని
కనువిప్పు కలిగించిన దేశ మిదే…

కన్నీటిని పన్నీరుగ మార్చినది
మానవ సేవే మాధవ సేవని బోధించిన
మానవతా వికసిత సుమ మీ భారతదేశం.

చక్కని ప్రవాహ శైలిలో దేశం గురించి చెప్పారు కవి. కవితాత్మకంగా సాగింది. అణువణువునా దేశం ప్రాణమై తనువు ఒక వేణువై “సమతా” సప్త స్వరాలను పలికించినవి ఈ దేశం సహజ సంపదలు అన్నారు. ఇందులో “సమత” గురించి చెప్పటం విశేషం. “గట్టి మనుషుల కష్టాలు దేశానికి పున్నములు” అని ఎంతో ఉదాత్తంగా వర్ణించారు. మానవా వికసిత సుమం భారత దేశం అని అద్భుతంగా వర్ణించారు. మంచి వచన కవిత ఇది.

దేశభక్తి (డా ఎన్. సి.హెచ్ సుధా మైథిలి, గుంటూరు)
_________________________________________________

ప్రాణ మెత్తుగా పెంచుకున్న పేగు బంధాన్ని
నిర్దయగా ప్రళయ భూమిలోకి పంపేలా చేస్తుంది.

పెళ్లినాటి ప్రమాణాలను పక్కన పెట్టి
మృత్యు కుహరంలోకి నవ్వుతూ సాగనంపేలా చేస్తుంది.

కాళ్ళకు అడ్డం పడుతున్న
బోసినవ్వులను విడిచివెళ్లాలన్న
బాధ గుండెల్లో ఉప్పొoగుతున్నా..

వేదనను కనురెప్పలు దాటనివ్వక
వెంటనే తిరిగి వచ్చేస్తా నన్న
అందమైన అబద్ధాలను పలికేలా చేస్తుంది.

దేశం కోసం ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని,
గుప్పెడు మెతుకుల కోసం అర్రులు చాచేలా చేస్తుంది..
కోటల్లో నివసించేవారి నైనా కారాగారం పాల్జేస్తుంది..

గుండెల్లో బడబాగ్నులు రగులుతున్నా ..
హిమనగముపై నిలిపి పహారా కాయిస్తుంది..

దేహం నుండి రుధిరం ధారలు కడుతున్నా..
పెదవులపై చిరునవ్వుల వెన్నెలలు పూయిస్తుంది..

జన్మనిచ్చిన భూమికోసం నిరంతరం
మృత్యువుతో స్నేహం చేయిస్తుంది..,
తన ఒడిలోనే ఒరిగేలా చేస్తుంది..

“దేశభక్తి” ఆ ఒక్క భావనే అనంతమౌ అవనిలో
అమరుడ్ని చేస్తుంది..
వసుధైక కుటుంబమన్న ఆలోచనకు
ఆయువు పోస్తుంది..

నిజమైన దేశభక్తి ఎన్ని విధాలుగా అంకితం అవుతుందో అద్భుతంగా చెప్పారు కవయిత్రి. ప్రతి భావం కూడా కవితాత్మకంగా ఉంది. మంచి వచన కవిత ఇది.

దేశభక్తి (శివకుమార్ ఎనికేపల్లి)
_________________________________

దేశమంటే మట్టి కాదు
దేశమంటే మనుషులోయ్
అన్న పెద్దాయన.
నాకు రక్తాన్ని ఇవ్వండి
మీకు స్వాతంత్రం ఇస్తానన్న పౌరుషం
ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికొయ్యను ముద్దాడిన యువత

ప్రాణం పెట్టి పహరా కాసే జవాను.
ప్రపంచానికి అన్నం పెట్టే కిసాను.
అక్షరాలతో అభ్యుదయం చూపే కవి.
నల్లబల్లపై తెల్లటి కాంతులు పంచే గురువు.
పన్నులతో దేశభారాన్ని మోసే
మధ్య తరగతి మానవుడు.
ఒక చేత్తో చాక్లెట్లు
మరో చేత్తో జండా వందనం చేసే
రేపటి పౌరుడు.

అందరిదీ దేశభక్తే,
అందరూ దేశభక్తులే.
నిర్వచనాలు ఏమీ లేవు కొలమానాలక్కర్లేదు
చాతి కొలతలు అసలే లేవు
చరిత పుటలకెక్కక్కర్లేదు
ప్రాణాలు ఇవ్వక్కర్లేదు
ప్రాణం తీయక్కర్లేదు
నీ పని
జస్ట్ నీ పని
స్వచ్ఛంగా నీ పని
చేస్తే చాలు
అదే దేశభక్తి
ఇది నా దేశ భక్తి.

దేశభక్తి అంటే అదేదో పెద్దవాళ్ళు చూసుకొనేది, గొప్ప త్యాగం అనుకొని సామాన్యులు తప్పించుకు పోదామంటే కుదరదు. ఇష్టం వచ్చినట్లు పోదాం అనుకునే సామాన్యులు కూడా ఎలా దేశభక్తి ప్రదర్శించవచ్చునో చక్కగా చెప్పారు. మంచి వచన కవిత ఇది.

దేశ భక్తి (రాజు కల్లూరి, ధవళేశ్వరం)
____________________________

జన్మభూమిని గౌరవిస్తూ
జాతి సంస్కృతిని పరిరక్షించే
హృదయ అభిమానమే దేశ భక్తి…

ఉపాధికి పొరుగు దేశం వలస వెళ్ళినా
జగతి వేదికలలో మాతృ భూమి
కీర్తీకి ఘనమైన ప్రసంగం దేశ భక్తి…

దేశ కీర్తిని పలుచన చేసే
చీడ పురుగుల అడ్డుకోవటం
దేశ పౌరుడుగా దేశ భక్తి,

దేశభక్తి అంటే జెండా పండగకు జెండా ఎగరేయటం కాదు, మనుషుల మనస్సులో మంచి పనులు గురించి ఆలోచనలు, ఆచరణలో మంచి పనులు అసలైన దేశభక్తి అని కవి సూచిస్తున్నారు. కవితలలో ఎలాంటి పోలికలు వర్ణనలు లేకపోయినా విషయ ప్రధాన కవిత్వం ఇది. ఒక ముఖ్య విషయం ప్రజలు మరిచిపోతున్నప్పుడు ఆ ముఖ్య విషయం గురించి కవి ప్రజలకు గుర్తు చేయాలి. వచన కవితలో విషయం విస్తరించటానికి ఎంతైనా అవకాశం ఉంది. అది కవి ఉపయోగించుకోవాలి. చెబుతున్న విషయం ఇంకా విస్తరించి చెబితే బాగుంటుంది అని పాఠకులకు అనిపించే అవకాశం ఉంది.

దేశభక్తి (సదాశివన్, హైదరాబాద్)
_______________________

“దేశభక్తి”
కొత్త మాటలా వుందే!?
అప్పుడెప్పుడో తెల్లోడ్ని
కడ తేర్చటానికి
కల్సి చేసిన సంఘటిత ప్రయాణం లా!
గొంతు, గొంతు కలిపి పాడిన పాటలా!!
చేయి చేయి కలిపి కట్టిన
హారంలా!
మతం, కులం ,ప్రాంతంలు లేవు,
అటు పరదేశి!
ఇటు స్వదేశీ అంతే!!
సంఘటిత హృదయాల ఘోష తప్ప!
దేశ భక్తి అంటే జీవనాడి!
దేశ భక్తి అంటే ఉక్కు నరాలు!!
దేశ భక్తి అంటే శ్వాస నిశ్వాస!!!
ఓ పదేళ్లుగా….
దేశ భక్తి అంటే
మతం!
రాజకీయం
రంగుటద్దం…
నీకు మాత్రం ఏ స్వంతం!
పక్కనోడికి పరతంత్రం!!
కుంచిత స్వభావం,
కుళ్లిన స్వార్థ ప్రయోజనం
మసక బారిన మానవత్వం,
మతానికి ట్యాగ్ లైన్ లా
నేటి నయా! “దేశ భక్తి”
మేరా భారత్ మహాన్!
ఈ పుడమి తల్లి
పురుడు పోసిన ప్రతి ఒక్కరూ!
దేశవాసే!!
ఈ దేశ ఆలయం లో
దేశ భక్తుడే!!

దేశభక్తి అంటే జీవ నాడి, ఉక్కు నరాలు, శ్వాస నిశ్వాస అని గొప్పగా వర్ణించారు. పదేళ్ళ నుండి మారిన రాజకీయ చిత్రాన్ని కూడా బాగా విమర్శించారు. దేశం అనే ఆలయంలో అందరూ దేశం భక్తులే అని కూడా కవితాత్మకంగా చెప్పారు. దేశభక్తి అనేది కొత్త మాటలా వినిపిస్తోంది అంటూ పాత సందర్భం గుర్తు చేసుకుంటున్నారు. పాత మాటలా వినిపించాలి కదా! “నీకు మాత్రం ఏ స్వంతం… మసకబారిన మానవత్వం” వరకు పాదాలు అవసరం లేదు, ఇలా అదనంగా వాచ్యం చేయాల్సిన పని లేదు.

దేశభక్తి ( ధనుంజయ రెడ్డి)
________________________

మా ద్వేషాన్ని
సమర్ధించే
మా మతాన్ని
ఆచరించే
మా దేవుణ్ణి
పూజించే
మా ప్రార్ధన
ఆలపించే
వాళ్ళదే దైవభక్తి అంటే
అలా కాకుంటే నాస్తికులే!
మా కండువాను
కప్పుకుంటున్న
మా నాయకుణ్ణి
అనుసరిస్తున్న
మా పరిపాలనను
ప్రశంసిస్తున్న
మా పారిశ్రామికవేత్తలను
ప్రోత్సహిస్తున్న
వాళ్ళంతా దేశభక్తులే
ఇలా లేకుంటే నేరస్తులే!!
దేశమనే
దేవాలయాన
ఏది భక్తి? ఎవరికి భుక్తి??
ఏది కుయుక్తి? ఎప్పటికి విముక్తి??

దేశం దేవాలయం ఒకటే అని కవి ఉద్దేశం. ఇంకా కొంచెం కవితాత్మకంగా చెబితే బాగుండేది. సరే దేశం, దేవాలయం గురించి జరుగుతున్న వాస్తవ చిత్రణ చేసారు అనుకుంటే ముగింపులో “ఏది భక్తి, ఎవరికీ భుక్తి, ఏది కుయుక్తి, ఎప్పటికి విముక్తి” అని పాఠకులకు స్ఫురించాల్సిన ఆలోచనలను కవి తానే చెప్పటంతో ముగింపు కవితను దెబ్బ తీసింది.

దేశభక్తి (సుబ్రహ్మణ్యేశ్వరరావు కానుకొలను)
_________________________

ఇంటగెలిచి రచ్చగెలువు
తుపాకి పట్టి పోరాడితేనే
దేశభక్తి కాదు సోదరా!
ఇంట్లో అమ్మా నాన్న ను
ప్రేమించు అదే దేశభక్తి!
తోటివారిని ప్రేమించు!
ద్వేషించకు అదే దేశభక్తి!

భార్యా భర్తలు ఇద్దరూ పిల్లల్ని
భాద్యతగా పెంచడమే దేశభక్తి!
నువ్వు చేసే వృత్తిని
దైవంగాభావించి ప్రేమించడమే
దేశభక్తి సోదరా!
అవినీతితో సహవాసం చేయకుండా
నిజాయితీగా వుండటమే దేశభక్తి!

కుటుంబం బాగుంటే,
సమాజం,బాగుంటుంది
సమాజంబాగుంటే
ఊరు బాగుంటుంది
ఊరుబాగుంటే
దేశం బాగుంటుంది…

దేశం బాగుంటే అందరూ
దేశభక్తి వున్నవారే సోదరా!

నిజమైన దేశభక్తి ఎలా ఉండాలో కవి చెబుతున్నారు కానీ కవితలో ఇంకా చక్కని బిగింపు ఉంటే బాగుండేది. అవసరమైనంతవరకే భాష వినియోగించుకోవాలి కవి.

సైనికుని వాంక్ష (అన్నాప్రగడ)
_____________________

శత్రు తూటాల నెన్నో ఎదురొడ్డి..
ఈ ధరతిపై రక్త మెంతో చిందించి..
మూడు రంగులను నుదుటన దిద్దాడు..
మువ్వన్నె జండాను దేహంపై కప్పాడు..
వీర మరణము అతను పొందాడు…

అయినా
ఈ మట్టిలోనే కలవాలని
ఎన్ని జన్మలైన ఈ పుడమిపై పుట్టాలని అతని వాంఛ..
ఈ నదులతో కలిసి జలజలా పారాలని
రైతు బిడ్డకు నీటిని అందించి పచ్చని పొలంగా మెరవాలని అతని వాంఛ…

ఈ ధరతిలో మొక్కగా మొలవాలని..
అందమైన పూవుగా నైన తిరిగి పుట్టాలని అతని వాంఛ..
ఈ శ్రామికుని చెమటగా మెరవాలని..
ఈ కర్షకుని చిరునవ్వులో నిలిచివుండాలని..
అతని వాంఛ…

ఈ పాడిలో శ్వేతక్షీరమై పొంగాలని..
అమ్మభాషయై స్వచ్ఛంగా పలకాలని
అతని వాంఛ…
దేశ మాతకు మరల మరలా ముద్దుబిడ్డగా నిలవాలని అతని వాంక్ష…

  వీర మరణం పొందిన తరువాత ఏ ఏ జన్మలు పొందాలని సైనికుడు కోరుకుంటున్నాడో చాలా గొప్పగా చెప్పారు కవి. ముఖ్య మైన పదాలలో కూడా శబ్ద దోషాలు ఉన్నాయి. “మువ్వన్నె జెండాను దేహంపై కప్పాడు” అన్నారు. మరణించిన సైనికుడు ఎలా జెండాను కప్పుతాడు, వేరే సైనికుడు కప్పాల్సిందే. భావం వ్యక్తం చేయటంలో అస్పష్టత. 

నేను సైతం..నీవు సైతం (మేడిశెట్టి యోగేశ్వరరావు, సియాటెల్, అమెరికా)
________________________________________________

దేశ మంతా మసగ గుందని
మాయ గుందని… వేద నెందకు సోదరా…

కళ్ల జోడును తుడిచి చూడు
కన్నులను విప్పార్చి చూడు..
కష్ణ మొస్తె తొంగి చూడు
కరుణ కాస్త చూపి చూడు..

సాయ మెంత చిన్న దైన
చిగురించును జీవితాలు..
చిరు దీపము ఒకటి చాలు
చీకటుండదు కొంతమేర…

ముసుగు వేసి తొంగి చూస్తే
ముచ్చ టెపుడు తీర దయ్య..
ముందడుగు వేసి చూడు..
మానవత్వం పంచి చూడు…

కదము తొక్కి కదిలి చూడు
కరము కరము కలిపి చూడు..
కష్ట మున్నా నష్ట మున్నా
మిన్నకుండక వెన్నుతట్టు…

నేను సైతం..నీవు సైతం
సాటి మనిషికి సాయపడదాం..
దేశభక్తిని చాటి చెబుదాం..
దేశమంటె మట్టి కాదు..
దేశమంటే మనుషులే మరి!
దేశమంటే మనుషులే మరి.

 ఈ కవితకు మంచి గేయం అని ప్రశంసా పత్రం ఇవ్వవచ్చు కాని ఇది వచన కవిత కాదు.

మనుషులే దేశమైతే (కొండ్రెడ్డి నాగిరెడ్డి)
______________________________________

పనులన్నీ చేసుకోని తినడానికి ఇంటికొస్తే
ఎదుటి మనిషి తిండి లేక దగ్గరొచ్చి నిలబడితే
పస్తులున్న వాని మొఖంలొ
దివాలా తనం చూసి నా కూడును వాడికి ఇచ్చి
పస్తు నేను పడుకుంటా
ఇది దేశభక్తి కాదామరి.నాకైతే తెలియదు మరి…

పశు సంపద పెంచి నేను పాల దిగుబడి పెంచుతాను
పాలన్నీ అమ్మి నేను పుల్ల నీళ్లు తాగుతాను .
అప్పు తీర్చుకుంటాను.
పాడితోటి పంట పెంచి పదిమందికి పంచుతాను.
దేశ భక్తి ఇదేనని చెప్పలేను ఎందుకో…

సరిహద్దు కాపల చేతగాని పని నాకు
చేతనైన సాయ మైతే చేసి పెడతా ఎవరికైనా
భయం భక్తి కలిగి నేను
శాసనాల ననుసరించి విధేయతకలిగి ఉంటా.
చట్టాలను గౌరవిస్తా
నా ఇంటి వారితోడ పరిసరాల వారితోడ
నా బాధ్యత మరువకుండ పద్ధతిగ పని జేస్త
నా స్వార్థం కొంత చంపి నీకోసం పనిచేస్త
దేశం బాగు కోరి నిరంతర శ్రమ చేస్తా
ఇల్లంతా చక్క దిద్ది పరిసరాల బాగు చేసి
సమాజ వృద్ధి కోరి దేశానికి మేలు చేస్త
దేశభక్తి కాదా అది!

మనుషులంటే దేశమని మనమంతా
ఒకటేనని ఒకరిని నొకరు గౌరవించి
అంతా కలిసి మెలిసుంటే
అదే దేశభక్తి అని నేననుకుంటా.
అదే నిజమని అందరితో చెప్పేస్తా.

కవితలో మంచి భావాలు చెప్పటమే కవిత్వం కాదు. ఆ భావాలను చక్కని బిగింపుతో చెప్పాలి. లేకుంటే అది ఉపన్యాసం అవుతుంది.

దేశ భక్తి (కాటేగారు పాండురంగ విఠల్, హైదారాబాదు)
____________________________________________

అసమానతలు పాటించక
ప్రేమ స్నేహ హస్తం చాచి
పర్యావరణ సమతుల్యం పెంచి
నీతిగా ఓటు హక్కు వినియోగించి
రాజ్యాంగ విధులు నిర్వర్తించి
అవినీతికి చరమ గీతం పాడి
సైనికులు రైతన్నల గౌరవించి
స్వీయ సమాజ దేశవృద్ధికై
కృషి చేయడమే దేశభక్తి!

కవిత మొత్తం ఒకే వాక్యంగా సుదీర్ఘంగా చెప్పటం పాఠకుడికి భావ గ్రహణం కష్టం. కవితాత్మకంగా చెప్పటం లేదు కవి. అంతా ఒక పట్టిక ఇచ్చినట్లు ఉంది.

డా. రావి రంగారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap