ప్రపంచ పుస్తక దినోత్సవం

ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా …

మనిషికి పుస్తకాలు అజ్ఞాత గురువులు. సమస్యల సిడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ, జీవన గమ్యంకోసం తపించే మనుష్యులకు, పుస్తకాలు లైట్ హౌస్ లా, కాంతిపుంజాలు విరజిమ్ముతూ, నేను మీకు తోడున్నాను ప్రియనేస్తమా అని చేతులు జాచి ఆహ్వానించే నేస్తాలు…

ప్రపంచ పుస్తక దినోత్సవం చరిత్రంటే గతానికి, వర్తమానినికి మధ్య సాగే నిరంతర సంభాషణ. ఆ నిరంతర సంభాషణకే కాదు. అందులోనే బీజప్రాయంగా నిక్షిప్తమై ఉన్న భవిష్యత్తుకు కూడా అద్దం పట్టేది పుస్తకం. పుస్తకమంటే ‘అక్షరం’, నాశనం కానిది. అక్షరబద్దమైన వేల సంవత్సరాల మానవ అనుభవం, ఆచరణ, జ్ఞానం, భాషా సంస్కృతులు శాశ్వతమై నిలుస్తాయి, తరతరాలకు అందుతాయి, మానవ వికాసానికి సోపానాలవుతాయి. ఏడాదికి ఒకసారైనా మనం మన భూత, భవిష్యత్, వర్తమానాలకు అద్దంపట్టే పుస్తక పఠనం ఆవశ్యకతను గుర్తించడం, గుర్తింపజేయడం అవరం. అందుకోసమే ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1995 నుంచి ఏటా ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా జరుపుకునే ఆనవాయితీకి నాంది పలికింది.

ఇప్పుడు మనందరి చేతుల్లోనూ ఎదో ఒక రకం పుస్తకాలు వున్నాయంటే .. దానికి మూలపురుషుడు, అక్షర శిల్చి గుటెన్ బర్గ్

పత్రికలు, మేగజైన్లు, పుస్తకాలు …… లేని జీవితాన్ని ఈనాడు మనం కనీసం ఊహించుకోనైనా ఊహించుకోలేం. అలా అని ఈ ముద్రణ వచ్చేదాకా పుస్తకాలు లేవనుకోవడం పొరపాటే. ముద్రణ యంత్ర ఆవిష్కరణకు ముందే అనేక మహాగ్రంధాలు వెలువడ్డాయి. కాకుంటే ఇవన్నీ చేతితో రాసినవే(తాళపత్ర గ్రంథాలు). ఒకటి కంటే ఎక్కువ కాపీలు కావాలంటే మళ్ళీ చేతితో రాయాల్సిందే.
మెట్టుమెట్టుగా విజ్ఞానం ఎదగాలంటే అది విశ్వవ్యాప్తం కావాలి. అలా జరగాలంటే ఏదైనా మీడియా అవసరం ఎంతైనా ఉంది. దీనిలో ముద్రణారంగం ప్రముఖపాత్ర నిర్వహించింది. విజ్ఞానం దేశాల సరిహద్దులు దాటింది. దీనికి కారణ భూతుడు జోహానెస్ గుటెన్ బర్గ్. ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్ళను కదిలించడానికి కారణమవుతోందంటే అది గుటెన్ బర్గ్ చలవే.
– జర్మనీలోని మెయింజ్ పట్టణంలో – 1398లో గుటెన్ బర్గ్ జన్మించాడని అంచనా, ఆయన గురించి ప్రపంచానికి ఖచ్చితంగా తెల్సింది చాలా తక్కువ. ఎప్పుడు పుట్టారో … ఎక్కడ చదివారో …… ఏం చదివారో … ఇలా గుటెన్ బర్గ్ గురించిన చాలా అంశాలు వెలుగు చూడలేదు. అప్పట్లో మెయింజ్ పట్టణం నాణాల తయారీకి కేంద్రం వంటిది. గుటెన్ బర్గ్ తండ్రి టంకశాలలో అధికారిగా ఉండేవారు. దీంతో గుటెన్ బర్గ్ కూడా కొన్నాళ్ళు అక్కడ పనిచేసి కొంత నైపుణ్యం సంపాదించాడు. తర్వాత కాలంలో బర్గ్ ముద్రణకు ఉపయోగించే అక్షరాల్ని (బ్లాకులు) తయారు చేయటానికి ఈ నైపుణ్యమే స్ఫూర్తి! 1428లో బర్గ్ కుటుంబం మెయింట్ నుంచి స్ట్రాస్ బోర్గ్ కు మారిపోయింది. తండ్రి చనిపోవటం, కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో బర్గ్ ఓ వైన్ కంపెనీలో పని చేసేవాడు.
1448కల్లా గుటెన్ బర్గ్ మళ్ళీ మెయింజ్ చేరుకున్నాడు. పుస్ట్ అనే వ్యక్తి నుంచి పెద్ద మొతాన్ని వడ్డీకి తీసుకున్నాడు. 1450 కల్లా బర్గ్ ముద్రణాయంత్రం, అచ్చు టైపు (అక్షరాలు)లు పూర్తిగా సిద్ధమయ్యాయి. గుటెన్ బర్గ్ తన ముద్రణలపై పేరు అచ్చు వేసుకోక పోవటంతో వాస్తవాలు అస్పష్టంగానే ఉండిపోయాయి.
ఒక పుస్తకంలోని ముటల్ని ముద్రించాలంటే వేలాది అక్షరాలు, విరామ చిహ్నాలు మొదలైనవి అవసరమవుతాయి. ముద్రణా వసరాలకు తగినట్లు కొన్ని పరికరాల్ని తయారు చేసుకొని వాటిని అక్షరాల ముద్రణకు ఉపయోగించుకున్నారు. 1453 కల్లా బైబిల్ ప్రింటింగ్ మొదలై 1455లో బైబిల్ కాపీలు విడుదలయ్యాయి. ప్రచురణా రంగంలో వెలువడిన మొట్టమొదటి పుస్తకం ఈ బైబిలే అని చరిత్రకారుల నమ్మకం. ‘పార్ట్ టూ లైన్ బైబిల్ (42 లైన్ల బైబిల్) గా అది పేరొందినది. ప్రతి పేజీలోను 42 పంక్తులుండడం కారణంగా దీనికా పేరు వచ్చింది. యంత్రం ద్వారా ముద్రితమైన తొలి బైబిల్ ఇదే కాబట్టి ‘గుటెన్ బర్గ్ బైబిల్ అని కూడా అంటారు. 1282 పేజీలున్న ఈ బైబిల్. 300 కాపీలు మాత్రమే ప్రింట్ అయ్యాయి. ప్రస్తుతం 40 ప్రతులు ప్రపంచంలోని పలు ప్రసిద్ధ లైబ్రరీలలోను, మ్యూజియంలలోనూ భద్రంగా ఉన్నాయి.
దాదాపు కాగితం (పేపరు) తయారు కాబడిన 300 సంవత్సరాలకు ముద్రణా యంత్రం ఆవిష్కరించబడింది. తాను అప్పులపాలైనా ప్రపంచం పై చెరగని ముద్ర వేసిన గుటెన్ బర్గ్ ఆవిష్కరించిన ముద్రణా పద్ధతులు ఈ కంప్యూటర్ల ప్రపంచంలో… డిజిటల్ లైబ్రరీల కాలంలో కూడా తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. ”
అచ్చు యంత్రం వచ్చాక విజ్ఞానం ముద్రణ రూపం దాల్చి భావితరాలకు మార్గదర్శకమైంది. ఆ విధంగా చూస్తే మానవాళికి వైజ్ఞానిక ప్రపంచం తలుపులు తెరచిన అక్షరశిల్పి గుటెన్ బర్గ్.

-కళాసాగర్ యల్లపు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap