కళాప్రపంచ వీక్షణ గవాక్షం

ఒక కళాకారుడిని, అతనిలోని నైపుణ్యాన్నీ మరొక కళాకారుడైతే, సాధారణ వ్యక్తి కన్నా ఇంకా చక్కగా గుర్తించగలడు. ఆ గుర్తించిన కళాకారుడు, రచయితా మరియు టీచర్ ఐతే, తన కోణంలో ఆ వ్యక్తులను మనకు పరిచయం చేస్తే, దాని పేరే ఎల్.ఆర్. వెంకట రమణగారి ‘కళా ప్రపంచం’.

ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కొన్ని అంశాలు, క్లుప్తంగా వ్రాస్తున్నాను.
రంగులో, రూపంలో, ఆకారంలో దాదాపు ప్రకృతికి సమానంగా వెళ్లగలిగేది ఒక్క చిత్రకళ మాత్రమే అని.
ప్రకృతి, అంతరంగిక జగత్తూ, బాహ్య ప్రపంచంలో అతనికి ఎదురైన అనుభవాలే కళాకారుని కళలో ప్రతిఫలిస్తాయని.
మనమెరిగిన మోర్స్ టెలిగ్రాఫ్ ఆవిష్కర్త, కానీ అంతకు మునుపు అతనొక చిత్రకారుడని, ప్రొఫెసర్ అని, భార్య కి జబ్బు చేసిందన్న జాబు తనకి ఆలస్యంగా చేరడంతొ ‘చివరి చూపుకి నోచుకోలేకపొయాడని, అప్పుడు మొదలైన తనలోని అంతర్మధనం ‘టెలిగ్రాఫ్ ‘ఆవిష్కర్త’ గా మార్చిందని తెలుసుకొని ఆశ్చర్యానికి లోనౌతాం.
చిత్రం కనిపించే బాహ్య రూపమైతే దాని వెనుకనున్నది నిజమైన చిత్రకారుని ‘ఆత్మరూపం’ అన్న అరవిందుని మాటలు ఆలోచింపచేస్తాయి.
మనిషి లోపల మనిషికి తెలియనిది ఏదో ఉంది, దానికై సాగిన ‘మదర్’ అన్వేషణ కవిత్వం, చిత్రలేఖనం, పియానో వాయించడం, రచన, విద్యా రంగాల మీదుగా సాగి, ఆధ్యాత్మికతలో ఎలా స్థిరపడిందో తెలియ వస్తుంది.
స్వామి వివేకానంద ఆధ్యాత్మికత మాత్రమే మనకు తెలుసు, వారు హార్మోనియం, వయొలిన్ పై పట్టు గలవారని, సాము గరిడీలూ, పడవ నడపడం కూడా వచ్చుననీ, తమ లండన్ ప్రసంగంలో ఒక చిత్రకారుడు సౌందర్యానికి ఎలా తన్మయుడౌతాడో, ఎలా సాక్షిగా ఉంటాడో, ఎలా ఇతరుల ఆనందానికి కారణమౌతాడో వివరించాడు అన్న వివరాలు చదువుతాం.

జీవితంలో ఎదురైన సంఘటనలు, వ్యక్తులే తన గురువులు అన్న ఖలిల్ జిబ్రాన్ జీవితము, రచనలు తెలుసుకొంటాం.
తెలుగునాట దామెర్ల రామారావు, అడవి బాపిరాజు వంటి ఉద్ధండులని తయారు చేసిన కూల్ద్రే దొర గురించి తెలుసుకొంటాం.
హిట్లర్ చిన్న చిత్రాలు గీచి జీవిక కై అమ్మేవాడనీ, చర్చిల్ చిత్రకళా జీవితం నలభైయవ ఏట మొదలయ్యిందనీ, తాత-తనయుడు-మనుమడు వయత్ కుటుంబం లోని చిత్రకళా వారసులన్న వైనాలు ఆశ్చర్యం కలిగించేవే.
ఆయా కళాకారుల ఫొటోలు, వారు గీచిన చిత్రాలు(వీలైనన్ని), తక్కువ నిడివిలో, ఎక్కువ విషయాలను పొందుపరచడం రచయిత కృషిని చెప్పకనే చెబుతున్నై.
అయాన్ రాండ్, తన చిత్రం తానే కొనుగోలు చేసిన సి.ఎన్.వెంకటరావు కృషీ,జీవితమూ, రచనల విషయాలూ చదువుతాం.
తెర కావల విరాట్ స్వరూపం
తెర కీవల జీవ స్వరూపం
తెర తెగితే రెండూ ఒకటే అన్న సంజీవదేవ్ గారి విశేషాలు అర్ధం అవుతాయి.
చిత్రకళావధానం -ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానంగా అప్పటికప్పుడే కాన్వాస్ పై చిత్రాలు గీస్తున్న సత్యనారాయణ వంటి కళాకారుల గురించి తెలుసుకొన్నపుడు అద్భుతానికి లోనౌతాం.
బుచ్చిబాబు గారి గురించి చెబుతూ, ఆకాశవాణిలో పని చేస్తున్నప్పుడు ఒక వంక రికార్డింగ్ చేస్తూనే, మరో వంక మాట్లాడుతున్నవారిని స్కెచ్ వేసేవారని, హార్మోనియం, వయొలిన్ కూడా చేతనవుననీ చదివినపుడు విభ్రాంతులవుతాం.
ఒక వ్యక్తి తనను తాను తెలుసుకుని, సంస్కరించుకుని, తనలో తాను ఐక్యమై, సమాధాన పడితేనే, సమాజంలో సమాధానం దొరుకుతుందనే జీవిత ధృక్పధమూ తెలియ చెబుతారు. అప్పుడే శాంతీ, సౌఖ్యమూ అని బుచ్చిబాబు గారి ఫిలాసఫీ మనకి అర్ధమయ్యేలా వివరిస్తారు. ఆత్మ సంతృప్తి కొరకే గాని ప్రదర్శనకు కాదు చిత్రాలు అన్న వారి సతీమణి గురించీ మనం తెలుసుకొంటాం.

200 పేజీలలో 51 మంది ప్రసిద్ధుల జీవితమూ, రచనలు, ఎవరి జీవిత విశేషాలు చదువుతున్నామో వారి చిత్రం, వారు గీచిన చిత్రాలు, ఆయా రంగాలలో వారు సల్పిన కృషిని, వారి గొప్పదనమూ రెండు లేదా మూడు పేజీలలో చెప్పడం రచయిత ప్రతిభకు నిదర్శనం.
ఒక వ్యక్తి ఒక రంగంలో ప్రజ్ఞ కలిగి ఉండడం మనం సాధారణంగా చూస్తాం కానీ బహుముఖ ప్రజ్ఞాశీలురు మనకు ఇందులో ఎక్కువగా తారసిల్లుతారు, ఇదొక విశేషం. భారతీయ సంస్కృతి, కళలను అభిమానించే ప్రతి వ్యక్తి,ప్రతి కళాకారుడు, భావి కళాకారులూ, చదివి ప్రభావితులయ్యే పుస్తకం ‘కళా ప్రపంచం’. ఇంత మంచి పుస్తకాన్ని 64కళలు.కాం వారు ప్రచురించడం ప్రశంసనీయం.

కళాప్రపంచం ప్రతులకు:
పేజీలు: 200, వెల: 250/-
ఎల్.ఆర్. వెంకటరమణ (98661 58908)

– వి. శ్రీనివాసరావు, 9441481014.

1 thought on “కళాప్రపంచ వీక్షణ గవాక్షం

  1. ఈ పుస్తకం గురించి మంచి వివరణ ఇచ్చారు. ఈ పుస్తకం కళా అభిమానులకు ఓ మార్గ నిర్దేశం అవ్వాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap