కళా మార్మికుడు కె.ఎస్. వాస్

ఆర్టిస్ట్ కె.యస్. వాస్ గారు 2024, ఫిబ్రవరి 26 న కన్నుమూసిన సందర్భంగా… నివాళి వ్యాసం.

మొబైల్ ఓపెన్ చేసేసరికి ఒక షాకింగ్ న్యూస్ కంటపడింది అది నాకు అత్యంత ఇష్టమైన ఆధునిక చిత్రకారుడు కే. ఎస్. వ్యాస్ గారు ఇక లేరు అన్న వార్త. ఒక్క క్షణం నా మనసంతా అదోలా అయిపొయింది. ఒక్కసారి ఆయనతో నాకు గల జ్ఞాపకాలన్నీ కళ్ళముందు కదలాడాయి.

2013 లో అనుకుంటాను తొలిసారిగా వాస్ గారి చిత్ర ప్రదర్శనను స్టేట్ ఆర్ట్ గాలరీ, హైదరాబాదు నందు నేను చూడడం జరిగింది ఆపై వారితో నేను మాట్లాటడం ఆ తర్వాత 64 కళలు.కాం లో నేను వారి గురించి మంచి ఆర్టికల్ రాయడం, ఆ ఆర్టికల్ చదివిన వ్యాస్ గారు వారి శ్రీమతి రుక్మిణి దేవిగారు అలాగే వారి ఆబ్బాయి కూడా ఫోన్ చేసి చాలా బాగ రాసారని ఎంతో మెచ్చుకోవడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఆ పై THE SPIRIT AND WORKS OF K.S. VAS పేరిట వారి చిత్రాలతో ఆంగ్లములో ప్రచురించిన ఖరీదైన ‘కాపీ టేబుల్ బుక్’ ని నాకు పోస్ట్ లో పంపించడమే గాక ఆ తర్వాత ‘మధు మాలాక్ష్మి ఆర్ట్ అండ్ కల్చరల్ సెంటర్’ విజయవాడ నందు జరిగిన అయన వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శన సందర్భంలో నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి వారు చిత్రించిన అద్భుతమైన ఒక ఒరిజినల్ పెయింటింగ్ ను నాకు బహుకరించడం ఒక మరపురాని మధురమైన అనుభూతి కె.ఎస్.వాస్ గా ప్రాచుర్యం పొందిన కోప్పాడ శ్రీనివాస్ గారు నాకు తెలిసి మన తెలుగు చిత్రకారులలో రంగులపైన, రేఖలపైనా మంచి సాధికారతను సాదించిన గొప్ప ఆధునిక చిత్రకారులు. ఆయన వేసిన కొన్ని చిత్రాలు పరిశీలిస్తే ఒకోసారి నాకు అనిపిస్తుంది పికాసోని సైతం మైమరపించేలా ఉంటాయని, ప్రధానంగా ఆయన ఆధునిక చిత్రకారులు. అందులో రూపాలుంటాయి , కాని ఆరూపాలు కాస్త అరూపాలా…? అన్నంతగా కొంత వైరూప్యంతో వుంటాయి. అలాగని రూపాన్ని సరూపంగా వేయలేరని కాదు ఆయన సవ్యమైన సరూపచిత్రాలు కూడా ఎంతో గొప్పగా వేయగలరు. అందుకు ఉదాహరణగా 2007 లో జలవర్నాల్లో ఆయన వేసిన వారిశ్రీమతి రుక్మిణి దేవి గారు మరియు తైల వర్ణాల్లో వేసిన వారి అమ్మాయి మాధవీలత గార్ల రూపచిత్రాలను పరిశీలిస్తే సరూప చిత్ర రచనలో కూడా ఆయన ఎంత ప్రతిభావంతులో మనకు అర్ధమౌతుంది. రూపాలను సరూపాలుగా ఎంత రమణీయంగా వేయగలరో విరూపాలుగా కూడా అంతే అందంగా వేసి వీక్షకులను మైమరపించగల గొప్ప రంగుల మాంత్రికుడు శ్రీ వ్యాస్ గారు.

ఒక చిత్రకారుడిగా తన ఆలోచనలను దృశ్య మాధ్యమంలో వ్యక్తీకరించడానికి ప్రధానంగా వాస్ గారు ఎంచుకున్న మాధ్యమం తైల వర్నాలని చెప్పవచ్చు. కారణం ఆయన కుంచె నుండి వెలువడిన చిత్రాల్లో తొంబై శాతం తైల వర్ణాలలోనే వున్నాయి కొద్దిగా జలవర్నాల్లో చిత్రించారు. నిత్యజీవితంలో స్త్రీ మూర్తి ఎదుర్కొనే అనేక సమస్యలు అనుభవాలు, అనుభూతులను, ప్రకృతినందలి బండరాళ్ళను నింగినందలి నీలిమేఘాలను, ఒక గొప్ప సంగీతకారుని శుద్ద సంగీతం ద్వారా మనసుకు కలిగే ఒకవిధమైన అలౌకిక ఆధ్యాత్మికత లాంటి అనుభూతులను ఎంతో హృద్యంగా ఆయన చిత్రాల్లో ఆవిష్కరించారు. చిత్రరచనా క్రమంలో వీరి కుంచె విసిరిన రంగులు మరియు రేఖల విన్యాసంలో ఒక విదమైన మార్మికత ఉంటుంది. అది వీక్షకుడిని ఆలోచింపజేసేలా చేస్తుంది. స్త్ర్హ్రీ మూర్తిని ప్రధానభూమికగా చేసుకుని వీరు వేసే చిత్రాలన్నీ నిజానికి రూప చిత్రాలే. కాని ఆ రూపం నిశ్చలన చిత్రంలోలా పూర్తిస్థాయిలో ఉండదు. రూపారూపాలుగా ఉంటాయన్నమాట. కారణం ప్రకృతిలో ఉన్నది ఉన్నట్టు చూపించడం ఏమాత్రం ఉత్తమ కళ కాదు, అందుకు రంగులనాశ్రయించనవసరం లేదు ఫోటోగ్రఫి చాలు. ఏ కళ అయినా స్వతంత్రంగా ఉండాలనేది వీరి భావన. అందుకే వీరి చిత్రాల్లో రంగులు రేఖలు తేజోమయమై వాటి గొప్పతనాన్ని చాటుకుంటూ స్వంత్రంగా వెలుగొందుతూ వీక్షకుడిని ఒక వినూత్న లోకాలకు తీసుకు వెళ్ళేలా చేస్తాయి, ఎలాంటి పదాలనూ ఉపయోగించకుండానే ఒక గొప్ప సంగీతకారుడు వినిపించే శుద్ద సంగీతం శ్రోతలను ఎలా మంత్రముగ్దులను చేస్తుందో అలాగే చిత్రకళకు సంభందించి రంగులు రేఖల ద్వారా కూడా ప్రేక్షకుడిని మంత్రముగ్దుల్ని చేయాలనే ప్రయత్నం వీరి చిత్రాల్లో మనకు కనిపిస్తుంది.

వీరి చిత్రాలలో శిఖరాయమానమైనవిగా PRESENT, PAAST, AND FUTURE పేరుతో వేసిన మూడు చిత్రాలను పేర్కొనవచ్చును. 9X5 అడుగుల సైజుల్లో ఒక్కోదాన్ని మూడేసి కాన్వాసులపై 1999లో తైలవర్నాల్లో చిత్రించిన ఈ భూత వర్తమాన భవిష్యత్ అనే చిత్ర రచనలో వీరి ప్రతిభ అత్యున్నతంగా కనిపిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాపురుషులు ప్రతిపాదించిన ఆదర్శ సమాజాన్ని రంగుల భాషలో నైరూప్యంగా వ్యక్తపరిచే ప్రయత్నంచేసారు వీరు ఈ చిత్రాల్లో. మనిషి పుట్టుక పరిణామం, సమాజ నిర్మాణం ఆపై అతని ఉత్తాన పతనాలను గతం, వర్తమానం అన్న చిత్రాల్లో చూపిస్తే, స్వేచ్చ కోసం మనిషి పడేఆరాటం, ఆశాభావాలను భవిష్యత్ అన్న చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

ప్రకృతిలో ఉన్నది ఉన్నట్టు చిత్రించడం ఒకరకమైన కళ. కానీ అది ఒక విదంగా అనుకరణ అవుతుంది. అందుకు భిన్నంగా చిత్రించాలంటే ఆ చిత్రకారుడికి ప్రకృతి పట్ల సమాజం పట్ల ఒక విధమైన అవగాహన కావాలి, అంతర్లీనంగా అతడు ఒక తాత్వికుడు కూడా అయి ఉండాలి. కేవలం ఆ తత్వపరమైన ఆలోచన అవగాహనలు వున్నంతనే సరిపోదు ఆ అవగాహనతో ఏర్పరుచుకున్న భావనను రంగుల్లో వ్యక్తం చేయగల నేర్పుకావాలి, ఓర్పు కూడా కావాలి. కే.ఎస్. వ్యాస్ గారు అలాంటి గొప్ప తాత్వికుడు మాత్రమే గాకా దానిని సార్వజనీనమైన రంగులభాషలో హృద్యంగా వ్యక్తం చేయగల నేర్పు ఓర్పు వున్న గొప్ప కళాకారుడు కనుకనే అంతటి గొప్ప చిత్రాలను వారు వేయగలిగారు అని చెప్పవచ్చు.

వ్యాస్ గారు కోప్పాడ వేణుగోపాళం, మంగతాయారమ్మ అనే దంపతులకు 28-01-1947 నాడు నాటి కృష్ణాజిల్లా గుడివాడలో జన్మించారు. వీరి తండ్రి వేణుగోపాలం గారు కూడా గొప్ప చిత్రకారులు. నేటి ప్రఖ్యాత నైరూప్య చిత్రకారులు ఎస్.వి. రామారావు కళారత్న బి.ఏ. రెడ్డి లాంటి వారు కూడా ఒకనాడు వేణుగోపాళం గారి శిష్యులు కావడం విశేషం. అందుచేతనే బాల్యం నుండే చిత్రకళపై ఆసక్తి గల వ్యాస్ చిత్రకళలో తొలి పాఠాలు తన తండ్రి గారి వద్దనే నేర్చుకున్నారు. ఆపై మద్రాస్ ప్రభుత్వం నుండి చిత్రకళలో డిప్లమో తీసుకున్నారు. అంతేగాక చరిత్ర ముఖ్యాంశంగా స్నాతకోత్తర విద్యను కూడా అభ్యసించారు. చిత్రకళలో తనదైన కృషి చేస్తూనే హైదరాబాదు నందు గల చైల్డ్ ఆర్ట్ ఇంటర్ నేషనల్ అనే సంస్థలో కళాబోధకునిగానూ, ఆంధ్రలయోలా కళాశాల వారి కళాధర్సిని అనే ఆర్ట్ స్కూల్ నందు చిత్రకళా అధ్యాపకునిగానూ కూడా సేవలందించారు.

చిత్రకారుడిగా మనరాష్ట్రంలోనూ రాష్ట్రానికి ఆవలా దాదాపు పది వ్యక్తిగత ప్రదర్శనలు చేసారు ఎన్నో సాంస్కృతిక సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు వీటిల్లో చిత్రకళా పరిషత్ మచిలీపట్టణం మరియు విశాఖపట్నం, దామెర్ల ఆర్ట్ అకాడమి రాజమండ్రి, అంకాల ఆర్ట్స్ అకాడమి బీమవరం, కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం, ఆంద్ర ప్రదేశ్ లలితకళా అకాడమి, తెలుగు విశ్వ విధ్యాలయము హైదరాబాదు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమి, విజయవాడ అంతే గాకా ఆల్ ఇండియా ఆర్ట్స్ అకాడమి, న్యూడిల్లి లాంటి పలుసంస్థలు నుండి ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారు. కాని కళ కేవలం కళకోసమే అనుకునే వీరి నైజం వారి స్థాయికి తగిన రీతిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి.


చివరిగా తక్కువ ప్రతిభతో ఎక్కువ కీర్తిని పొందిన అదృష్టవంతులు కొందరైతే ఎక్కువ ప్రతిభతో తక్కువ కీర్తిని పొందిన దురదృష్ట వంతులు మరికొందరు. అలాగే తనకాలంలోనే తన ప్రతిభకు తగిన గుర్తింపు సాధించిన అదృష్టవంతులు కొందరైతే తన ప్రతిభకు తగినరీతిలో గుర్తింపుకు నోచుకోని దురదృష్టవంతులు మరికొందరు. కే.ఎస్. వాస్ గారు ఎంతో ప్రతిభావంతుడైన చిత్రకారుడు. కాని ఆయన ప్రతిభకు తగిన స్తాయిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి. తన పూర్తి జీవితకాలంలో ఒక్క చిత్రం కూడా అమ్మకానికి నోచుకోని విన్సెంట్ వెంగో లాంటి గొప్ప కళాకారులు ఎందరో నేడు మనమధ్యలేక పోవచ్చు కాని శతాబ్దాలు గడిచినా వారు మనమధ్య ఇంకా ప్రకాశవంతంగా వెలుగొందుతూనే ఉన్నారు. అలాగే వాస్ గారు నేడు మనమధ్య లేకపోవచ్చు కాని ఆయన సృష్టించిన కళ వారిని తరతరాలలో కూడా జీవించేలా చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అజరామమైన వారి కళాసంపదను సృష్టించిన ఆ మహా కళాకారుడికి అశ్రు నివాళులతో…….

వెంటపల్లి సత్యనారాయణ
చిత్రకారుడు, కార్టూనిస్ట్ & చిత్రకళారచయిత

1 thought on “కళా మార్మికుడు కె.ఎస్. వాస్

  1. ఆర్టికల్ అద్భుతంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap