కూచిపూడి నాట్యానికి ‘శోభ ‘ నాయుడు

ప్రసిద్ధ నృత్య కళాకారిణి శోభానాయుడు గారి జన్మదిన జ్ఞాపకం !
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఒక అద్భుతమైన నాట్య రారాణిని కూచిపూడి నాట్య రంగం కోల్పోయింది. దేశ విదేశాల్లో రెండు వేల మంది విద్యార్థులను కూచిపూడి నాట్య తారలుగా తీర్చిదిద్దిన ఘనత శోభా నాయుడుదే. 100 కు పైగా సోలో కొరియోగ్రఫీల సృష్టికర్త. పాతిక కూచిపూడి నృత్యరూపకాల సృజనశీలి. పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం, నృత్య చూడామణి, ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ పురస్కారం తో పాటు వందలాది పురస్కారాలు ఆమెను వరించాయి. ఏ పాత్రలోనైనా ఒదిగి ఆ పాత్రకు వన్నె తెచ్చే ప్రత్యేకత, వేదిక పై దునుమాడే శక్తి వున్న ఏకైక శాస్త్రీయ సాంప్రదాయ నర్తకీమణి శోభానాయుడు.

శ్రీమతి శోభానాయడు కూచిపూడి నాట్యకళాకారుల్లో విలక్షణస్థానాన్ని పొందిన నర్తకి, 14 ఏప్రిల్, 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లిలో పుట్టిన ఈమె తండ్రి వెంకన్న నాయడు పి.డబ్ల్యు.డి.లో ఎగ్జిక్యూటివ్ ఇన్జనీరు. తల్లి సరోజినీదేవి గృహిణి.
శోభానాయడు మొదట రాజమహేంద్రవరంలో నాట్య శిక్షణ పొంది, తరువాత 1968లో మాతృమూర్తితోపాటు మద్రాసు వెళ్లి పన్నెండేళ్లు డా. వెంపటి చిన్న సత్యంగారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకొని ఆ నగరంలో అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నది. ఈ దశలో ఆమె చదువు సాగలేదు. 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తరువాత బి.ఏ. డిగ్రీ (ఆంగ్లభాష) సంపాదించారు. మద్రాసులో ఉండగా బి.ఎన్. రెడ్డి వంటి మహాదర్శకుడు అడిగినప్పటికీ ఆమె చలనచిత్రాల్లో నటించటానికి అంగీకరింపలేదు. ప్రసిద్ధ దక్షిణ భారత చలనచిత్ర దర్శకులు కోరినప్పటికి ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.

1980లో హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ అకాడెమీ స్థాపించి దానికి ప్రిన్సిపల్ గా, డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త శ్రీ అర్జునరావు రిటైర్డ్ I.A.S. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో చీఫ్ సెక్రటరీ గా పని చేశారు. ఆమెవద్ద వేయిమందికి పైగా విద్యార్థినులు కూచిపూడి నాట్యాన్ని అభ్యసించారు. వీరిలో రష్యా నుండి వచ్చిన బాలికలు ఉన్నారు. వారు స్వదేశానికి వెళ్లి అక్కడ కూచిపూడి నాట్యసంస్థలు, నెలకొల్పి రష్యాయువతులకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీమతి శోభానాయడు తూర్పు ఆసియా దేశాలు, పశ్చిమ ఆసియా దేశాలు, రష్యా, ఉత్తర అమెరికా, బ్రిటన్, వెస్ట్ ఇండీస్, మెక్సికో, వెనిజులా మొదలైన దేశాల్లో పర్యటించి కూచిపూడి నాట్యానికి ప్రశస్తి చేకూర్చారు.

శ్రీమతి శోభానాయడు అనేక నృత్యరూపకాల్లో విభిన్న నాయికానాయక పాత్రలు పోషించి, తన నాట్య వైదుష్యాన్ని చాటుకొన్నారు. భామాకలాపం, శ్రీకృష్ణ పారిజాతం (సత్యభామ), చండాలిక (చండాలిక), విప్రనారాయణ (దేవదేవి), మేనకా విశ్వామిత్ర (మేనక), కళ్యాణ శ్రీనివాసం (పద్మావతి), శ్రీకృష్ణశరణం మమ (శ్రీకృష్ణుడు), విజయోస్తుతే నారి (దుర్గామాత), క్షీరసాగర మథనం (బలిచక్రవర్తి, మోహిని), సర్వంసాయిమయం (సాయిబాబా), జగదానందకారక (శ్రీరాముడు), స్వామి వివేకానంద (వివేకానందుడు) మొదలైన నృత్యరూపకాలు ఆమె నాట్యచాతుర్యానికి ఒరపిడిరాళ్లు అయినాయి. పై నృత్యరూపకాల్లో ఎనిమిదింటికి ఆమెయే నృత్యదర్శకురాలు.

ఇంతగా కూచిపూడి నాట్యానికి జీవితాన్ని అంకితం చేసిన శ్రీమతి శోభానాయడు సత్కారాలు, పురస్కారాలూ, బిరుదులు పొందటం ఆశ్చర్యం కలిగింపదు. “నృత్య చూడామణి” బిరుదుతో పాటు సుర్ శృంగార సన్నద్ (ముంబాయి) వారి “నృత్యవిహార్” (1991), నుంగంబాకం కల్చరల్ అసోషియేషన్ (చెన్నై) వారి “నాట్య కళాశిరోమణి” (1996), తిరుపతి త్యాగరాజసంగీతసభవారి” సప్తగిరి సంగీత విద్వన్మణి(2002) మున్నగునవి ఆమె పొందిన బిరుదులలో కొన్ని మాత్రమే. 1991లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ వారి అవార్డు, ఎన్.టి.ఆర్. అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి “హంస” అవార్డు ఆమె స్వీకరించారు. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్టపురస్కారాన్ని, డాక్టరేట్ పట్టాన్ని పొందారు. భారత ప్రభుత్వం కూచిపూడి నృత్యానికి ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ” పద్మశ్రీ” బిరుదుతో సత్కరించారు.

కూచిపూడి మహారాణి పద్మశ్రీ డాక్టర్ కట్టా శోభా నాయుడు ఇక లేరు. న్యూరోలజి సమస్య తో స్టార్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున(14-10-20) 1.44 నిముషాలకు కన్నుమూశారు.
అంకిత భావం తోనే చివరి వరకు నాట్యమే శ్వాసగా నాట్యమే ధ్యాసగా జీవించారు! కూచిపూడి నాట్యం అంటే శోభా నాయుడు! శోభానాయుడు అంటే కూచిపూడి! అంతే, ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ శోభా నాయుడు ముద్ర చెదరనిది ! కూచిపూడి నాట్యం ఉన్నంత కాలం ఆమె పేరు శాశ్వతం!

-కళాసాగర్
_____________________________________________________________________________

శోభానాయుడు గారంటే మహా ఇష్టం …
మహా నాట్యాచార్యులు వెంపటి చిన సత్యం గారి కళకి స్త్రీ రూపం ఇస్తే మన శోభానాయుడు…
భరతుడు సూత్రీకరించిన నాట్యకారులు లక్షణాలు మూర్తి భవిస్తే…మన శోభానాయుడు…
250 పైనే నృత్య రూపకాలు రాసిన నేను ..శోభానాయుడు గారికి చిత్రంగా.. ఒక్కపాట కూడా రాయలేదు …
నేను రాసిన డాన్సర్ అందరికన్నా ఆవిడకి నేనంటే విచిత్రం గా ఎక్కువ ఇష్టం…నాకు మా వాళ్ళందరి కన్నా శోభానాయుడు గారంటే మహా ఇష్టం …
హైదరాబాదులో ఆవిడ చేసే ప్రతీ కార్యక్రమానికి ఫోన్ చేసి పిలిచేవారు శోభానాయుడు…
నేను రాసిన బ్యాలేలు ఆవిడ చూసినప్పుడల్లా ప్రేమగా మెచ్చుకునేవారు …
నాపుస్తకాల ఆవిష్కరణ సభలకి వచ్చి నాలుగుమంచిమాటలు చెప్పేవారు …
అంత గొప్ప వ్యక్తి వ్యక్తిత్వానికి తార్కాణం ఆమె శిష్యుల శిష్యులు చేసే నృత్య ప్రదర్శనలకు ఆవిడ తప్పకుండా వచ్చి ఆశీర్వదించడం ..
ఆవిడ గ్రేట్ …గ్రేట్ అంటే గ్రేట్టే ….
బ్నిం, Hyderabad
____________________________________________________________________

గొప్ప విదుషీమణి
ఉదయాన్నే శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభానాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప విదుషీమణి.


వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రశంశించుకునే కళాకారులం.ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడాను చూశాను. అది చూసినప్పుడు నాకూ ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఆడారు పాడారు అంటే గనుక కళాకారిణిగా ఆమెకు కళల పట్ల ఉన్న అభిమానం, సమాజం పట్ల ఉన్న అభిమానం ఎంతో అర్థమైంది. అలాంటి శోభానాయుడు ఈరోజు మనముందు లేకపోవడం దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
-చిరంజీవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap