నా జ్ఞాపకాల్లో ‘దాసి’ సుదర్శన్- వెంటపల్లి

జతీయ అవార్డ్ గ్రహీత, చిత్రకారుడు ‘దాసి’ సుదర్శన్ గారికి నివాళిగా… ఈ వ్యాసం

లోకంలో పరిచయాలు ఏర్పడతాయి రెండురకాలుగా ఒకటి ప్రత్యక్షంగా, రెండోది పరోక్షంగా. హాయ్ అన్న ఒక్క పిలుపుతో ప్రత్యక్షంగా ఏర్పడే పరిచయాలు కొన్నైతే, హలో అన్న ఒక్క కాల్ తో పరోక్షంగా ఏర్పడే పరిచయాలు మరికొన్ని. పరోక్ష పరిచయాలు మారవచ్చు కొన్నాళ్ళకు ప్రత్యక్షంగా. ప్రత్యక్షపరిచయాలూ మారవచ్చు కొన్నాళ్ళకు పరోక్షంగా. దృడం అవుతుంది పరోక్ష పరిచయం ప్రత్యక్షంగా మారినప్పుడు. అధ్రుడం అవుతుంది ప్రత్యక్ష పరిచయం పరోక్షంగా మారినప్పుడు. పరోక్ష పరిచయాలన్ని అధ్రుడమైనవి కావు అలాగే ప్రత్యక్ష పరిచయాలన్ని ధృడమైనవి కావు. మనిషికి మనిషికి మధ్యగల అవగాహనపై ఆధారపడుతుంది ఏ పరిచయం అయినా. పరిమితమైన పరిచయమైనా అపరిమితమైన ఆనందాన్నిస్తాయి కొందరి పరిచయాలు.

ఇప్పటికి పదమూడేళ్ళ క్రితం, పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురంలో నేను ఉపఖజానాదికారిగ పని చేస్తూన్నరోజులు.. ’64 కళలు.కాం’ లో నా చిత్ర కళా వ్యాసాలు ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది నెలలముందు ప్రజా శక్తి దినపత్రికలో ప్రముఖ చిత్రకారుడు కాళ్ళ గురించి ప్రచురితమయిన నా ఆర్టికల్ కి స్పందించి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక పెద్దాయన నుండి. చిత్రకారుడు కాళ్ళ గురిచి ఆయన చిత్రకళ గురించి నేను రాసిన ఆ ఆర్టికల్ ని ఎంతో మెచ్చుకుంటూ మాట్లాడడం నాకెంతో సంతోషమనిపించింది. చిత్రకళ రచనా వ్యాసంగం మొదలు పెట్టిన తోలినాల్లలోనే నా ఆర్టికల్ పై అంతగా స్పందించిన ఆ కళాత్మక హృదయం గల ఆ వ్యక్తి ఎవరబ్బా అని నేను అడగడం, దానికి ఆయన తాను కూడా ఒక చిత్రకారుడినని నాపేరు సుదర్శన్ అని అంతా దాసి సుదర్శన్ అని పిలుస్తారు అన్నారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యి, దాసి సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ సుదర్శన్ గారా అని అడిగాను? అవును అని చెప్పగానే నా ఆనందానికి అవదులు లేవు. కారణం అంతకు ముందే కళాసాగర్ గారి ఆంధ్రకళాదర్శినిలో వీరి గురించి చదవడమే గాక అందులో ప్రచురితమైన వారి గొప్ప చిత్రం చూసియున్న వాణ్ని. అందుకే దాసి సుదర్శన్ అంతటి గొప్పవ్యక్తి నా ఆర్టికల్ పై స్పందించి కొంతసేపు మాట్లాడడం నాకు గొప్ప ఆనందంఅయ్యింది. వయసులోనే గాక కళాపరంగా కూడా అన్ని రంగాలలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తిఆయన. ఒక చిత్రకారుడిగా, నటుడిగా రచయితగా ఒక స్థాయిలో వున్నవ్యక్తి ఆయన. ఆ తర్వాత ఆయన చెప్పుకొచ్చారు తాను ఇటీవలనే చిత్రకారుడిగా పని చేసి రిటైర్ అయ్యానని నాగార్జున సాగర్ వద్ద తానుఉంటున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత నేను “64 కళలు.కాం” లో రెగ్యులర్ గా రాసే ఆర్టికల్స్ లో కొండపల్లి శేషగిరిరావు కాపు రాజయ్య లాంటి వారి గురించి రాసిన ఆర్టికల్స్ గురించి ఫోన్ లో మాట్లాడడం జరిగేది. ఆ తర్వాత ఆయన ఉద్యోగం నుండి రిటైర్ అయిన సందర్భంలో ఆయన మిత్రులు “మనసు దర్శనం” పేరుతో వేసిన ప్రత్యేక సంచికను మరియు ఆయన వ్రాసిన కుంచెలు–కలాలు అన్న మరో పుస్తకం రెండింటిని అప్పటికి చర్లలో ఉంటున్న మా అడ్రస్ కి వారు పోస్ట్ లో పంపడం మరింతానందం వేసింది.

సుదర్శనం గారి నుండి వచ్చిన ఆ పుస్తకాలను ఎంతో మురిపెంగా తిరగేశాను. ఎంతమంది చిత్రకారులు, రచయితలు సాహితీవేత్తలు, నటులు, కార్టూనిస్టులు, సినీ దర్శకులు ఆయన శ్రేయోభిలాశులో అభిమాన పాత్రులుగా వున్నారో నా కర్ధంయ్యింది. ఆయన వృత్తి పరంగా చిత్రకారుడు కావచ్చు కాని దానికే ఆయన పరిమితం కాలేదు, లలితకళలకు సంభందించిన అన్ని విభాగాలలోనూ తను దైన ముద్రవేశారు. ఒక గాయకుడిగా నటుడిగా, చిత్రకారుడిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా, ఫోటో గ్రాఫర్ గా అన్నింటా తన జీవితాన్ని కళారంగంతో పెనవేసుకున్నారు . చిత్రకారుడిగా రొటీన్ గా కాకుండా తనదైన శైలిని ఏర్పరుచుకున్న కళాకారుడు ఆయన. అలాగే చిత్రకారుడిగా కేవలం బొమ్మలేయడం మాత్రమే గాకా ఆ బొమ్మల వెనుక మర్మం గురించికూడా అద్భుతంగా రాయగాలదిట్ట ఆయన .తను రాసిన కుంచెలు కలాలు అన్న గ్రంధంలో ప్రఖ్యాత జానపద చిత్రకారులు పైడి రాజు గారి గురించి రాస్తూ చిత్రకారులు నిరంతరం స్వాప్నిక జగత్తులో విహరించే నీరో చక్రవర్తులని దైనందిన బాహ్యప్రపంచాన్ని వారు పట్టించుకోరనే అభిప్రాయానికి భిన్నంగా పైడిరాజు తన చుట్టూ వున్న సమాజాన్ని మానవ సంభందాలను ,వ్యక్తుల ప్రవర్తనలనూ నిశితంగా పరిశీలించి సందర్భానుసారం స్పందించిన ప్రతిభాశాలి. అంతే గాక, జానపదశైలికి తొలితరం ప్రతినిధి అని అంట్యాకుల పైడిరాజును గురించి గొప్పగా రాస్తారు. అలాగే ఏ లలిత కళా రూపాలనైనా ఆస్వాదించడానికి ఒక వ్యక్తిలో సహృదయత, సానుభూతి, సహనం, అధ్యయనం అవసరం అని చెప్తారు.. మారుతున్న చిత్రకళా దోరణులగురించి కూడా చక్కగా వివరిస్తారు. ఇంకా కొండపర్తి శేషగిరిరావు, ఎస్.వి. రామారావు కొమ్మిసేట్టి శ్రీనివాసులు సాహితీ వేత్తలు కాళోజి, కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి, సిని నటులు కాంతారావు లాంటి ప్రముఖ వ్యక్తులను చేసిన ఇంటర్వూలు, అలాగే నట్ట నడుమ నల్లగొండ పేరుతో ఆ జిల్లా నందలి చిత్ర కళ. సాహిత్య నాటక, చలన చిత్ర తదితర రంగాలలో కృషి చేసిన కళాకారుల గురించి ఆయన వివరిస్తూ వ్యాసాలూ రాయడం జరిగింది . ముఖ్యంగా నల్గొండ జిల్లా నుండి జాతీయ స్తాయికేదిగిన చిత్రకారులు ఏలే లక్ష్మన్, పిట్టల రామచంద్రం, కాతోజు వెంకటేశ్వర్లు, ఈనాడు శ్రీధర్, ఇండియా టుడే నర్శిం , చిత్ర, సాక్షి శంకర్ చంద్రశేఖర్, శ్రీ చంద్ర, కంబాలపల్లి కృష్ణ, శ్రీనివాస నాయక్, కూరెల్ల శ్రీనివాస్, గోనే లింగరాజు, ధనిఎలె, దేవరాయ, నామాల సురేష్ లాంటి ఎందరో చిత్రకారులగురించి లఘు వ్యాసాలూ రాసారు.

నటుడిగా మిర్యాలగూడ సాంస్కృతిక కేంద్రం మరియు నల్లగొండ ‘కోమలి కళాపరిషత్’ వారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన “ఊరుమ్మడి బతుకులు, దంతవేదాంతం“ జన్మభూమి, రాజద్రోహి, సరిహద్దు, అసలు నేను, మంచంమీద మనిషి లాంటి సాంఘీక నాటికలతో పాటు చింతామణి, నలదమయంతి, వసంత రాజీయం శ్రీ కృష్ణ తులాభారం, యమాజనేయ యుద్ధం లాంటి పౌరాణిక నాటకలు ఎన్నిట్లోనో పలు పాత్రలు పోషించారు.

1989లో ప్రముఖ కళాకారుడు బి. నరసింగరావు తీసిన “దాసి” చలన చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి ఆ ఏడాది ఆ సినిమాకు జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాష్ట్రపతి నుండి అవార్డ్ అందుకోవడంతో నాటి నుండి పిట్టంపల్లి సుదర్శన్ పేరు ‘దాసి’ సుదర్శన్ గా స్థిరపడిపోయింది .

శ్రీ మతి పిట్టంపల్లి లక్ష్మమ్మ మట్టయ్య అనే దంపతులకు పిబ్రవరి 02వ తేదీ 1951 వ సంవత్సంలో పూర్వ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సుదర్శన్ గారు జన్మించారు. సాధారణ డిగ్రీ బి.ఏ., బి.యిడి. తో పాటు, చిత్రకళపై ఆసక్తితో పెయింటింగ్ లో డిప్లోమా కూడా చేయడంతో డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగం సాదించి గవర్నమెంట్ మోడల్ స్కూల్ నాగార్జున సాగర్ నందు నియమితులయ్యారు. 1992 లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ముఖ్యమంతి నుండి అందుకున్న పురష్కారంతో పాటు రాష్త్రంలో పలు సంస్కృతిక సంస్థలనుండి ఎన్నో పురస్కారలనందుకున్నారు. డ్రాయింగ్ టీచర్ గా కేవలం ఆవ్రుత్తికే పరిమితం గాకుండా కళాత్మక చిత్రాలైన దాసి, మా ఊరు, మట్టిమనుషులు లాంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా, అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు. రాష్ట్రంలోని ఎందరో కవులు సాహితీ వేత్తల పుస్తకాలకు ముఖ చిత్రాలనందించారు.

కాలక్రమంలో నాకు ప్రత్యక్ష సంభంధం ఏర్పడి బాగా సుపరిచితులైన నల్గొండ చిత్రకారులు సాక్షి శంకర్, కూరెల్ల శ్రీనివాస్, దేవరాయ వీళ్ళతో జరిగిన సంభాషణల్లో అప్పుడప్పుడు సుదర్శన్ గారి ప్రస్తావన రావడం జరిగేది. మిత్రుడు కూరెల్ల శ్రీనివాస్, బీర శ్రీవాస్ అందరం కలిసి ఒక్కసారి నాగార్జున సాగర్ వెళ్లి ఆరడుగుల ఎత్త్తు ఆ ఎత్తుకు తగ్గ దేహ దారుద్యం, ఉంగరాల జుట్టుతో ఒక ప్రత్యేక విగ్రహంలా కనిపిస్తూ అంతే ప్రతేకమైన రీతిలో అవధులు లేని కళానైపుణ్యం సొంతం చేసుకున్న సుదర్శన్ గారి ని కలవాలని చాలా సార్లు అనుకునేవాళ్ళం. కాని ఆ కల నెరవేరకుండానే 01-04-2024 న వారు ఆకస్మికంగా ఈ లోకాన్ని వీడడంతో మా పరిచయం ప్రత్యక్షంగా మారకుండా అలా పరోక్షంగానే మిగిలిపోయింది .

మనిషి జీవితం అశాశ్వతం కాని కళ మాత్రం శాశ్వతం. అందుకే వ్యక్తిగా సుదర్శన్ నేడు మనమధ్య లేకపోవచ్చు కాని ఆయన కళ ఎప్పటికి శాశ్వతంగా నిలిచే ఉంటుంది.

వెంటపల్లి సత్యనారాయణ
చిత్రకారుడు, మరియు చిత్రకళా రచయిత
9491378313

4 thoughts on “నా జ్ఞాపకాల్లో ‘దాసి’ సుదర్శన్- వెంటపల్లి

  1. బాగుంది సార్..
    డ్రాయింగ్ టీచరుగా *ఉత్తమ ఉపాద్యాయులుగా* అవార్డు అందుకోవడం, దాసి సినిమాకి *రాష్ట్రపతి నండి అవార్డు* తీసుకోవడం గొప్ప విషయమే.
    ప్రతిభకు గుర్తింపు ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం *దాసి సుదర్శన్* గారు.

    మొదటి పేరాలో మీరు రాసిన థీరీ అక్షర సత్యం.

    మంచి మనిషికి చక్కని నివాళి….
    అభినందనలు సర్ 🌹

  2. చాలా బాగా , విపులంగా రాశారు. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap