విజయవాడ సభలో ‘నవ్వులు గ్యారెంటీ’

*భావరాజు పద్మిని ప్రియదర్శిని గారికి – బంగార్తల్లి పురస్కారం-2024
*ప్రముఖ కార్టూనిస్టు నాగిశెట్టి ‘నవ్వులు గ్యారెంటీ’ – కార్టూన్ల సంకలనం ఆవిష్కరణ
*విశాఖ ‘NCCF’ నిర్వహించిన కార్టూన్ల పోటీ – బహుమతి ప్రదానం
*’గోదావరి తీరాన’ తెలుగు కార్టూన్లు – పుస్తక ఆవిష్కరణ

*‘మినీ హాస్య కథల’ పోటీ విజేతలకు బహుమతి ప్రదానం
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

14 ఏప్రిల్ 2024, సాయంత్రం 6:00 గంటలు, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ.. హాల్ అంతా కార్టూనిస్టులతో, కార్టూన్లు ఇష్టపడే వారితో, రచయితలతో నిండిపోయింది.
అది హాస్యానందం రాము గా పిలువబడే హాస్యానందం పత్రికా సంపాదకులు రాము గారి తల్లి అయినా శ్రీమతి జాంబవతి గారి పేరు మీద గత మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా పబ్లిషింగ్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన మహిళా మణులకు ఇచ్చేటువంటి బంగార్తల్లి పురస్కార మహోత్సవం.

ఈ పురస్కారం ఈ సంవత్సరానికి గాను శ్రీమతి భావరాజు పద్మిని ప్రియదర్శిని గారికి ప్రధానం చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ పబ్లిషింగ్ రంగంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుందని, పుస్తకాలు కొని చదివేవారు తగ్గిపోయారని, అయితే యూనికోడ్ వంటివి వచ్చాక పబ్లిషింగ్ చాలా తేలిక అయ్యిందని, తాను ఇప్పటివరకు దాదాపు 105 పుస్తకాల వరకు ప్రచురించామని తెలియజేశారు.

ఈ సమావేశంలో శ్రీదుర్గామల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.ఎస్. రామారావు, కేబీఎన్ కాలేజీ విజయవాడ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ టి. శ్రీనివాస్, సెక్రటరీ సాహితీ సమాఖ్య గుంటూరు, ఎస్.వి.ఎస్. లక్ష్మీనారాయణ, ప్రముఖ కార్టూనిస్టులు సరసి మరియు బాచి లు, సాహితీ విమర్శకురాలు శ్రీమతి బాలాంతరపు ప్రసూన, హాస్యానందము ఆప్త బంధువు కె.వి. సత్యనారాయణ, హాస్యానందంలో కొసమెరుపు కథల పోటీ నిర్వాహకులు పాలపర్తి శ్రీకాంతశర్మ మొదలైన వారు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత డా. కప్పగంతు రామకృష్ణ ఆధ్యంతం ఉల్లాసంగా నిర్వహించారు.
వక్తలు మాట్లాడుతూ రచనల్లోనే కాకుండా సర్వకాల సర్వావస్థలందు హాస్యం యొక్క ప్రాధాన్యత తప్పక ఉంటుందని తెలిపారు. అలాగే కష్టపడి ప్రచురించిన పుస్తకాలను నిమిషాలలో పిడిఎఫ్ కింద మార్చి సర్క్యులేట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయంగా వక్తలందరూ అభివర్ణించారు. అందరూ పుస్తకాలను ఉచితంగా అడగకుండా కొని చదవాలని విజ్ఞప్తి చేశారు.

తదుపరి ప్రముఖ కార్టూనిస్టు నాగిశెట్టి ప్రచురించిన ‘నవ్వులు గ్యారెంటీ’ అనే కార్టూన్ల సంకలనాన్ని ఆవిష్కరించారు. అయితే ఇక్కడ ఒక కొత్తదనానికి అందరూ నాంది పలికారు. అది ఏమిటంటే ఈ నవ్వులు గ్యారెంటీ అనే కార్టూన్ల పుస్తకాన్ని అందరూ ఉచితంగా అడగకుండా కొనుక్కున్నారు. 150 రూపాయలు ఖరీదు చేసే ఈ పుస్తకాన్ని అక్కడకు వచ్చిన వారందరికీ నాగిశెట్టి 100 రూపాయలకే అందించారు.
తదుపరి గోదారి తీరాన తెలుగు కార్టూన్లు అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇది కొన్నాళ్ల క్రితం రాజమండ్రిలో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభలలో ప్రదర్శించిన కార్టూన్ల తాలూకు సంకలనం. దీనిని రంగులలో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని యువ కార్టూనిస్టు హరికృష్ణ ఇతర కార్టూనిస్టుల సహాయంతో శ్రమకోర్చి ప్రచురించడం జరిగింది. దీని వెల 200 రూపాయలుగా నిర్ణయించారు.

తదుపరి విశాఖపట్నం చెందిన కార్టూనిస్టుల సమితి అయిన NCCF వారిచే నిర్వహింపబడిన కార్టూన్ల పోటీలో బహుమతులు పొందిన కార్టూనిస్టులకు బహుమతులు అందజేశారు. వీరిలో నాగిశెట్టి, అరుణ్, ప్రసాద్ కాజా, ప్రేమ్, సునీల్ మరియు ఇతర కార్టూనిస్టులు ఉన్నారు.
తరువాత పాలపర్తి రాజగోపాల్ మరియు ఉమాదేవి స్మారక ఉగాది కొసమెరుపు మినీ హాస్య కథల పోటీలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

సభ ఆద్యంతం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా, చతురోక్తులతో, నవ్వులతో సాగింది.
ఇటువంటి సభలు తరచూ జరుగుతూ ఉండాలని, ఇలా హాస్యాన్ని పండించే కార్టూనిస్టులు మరియు రచయితలు కలుస్తూ ఉండాలని, తద్వారా ప్రజలకి నవ్వులు పంచి ఆరోగ్యాన్ని పెంచాలని అందరూ ఆకాంక్షించారు.
చివరగా రాము గారు తాను కష్టనష్టాలకు ఓర్చి ఈ హాస్యానందాన్ని నడిపిస్తోంది కేవలం ఇష్టపడేనని, లాభాపేక్షతో కాదని, అలాగే పబ్లిషింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి తాను ఈ బంగార్తల్లి పురస్కారాన్ని తన తల్లి గారి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతూ, సభ జయప్రదం కావడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

-నాగిశెట్టి

3 thoughts on “విజయవాడ సభలో ‘నవ్వులు గ్యారెంటీ’

  1. ఆదివారం జరిగిన ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగిందండి.. 30 మందికి పైగా కార్టూన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. చాలామంది హాస్య రచయితలు కూడా పాల్గొన్నారు. వక్తలు కూడా చాలా చక్కగా మాట్లాడి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. నా కార్టూన్ల సంకలనం నవ్వులు గ్యారెంటీ కూడా చాలా బాగుందని అందరూ మెచ్చుకొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తదుపరి ప్రచురించే పుస్తకం మరింత అందంగా తీర్చి దిద్దాలి అనేటువంటి పట్టుదలని చేపట్టేటట్లు చేసింది. నా కార్టూన్ల పుస్తకం కొనుగోలు చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇంకా చాలామంది పోస్టులో పంపమని అడుగుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎలా పంపాలో ఫైనలైజ్ చేసి అందరికీ తెలియజేస్తాను.

  2. చాలా బాగా అన్ని విషయాలు సవివరంగా క్రొదీకరించారు.

  3. 14వ తేదీ శభాకార్యక్రమాలాగురించి చాలాచక్కగా వివరించారండీ. ధన్యవాదములు. ఈ సభకు రాలేకపోయిన మిత్రులకు మీరు వ్రాసింది చదివితే – ఈ కార్యక్రమాలు సచిత్రంగా కళ్ళముందు మెదులుతాయి.
    హాస్యానందం రాముగారు అత్యంతరమ్యంగా నిర్వహించారు. వారికి ధన్యవాదములు.🙏🏻
    – ప్రసాద్ కాజ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap