సమాజ ప్రగతికి చిత్రకళ తోడ్పడాలని జీవితాంతం పరితపించిన కళాతపస్వి దాసి సుదర్శన్. ఐదు జాతీయ పురస్కారాలతో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో ఎగురవేసిన ‘దాసి’ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన. ‘దాసి’ సినిమా తరువాత ఆ సినిమా పేరు తన ఇంటి పేరుగా ప్రసిద్ధి చెందిన పిట్టంపల్లి సుదర్శన్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జన్మించారు. సుదర్శన్ కేవలం చిత్రకారుడు మాత్రమే కాదు, రచయిత, ఫొటోగ్రాఫర్, సంగీత కారుడు, నటుడు, నాటక దర్శకుడు కూడా. నటనను తన తండ్రి మట్టయ్య ద్వారా వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడు. అనేక నాటకాల్లో నటుడిగా తన ప్రతిభను కనబరిచారు. మిర్యాలగూడకు చెందిన శేషు రచించిన ‘భవిష్యత్ తరం’, ‘కళావేత్తలారా మీరెటు వైపు?” నాటకాల్లో నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు. పాఠశాల దశలో ఎక్కడ చిత్రలేఖనం పోటీలు జరిగినా ప్రథమ స్థానం వీరిదే. చిత్రకళని తన జీవికకు ఉపాధిగా ఎంచుకున్నా అంతటితో ఆగకుండా కళాఖండాలను సృష్టించగలిగారు. వీరు గీసిన చాకలి ఐలమ్మ, కొమరం భీం లాంటి తెలంగాణ యోధుల పోర్ట్రెట్స్, చలం, శ్రీశ్రీ వంటి అభ్యుదయ కవుల పోర్రెట్స్, వారి సుప్రసిద్ధ కొటేషన్స్తో వచ్చిన క్యాలెండర్స్ ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ ఏర్పాటు నాగార్జునసాగర్ అనంతరం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో వీరి అనేక చిత్రాలకు చోటు దక్కింది.
ఈ ప్రాజెక్టు కోసమే ఇంకా అనేక భంగిమల్లో బుద్ధుడి చిత్రాలు గీసారు. అవి బుద్ధ వనంలో ఇంకా చేర్చవలసి ఉంది. తొలినాళ్లలో బ్యానర్లు రాస్తూ, ఆయిల్ పెయింటింగ్ లు వేసే సుదర్శన్ తదనంతరం. ఆ రంగంలో అనేక టెక్నిక్స్ నేర్చుకున్నారు. వీరి ప్రతిభకు ఆనాడు మద్రాసులో ఉన్న సినిమా రంగం నుండి పబ్లిసిటీ రంగంలో అవకాశాలు వచ్చాయి. కానీ తల్లి కోరిక మేరకు విరమించుకున్నారు. అనంతరం నాగార్జునసాగర్లో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. నాటి చిత్రకళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది బహుమతి పొందిన ‘ఈ చరిత్ర చెరిపేద్దాం’ ‘అఖండ విప్లవ జ్యోతి అంబేద్కర్’ అనే డాక్యుమెంటరీ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. ‘ప్రగతి పథంలో నల్లగొండ’ అన్న మరొక చిత్రం కూడా వీరి ఆర్ట్ డైరెక్షన్లో వచ్చింది. ప్రసిద్ధ కళాకారులు మాజీ ఎమ్మెల్యే రాజారత్నం నిర్మించిన ‘తపస్వి’ వీడియో చిత్రంలో ఆర్ట్ డైరెక్టర్ గా, నటుడిగా కూడా పని చేశారు. ఆర్ట్ ఫిల్మ్ ‘రంగుల కల’ చిత్ర నిర్మాత బి. నర్సింగరావుతో పరిచయమైన తరువాత వీరి సినిమా జైత్రయాత్ర అప్రతిహతంగా సాగింది. నర్సింగరావు దర్శకత్వంలో వచ్చిన ‘మా ఊరు’, ‘దాసి’, ‘మట్టి మనుషులు’, ‘హరివిల్లు’ చిత్రాలకు అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేశారు.
సుదర్శన్ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘దాసి’, దాసి చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్గా ఆ సినిమాకు పూర్వం 45 సంవత్సరాల క్రితపు వాస్తవ వాతావరణాన్ని తెరపై చూపించగలిగాడు. ఎంతో పరిశీలన, పరిశోధన ఉంటే తప్ప ఈ పని చేయడం సాధ్యం కాదు. సుదర్శన్ శ్రమకు తగిన గౌరవం దక్కింది. జాతీయస్థాయిలో ఉత్తమ డిజైనర్గా ఎంపికయి రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ చలన చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్ గా సేవలందించారు. అలాగే 2005 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర ఉత్తమ బహుమతుల జ్యూరీ కమిటీలో ఆంధ్రప్రదేశ్ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే ఎంపిక చేయబడిన ఒకే ఒక వ్యక్తి దాసి సుదర్శన్ కావడం గమనార్హం. దాసి సుదర్శన్ అనేక పుస్తకాలకు అందమైన ముఖ చిత్రాలను డిజైన్ చేశారు.
పికాసో, బాపు, ఎం.ఎఫ్. హుస్సేన్, వైకుంఠం వంటి లబ్దప్రతిష్టులైన చిత్రకారులు ప్రభావం తనపై ఉందని ఆయనే ఒక సందర్భంలో చెప్పుకున్నారు.
‘దాసి’ సుదర్శన్ విలక్షణమై ఫొటోగ్రాఫర్ కూడా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫొటో జర్నల్స్ అధ్యయనం చేసి వారు ఫొటోగ్రఫీని సశాస్త్రీయంగా ఒంట పట్టించుకున్నారు. వీరి సృజనాత్మక ఛాయాచిత్రాలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, ఉదయం మొదలైన దినపత్రికలలో ప్రచురితం అయినాయి.
సుదర్శన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి గాయకుడు. ముఖేష్, జేసుదాస్ వంటి గాయకుల పాటలను రమణీయంగా ఆలపించేవారు. రవిశంకర్, బాలమురళీకృష్ణ అంటే వీరికి అభిమానం మెండు. సాహిత్యంలోనూ సుదర్శనికి ప్రవేశం ఉన్నది. 1973 ప్రాంతంలో వీరు కొన్ని కథలు రాశారు. అవి ఇప్పుడు అలభ్యం. ‘కుంచెలు-కలాలు’ పేరుతో కళా సాహిత్య రంగాల వ్యాసాలు ప్రముఖుల ఇంటర్వ్యూలను గ్రంథంగా ప్రచురించారు. ‘నట్ట నడుమ నల్లగొండ’ పేరుతో నల్లగొండ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తులను ప్రాంతాలను రికార్డు చేశారు. ఇంకా వివిధ దినపత్రికల్లో రూపంలో వచ్చిన వ్యాసాలు రాకుండా అనేకం ఉన్నాయి. సాహిత్య కళా రంగాలలో సుదర్శన్ సేవలు ఎన లేనివి. మిర్యాలగూడలో చైతన్య సమాఖ్య, హైదరాబాద్, నల్లగొండ కేంద్రంగా పనిచేసిన ‘జయ మిత్ర సాహిత్య సాంస్కృతిక సంస్థ’ లలో దాసి సుదర్శన్ కీలకంగా వ్యవహరించారు. నాగార్జునసాగర్లో తానే స్వయంగా ‘అల’ కళావేదిక స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అభ్యుదయ దృక్పథంతో సమాజ సంస్కరణను అభిలషించిన దాసి సుదర్శన్ మరణం సాహితీ కళారంగాలకు తీరనిలోటు.
“దాసి సుదర్శన్ అచ్చమైన రచయిత. స్వచ్ఛమైన కళాకారుడు. నగరం మాయలో పడి కళను కోల్పోయిన వాడు కాదు. ఆయన కళాజీవితం గుడిసె మీద గుమ్మడి తీగలా మొదలై ‘రాష్ట్రపతి అవార్డు’తో ఆకాశమల్లెగా విరబూసింది” అనే డా. అమ్మంగి వేణుగోపాల్ మాటలు అక్షర సత్యాలు.
–డాక్టర్ సాగర్ల సత్తయ్య