పబ్లిసిటీ డిజైనర్ రామారావు కన్నుమూత

పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తెలుగు సినిమాలకు ప్రచార చిత్రకారులుగా స్థిరపడిన కేతా సాంబమూర్తి గారికి, మరో శిష్యుడు మజ్జి రామారావుగారు, గంగాధర్లకు జన్మనిచ్చింది పోడూరు గ్రామమే. వీరు ప. గో. జిల్లా పోడూరు గ్రామంలో 1941లో అప్పయ్యమ్మ, లచ్చన్న దంపతులకు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ఐదుగురన్నదమ్ముల్లో మధ్యముడిగా జన్మించారు. 1956-60 సం.లలో ప్రముఖ చిత్రకారులు కేతా సాంబమూర్తి వద్ద శిష్యుడిగా చేశారు. ప్రముఖ చిత్రకారులు కె. గంగాధర్, ఎం. సత్యనారాయణ మూర్తిలతో కలిసి ‘సరాగం’ స్టూడియో స్థాపించారు. రామారావు గారు తన 82 వ యేట 31 మార్చి 2024 న చెన్నై లో తుదిశ్వాస విడిచారు. వారి జీవనయాణాన్ని వ్యాసరూపంలో 64కళలు.కాం పాఠకులకోసం…

పాలేరు నుంచి పబ్లిసిటీ డిజైనర్ గా: చదివింది ఐదోతరగతేయైనా స్వతహా క్రమశిక్షణ, అణకువ అలవరుచుకున్న రామారావు కు అనుకోని రీతిలో చిన్నతనం నుంచి చిత్రకళ అబ్బడం అందర్ని అబ్బురపరిచింది. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఒక చిత్రకారుడు రావడం ఆశ్చర్యమే. బాల్యంలో తోటివాడైన గంగాధర్ బొమ్మలు వేయడం గమనిస్తూ వచ్చిన రామారావు తానూ వెయ్యాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు. గంగాధర్ వేసే ప్రతి డ్రాయింగును తిరిగి అలాగే వేసే ప్రయత్నం చేసేవారు. అలా చెయ్యగా కొంతకాలానికి చెయ్యి తిరిగింది. డ్రాయింగులు వెయ్యడానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటే ఈయన ఉత్సాహాన్ని పదింతలు చేసింది. గుండె ధైర్యాన్ని నింపింది. ఆర్టిస్ట్ కావాలని తపనపడుతున్న తరుణంలో తన తండ్రి కొన్ని వివాదాల్లో చిక్కుకుని ఎవరికి చెప్పాచెయ్యకుండా ఒక అర్ధరాత్రి రంగూను వెళ్ళిపోయారు. ఇక కుటుంబానికి యింకో ఆధారం లేకపోవడంతో తల్లి రామారావును ఒక రైతు దగ్గర పాలేరుగా వుంచింది. తర్వాత ఈయన పెద్దమ్మ ఒక గేదెను కొని రామారావుకు అప్పగించి దాని పాలు పితికి అమ్మి కుటుంబాన్ని పోషించమని సలహాయిచ్చింది. అలా పాడి చేసుకుంటూ జీవితాన్ని గడిపే సమయంలో రంగూన్ వెళ్ళిపోయిన తండ్రి తిరిగి రావడం, పోడూరులో కొంత పొలాన్ని కొని, వ్యవసాయం ప్రారంభించి దాని బాధ్యత రామారావుకు అప్పగించడంతో ఈయనకి పాడి పంటల్లో అనుభవం లభించింది. అయినా చిత్రకళమీద మక్కువ పోక ప్రతి బొమ్మను, ప్రతి డ్రాయింగ్ను నిశితంగా పరిశీలించేవారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళకు. డెకరేషన్ చెయ్యడానికి డెకరేటర్లు, ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ వెంటబడి తిరిగేవారు. ఇది గమనించిన తన తల్లి వారి గ్రామనికి చెందిన ప్రముఖ చిత్రకారులు కేతా సాంబమూర్తి వద్ద కుమారున్ని శిష్యుడిగా చేర్పించింది. పిమ్మట తన తల్లి వారి గ్రామనికి చెందిన ప్రముఖ చిత్రకారులు కేతా సాంబమూర్తి వద్ద చెన్నై లో కుమారున్ని శిష్యుడిగా చేర్పించింది. అలా మూడేళ్ళ పాటు జీతం లేకుండా భోజనం పెట్టి, సంవత్సరానికి ఒక జత చొక్కా, లాగు కుట్టించేవారు కేతా గారు.

‘స్టూడియో సరాగం’ : ఇలా ఆర్టీమీద ఆసక్తిని పెంచుకొని గంగాధర్ తో పరిచయాన్ని, స్నేహాన్ని పెంచుకొని గంగాధర్ కంటే ముందే 1956వ సంవత్సరంలో ‘పూరి ప్యాసింజర్’ ఎక్కి మద్రాస్ లో కేతా సాంబమూర్తి గారింటికి చేరుకున్నారు. పోడూరు కుర్రాళ్ళలో అందరికంటే ముందుగా కేతాగారి దగ్గర ప్రవేశించింది రామారావుగారే… పని నేర్చుకునే సమయంలో కేతాగారి శ్రీమతిగారు ఇంట్లో చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడంతో మనస్తాపానికి గురై తిరిగి యింటికి పోతానని మారాం చెయ్యడం ప్రారంభించే సరికి కేతాగారు. బుజ్జగించి వెంట తీసుకొనిపోయి సినిమాలు చూపించి, ఆయన మనసు మార్చే ప్రయత్నం చేసేవారు. ఆ విధంగా రామారావుగారు రెండు మూడు సంవత్సరాలపాటు డిజైనింగ్, లెటరింగ్లోను అనుభవం సంపాదించాక తనతోపాటు వున్న గంగాధరం, సత్యనారాయణమూర్తిగార్లలతో కలిసి బయటకు వచ్చి వారి పేర్లలోని మొదటి అక్షరాలతో ‘స్టూడియో సరాగం’ సంస్థను స్థాపించడం, సుమారు రెండున్నర సంవత్సరాలనంతరం స్వతంత్రంగా చెయ్యాలనే అభిలాషతో బయటకువచ్చి త్రిమూర్తి స్ట్రీట్లో ఏకాబ్రేశ్వరరావుగారు వుంటున్న ఇంట్లోనే ఒక భాగంలో వుంటూ బుక్ రేపర్లు, స్టోరీ ఇలస్ట్రేషన్స్తో కాలం గడపడం ప్రారంభించారు.

మొదటి సినిమా: 1965లో పోస్టర్స్ చెయ్యడానికి ‘పెరియ ఇడత్తు పెణ్’ తమిళ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు దానిమీద ‘రామారావ్ ఆర్ట్స్’ అనే ఇంగ్లీష్ సంతకం చేశారు. తర్వాత ఏకాంబ్రేశ్వరరావు, రాఘవలతో పరిచయం బాగా పెరగడంతో వారిద్దరూ నిర్మాతలై నిర్మించిన ‘తాత మనవడు’ చిత్రానికి డిజైన్స్ చేసినప్పుడు రామారావు పేరు పరిశ్రమలో అందరికి తెలిసింది. ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ, ఏకాంబ్రేశ్వరరావుగార్ల ప్రోత్సాహం, అండ లభించడంతో వరస చిత్రాలకు పనిచేసే అవకాశం కలిగింది. ఆ తర్వాత కొద్దికాలంలోనే మదురై వీరన్ కోయిల్ వీధిలో తాపీ చాణక్యగారి ఇంటికెదురు స్థలంకొని గృహ నిర్మాణం చేశాక తన నివాసాన్ని, కార్యాలయాన్ని అక్కడకు మార్చుకుని పలు చిత్రాలకు పబ్లిసిటీ డిజైనింగ్ చేశారు. బాలమిత్ర, ఆంధ్ర సచిత్రవారపత్రిక,యువ, స్వాతి, జ్యోతి మాసపత్రిక, విజ్ఞమ్, సినిమారంగం, వార, మాసపత్రికలకు ఇలస్ట్రేటర్ గా వేలాది బొమ్మలు వేశారు. పాకెట్ నవలల ముఖచిత్రాలు అనేకం చిత్రించారు. 1980 నుండి నూనె రంగుల్లో రూపచిత్రాలువేస్తున్నారు. అనేక కళాప్రదర్శనలు కూడా నిర్వహించారు.

తమిళనాడు ఆర్టు అండ్ క్రాఫ్ట్స్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్లో గత పది సంవత్సరాలుగా వీరి చిత్రాలు ప్రదర్శింపబడి ప్రశంసలు అందుకొన్నారు. 2016లో అదే సంస్థ చిత్రకళారత్న బిరుదుతో సత్కరించింది. 2018లో పాలకొల్లు లైన్స్ క్లబ్ ‘కళాతపస్వి’ బిరుదుతో సత్కరించింది.

రామారావు గారికి సంతానం ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ‘మజ్జి బాబు’ అనే సంతకంతో కొన్ని సినిమాలకు పనిచేశాడు. రెండవ అబ్బాయి కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.

‘రామారావ్ ఆర్ట్స్’ పబ్లిసిటీ డిజైన్స్ చేసిన కొన్ని చిత్రాలు:
అభిమానవంతులు, ఆడజన్మ, అమ్మ మాట, అనురాగాలు, ఐలిపీఠం, బంగారక్క, భలే రంగడు, చదువు సంస్కారం, గాంధీ పుట్టిన దేశం, గౌరి, హంతకులు – దేవాంతకులు, ఇల్లాలు తీర్పు, ఇంట్లో రామయ్య – – వీధిలో కృష్ణయ్య, ఇంటిగుట్టు, ఇంటింటి కథ, జగత్ జెట్టీలు, జగత్ కిలాజీలు, కలియుగ రాముడు, జమిందారుగారి అమ్మాయి, కాలం మారింది, ఎం.ఎల్.ఏ. ఏడుకొండలు, మండలాధీసుడు, మేనకోడలు, ఒకే రక్తం, పల్లెపడుచు, పట్టుకుంటే లక్ష, ప్రేమతరంగాలు, పుట్టింటి గౌరవం, సింహబలుడు, స్నేహబంధం, సుఖ దుఃఖాలు, తరంగిణి, తాత-మనవడు, తొలిరేయి గడిచింది, తూర్పు పడమర, వైకుంఠపాళి లాంటి 300 పైగా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు.


కుమారులు, కూతురు చెన్నై లోనే స్థిరపడ్డారు. రామారావు గారు తన 82 వ యేట ఆదివారం, 31 మార్చి 2024 న చెన్నై లో తుదిశ్వాస విడిచారు.

రామారావుగారి మృతికి 64కళలు.కాం పత్రిక, తెలుగు సినీ పబ్లిసిటీ డిజైనర్స్ అసోసియేషన్, ప్రముఖ చిత్రకారులు, పబ్లిసిటీ డిజైనర్స్ గాలి అంకయ్య గారు, కడలి సురేష్ గారు సంతాపాన్ని తెలియజేసారు.

-కళాసాగర్

1 thought on “పబ్లిసిటీ డిజైనర్ రామారావు కన్నుమూత

  1. కీ. శే. రామారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ 🙏💐🙏వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను 💐🙏🙏💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap