ఒక కథలో సస్పెన్స్ – ఒక కథలో క్రైం… ఒక కథలో హాస్యం… మరొక కథలో కారుణ్యం… ఇంకో కథలో శృంగారం…. ఇలా ప్రతీ కథలోనూ నవ్యతను చూపిస్తూతన కథలకు ఇతి వృత్తాలు మన చుట్టూ వుండే సమాజమే అని గర్వంగా చెప్పే రచయిత సి.ఎన్. చంద్రశేఖర్. చిత్తూరుకు చెందిన చంద్రశేఖర్ కథ, కవిత, నవలా రచయితగా తెలుగు పాఠకులకు సుపరిచితులు.
ఈ ‘ఆదివారం కథలు‘ పుస్తకం ‘ఈనాడు’ దినపత్రిక అనుబంధంలో ప్రచురితమైన కథల సమాహారం. ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడినవి అంటేనే ఆ కథలు ఎంత శ్రేష్టమైనవో మళ్ళీ వేరేగా చెప్పనవసరం లేదు. ప్రతీ కథా రచయిత తన ‘కథ’ ఒకటి అయినా ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడాలని కోరుకుంటాడు.
ఈ కథాసంపుటిలో చందు, సుందరం, పెద్దన్నయ్య, పిత్రార్జితం, స్వాతి ముత్యం, నీరాజనం, తల్లిదీవెన, బాలు, శుభసంకల్పం, ఆశయాల పల్లకిలో!, దృష్టి లాంటి పదకొండు కథలున్నాయి. రచయిత ప్రతీ కథను రాయడంలో తన అనుభవాలను ఆయా కథల పేజీలలో వివరించారు. ఇవి కథలను చదివే చదువరులకు రచయిత ఏవిధంగా ప్రేరణ పొందాడో తెలుసుకునేందుకు తోడ్పడుతుంది, ఆసక్తిని కలిగిస్తుంది కూడా. ఇంత చక్కటి కథాసంపుటి ని ప్రచురించిన జయంతి పబ్లికేషన్స్ వారు, రచయిత సి.ఎన్. చంద్రశేఖర్ అభినందనీయులు.
ప్రతులకు: సి. రాధిక (94923 78422), మరియు యస్వీ. కృష్ణ జయంతి (92473 02882)
పేజీలు: 136, వెల: రూ. 180/-
– కళాసాగర్