నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు

జయప్రకాష్ రెడ్డి గారితో మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకరరావు గారి అనుభవాలు – అనుభూతులు…

నాకు మొట్టమొదటిసారిగా పూసలగారు రాసిన మూడు సన్నివేశాల నాటకంతో విజయవాడలో JP గారు పరిచయం. నవ్వుతూ మాట్లాడారు.

తరువాత…పాలకొల్లు నాటక పరిషత్ లో నేను ఒక నాటిక మేకప్ చేస్తున్నాను. ఆ నాటిక మొదలు పెట్టిన దగ్గర్నుంచి విపరీతమైన మేకప్ చేంజ్ లు వున్న నాటిక. అప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు నా మేకప్ రూంలోకి వచ్చి “శంకర్ గారూ! మా నాటికకి కూడా దయచేసి మేకప్ చేసిపెట్టండి.” అన్నారు. సారీ సార్ అని నేను మేకప్ చేస్తున్న నాటిక పరిస్థితి చెప్పాను ఆయనకి. నేను చేస్తున్న నాటికలో బాగా రెస్ట్ లెస్ చేంజ్ లు వున్నాయి, నాకు అవకాశం లేదండి అన్నా. ఆ గ్యాప్ లోనే మాకు మేకప్ చేసి పెట్టండి అన్నారు. వారు అడిగినందుకు కాదనలేకపోయాను. మొత్తం మీద నా నాటిక మేకప్ చేంజ్ లు చేస్తూ వారి నాటిక కొత్తసైన్యం నాటికకు అన్ని పాత్రలకు మేకప్ చెయ్యగలిగాను. మీరట్లా అంటారు కానీ-“మీరు తలుచుకుంటే చెయ్యగలరు” అని అభినందించి సంతోషించారు. అది మొదలు వారి నాటికలన్నింటికీ (అలెగ్జాండర్ తప్ప) మేకప్ చేసే అవకాశం నాకే ఇచ్చారు. నేను తప్ప వారి నాటికలకు ఎవరూ మేకప్ చెయ్యలేదు.

గూడూరు పరిషత్ లో వారు అడిగితే అన్ని నాటిక పరిషత్ ల అడ్రస్లు, ఫోన్ నంబర్లు ఇచ్చాను.

జయప్రకాష్ రెడ్డి గారు చాలా శాంతస్వభావులు. ఎప్పుడూ చిరునవ్వుతోనే వుండేవారు. అనేక మంది మిత్రులు, సహాయకులున్నా కూడా ఆయన నాటకంలో వాడే చెప్పులు, బ్యాగ్ ఎవరికే ఇచ్చేవారు కాదు. తనే మోసుకు వచ్చేవారు. ఎంతటి ధనవంతుడైనా, సినీనటుడైనా భేషజం లేదు ఆయనకి.

JP గారితో వారి నాటకాలకి ఎన్నో వూళ్ళు తిరిగాను. సరదాగా వుండేవారు మాతో. ఢిల్లీ లో నేను వేరే నాటకం వుండి వెళ్ళి రావడంతో నాకు జీర్ణక్రియ దెబ్బతిని, వాంతులు, విరోచనాలు ఎకువగా అయ్యయి. ఎలాగోలా రైల్లో విజయవాడ చేరాను. సెలైన్లు పెట్టించుకుని వైద్యం చేయించుకున్నాను. మర్నాడే కడపలో JP నాటిక వుంది. వెళ్ళడం కష్టం, పైగా బస్ ప్రయాణం. అక్కడ వారికి మేకప్ చేసే వాళ్ళెవరూ వుండరు. అందుకని అతికష్టం మీద కడప వెళ్ళాను. ఏంటి అలా వున్నారు అని అడిగారు. నా సంగతి చెప్పాను. రాకపోతే ఏమవుతుంది అని ప్రేమతో మందలించారు. మేకప్ చేసేశాను ఆ ప్రదర్శనకి. ఆ రోజు సాయంత్రం కడపలో ఎక్కడికో పంపించి అనేక రకాల స్వీట్స్ ప్యాకెట్లు తెప్పించారు. మా అందరికీ అవన్నీ ఇచ్చి, “తీసుకెళ్ళి మీ పిల్లలకి పెట్టండి, బావుంటాయి.” అన్నారు. మాకు విజయవాడకి బస్ లో రిజర్వేషన్ అయింది. నాటిక అవగానే సినీ అభిమానులతో ఆయనకి సందడి విపరీతంగా. ఆయనతో పరిస్థితి అది. అతికష్టం మీద ఆయన వచ్చి నన్ను, మ్యూజిక్ సాంబశివరావుని పంపించారు.

మేకప్ రూం లో తన మనస్సులోనే రిహార్సల్స్ చేసుకునేవారు. పాత్రధారులందరితో చేసేవారు. డిస్టర్బన్స్ పనికిరాదు ఆయనకి. ఏవండి శంకరు గారూ! కొద్దిగా ఏమైనా వుందా, ఇస్తారా నాకు అనేవారు. “లేదండీ” అనేవాణ్ణి మేకప్ చేస్తూనే. కొద్దిగా వుంటే చూడండీ” అని మళ్ళీ అడిగేవారు సరదాగానే. ఇంతకీ ఆయన అడిగింది ఇచ్చేవాణ్ణి. ఫ్లాస్కులోంచి వేడి వేడి కాఫీ ఇచ్చేవాణ్ణి ఆయనకి ప్రతిసారీ.

ఒకసారి పగిలిపోయింది నా ఫ్లాస్క్. ఒక ప్రోగ్రాం లో మేకప్ లో అడిగితే ఇవ్వలేకపోయాను. కారణం అడిగితే చెప్పాను. వెంటనే కొత్త స్టీల్ ఫ్లాస్క్ కొనిపించి ఫుల్ కాఫీతో సహా నాకు బహుమతి ఇచ్చారు. ఇప్పుడది JP జ్ఞాపకార్థం నా దగ్గరే వుంది.

JP గారికి పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మాయి హేమమాలిని మా అబ్బాయి ప్రేమసాయి ఇద్దరూ ఆయనకి పరిచయమే. ఎప్పుడూ వారి యోగక్షేమాలు అడిగేవారు. హైదరాబాద్ సినిమాల్లో హడావిడిగా ఉన్నా కూడా – వాళ్ళ మనవలు, మనవరాళ్ల కోసం వారం వారం గుంటూరు వెళ్ళి వచ్చేవారుట. ప్రతీసారీ నాకు మేకప్ చేసినందుకు డబ్బులు ఇస్తూ, మళ్ళీ మరికొంత నగదు ఎక్కువ ఇచ్చేవారు. ఎందుకండీ అంటే పిల్లలకి ఏమైనా కొని పట్టుకెళ్ళండి అనేవారు ప్రేమగా నవ్వుతూ.

శంకరు గారూ ఏమైనా తెచ్చారా అని అడిగేవారు నన్ను. లేదండి తేలేదండి అనేవాణ్ణి, వుంటాయి చూడండి అనేవారు. ఇంతకీ ఆయన అడిగేది నేను పరిషత్ లకి వెంట తెచ్చుకునే నా పచ్చళ్ళు మసాలా లేనివి, నేను తయారుచేసుకున్నవి – గోంగూర, చింతకాయ, ఆవకాయ, కందిపొడి, కారప్పొడి, నువ్వులపొడి, నెయ్యి వగైరాలు. ఒకసారి, నంద్యాలలో జరిగిన నంది నాటకోత్సవాల్లో మొదటిరోజు అర్థరాత్రి వచ్చారు ఆయన, ఇంకొకరు. శ్రీశైలం మల్లేశ్వరస్వామి దీక్షలోవున్నారు. JP గారు పరమశివభక్తులు. ఆయన రాగానే అక్కడ నిర్వాహకుల్ని అడిగారుట. ఇక్కడికి అడివి శంకర్ గారు వచ్చారా అని. వచ్చారని వాళ్ళు అంటే నాకోసం కబురు పెట్టారు. నేను వచ్చి కనపడగానే ఏమండీ శంకరు గారు ఏమన్నా వుందా అని అడిగారు నన్ను. నిర్వాహకులు అన్నీ తెచ్చి పెట్టిన ఫలహారాలతో పాటు నేను తెచ్చి ఇచ్చిన పచ్చళ్ళు తిన్నారు ఆనందంగా. వాళ్లకు డబ్బు లేదని కాదు ఇవన్నీ చెప్పేది. సరదాగా ఉండేవారు.మా అమ్మాయి పెళ్ళికి రావాలి సర్ అని శుభలేఖ ఇచ్చాను. ఎదో మేకప్ వాడు పిలిచాడులే అని మానేయకుండా, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఊరు వెళాల్సిన అయన హైదరాబాద్ లో స్వయానా car వేసుకుని వచ్చి నూతన వధువు వరులు ఇద్దరినీ ఆశీర్వదించి, మమల్ని అందరిని ఆనంద పరిచారు జయ ప్రకాష్ రెడ్డి గారు. ఇది అయన ఆత్మీయత కి, విశాల మనస్త్తత్వానికి నిదర్శనం గా భావిస్తున్నాను. ఇవన్నేఅ కూడా JP గారితో నాకున్న ఆనందానుభూతులే.

ఆయన నాటక ప్రియుడే కాకుండా సమాజహితం బాగా కోరేవారు. ఈ మధ్య కోవిడ్ – 19 గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ వాట్సప్ లో వచ్చిన వీడియో నే అందుకు నిదర్శనం. JP గారు శారీరకంగా పెద్ద పర్సనాలిటీ అయినా ఆయన మనస్సు సన్నని సన్నజాజిలాంటిది. తేలికగా కరిగిపోయే వెన్నపూసలాంటి హృదయం. నటనలో JP గారు చక్కని విద్యావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి, వినయపూర్వకంగా అందరికీ రెండు చేతులూ జోడించి నమస్కరించే బాగా సంస్కారం తెలిసిన మనిషి. స్నేహప్రియుడు, హాస్యప్రియుడు, పేద కళాకారుల పాలిట ఒక దైవం వారు. ఎప్పుడూ నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు.

భౌతికంగా శివైక్యం చెంది దూరమైనా…నా మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు T.V. జయప్రకాష్ రెడ్డి గారు.

సజల నయనాలతో…. ఆయన నాటకాలతో సన్నిహితంగా మెలిగిన
“కళామిత్ర” అడివి శంకరరావు
మేకప్ ఆర్టిస్ట్,హైదరాబాద్
6301002268

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap