మహిళలు మహరాణులు

“ఏడాదిపాటు మహిళలకు శుభాకాంక్షలు” తెలిపిన డా. దార్ల నాగేశ్వరరావు
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ప్రముఖ రెప్లికా ఆర్టిస్టు, వందల సంఖ్యలో ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న డా. దార్ల నాగేశ్వరరావు గారు నాకు చిరకాల మిత్రులు. ఎన్నో ప్రక్రియలను వెలుగులోకి తెచ్చిన దార్ల గారి గురించి ఓ కథనం రాసే అదృష్టం కలిగింది. వారిని ఆన్ లైన్ లో ఇంటర్య్వూ చేస్తే ఎన్నో ఆసక్తికర విషయాలను వ్యక్త పరిచారు దార్ల గారు. ముఖ్యంగా నాకు బాగా ఆకట్టుకున్న అంశం ఏమంటే…

మహిళలను ప్రతిరోజూ రోజుకొక పేరుతో గౌరవించే ప్రక్రియ గురించి వివరించారు. విన్నాక, ఇంతవరకూ ఎవ్వరూ చేయ్యలేదనిపించింది. ప్రతి సంవత్సరం, మార్చి 8న మహిళా దినోత్సవం వస్తుంది. ఆ రోజున ఆడవారందరికీ శుభాకాంక్షలు చెబుతారు. తర్వాత మామూలే. మళ్లీ సంవత్సరం తర్వాతే మహిళలకు శుభాకాంక్షలు తెలిపేది. కానీ దార్ల నాగేశ్వరరావు గారు అందరూ వినూత్నంగా వెలుగులోకి తీసుకొచ్చిన ప్రక్రియ ఇది. ముందుగా స్త్రీ గురించి తెలిపిన వివరాలను తెలుసుకుందాము.

“మహిళ” స్త్రీ లేనిదే సృష్టి లేదు. అసలు స్త్రీ లేకపోతే ఏదీ లేదు. అలాగే తాను లేకపోతే.. పురుషుడు.. పురుషుడు లేకపోతే జగత్తు లేనే లేదు. నిజానికి భూమండలంపై ఉన్న జనాభాలో పురుషులు ఎంతమంది ఉన్నారో ఇంచుమించు స్త్రీలు కూడా అంత మంది ఉన్నారు. అయితే నాటికి, నేటికి, ఏ నాటికైనా స్త్రీ పురుషుల కంటే తక్కువ కాదని, తలచుకుంటే స్త్రీ కూడా ఏదైనా చేయగలదు. సాధించగలదు. భరించగలదు. పోటీపడగలదు. చివరిక ఎంతకైనా తెగించగలదు.

నేటి కాలంలో మహిళలు ఎన్నో రంగాల్లోను, అలవాట్లల్లోను, అభివృద్ధిలోను, విశేషాల్లోను, నూతనంగానూ, ఆదర్శంగానూ ఇలా ప్రత్యేకతలను చాటుకుంటున్నారు “స్త్రీ” లు. ఇలా స్త్రీ గురించి ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా తక్కువే.
అలాంటి విషయాలను ముఖ్యంగా దినపత్రికల్లోనూ మనం చదువుతుంటాము. టీవీల్లోనూ చూస్తుంటాము. అయితే డా. దార్ల నాగేశ్వరరావు గారు అలాంటి ఆసక్తికరమైన విశేషాలను దినపత్రికల నుండి సేకరించి, రోజుకొకరి గురించి, వారి పేర్లతోను, తెలియచేయటం, సంబంధించిన దినపత్రిక కటింగ్ ను కూడా షేర్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ స్త్రీల పేరు పేరునా ప్రతి స్త్రీ కు ప్రతి రోజూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం అందరికీ సాధ్యం కాదు. కానీ, దార్ల గారు ఆచరణలో పెట్టారు. రోజూ వారిగా దార్ల గారి స్టేటస్ లోను, మరియు భక్తి మార్గం పేరుతో ఫేస్ బుక్ లో షేర్ చేస్తున్నవి అప్పుడప్పుడు చూస్తున్నాను. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియకు సంబంధించి, దార్ల గారి గురించి గమనించినంత వరకు ఓ కథనం రాయాలని నాకు సంకల్పం కలిగినది. దార్ల గారిని సంప్రదించాను. ఈ విధంగా వివరించారు. ముందుగా సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్పింగ్ చూసాక, శ్రీకారం చుట్టానని చెబుతూ….

“గత సంవత్సరం మార్చి 8, 2023 రోజున మహిళా దినోత్సం సందర్భంగా సుమన్ టీవి వాళ్లు శ్రీమతి కొంపెల్ల మాధవిలత గారితో ఇంటర్వ్యూ చేసిన ఓ వీడియోను చూసాను. స్త్రీలను ఉద్దేశించి, స్త్రీ శక్తి గురించి మాధవీ లత గారు మాట్లాడిన ఆ క్లిప్పింగ్ కు సారాంశం…
“భరత మాత ఒడిలో పుట్టిన మనందరికీ స్త్రీ గురించి ఒకరు వచ్చి చెప్పాలా..
పెళ్లి పత్రికల పైన “శ్రీమతి & శ్రీ” అని రాస్తాం. స్త్రీలను గౌరవించే సాంప్రదాయం ముందు నుంచే వుంది. ఇతర దేశాలు చాడాలని మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అంతేగాని ప్రతి దినమూ ఎమ్ పవర్మెంటే. ప్రపంచంలో ఎక్కడా లేని ఎమ్ పవర్మెంట్ మనదేశంలోనే వుంది. మన హిందూ దేవుళ్లలలో కూడా ముందు అమ్మ వారి పేరు వస్తుంది. తర్వాత అయ్యవారి పేరు వస్తుంది. ఉదాహరణకు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, లక్ష్మీ నృసింహ స్వామి అంటాము. యజ్ఞం చేసేటప్పుడు హోమంలో నేయిని వేస్తూ “స్వాహా” అంటాం. స్వాహా ఎవరూ. అగ్ని భార్య పేరు స్వాహా. భరత మాతా, భూ దేవి స్త్రీలే. నదుల పేర్లు కూడా స్త్రీ పేర్లే.

మరొకసారి సోషల్ మీడియాలో స్త్రీ గురించి ఓ ప్రత్యేక కథనం కూడా చదివారంట.
దేవుడు యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. స్త్రీ ని రూపొందించడానికి మాత్రం ఒక వారం రోజులు పట్టిందంట. మగాడితో సహా సర్వ జీవులను పుట్టించిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడానికే వారంరోజులు పట్టిందంట. మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం తల మునకలవడం చూసిన దేవత అడిగింది. “స్త్రీ ని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?” అందుకు.. “స్త్రీ హృదయంలో ఎన్నో విషయాలు పొదగాల్సి వచ్చింది. ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలి ఈ స్త్రీ సృష్టి.

మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి కదా! చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసుల వరకూ ఎన్నెన్ని సంఘటనలను స్త్రీ ఎదుర్కోవాలి. ఆమె ఎంతో మందికి ఔషధంగా పని చేయాలి.
ఆమెకు ఆరోగ్యం బాగోకున్నా తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు… రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే” అన్నాడు.

అందుకు ఆ దేవత ఆశ్చర్యపోతూ ఆ స్త్రీ ని మెల్లగా తాకింది. “ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం” అడిగింది. “ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలు ఎదురైననూ ఎదుర్కోగలదు. ఆమె ఆపదలను తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం వంటి భావోద్వేగాలన్నీ భరించగలదు. అవసరమైతే దిగమింగగలదు. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. న్యాయం కోసం పట్టు పట్టడమూ తెలుసు. కానీ ఇతరుల నుంచి ఆశించేది కేవలం ప్రేమానురాగాలను” మాత్రమే అన్నాడు.

ఏంటీ “ఈమె ఆలోచించగలదా” అడిగిన దానికి, సమాధానంగా “ఎందుకాలోచించదు? అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు కూడా చెప్పగలదు చూపించగలదు” అన్నాడు దేవుడు. అప్పుడు ఆ దేవత ఆమె చెక్కిళ్ళను తాకి చెక్కిళ్ళు తడిగా ఉన్నాయి. “కన్నీరు కారుస్తుంది ఏంటని, ఎందుకని” అడిగింది.

దేవుడు.. “అదా…కన్నీరది.
ఆ కన్నీటిలో ఆనందమూ, ఆవేదనా, దుఃఖమూ, దిగులూ, ఆశ్చర్యమూ, భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి.
ఆ కన్నీటికున్న శక్తి అనంతం….
పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు స్త్రీ కి మాత్రమే ఉంది” అని చెప్పాడు.

ఆశ్చర్యపోతూ “నిజంగా మీ సృష్టి విశిష్టమైనది ఇదే” అన్నది. అయితే దేవుడు.. “అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా… వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకూ తెలియనట్టే ఉంటుంది.
అవసరమైనప్పుడు ఆ శక్తి ముందూ ఎవరూ నిలబడలేరు. అని చెప్పి భూమ్మీదకు పంపాడంట స్త్రీ ని. ఇదంతా చదువుతుంటే.. మన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు గుర్తుకొస్తున్నాయి కదా.. అందుకనే ఏమో “స్త్రీ” ని పుడమి తల్లి తో పోల్చారు”.

ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. నిజానికి నా విజయాల వెనుక నా శ్రీమతి జ్యోతి కుమారి పాత్ర ఎంతో ఉంది. “ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి” అని ఓ పాట కూడా వుంది.
కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అన్నారు. అంటే పనిలో దాసిగా, సలహా ఇవ్వడంలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా ఏనాడో స్త్రీ ని వర్ణించారు. స్వతహాగా ఆడవారికి తెలివితేటలు చాలా ఎక్కువ.

మహిళలు ఇంటి పనులతోపాటు చదువులు-సంధ్యలు, కుటుంబ బాద్యతలు, పిల్లల పెంపకంతోపాటు ఎన్నో పనులను చూసుకోవాలి. అందుకే స్త్రీ (షీ) శక్తి గురించి చెప్పడానికి ఈ ప్రక్రియను ఎంచుకున్నానని తెలిపారు దార్ల గారు.

డా. దార్ల నాగేశ్వరరావు గారు 9/3/2023 – 8/3/2024 సంవత్సరం పాటు స్టేటస్ & ఫేస్ బుక్ భక్తి మార్గంలో, “స్త్రీ లపై” గౌరవ భావంతో, మహిళల పేర్లతో “ప్రతిరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” తెలియజేయటానికి ముందుగా, ఈ విధంగా…

“మహిళలకు ప్రతిరోజూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
అమ్మను పూజించండి.
భార్యను ప్రేమించండి.
అక్కను ఆరాధించండి.
చెల్లిని దీవించండి.
వదినను అభిమానించండి.
కూతురిని కరుణించండి.
స్నేహితురాలిని మర్యాదించండి.
ప్రతి స్త్రీ లను గౌరవించండి.

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత
స్త్రీలను ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు”. అని ప్రతిరోజూ పెడతారు.

అంతేకాదు, స్త్రీ ని గౌరవిస్తున్నట్లుగా స్త్రీ కాలిని పురుషుడు తన అరచేతిలో ఉంచుకున్నట్లు ఓ ఇమేజ్ ను కూడా పెడతారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు ముందు, దార్ల నాగేశ్వరరావు గారి భార్య శ్రీమతి “జ్యోతి కుమారికి శుభాకాంక్షలు” తెలిపిన తర్వాతనే సోషల్ మీడియాలో షేర్ చేస్తారని తెలిపారు.

మొదట్లో అనగా 9-3-2023 నుండి దినపత్రికల నుండి ఆడవారి గురించి కొటేషన్లు కొన్ని రోజులు.,
తర్వాత స్వయం-సందర్శనంలో పాల్గొన్న మహిళా కళాకారులు గురించి కొన్ని రోజులు.,
బంధువుల పేర్లతో అనగా “దార్ల గారి ముత్తాతమ్మ నుండి మనవరాలు తనిష్క” పేరు వరకు.,

ఇకపోతే 12-10-2023 నుండి దినపత్రికల నుండి సేకరించిన వాటిలో ప్రాముఖ్యత కలిగినవి, బామ్మలు నుండి యువతులు, ప్రముఖులు, రాజకీయాలు, వాయుసేన, సామాజిక సేవ, ఉద్యోగం, వ్యాపారం, దౌత్యనీతి, వ్యవసాయం, సైనికులు, డాక్టర్లు, యాక్టర్లు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, కళాకారులు, పైలట్లు, డ్రైవర్లు, కూలీలు, కడు పేదలు, స్థితిమంతులు, దాతలు, పురోహితులు, ప్రమాదకరమైన సాహసాలు, ఇతరలకు ఆదర్శంగా నిలుస్తున్న వారూ, అన్ని రంగాల్లో స్త్రీ లు ఉన్నవి షేర్ చేశారు.

మహిళలు చాలా వరకు కీలకపాత్రలు పోషిస్తూ, ఇంకా అవకాశాలు కలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడమేకాక, తమను తాము నిరూపించుకుంటున్నారు కూడా. త్యాగాలతోనూ, సాహసాలతోనూ కూలి పని నుంచి ఉపాధి వరకు నేటి మహిళలు మగవారికి సమానంగా పోటీపడుతున్నారు. భువి నుంచి దివి వరకు స్త్రీ లేని రంగం లేదు. నారీ లేని నేల లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే… స్త్రీ ఇందు కలదు అందు లేదన్న సందేహం వలదు. ఇది జగమెరిగిన సత్యం కాబట్టి, సంవత్సరం నుంచి ఎంతో మంది మహిళల పేర్లతో, ప్రతిరోజూ “మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” తెలుపుతూ ఈ ప్రక్రియను పూర్తి చేశారు డా. దార్ల నాగేశ్వరరావు గారు. వారికి నా ధన్యవాదములు.

– సుధా స్రవంతి రస్తోగి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap