
అమెరికాలోని అట్లాంటాలో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
అమెరికాలోని అట్లాంటాలో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మన తెలుగువారైన మోచర్ల శశిభూషణ్ ఈ మహానిర్మాణానికి మూలస్థంభంగా నిలుస్తున్నారు. 500 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సేకరించారు.
అఖండ భారతఖ్యాతిని అఖండ జ్యోతిగా వెలిగించే అపురూప నిర్మాణాలు ఎన్నో ఇక్కడ రూపుదాల్చుకోనున్నాయి. అందులో శంకరాచార్య విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.
ఈ విగ్రహాన్ని ఎలా నిర్మాణం చెయ్యాలనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 200 కోట్ల రూపాయలు కావాల్సివస్తుందని లెక్కలు వేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సివుంది. అత్యంత త్వరలో ఆ అద్భుతం ఆవిష్కరణ కానుంది. మన పీఠాధిపతులు, ప్రధానమంత్రి, దేశాధినేతల సమక్షంలో ఈ మహోత్సవం జరపాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం అందుతున్నట్లుగా శశిభూషణ్ మాటలు బట్టి తెలుస్తోంది.అమెరికాలో నివసిస్తున్న మన భారతీయలే కాక, అమెరికన్లు మొదలు మిగిలిన దేశస్థులు ఎందరో ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావడానికి సిద్దపడడం శుభ పరిణామం. కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టుకు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ 500 ఎకరాల ప్రాంగణంలో దేవాలయాలు, యోగా కేంద్రాలు, సంప్రదాయ వ్యవసాయ క్షేత్రాలు,
గోశాలలు, ఆరోగ్య నిలయాలు, 64 కళల స్వరూపాలు, వేద విద్యా భాండాగారాలు మొదలైన భారతీయ ప్రతిరూపాలు ఎన్నో దర్శనం కానున్నాయి. ఈ ప్రాజెక్టు విలువ 3 వేల కోట్ల రూపాయల వరకూ వుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఆదిశంకరాచార్యుల ప్రాభవాన్ని,ప్రభావాన్ని ఒకసారి తలుచుకుందాం.
భారతీయ సంప్రదాయంలో ముగ్గురిని ‘జగద్గురువులు’గా భావించి గౌరవించి పూజిస్తారు.
ఒకరు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. రెండవవారు వ్యాస భగవానుడు. మూడోవారు ఆదిశంకరాచార్యులు. వీరిలో శ్రీకృష్ణుడు దైవం, వ్యాసుడు మహర్షి, ఆదిశంకరుడు తత్త్వవేత్త.
ఆదిశంకరాచార్యుడిని అపర శంకర స్వరూపంగా అభివర్ణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని ఉద్ధరించిన ఈ మనీషామూర్తిని వర్ణించాలంటే మాటలు సరిపోవు. ఆ ప్రతిభ జగదాశ్చర్యకరం.ఆ బోధనలు జగదానందకారకం. “రెండు లేవు,అంతా ఒకటే” అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తీరు, సమతను స్థాపించిన వైనం పరమాద్భుతం !.
ఆయన జనన, మరణ కాలాదులపై స్పష్టత లేకపోయినా, కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకూ ఈ భూమిపై నడయాడిన దైవస్వరూపంగా విశ్వసిస్తారు. దేవభూమిగా మన్ననలు అందుకున్న కేరళ రాష్ట్రం ఈ మాననీయుని జన్మభూమి. ఆర్యుల జన్మల గురించి ఎంచరాదని పెద్దల మాట.
కేవలం 32 ఏళ్ళు మాత్రమే భౌతికంగా ఈ భూమిపై నడయాడినా, అనంతకాలంలో నిలబడే సారస్వతాన్ని మనకు గొప్ప కానుకగా అందించి వెళ్లిపోయాడు. వందల ఏళ్ళనాడే ఆసేతు శీతాచలం సంచరించి, విస్తృతంగా జ్ఞాన బోధ చేసి మానవాళి ఐక్యతకు పునాదులు వేశాడు. వేదమయమైన వాఙ్మయానికి అద్భుతమైన వ్యాఖ్యలు రచించాడు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతకు ఆదిశంకరుడు చేసిన భాష్యం అమృత తుల్యం.
హిందూ మతంలోని సౌందర్యాన్ని తాను దర్శించి మనకు దర్శనం చేయించాడు.ఈ ప్రస్థానంలో ఉపన్యాసాలు, చర్చలు, బోధనలు, రచనలు వంటి అనేక మార్గాలను ఎంచుకున్నాడు.
భరతభూమిలోని నాలుగు ప్రాంతాలలో నాలుగు విశిష్ట పీఠాలను స్థాపించాడు.
సనాతన హిందూ సంప్రదాయ పునరుద్దీపనకు ఆదిశంకరుడు చేసిన కృషి అనన్య సామాన్యం.
ఈ మహనీయుని జీవితానికి సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ గాథలను పరిశీలిస్తే,ఆ విశేషాలు తెలుసుకుంటే పులకిత గాత్రులమవుతాము. కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో ఆర్యాంబ, శివగురులకు జన్మించినట్లు తెలుస్తోంది. వైశాఖ శుద్ధ పంచమి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో జన్మించారని చెబుతారు. ఈ పుట్టు ప్రతిభావంతుడి విశేషాలు ఆశ్చర్యజనకాలు. జ్ఞాన దర్శనం, ప్రదర్శనం, కవితా ధార, ధారణ, గ్రాహ్యం అన్నీ అపూర్వమైనవే.
ఆయన దివ్యమేధ నుంచి పుట్టిన స్తోత్రాలు సాక్షాత్తు శారదాగాత్రాలు. సౌందర్యలహరి, కనకధారాస్తవం వంటివి ఎన్నో గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయి. నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదులను దర్శనం చేసుకున్న శుభవేళ చెప్పిన ‘దశశ్లోకి’ని విన్నంతనే..
దివి నుంచి భువికి దిగివచ్చిన సాక్షాత్తు శంకర స్వరూపంగా ఆదిశంకరుడిని భగవత్పాదులు
దర్శించారు. గోవిందునికి తొట్ట తొలిగా శంకరుడు పాదపూజ చేసి తన గురుభక్తిని చాటుకున్నారు.
అలా గురుసేవకు, గురు-శిష్య పరంపరాగతమైన సంప్రదాయానికి బీజం వేశాడు.
తదనుగుణంగా గురు శుష్రూష చేసి విద్యాభ్యాసం చేశాడు. అక్కడ నుంచి వారణాసి పయనమై అనేక దివ్య జ్ఞానానుభూతులు పొందాడు. అక్కడే సదానందుడు అనే బ్రహ్మచారి ప్రథమ శిష్యుడుగా దొరికాడు. గంగానదికి కాలకృత్యాలకు వెళ్తున్న సమయంలో చండాలుడు ఎదురైన వేళ చెప్పిన ‘మనీషా పంచకం’ పరమ రమణీయం.
ఇవి కేవలం ఐదు శ్లోకాలు మాత్రమే. అలా పరమశివుడు నుంచి కర్తవ్యబోధ పొందాడు.
అక్కడ నుంచి బదరికి వెళ్ళాడు. అక్కడ జరిగిన పండిత గోష్ఠి అద్భుతం. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు రాసిన భాష్యాన్ని ‘ప్రస్థానత్రయం’ అంటారు.
వ్యాసభగవానుడితో జరిగిన చర్చ అపురూపం. ఈ ప్రస్థానంలో ఆదిశంకరుడికి అనేకమంది మహనీయులైన శిష్యులు కూడా ఏర్పడ్డారు. బౌద్ధ, జైన మత ప్రభావాలతో హిందూమతానికి కాస్త క్షీణదశ ఏర్పడిన క్రమంలో ఆదిశంకరాచార్యుడి అవతారం అద్భుతమైన విజయాలను సనాతన హిందూ సంప్రదాయానికి అందించింది. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠంలో ఆయన స్థాపించిన పీఠాలు ఆధ్యాత్మిక జ్ఞాన పీఠాలుగా నేటికీ అఖండ జ్యోతులు వెలిగిస్తున్నాయి. లోకవశంకరుడైన శంకరుని అవతారం సత్యం, శివం, సుందరం.
-మాశర్మ