ఎస్.ఎం. వలి… తెలిసినవారు ‘వలి’ అంటారు. తెలియనివారు ‘వాలి’ అని చదువుతారు. సౌమ్యుడు – కష్టం నుండి ఇష్టంగా కుంచెను ప్రేమగా పట్టికొని కళాప్రపంచంలో నిటారుగా నిలిచున్న కళాసాధకుడు. వారితో నాకున్న అనుబంధం 20 ఏళ్ళు నాటిది. మా తొలి పరిచయం బెంగళూరులోనే జరిగింది. నేను KV(కేంద్రీయల విద్యాలయ)- I.I.Sc లో పని చేస్తున్న రోజుల్లో తాను KV–NAL లో ఆర్టు టీచర్లుగా పనిచేస్తుండేవారు. ఆ తరువాత 2010లో నేను విజయవాడ KV-2 కి రావటం, వారు హైదరాబాదులోని కంచన్ బాగ్ KV కి రావటం జరిగింది. గత ఏడాది(2023)లో వలి మరల ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ బెంగళూరు ‘KV–AFS యలహంక’ కు వెళ్ళిపోయారు.
నిన్న(25-4-2024) అనుకోని వార్త చిత్రకళా మిత్రుల్ని హతాశుల్ని చేసింది. వలి ఎలక్షన్ నిర్వహణ బాధ్యతల నిర్వహణ నిమిత్తం పయనమవ్వగా మార్గమధ్యంలోనే హృదయం స్థంబించి మనలనుండి వెళ్ళి పోయారు. వారి జ్ఞాపకాలే మనకు తోడిక. తన కుంచెల నుండి ఆలవోకగా పల్లానికి జాలువారే జలవర్ణాలు ప్రవహించక స్థంబించి పోయాయి.
KEN School Art, బెంగుళూరు, శేషాద్రిపురం వ్యవస్థాపకుడు తనకు అత్యంత ప్రియమైన గురువుగారని గర్వంగా… పలుమార్లు చెప్పుకునేవాడు. వారి నుండి అలవడిందే ఈ నిరంతర సాధన అంటారు. 2007లో ZIET మైసూరులో జరిగిన ఇన్ సర్వీస్ కోర్సులో మేమిద్దరం ఒకే రూములో 21 రోజులు గడపటం జరిగింది. ఏమాత్రం సమయం దొరికినా ప్రకృతి చిత్రాలను సాధన చేస్తూ కనిపించేవారు. ఏకకాలంతో 4 చిత్రాలను సృజిస్తుండేవారు. చక్కని ‘దస్తూరి / క్యాలీగ్రఫీ’ వీరి మరో ప్రత్యేకత ప్రావీణ్యత.
గుంతకల్ లో 1967 లో పుట్టిన ఎస్.ఎం. వలి, బాల్యంలో వెల్లటూరు పూర్ణానంద శర్మ గారు నిర్వహించే బాలల చిత్రకళా పోటీల్లో పాల్గొన్న వలీకి బంగారు పతకం రాగా, అందుకోడానికి గుత్తి నుండి వెల్లటూరు వచ్చాడు. ఆ తరువాత కాలగమనంలో లలితకళా అకాడమీ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు సంపాందించుకున్నా… వాటి నన్నింటిని ఇంట్లో ఏదో మూల ఉంచి, ఈ పతకాన్ని మాత్రం ప్రధానంగా ముందు గదిగోడపై ప్రత్యేకంగా అలంకరించి ఎరిగిన వారందరికి దాని గురించి విశేషంగా చెప్పుకుంటూ ఉండేవాడు. నాటి శర్మ గారి పలుకులే గొప్ప ఆశీస్సుల్లా నన్ను బాలచిత్రకారుడి స్థాయి నుండి బెంగుళూరు KEN స్కూలు(ఫైన్ ఆర్ట్సు కాలేజి) వరకు నడిపించిందని చెప్పుకుంటారు.
నిరుపేద తండ్రి రైలు గేట్ మెన్ గా గంపెడు సంతానానికి యజమాని. వలి కటిక దరిద్రం నుండి ఒంటరి పోరాటంచేస్తూ మంచిపేరు, మంచివాడన్న ప్రశంస సాధించుకున్నాడు. తోబుట్టువులకు చేయూత నిస్తూనే చిత్రకళారంగంలో ఎదిగి తనదైన ముద్రను విడిచి వెళ్ళిపోయారు. లలితకళా పరిషత్ సభ్యుడైన వలి మన రాష్ట్రంలో దామెర్ల రామారావు, భగీరథి రివార్డులను, కోనసీమ చిత్రకళా పరిషత్ సన్మానాన్ని అందుకున్నారు.
నాకు నందిని మైసూరుపాకు రుచి పరిచయం చేసింది మొదట వలీనే. డా. వీణా శేఖర్ ఆర్టు హిస్టేరియన్ ను పరిచయం చేసి, వారితో నా ఎగ్జిబిషన్ బ్రోచర్లకు మ్యాటర్ రాయించిన మిత్రుడు వలీనే. నా పెయింటింగులను ‘సోని డిజిటల్ కెమరా’తో క్లిక్ చేసి నా కళ్ళను మురిపించిన నిపుణుడు వలీనే. తరచు పలు కేంద్రీయ విద్యాలయ కార్యక్రమాల్లో కలిసేవాళ్ళం-ఎన్నో విషయాలను ముచ్చటించుకునే వారం. ఫోను ద్వారా చాల తక్కువ.., ప్రత్యక్షంగా కలిసినప్పుడే ఎక్కువ మాటలు మామధ్య సాగేవి.
వెంకటప్ప ఆర్టు గ్యాలరీలో తాను ఎగ్జిబిషన్ చేస్తూ, నన్నూ ఎగ్జిబిషన్ చేయమని ఎంకరేజ్ చేసిన సహృదయుడు. బెంగుళూరు కేంద్రీయ విద్యాలయాల ఆర్టు టీచర్లమంతా కలిసి ఎగ్జిబిషన్ నిర్వహించాలన్నది వలీ తీరని కల. విశాఖపట్టణం, బెంగళూరు, హైదరాబాదు కేంద్రీయ విద్యాలయాల్లో దాదాపు 26 సంవత్సరాలుగా తన సేవలనందించారు. 1967లో జన్నించిన వలీ ఉద్యోగ విరమణకు మరో మూడు సంవత్సరాల వ్యవథి మిగిలి ఉండగనే తన జీవన పోరాటాన్ని విరమించుకున్నారు. వందలాది మంది విద్యార్థులను కళాకారులుగా, కళాభిమానులుగా తీర్చి దిద్దారు. ఇంటిని ఓ ఖార్కానాగా మలుచుకుని పుంఖాను పుంఖాలుగా చిత్రరచనలు చేసాడు. తన చిత్రాలకు తానే స్వయంగా ఫ్రేములు కట్టుకునేవాడు. తామరాకు మీది నీటి బొట్టు చందంగా జీవితాన్ని గడిపి నిశ్సబ్ధంగా సెలవుతీసుకున్నాడు. కుటుంబ బాధ్యతలతో ఆలస్యంగా పెళ్లిచేసుకొని, ఇద్దరి మగ బిడ్డలకు తండ్రిగా తన కుటుంబాన్ని ఏర్పరచుకున్న వలి మహాశయుని కుటుంబానికి ధైర్యాన్ని, వలీ ఆత్మకు శాంతిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
–ఆత్మకూరు రామకృష్ణ
Very well said sir.I also worked with him in KV 2 Nausenabaugh,Vizag
A good n kind person
Om Shanti 💐🙏💐
వలి గారిని ముఫ్ఫై ఏళ్ల కిందట రాజమండ్రీ లో ప్రకృతి దృశ్యాలు చిత్రిస్తుంటే చూశాను. అధ్బుతమైన చిత్రకారుడు , సౌమ్యుడు వారులేని లోటు చిత్రకళా రంగానికి పూడ్చలేనిది. వారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.💐🙏💐