సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా అలేఖ్య

తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా అలేఖ్య పుంజాల నియామకం.

కూచిపూడి అభినయంలో మేటి నర్తకీమణి, నాట్యగురు డాక్టర్ అలేఖ్య పుంజాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ నూతన అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత నాటక కళాకారులు, రాజకీయ నాయకుడు శివకుమార్, ప్రముఖ నాట్యగురు దీపికా రెడ్డి అనంతరం మూడవ అధ్యక్షురాలిగా అలేఖ్య నియమితులయ్యారు. తెలుగు విశ్వ విద్యాలయం నృత్య విభాగాధిపతిగా, లలిత కళల పీఠం అధిపతిగా ఆమె విశేష సేవలు అందించారు. అదే విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేసి తొలి మహిళా రిజిస్ట్రార్ గా రికార్డు సృష్టించి పదవీ విరమణ పొందారు.

అలేఖ్య 1962 ఏప్రిల్ 9న మార్గం నర్సింహారావు, సుగుణ దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. ప్రాచీన చరిత్ర కళలు అనే అంశం పై పిజీ చేసి, ఎంఎ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసి నాట్యం పై మక్కువతో ప్రముఖ నాట్య గురువు ఉమా రామారావు సూచన మేరకు తెలుగు విశ్వ విద్యాలయం లో ఎంఎ కూచిపూడి చేశారు. ప్రముఖ కాంగ్రెస్ నేత, పూర్వ కేంద్ర మంత్రి శివశంకర్ కుమారుడు డా.వినయ్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. ఆయన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా పోటీ చేశారు. అలేఖ్యకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి శాశ్వత్ రాంశంకర్, కోడలు సంజన న్యాయవాద వృత్తిలో ఉన్నారు. చిన్నబ్బాయి దేవాన్ష్ రాంశంకర్ అమెరికాలో ఉన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయం నృత్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన అలేఖ్య తరువాత అదే శాఖకు అధిపతి అయ్యారు. టూరిజం స్టడీస్ డైరెక్టర్ గా, లలిత కళల పీఠం అధిపతి గా సేవలు అందించారు. 2017లో రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు. 2019 వరకు ఆ హోదాలో ఉండి పదవీ విరమణ పొందారు. 1985లో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగు విశ్వ విద్యాలయం చరిత్రలో అలేఖ్య తొలి మహిళా రిజిస్ట్రార్ కావడం విశేషం. తన నాలుగో ఏట ఒడిస్సి, కథక్ నృత్యాలు నేర్చుకోవడం ఆరంభించిన అలేఖ్య తరువాత కూచిపూడి వైపు అడుగులు వేశారు. డా. ఉమా రామారావు శిష్యురాలిగా గుర్తింపు పొందారు. ఆమె నాట్యం అభినయం అందరిలోనూ ప్రత్యేకత తెచ్చిపెట్టింది.

రాజమండ్రి సాహిత్య పీఠం అలేఖ్యను అభినయ తపస్విని అవార్డుతో ఘనంగా సత్కరించింది. అమెరికా నుంచి మారిషస్ వరకు అన్ని దేశాల్లోను ప్రదర్శనలు ఇచ్చి అభినందనలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె ప్రదర్శించిన రాణి రుద్రమ కూచిపూడి నృత్య రూపకం ఒక గొప్ప సంచలనం సృష్టించింది. లకుమా నృత్య రూపకం, దుర్గాసుర సంహారం, సత్యభామ విలాసం, మండోదరి, ద్రౌపది తదితర నృత్య రూపకాలు కూచిపూడి నాట్య రంగంలో ఆమె ప్రత్యేకతను నిలబెట్టాయి.

2011లోనే ఆమెకు కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారం లభించింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, రాజీవ్ ప్రతిభ పురస్కారం, హంస అవార్డు, తెలంగాణ ఆవిర్భావ పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ ప్రతిభ అవార్డు, సిద్దేంద్ర పురస్కారం… ఇలా ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆమెకు దక్కాయి.
ఇప్పుడు కీలక సంగీత నాటక అకాడమీ అధ్యక్ష పగ్గాలు ఆమెకు లభించాయి. కార్యనిర్వహణలో ఎంతో అనుభవం వున్న అలేఖ్య ఆ పదవికే గొప్ప అందమైన అలంకారం అని చెప్పుకోవచ్చు. ఆమె హయాంలో కళాకారులకు ఇంకా మంచి జరగాలని కోరుకుందాం. అభినందనలు అలేఖ్య గారు!

డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap