‘గోపరాజు’ ఇంట ప్రపంచ రంగస్థల దినోత్సవం!

కొలకలూరులో ‘గోపరాజు విజయ్’ ఇంట ప్రపంచ రంగస్థల దినోత్సవండా. మహ్మద్ రఫీ

ప్రపంచ రంగస్థల దినోత్సవం ఒక కళాకారుడితో కలసి ముచ్చటించిన సందర్భం. గొప్ప అనుభూతిని కలిగించింది. నాటక రంగమే జీవితంగా బతుకుతూ అందులోనే ఆనందం, అందులోనే కష్టం, అందులోనే జీవితం. అద్భుతం అనిపించింది!

ఇవాళ అనుకోకుండా గుంటూరు జిల్లా కొలకలూరు వెళ్లడం జరిగింది. ప్రముఖ రంగస్థల టివి సినిమా నటుడు దర్శకుడు, రచయిత గోపరాజు విజయ్ ఎంతో ప్రేమగా ఊరి నడిబొడ్డున నిలుచుని ఆహ్వానం పలికారు. నేరుగా రథం సెంటర్ తీసుకెళ్లి చూపించారు. మే నెలలో తాను నిర్వహించే పరిషత్ వేదిక ఎక్కడ నిర్మించనున్నది, ఎలా ఉంటుంది అన్నీ వివరించి చూపించారు. అక్కడ నుంచి వారి ఇంటికి తీసుకెళ్లారు. వరసగా ముచ్చటగా కట్టుకున్న మూడు ఇళ్ళు. ఒకటి తనది, రెండోది వారి అన్నయ్యది, మూడో ఇల్లు ముస్తాబు అవుతున్నది వారి తండ్రి గారు గోపరాజు రమణ గారిది. రమణ గారి గురించి ప్రత్యేక పరిచయ వాక్యాలు అక్కరలేదు. ఆయన మహానటుడు. ఎన్నో పరిషత్ లలో బహుమతులు గెలుచుకున్న నటుడు. ఎన్నో నందులను కొల్లగొట్టిన నట కేసరి రమణ గారు అటు సినిమాలు, టివి సీరియల్స్ లోనూ యమా డిమాండ్ వున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. వారి కుమారుడు విజయ్ కూడా తక్కువేం కాదు. నటుడు గా దర్శకుడుగా 12 నందులు సాధించి నాటక రంగమే జీవితంగా మార్చుకుని మేటి నట దర్శక ప్రయోక్త గా పేరు తెచ్చుకున్నారు.

ఒక రంగస్థల కళాకారుడి జీవితం ఎంత ముచ్చటగా ఉందో వారి కుటుంబాన్ని, వారి ఇంటిని చూస్తుంటే సంతోషం అనిపించింది. వారి జీవితానుభవాలు వింటుంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక అద్భుత కళాకారుడితో ముచ్చటిస్తూ వారి అతిధ్యం స్వీకరిస్తూ సమయమే తెలియకుండా గడచిపోయింది. కళాకారులు అదృష్టవంతులు. నటిస్తూ దర్శకత్వం వహిస్తూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్న విజయ్ మరింత అదృష్టవంతుడు. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున ఒక మధురమైన జ్ఞాపకం గా మిగిల్చిన విజయ్ విజయ దంపతులకు అభినందనలు. నాతో పాటు నాటక రంగ వీరాభిమాని బొప్పన నరసింహారావు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు అంజుబాబు, పాత్రికేయ మిత్రుడు జీవిజీ శంకర్ కూడా ఈ అనుభూతిని ఆస్వాదించారు.

(కొలకలూరులో అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడ గడిపిన రెండు గంటలు నట దర్శక ప్రయోక్త ఆత్మీయులు డి. ఎస్. దీక్షిత్ గారు గుర్తుకొస్తూనే ఉన్నారు)

డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap