మనోవికాసానికి మంచి మార్గం – చిత్రకళ

మార్చి 10 న దామెర్ల రామారావు జన్మదినం మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ‘మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ’ ఆధ్వర్యంలో జరిగిన ఆర్ట్ క్యాంప్ విశేషాలు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

‘చిత్రాన్ని మనం చూస్తే చిత్రం కూడా మనల్ని చూస్తూ వుంటుంది’ – ప్రముఖ చిత్రకారుడు ఎస్వీరామారావు గారి ప్రసిద్ధ వాక్కు ఇది. పరిశీలనాత్మక దృష్టికోణాన్ని వక్కాణించేందుకే ఇలా చెప్పాడు. అవును, ఆ చిత్రంలో ప్రాకృతిక ప్రపంచంలోని అంశాలే కాకుండా ఆయా చారిత్రక అంశాలు కూడా ద్యోతకమవుతాయి (రంగులు, బ్యాక్ డ్రాప్ వగైరా). చిత్రకారుని ప్రతిభా పాటవాలతో పాటు వీక్షకుని సాంస్కృతిక చైతన్యం కూడా జతకూడితేనే కదా ఆ చిత్రానికి ఓ పరిపూర్ణత, ఓ సాఫల్యత దక్కేది.

ప్రస్తుత ప్రైవేటీకరణ కార్పొరేట్ విద్యావ్యవస్థలో కళలు శీఘ్రగతిన విధ్వంసానికి గురవుతున్నాయి. లలిత కళలు ఉపాసించేవారెవరైనా ఏటికి ఎదురీదవలసి వస్తున్నది. శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి లలిత కళల్లో చిత్రలేఖనం ప్రాథమికమైనది. మానవ సమాజ పరిణామ క్రమంలో భాష పుట్టకముందే చిత్రలేఖనం పుట్టింది.

మనోవికాసానికి పూలబాటలు పరిచింది. ఆఫ్రికా గుహల్లోని వేల సంవత్సరాలనాటి ఆదిమానవుల కుడ్య చిత్రాలు అందుకు నిదర్శనంగా ఇప్పటికీ నిలుస్తున్నాయి. కోతి నుండి ఆవిర్భవించిన మానవునికి ఆహార వేట, ఆత్మరక్షణలో భాగంగా ముందరికాళ్లు చేతులుగా మారాయి. చేతుల్లో మళ్ళీ మిగిలిన నాలుగు వేళ్లకు అభిముఖంగా బొటనవేలు ఏర్పడింది. ఇలా ఏ జంతువుకూ జరగలేదు. ‘వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమపాత్ర’ అనే చిరుపుస్తకంలో ఏంగెల్స్ మహాశయుడు ఈ విషయాన్ని సుబోధకంగా వివరించాడు. బొటనవేలు నుండి మెదడు వరకు నాడీమండల వ్యవస్థ వృద్ధి అయింది. అడ్డంగా వుండే వెన్నెముక నిటారుగా నిలిచింది. దాంతో మనిషి దృష్టికోణంలోనే (చూసే తీరు, రీతి) తీవ్ర మార్పు వచ్చింది. చేతులు, వేళ్ళు బొమ్మలు గీసే అభివ్యక్తి సాధనాలయ్యాయి. భౌతిక జీవన స్థితినుండి ఓ రసభావాన్ని పొందడం, ఆ భావాన్ని పదిలంగా హృదయంపై ముద్రపరచుకుని అనుభూతిగా మార్చుకోవడం, తిరిగి అదే భావానికి ఓ పథకం ప్రకారం రూపాన్ని ఇవ్వడం…
ఇదంతా ఓ అద్భుతమైన మనోవికాసం కాక మరేమిటి?
అందుకే గాంధీజీ ప్రవేశపెట్టిన నయా తాలిం (నూతన విద్యావిధానం) కు ఆధునిక విద్యాబోధనా పద్ధతుల్లో అగ్రతాంబూలం లభించింది. హృదయానికి, మెదడుకు, చేతులకు బలమైన సంబంధం ఉండేవిధంగా విద్యాబోధన ఉండాలని గాంధీజీ నొక్కి చెప్పాడు. ఆ క్రమంలోనే మన పనే మన విజ్ఞానం (అవర్ వర్క్ ఈజ్ అవర్ నాలెడ్జ్) అను గొప్ప నినాదం ఇచ్చాడు. అయితే బ్రిటీష్ పాలకులు ప్రవేశపెట్టిన మెఖాలే విద్యావ్యవస్థ చెప్పుల్లోనే కాళ్లు పెట్టి మనం నడుస్తున్నాం. గుమస్తాగిరి, బానిస చదువులు తప్ప జీవితంపై సాధికారత పొందేలా సర్వతోముఖాభివృద్ధి చదువులకు వేల ఆమడల దూరంలో వున్నాం. పులిమీద పుట్రలా ఇప్పుడు కార్పొరేట్ విద్య మనపై స్వారీ చేస్తున్నది. కెరీర్ కావాలంటే ఇంగ్లీష్ భాష తప్పనిసరి అంటూ మాతృభాషను తృణీకరిస్తున్నాం. అనుభూతి ఎప్పుడూ సహజ మాతృభాషలోనే కలుగుతుంది. మాతృభాషకు, లలిత కళలకు మనిషి దూరం అవుతున్నాడంటే మనిషి జడత్వంతో (మొద్దుగా), యంత్రంలా మారుతున్నాడని గ్రహించాలి. ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులతో మనిషి వికాసంవైపు అడుగిడాలే తప్ప యంత్రంలో మారకూడదు. ఈ ధర్మసూక్ష్మం ఇప్పుడు కొరవడింది.


ఈ నేపధ్యంలో మనిషిని మనిషిగా నిలబెట్టేందుకు ప్రయత్నపూర్వకంగానే కొందరు భాష-కళల వృద్ధికి నడుం కడుతున్నారు. ఆందులో భాగంగా ఇటీవల ‘మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ‘ (ఎం.ఎ.ఎ.) ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బొమ్మలు గీసి విజేతలైన పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా, లబ్దప్రతిష్టులైనవారిచే రకరకాల పద్ధతుల్లో బొమ్మలు గీయడం, చేయడం ‘వర్క్ షాప్’ ద్వారా నేర్పించారు.
దామెర్ల రామారావు చిత్రపటాన్ని చూస్తూ… పి. సంతోష్ కుమార్ మట్టితో ‘రామారావు ప్రతిమను’ తీర్చిదిద్దారు. ఆత్మకూరు రామకృష్ణ బ్రష్ ను ఉపయోగించకుండానే కేవలం చేతివేళ్లతోనే ప్రకృతి మనోహర దృశ్యాన్ని ఆవిష్కరించారు. అలాగే మిలాన్ గర్కర్, మృత్యుంజరావులు వ్యక్తులను కూర్చోబెట్టి రేఖా ముఖచిత్రాలు గీశారు. ఇవన్నీ అప్పటికప్పుడు క్షణాల్లో గీసి (చేసి) అబ్బురపరిచారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన చిత్రకారులు, విశ్రాంత చిత్రకళోపాధ్యాయులు కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో కళల ప్రాముఖ్యతను తెలియజేస్తూ… ప్రతీ ప్రాథమిక ఉన్నతపాఠశాల లోనూ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లను నియమించాల్సిన అవసరం వున్నప్పటికీ… ప్రస్తుతం ఆర్ట్ ఇనస్ట్రక్టర్స్ ను తక్కువ జీతానికి నియమిస్తుందని అన్నారు. వాళ్ళను పెర్మనెట్ టీచర్స్ గా తీసుకొని, వారికి జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు లలిత్ మోహన్, బి.వి.రమేష్ లు ‘దామెర్ల రామారావు జయంతిని’ పురస్కరించుకుని ఈ బృహత్కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేరోజు ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కనుక కళాకారులతో పాటు మహిళా విదుషీమణులను కూడా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టార్ సి. సూర్యచంద్ర మాట్లాడుతూ చిత్రకళ పట్ల ఆదరణ తగ్గడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

కవి శబ్దాలంకారాలతో కావ్యసృష్టి చేస్తే, చిత్రకారుడు దృశ్యాలంకారాలతో రసరేఖల కావ్యసృష్టి చేస్తాడు. అలాంటి చిత్రకళకు అచ్చమైన తెలుగు ముద్ర వేసినవాడు దామెర్ల రామారావు. 1897లో జన్మించిన దామెర్ల అతి పిన్నవయసులోనే మరణించడం (1925) పెద్ద విషాదం.
అవి స్వాతంత్ర్యోద్యమం పురివిప్పుతున్న రోజులు. గాంధీజీ పిలుపుపై విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలు ముమ్మరంగా అమలవుతున్నాయి. ఆ క్రమంలో పాశ్చాత్య సంస్కృతి పట్ల వ్యతిరేకతతో పాటు స్వదేశీ సంస్కృతి పట్ల అనురక్తి కలగడం మెండు అయింది.

బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలలో నవచైతన్యం మొదలైంది. యుక్త వయసులోని దామెర్లకు సహజంగానే తెలుగు చిత్రకళ పట్ల శోధన, నిర్మాణశక్తి మొదలైంది. లోకానువృత్తమైన మానవీయ ఇతివృత్తాలకు ప్రాధాన్యతనిస్తూ భారతీయ ఆత్మను వాటిలో పాదుగొల్పేందుకు విశ్వగురు రవీంద్రుల వంటివారు కృషి చేసేవారు. దేశంలోని ప్రముఖ చిత్రకళ పాఠశాలలన్నింటిని దామెర్ల సందర్శించాడు. రవీంద్రుని ప్రత్యక్ష ప్రశంసలు చూరగొన్నాడు. ఇందుకు నాటి బ్రిటీష్ దొర కూల్డ్రే సహాయ ప్రోత్సాహాలు అపారం. ఈ దశలోనే మచిలీపట్నంలోని జాతీయ కళాశాల ఆధునికాంధ్ర చిత్రకళా నిర్మాణానికి తెర తీసింది. దామెర్ల రామారావు చిత్రకళా కృషి ఈ మార్గంలో ఉవ్వెత్తుగ పయనించి, అనతికాలంలోనే అగ్రాసనం అధిష్టించింది. రాజమండ్రిలో దామెర్ల స్థాపించిన చిత్రకళా పాఠశాల ఈ ఒరవడిలోనే ఎందరికో చిత్రకళాభ్యాసన గావించి బాపు వంటి శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దుకున్నది. కనుకనే ఆధునికాంధ్ర చిత్రకళా వైతాళికునిగాను, తెలుగువారి రవివర్మగానూ దామెర్ల గణతికెక్కాడు.. సిద్ధార్ధ, రాగోదయం, పుష్పాలంకరణ, కార్తీకపౌర్ణమి వంటి దామెర్ల చిత్రాలు దేశ నగరాల్లోనే కాక, లండన్ టొరంటోలలో ప్రదర్శితమై బహుమతులు పొందాయి. ‘మృత్యువు’ చిత్రాన్ని గీస్తూ మశూచి వ్యాధికి గురై మృత్యువుకు చేరువయ్యాడు. అందుకే కవి హరీంద్రనాథ్ చటోపాద్యాయ ‘మరణంలేని చిత్రాలు సృష్టికర్తకు మరణమా? అసంభవం’ అంటూ ఆక్రోసించాడు. అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమిటంటే చిత్రకళ మనోవికాస మార్గమని శాస్త్రీయంగా రూఢీ అయింది. ఆర్ట్ అండ్ ఇన్నర్ ఎబిలిటి (చిత్రకళ – అంతర్గత సామర్ధ్యం) అనేది జీవన నైపుణ్యం పాఠ్యాంశంగా నేడు ప్రపంచం ముందుకొచ్చింది. ఈ వెలుగులో నర్సరీ స్థాయినుండే మోటారు స్కిల్స్ (చేతి కదలికా నైపుణ్యాలు) శిక్షణ పై దేశదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ పెడ్తున్నారు. ప్రతి ఇంటా ఇలాంటి శిక్షణ మొదలైతే వ్యక్తిత్వ వికాసానికే కాదు, జాతి వికాసానికీ కొదవేముంటుంది?

-కె. శాంతారావు

5 thoughts on “మనోవికాసానికి మంచి మార్గం – చిత్రకళ

  1. తెలుగు చిత్రకళని అల్లంత ఎత్తున నిలిపిన ప్రసిద్ధ చిత్రకారులలో దామెర్ల గారు ఒకరు.. ఈ సందర్భంగా ఆయనని స్మరించుకోవడం ము.
    ఇలా కళలని నలుగురికి పరిచయం చేయడం ద్వారా మీరు చేస్తున్న ఈ కృషి సర్వదా హర్షణీయం కళాసాగర్ గారు.

  2. తెలుగు చిత్రకళని అల్లంత ఎత్తున నిలిపిన ప్రసిద్ధ చిత్రకారులలో దామెర్ల గారు ఒకరు.. ఈ సందర్భంగా ఆయనని స్మరించుకోవడం ము.
    ఇలా కళలని నలుగురికి పరిచయం చేయడం ద్వారా మీరు చేస్తున్న ఈ కృషి సర్వదా హర్షణీయం కళాసాగర్ గారు.

  3. గ్రేట్ ఆర్టిస్ట్ దామెర్ల రామారావు గారికి వారి జయంతి ని పురస్కరించుకొని మచిలీపట్నం ఆర్ట్ అకాడెమి నిర్వహించిన దామెర్ల పురస్కారాల సభ ఆద్యంతం అద్భుతం. వారికి అభినందనలు 💐💐ధన్యవాదములు 💐🙏💐

  4. గ్రేట్ ఆర్టిస్ట్ దామెర్ల రామారావు గారికి వారి జయంతి ని పురస్కరించుకొని మచిలీపట్నం ఆర్ట్ అకాడెమి నిర్వహించిన దామెర్ల పురస్కారాల సభ ఆద్యంతం అద్భుతం. వారికి అభినందనలు 💐💐ధన్యవాదములు 💐🙏💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap