పద్మ శ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా `మల్లేశం`. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత మల్లేశంగారి సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా `మల్లేశం` సినిమా తెరకెక్కింది. రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. ఇందులో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రాత్రికేయుల సమావేశవివరాలు..
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ మాట్లాడుతూ – “మల్లేశం సినిమాను పూర్తి చేయడంలో సూర్యుల్లాగా చాలా మంది పనిచేశారు. వారందరినీ అభినందనలు. సినిమా చాలా హృద్యంగా, చాలా మానవీయంగా, సహజంగా, అద్భుతంగా మానవ ఉద్వేగాలను చక్కగా క్యాప్చర్ చేశారు. సినిమాలో `సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో, సమాజంలో అజ్ఞాత సూర్యలెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో` అనే ఓ కవిత సినిమాలోని రెండు గంటల ఎమోషన్‌ని, ప్రయాసని, కృషి, సామాన్యుడి ప్రతిభా పాటవాన్ని ఆవిష్కరించే క్రమంలో ఎన్ని కష్టనష్టాలుంటాయో తెలియజేసింది. సినిమాలో మూడు నాలుగు అంశాలు నా హృదయానికి చాలా దగ్గరయ్యాయి. భారతదేశంలోని అందరూ చేనేత కార్మికులు పడే కష్టం మరుగున పడిపోతున్న కళగా అంతరించిపోతున్న తరుణంలో వారి నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ వారి కష్టనష్టాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు. చేనేత కళాకారుల ఆత్మహత్యలను, స్థితిగతులను చూపెడుతూ, ఈ వృత్తిలో రాణించాలంటే ఉండే కష్టనష్టాలను చూపుతూ, అందులో భాగంగా ఓ రూరల్ ఇన్‌వెంటర్ జీవితాన్ని చూపించారు. ఒక కొత్త ఆవిష్కరణను చేయాలనుకున్నప్పుడు ఓ వ్యక్తికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. దాన్ని తట్టుకుని అధిగమిస్తూ ఎలా సక్సెస్ కావాలనే దానికి కూడా ఈ సినిమా అద్భుతమైన ప్రేరణగా నిలిచింది. పద్మశ్రీ చింతకింది మల్లేశం గారికి, చేనేత కళాకారులకి, తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. చింతకింది మల్లేశం గారికి మరో యూనిట్‌ను స్టార్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని చేసిందనే సంగతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సినిమా ద్వారా హ్యాండ్ లూమ్‌కి కూడా కొంత ప్రమోషన్ దొరికి చేనేత కళాకారుల బిజినెస్ కూడా పెరిగితే, నేను కూడా ఎంతో సంతోషిస్తాను. చేనేత కళాకారులకు ప్రభుత్వ పరంగా ఎంతో కొంత చేసినా, అందరూ వారికి సపోర్ట్‌గా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాను, నాకు చూసే అవకాశాన్ని కలిగించిన అందరికీ థాంక్స్“ అన్నారు.
నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ – “రాజ్, వెంకట్ ఈ సినిమాను నాకు చూపించారు. ఆయన ప్యాషన్ చూసి నేను భయపడ్డాను. మార్కెట్ ఎలా ఉంటుందనే విషయంలో ఎవరూ రారేమో అని కూడా అన్నాను. అమెరికాలో ఉండే రాజ్‌గారు సినిమాలపై ప్యాషన్‌తో 6వ తరగతి ఫెయిలై వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. థియేటర్‌కు బయటకు వచ్చేటప్పుడు ఓ ఫీల్‌తో బయటకు వస్తారు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే బెటర్ సినిమాలువస్తాయి. దాని వల్ల బెటర్ సొసైటీ రూపొందుతుంది“ అన్నారు.
డైరెక్టర్ రాజ్ మాట్లాడుతూ – “నేను మల్లేశంగారి వీడియో చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ఇందులో రూరల్ ఇన్నోవేషన్, హ్యాండ్ లూమ్స్ సమసస్యలు, హ్యుమన్ మోటివేషనల్ స్టోరీ ఉంది. అందుకనే ఈ సినిమాను చేశాం. పెద్దింటి అశోక్‌గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. కళా దర్శకత్వం యేలే లక్ష్మణ్ లాంటి మంచి టీం కుదిరింది. శ్రీ కో ప్రొడ్యూసర్, వెంకట్ సిద్ధారెడ్డి మా టీంకు సి.ఇ.ఒగా పినిచేశారు. చక్రపాణిగారు, ఝాన్సీ, అనన్య, ప్రియదర్శిలకు స్పెషల్ థాంక్స్“ అన్నారు.
నర్సింగ్ రావు మాట్లాడుతూ – “రాజ్‌కు అభినందనలు. సామాన్యుడు మల్లేశం జీవితాన్ని కళ్లకు కట్టినట్లు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన సురేష్‌బాబుగారు సహా అందరినీ అభినందిస్తున్నాను. ఐదారేళ్లుగా మన సినిమాల్లో సహజత్వం పెరుగుతుంది. ఎంటైర్ యూనిట్‌కు కంగ్రాట్స్“ అన్నారు
-కళాసాగర్