‘ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఒక గ్యాలరీ తెరవాలి. అందులో మీ ఛాయాచిత్రం ఒకటి తప్పక ఉండాలి’ అంటారు, ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు.
హైదరాబాద్ కు చెందిన కందుకూరి రమేష్ బాబు రెండు దశాబ్దాల పాటు ప్రింట్ – ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా రాణించి స్నేహితుల సహకారంతో ‘సామాన్యశాస్త్రం’ ప్రచురణ సంస్థను స్థాపించి రచయిత గా ఎంతో ఇష్టంతో సుమారు 13 పుస్తకాలు ప్రచురించారు. అంతే కాదు వీరు రాసిన పుస్తకాల్లో కూడా ఏ పేజీ తిప్పినా సామాన్యులే కనిపిస్తారు.
ఫోటోగ్రఫీ మీద ఉన్న మక్కువతో జర్నలిస్టు గా ఎందరినో రాజకీయ నాయకులను, సెలబ్రిటీలను దగ్గరగా చూసిన అనుభవంతో, సామాన్యుని జీవితాన్ని మించిన ‘శాస్త్రం’ లేదని తెలుసుకుని వారి జీవితంలో ఉన్నంత సుఖం, సంతోషం మరెక్కడా కనపడదలేదని భావించి, తన ఫోటోగ్రఫీకి సామాన్యులనే ప్రధాన వస్తువుగా ఎన్నుకున్నారు.
రెండున్నర సంవత్సరాల క్రితం ‘సామాన్యశాస్త్రం’ గ్యాలరీ ప్రారంభించారు, హైదరాబాద్ మణికొండ ఒయూ కాలనీ లో. ఈ గ్యాలరీలో ప్రతి 3 నెలలకు ఒక్కో కొత్త అంశం మీద తను తీసిన చాయాచిత్రాలను ప్రదర్శిస్తారు. ఇప్పటి వరకు పదకొండు ప్రదర్శనలు నిర్వహించిన వీరు గత సంవత్సరం ముంబై జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ లో ‘సామాన్యశాస్త్రం’ పేరుతో వారం రోజులపాటు చాయా చిత్రాలను ప్రదర్శించారు. త్వరలో అమరావతిలో కూడా తన చిత్రాలను ప్రదర్శించాలన్న యోచనలో వున్నారు రమేష్ బాబు. ప్రస్తుతం వీరు బి.బి.సి. వెబ్ చానల్ కి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా సేవలందిస్తున్నారు.
గునుగు పూల – గోచికట్టు
తెలంగాణ పల్లెల్లో కట్టుబొట్టు లో భాగమైన సంస్కృతి ‘నవ్వార్’ చీర. పల్లెపట్టున ఉన్న మహిళల జీవన ఛాయలు ముచ్చటగా కనిపిస్తాయి. తెలంగాణలో అనేక ప్రదేశాలలో ప్రజలను శ్రద్ధగా ఫోటోగ్రఫీ చేస్తున్న తరుణంలో ఆకర్షించింది ఈ గోచికట్టు. తక్షణమే ‘గోచికట్టు’ సిరీస్ లో కొన్ని ఫోటోలు తీయాలని సుమారు సంవత్సరం పాటు రాష్ట్రం అంతా పర్యటించి ‘నవ్వార్’ చీర, దాని కట్టు, అందులో అమ్మలక్కల అలంకరణను తన కెమెరాలో బంధించారు.
గోచికట్టు అన్నది స్త్రీల తరతరాల సంప్రదాయానికి ఒక నాటి దక్కని సాంస్కృతిక వైభవానికి నిదర్శనం అంటారు రమేష్ బాబు. అందుకే ప్రస్తుతం ఈ ఛాయా చిత్రాలను ‘గోచికట్టు’ పేరుతో ‘సామాన్యశాస్త్రం’ గ్యాలరీలో ఆగస్టు వరకు ప్రదర్శన కొనసాగుతుంది. అప్పటి దాకా ఈ అమ్మలక్కల వస్త్రధారణ, అలంకరణ మీరు వీక్షించవచ్చు.
మీరు ఎప్పుడయినా హైదరాబాద్ కు వెలితే ‘సామాన్యశాస్త్రం’ గ్యాలరీ ని సందర్శించండి. వెళ్ళే ముందు ఈ నంబర్ (9948077893) ను సంప్రదించండి.
-కళాసాగర్