ఎస్‌.వి.రంగారావు “మహానటుడు” పుస్తక ఆవిష్కరణ

సంజయ్ కిషోర్ రూపొందించిన ఎస్‌.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి “మహానటుడు” పుస్తక ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. `మ‌హాన‌టుడు` పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. తొలిప్రతిని ప్రముఖ వ్యాపారవేత్త పెండ్యాల హరనాథ్‌ బాబు ఒక లక్షా వెయ్యినూటపదహార్లు చెల్లించి అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “ఎస్వీ రంగారావుగారు నా ఆరాధ్య నటుడు. ఆయనంటే అపారమైన అభిమానం. ఆయనపై వచ్చిన ఈ పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నా అభిమాన నటులెవరంటే ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ పేర్లు చెప్తుంటాను. ఆయన నటన చూసి ఎంతో నేర్చుకోవచ్చు. నటనలో ఆయనో ఎన్ సైక్లో పీడియా. 1969-71మధ్యకాలంలో మా నాన్నగారు బాపట్లలో ఉద్యోగం చేస్తూ నటనపై ఇష్టంతో నాటకాలు వేస్తుండేవారు. ఆ సమయంలో ఏకాంబరేశ్వరరావు అనే నిర్మాత కె.రాఘవ గారితో `జగత్ కిలాడీలు`, `జగల్ జంత్రీలు` అనే రెండు చిత్రాల్ని తీశారు. ఈ రెండు చిత్రాల్లోనూ నాన్నగారికి నటనపై ఉన్న అభిలాషను గ్రహించి చిన్నపాత్రల్లో అవకాశం ఇచ్చారు. అలా ఎస్వీరంగారావు గారి కాంబినేషన్ లో నాన్న నటించారు.

ఇంటికొచ్చి సెట్స్ లో ఏం జరిగింది.. రంగారావు గారు ఎలా మాట్లాడతారు?, ఎలా నటిస్తారు? లాంటి విషయాలు చేసి చూపిస్తుండేవారు. ఆయనంటే అంతలా ఆయనకు ఇష్టం. అలా నాలో రంగారావు గారిపై అభిమానం అనే భీజం పడింది. తర్వాత రంగారావుగారి సినిమాలు చూసేవాడిని. నేను నటుడిని కావాల‌నే కోరిక కలిగింది కూడా అప్పటినుంచే. రావుగోపాలరావు గారి మొదటి సినిమా `జగత్ కిలాడీలు`. అప్పటివరకూ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన నటించడానికి ఇన్‌స్పిరేష‌న్‌ రంగారావుగారే. అప్పుడు నాన్నగారు ఆ సెట్లో ఉన్నారు. సీన్ అయ్యాక రావుగోపాలరావుగారితో డైలాగులు అనేవి రబ్బరులా సాగతీస్తూ చెప్పకూడదు.. అప్పడం నమిలినట్టు అలవోకగా చెప్పేయాలి అన్నారట. నాకది ఇప్పటికీ ఓ టిప్‌లా అనిపిస్తుంది. ఆయన నటన సహజసిద్ధంగా ఉంటుంది కనుక పాత కొత్త అని ఉండదు. చరణ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు కూడా రంగారావు గారి సినిమాలు చూపించేవాడిని. అలా నేను, మా అబ్బాయి రంగారావు గారి నుంచి స్పూర్తి పొందాం.

ఓ సంద‌ర్భంలో ఎస్వీఆర్ మరో దేశంలో పుట్టుంటే ప్రపంచం కీర్తించే మహానుబావుడు అయ్యుండేవారు అని గుమ్మడి గారు చెప్పేవారు. కానీ అలాంటి గొప్ప నటుడు తెలుగువాడవడం మన అదృష్టం అని నేనంటాను. నాకు నటనలో అంతలా స్పూర్తినిచ్చిన వ్యక్తిని ఒక్కసారి కూడా చూడలేకపోయానే, ఫొటో కూడా తీయించుకోలేదే అనే లోటు బాధపెడుతుంటుంది. ఇక సంజయ్ కిషోర్ పుస్తకం వెనుక కళపై ఉన్న తపన. రంగారావు గారిపై ఉన్న అభిమానం కనిపిస్తున్నాయి. ఫొటోస్ అన్నీ చూస్తుంటే విజువల్ జర్నీలా ఉంది. భావితరాలకు అందివ్వడానికి ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బ్రహ్మానందం రంగారావు గారి గొంతుకను మిమిక్రి చేసి, తనికెళ్ల భరణి తన కవిత తో అలరించారు. ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ, మండలి బుద్ధ ప్రసాద్, అలి, రావి కొండలరావు, రోజా రమణి, రేలంగి నరసింహరావు, కె.వి.రంగనాథ్, బొలినేని క్రిష్ణయ్య, వడ్డిరాజు రవిచంద్ర, ఎస్వీరంగారావు మేనల్లుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap