తెలుగు ప్రజలకు ఇది కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో సినీ పత్రికలు మూత పడ్డాయి. లాభసాటి అనే కారణం కానే కాదు. అదంతే!! పాఠకుడికి తెలియని కారణాలు ఎన్నో… ఎన్నెన్నో. అద్భుతంగా నడచిన ‘జ్యోతి చిత్ర’ ఎందుకు మూత పడింది? అద్భుతమైన సరళితో నడచిన ‘హాసం’ ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ‘సితార’ పరిస్థితీ అంతే. ప్రచురణ కర్తలు చెప్పేది ఒకే ఒక కారణం. ఈ కంప్యూటర్ యుగంలో వున్న సాంకేతికతో పోటీ పడలేక పత్రిక బయటకు వచ్చే లోపు అందులో వార్తలన్నీ ‘స్టేల్’ అవుతున్నాయని. ఆన్ లైన్ లో తాజా వార్తలు వస్తుంటే, ఇక పేపరు చదివేవాళ్లెవరుంటారని! అసలు ఈ సినిమా పత్రికల చరిత్ర ఒకసారి తిరగేద్దాం!
టాకీ సినిమాలు వచ్చిన ఐదు సంవత్సరాల తరవాత తొలి సినిమా పత్రికకు బీజం పడింది. ఆ పత్రిక పేరు చిత్రకళ. పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి యాజమాన్యంలో ఆ పత్రికకు కె. నరసింహారావు సంపాదకుడుగా వ్యవహరించారు. 1938 లో మొదలెట్టిన ఆ పత్రిక మనుగడ ఎన్నోరోజులు సాగలేదు. తరవాత రామాచారి అనే వ్యక్తి నటన పేరుతో ఒక సినీ పత్రికను పారంభించారు. అదీ అంతంతమాత్రంగానే నడిచింది. 1940 లో సీతారామయ్య అనే పాత్రికేయుడు రూపవాణి అనే సినిమా పత్రిక ప్రారంభించారు. ఇందులో శ్రీశ్రీ వంటి నిష్ణాతులు పనిచేశారు. మన రావి కొండలరావు గారు కూడా ఇందులో పనిచేసినవారే. జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో మంచి మంచి రచయితలు ఆ పత్రికనుండి తప్పుకున్నారు. అదే సమయంలో ప్రముఖ నవలా రచయితగా, తొలి డిటెక్టివ్ రచయితగా పేరుపొందిన కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా పేరుతో పత్రిక ప్రారంభించారు. సినిమా పత్రికకు ఒక ‘స్టాటస్’ తెచ్చిన పత్రిక ఇదే. ఈలోగా రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో ప్రింట్ కు ఉపయోగించే ముడి కాగితం దిగుమతి ఆగిపోవడంతో చాలా పత్రికలు మూతపడ్డాయి. అలాంటిదే ‘తెలుగు సినిమా’ కూడా. యుద్ధం ముగిశాక 1954 లో టి.వి. రామనాథన్ సినిమా రంగం పేరుతో సినీ మాసపత్రిక ప్రారంభించారు. కలర్ ఫొటోలతో నిండిన ఆ పత్రిక బాగా పాపులర్ అయింది. తరవాత చక్రపాణి కినిమా పేరుతో సినిమా పత్రిక నడిపారు. సమాంతరంగా కాగడా శర్మ గా పేరుగాంచిన కె.కె. శర్మ ‘కాగడా’ ప్రారంభించారు. అలా వరసగా అనేక సినిమా పత్రికలు ప్రారంభించబడ్డాయి. అవి ‘చిత్రాలయ’, ‘తరంగిణి’, ‘చిత్ర జగత్’, ‘మధురవాణి’ వంటి పేర్లతో విడుదలయ్యేవి. వాటికి సినిమారంగం పత్రికకు ఉన్నంత సర్కులేషన్ వుండేది కాదు. తరవాత విజయా వారి డాల్టన్ ప్రెస్ లో ఆఫ్ సెట్ ముద్రణ ప్రారంభం కావడంతో విజయా నాగిరెడ్డి విజయచిత్ర పేరుతో అద్భుత సినిమా పత్రికను ప్రారంభించారు. దానికి రావి కొండలరావు గారు సంపాదకులు. జూలై 1966 న మొదలైన ఈ పత్రిక అటు ఎన్టీఆర్ బొమ్మను కానీ, ఇటు ఏయన్నార్ బొమ్మను కానీ ముఖచిత్రంగా వెయ్యకుండా దేవిక బొమ్మతో నాన్-కాంట్రవర్షియల్ గా ముద్రించింది. “విజయచిత్ర వున్న మంచేనే చెబుతుంది… ఉన్నా చెడు చెప్పదు” అనే నినాదంతో ముందుకు వెళ్ళింది. ఆ పత్రికకు కొండలరావు గారు 26 ఏళ్ళు సంపాదకుడు గా పనిచేశారంటే ఆ పత్రిక మనుగడ ఎలాంటిదో ఊహించవచ్చు. హిందీ చిత్రరంగం నుంచి సినిమా పోస్టర్ల ముద్రణా భారం పెరగడంతో, విజయచిత్రకు నూకలు చెల్లాయి. 1975 లో ఠాకూర్ హరిప్రసాద్ సినీ ఓం హెరాల్డ్ అనే సినిమా పత్రికను టాబ్లాయిడ్ రూపంలో ప్రారంభించారు. హరిప్రసాద్ ఆ పత్రిక పేరుతో అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని కూడా ప్రవేశపెట్టారు.
1976 అక్టోబరులో ఈనాడు సంస్థ వారి సితార ఆవిర్భవించి సంచలనం సృష్టించింది.
‘సితార’ అవార్డులకు ‘ఫిలింఫేర్ అవార్డు’లంత క్రేజ్ వుండేది. అప్రతిహతంగా 42 సంవత్సరాలు ఒక అద్భుత సినీ పత్రికగా, స్టాండర్డ్ తో కూడిన వార్తలకు మారుపేరుగా వ్యవహరించింది. సంవత్సరం తరవాత ఆంధ్రజ్యోతి సంస్థ జ్యోతిచిత్ర ను ప్రారంభించి సితారతో పోటీపడి నడిపింది. దాసరి నారాయణరావు శివరంజని పేరుతో సినీ వారపత్రిక నడిపారు. కంప్యూటర్ సాంకేతికత, ఆన్ లైన్ వార్తల సరంభంలో సినిమా పత్రికలు కొట్టుకు పోయాయి. ఇన్నాళ్ళ తరవాత ‘సితార’ పత్రికకూ అదే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టం!!
Good information.
Sitara magazine kooda aagipoyindaa ? very bad