-మీ ఫోన్లో వున్న మెమరీ కార్ట్ ఒరిజినలేనా?
-కంప్యూటర్, పెన్ డ్రైవ్, మెమరీకార్డ్స్ లో డిలీట్ అయిన ఫైళ్ళను రికవర్ చేసుకోవడమెలా?
-విండోస్ కొత్త వెర్షన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుంది?
-ఒకే మొబైల్ లో 2 వాట్స్ ఆప్ అకౌంట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా?
నేడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఈ దశలో నిత్యం మనకు అనేక సందేహాలు కల్గుతాయి. సవాళ్ళు ఎదురవుతాయి. ఉ దాహరణకు పైన ఉటంకించిన లాంటివి…. మరి వీటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు చెప్తారు?
ఇలాంటి వారి కోసమే ఆధునిక టెక్నాలజీని సామాన్యులకు అందించాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్న నల్లమోతు శ్రీధర్ గారున్నారు గత రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ రంగంలో పత్రికలు, టీ.వీ, రేడియో, కాలేజి సెమినార్లు, యూట్యూబ్, ఫేస్ బుక్, బ్లాగ్స్ లాంటి రకరకాల మాధ్యమాల ద్వారా అందరికీ అందుబాటులో ఉంటూ విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు.
ఇక శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే 1996లోనే తెలుగులో కంప్యూటర్ సాహిత్యంపై రచనలు చేసిన ఆయన ప్రయాణం నేటికీ సాగుతూనే ఉంది. తొలి అడుగు సినీ జర్నలిజంలోకి పడ్డా, తర్వాత టెక్నాలజీ రంగంవైపే మళ్ళారు. సూపర్ హిట్, క్రేజీ వరల్డ్, కంప్యూటర్ వరల్డ్ వంటి పలు ప్రతికలకు వివిధ హెూదాలలో పనిచేసిన శ్రీధర్ గారు 2001లో ‘విజేత కాంపిటేషన్స్’ ద్వారా ‘కంప్యూటర్ ఎరా’ మాసపత్రికను తన సంపాదకత్వంలో ప్రారంభించి నేటికి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీధర్ గారు టెక్నాలజీ గురించి మాత్రమే మాట్లాడగలరు, రాయగలరు అని మనందరికీ తెలుసుకానీ, మనస్తత్వ శాస్త్రం, వ్యక్తిత్వ వికాసం విషయాలపై కూడా చక్కని వ్యాసాలు రాయగలరు, చర్చింగలరని ప్రతినెలా కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకీయాలు చదివేవారికి, వీరి బ్లాగును ఫాలో అవుతున్న వారికి తెలుస్తుంది. వీరు ఇటీవలే వెలువరించిన రిలేషన్స్’ పుస్తకం చదివితే సమాజాన్ని, సమాజంలోని వ్యక్తులను, వారి మనస్థత్వాలను వీరు ఎంత లోతుగా పరిశీలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే సమాజంలో నిత్యంజరిగే అనేక విషయాలపై ఫేస్బుక్ ద్వారా స్పందించడం వీరికి అలావాటు. ఇవన్నీ కూడా వీరికి పుట్టి పెరిగిన వాతావరణం, సామాజిక పరిస్థితుల కారణంగా అలవడి వుండవచ్చు. బాల్యంలో కుటుంబ పరంగా, సమాజపరంగా ఎన్నో అవాంతరాలను, సవాళ్ళను అధిగమించిన వీరికున్న మంచి అలవాటు పుస్తకాలు చదవడం కథలు, నవలలు, వ్యాసాలు, చరిత్ర ఇలా ఒకటేమిటి వందలకొద్ది పుస్తకాలు చదివి జీవిత సారాంశాన్ని మనుసునిండా నింపుకొన్నారు. చదివింది డిగ్రీ అయినా, డిగ్రీలకందని ప్రజ్ఞను, పరిణితిని సాధించారు. డిగ్రీ పూర్తయ్యాక, ఐసిడబ్ల్యూఏ. ఫైనల్ కోర్సు చదవడానికి మద్రాసువెళ్ళి పార్ట్ టైం ఉద్యోగిగా సూపర్ హిట్, క్రేజీవరల్డ్ పత్రికలలో సబ్ ఎడిటర్ గా చేరి, ఆపై పత్రిక పనుల్లోనూ, సినిమా స్టార్ల ఇంటర్వ్యూల కోసం ఔట్డోర్ షూటింగ్ లకు వెళ్ళడంతో చదువుకు ఫుల్ స్టాప్ పడింది. తర్వాత హైదరాబాద్ కు వచ్చి మొదట ‘కంప్యూటర్ వరల్డ్’ పత్రికలో పనిచేసి, 2001లో కంప్యూటర్ ఎరా మాసపత్రికను ప్రారంభించారు. ముఖ్యంగా ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన పత్రికలు నడపడం ఎంత కష్టమో ‘కంప్యూటర్ విజ్ఞానం’ పత్రికలో కొన్నాళ్ళు పనిచేసిన నాకు తెలుసు. పత్రిక ఎడిటర్ అంటే పదిమంది రాసిన ఆర్టికల్స్ ను ఎడిట్చేయడంకాదు, పత్రిక మొత్తం శ్రీధర్ గారే రాసుకొని, డిజైన్ చేస్తారు. కాబట్టే 15 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుంది. కంప్యూటర్ సంబంధిత రంగాలపై వ్యాసాలు రాసే రచయితలు తెలుగులో బహుతక్కువ, కంటెస్ట్ రాయించుకోలేక మూతపడిన పత్రికలు కూడా వున్నాయి.
‘మనసులో… అనుక్షణం దోబూచులాడే తరంగాల సమాహారం’ అన్న శీర్షికతో 2008 సంవత్సరం నుండి తెలుగులో రాస్తున్న వీరి బ్లాగ్లో అనుభవాలు. జ్ఞాపకాలు, భావసంఘర్షణ, వ్యక్తిత్వం, సినిమా కబుర్లు, యోగా, ఆరోగ్యం… ఇలా ఒకటేమిటి సమస్త విషయాల గురించి తన మస్తిస్కంలో నిక్షిప్తమైన భావాలను పాఠకులతో పంచుకుంటున్నారు. తాజాగా దేశంలో తెగ హడావుడి చేసిన ఫ్రీడమ్ చీప్ స్మార్ట్ ఫోన్ విషయంలో శ్రీధర్ గారు అలుపెరుగని పోరాటం చేసారు, ఇంకా చేస్తున్నారు. అసలు అంత తక్కువకు స్మార్ట్ ఫోన్ ఎలా వస్తుంది? అని కేవలం ప్రశ్నించి వదిలేయకుండా… అది ఎలా సాధ్య మవదో లెక్కలతో సహా నిరూపించారు. 251 రూపాయలకు స్మార్ట్ ఫోన్. ఇవ్వడం ప్రస్తుతం ఏ కంపెనీకి కూడా సాధ్యపడదని సవివివరంగా తెలియజేసి ఎంతో మందిని ఈస్కామ్లో నష్టపోకుండా కాపాడారు. ఫేస్ బుక్ నిర్వహించిన ‘సేవ్ ద ఫ్రీ బేసిక్స్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో శ్రీధర్ గారూ అలుపెరుగని పోరాటమే చేసారు. ఫేస్ బుక్ ఇండియాలో తన వినియోగదారులను పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఫ్రీ బేసిక్స్ ఒక భాగమని, మనమీద ప్రేమతో మాత్రం కాదని ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించారు. చివరకు Telecom Regulatory Authority of India (TRAI) నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో, ఫేస్ బుక్ వంటి సంస్థలు ఉచితంగా నెట్ అందిస్తామంటూ దేశంలో చొరబడడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వీరు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వీడియోలు, రాస్తున్న వ్యాసాలు, టీ.వీ. చర్చలు చూస్తే ఒక మనిషి ఇన్ని పనులు చేయగలడా అనిపస్తుంది. దీని వెనుక ఎంతో పరిశోధన ఉందో, రేయింబవళ్ళు ఎంతగా ఈ రంగానికి మమేకమై పోయారో మనం ఊహించుకోవచ్చు. ఈ సమయంలో ఒక ఆరునెలలు ఒక కంప్యూటర్ కోర్సు చేయడానికి వెచ్చించి వుంటే ఏ యం.ఎన్.సి. సాఫ్ట్ వేర్ కంపెనీలోనో ఉద్యోగం చేసుకొంటూ ఈ పాటికి ఆర్ధికంగానూ, కెరీర్ పరంగానూ స్థిరపడిపోయేవారు. కానీ నాలెడ్జిని పెంచుకోవడం, దాన్ని పదిమందికి పంచడమే ధ్యేయంగా ముందుకెళుతున్న శ్రీధర్ గారు ఎప్పుడూ ఐశ్వర్యవంతులే..
వీరి కృషిని గుర్తించిన వారిగా మనం వీరి వీడియోలను షేర్ చేస్తే పదిమందికి వుపయోగపడతాయి. ‘యూట్యూబ్’ చూసి లైక్ చేయడమేకాకుండా, యాడ్స్ ని క్లిక్ చేస్తే వారికి ఆర్ధికంగా సహకరించి, ప్రోత్సహించిన వారమవుతాం. శ్రీధర్ గారు చేస్తున్న కృషికి 64కళలు పత్రిక అభినందనలు తెలియజేస్తుంది.
-కళాసాగర్
Good.
👌 వంద శాతం నిజం… శ్రీనివాస రావు భళ్ళమూడి
Thanq sir
He is a Knowledge Bank