నింగికేగిన తారామణి – విజయనిర్మల

రంగులరాట్నం చిత్రంలో నీరజగా పరిచయమై, విజయవంతమైన విజయనిర్మలగా వినీలాకాశంలో రెపరెపలాడిన సహజనటి. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులు అందుకున్న విజయనిర్మల అనారోగ్యంతో చికిత్స పొందుతూ జూన్ 26న రాత్రి హైదరాబాదు కాంటినెంటల్ ఆసుపత్రిలో తనువు చాలించారు.ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి మృత దేహాన్ని తీసుకువచ్చిన అనంతరం అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్లో ఉంచి,రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె వయస్సు 73 సవంత్సరాలు.
తెలుగు తెరపై హీరోయిన్ పాత్రకు హీరోయిజాన్ని పరిచయం చేసిన నటి విజయనిర్మల. తెలుగు పరిశ్రమలో హీరోయిన్ పాత్రంటే ఇలానే ఉండాలి, అనే సంప్రదాయాన్ని బద్దలుకొట్టి హీరోయిన్ పాత్రకు కొత్త భాష్యం చెప్పారు. లేడీ ఓరియెంట్ సినిమాలకు మార్గదర్శిగా ఆమెను చెప్పుకోవచ్చు. అప్పటివరకు అగ్ర హీరోలు కూడా చేయని ప్రయోగాత్మక పాత్రలలో విజయనిర్మల నటించారు. నటిగానే కాక దర్శకురాలిగా తెలుగు తెరపై తనదంటూ ముద్ర వేశారు. ఏకంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.

1946 ఫిబ్రవరి 20న చెన్నైలో పుట్టిన విజయనిర్మల 1950లో బాలనటిగా తమిళ చిత్రంలో మొదటిసారి నటించారు. హీరోయిన్ గా 11ఏళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ చిత్రంతో మొదలైన ఆమె సినీ ప్రస్థానం దశాబ్దాల పాటు విజయవంతంగా కొనసాగింది. మొదటి భర్తతో విడాకుల తరువాత హీరో కృష్ణను వివాహం చేసుకున్నారు. యాక్టర్ నరేష్ ఆమె కుమారుడు.

బాపు దర్శకునిగా తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న సినిమా నందనా ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించిన ‘సాక్షి’. అందులో కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్లు. ఈ సినిమా కృష్ణకు ఐదవ సినిమా కాగా విజయనిర్మలకు మూడోది. ‘సాక్షి’ సినిమా తొలి సన్నివేశ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు రాజబాబు కల్పించుకొని “ఇది మీసాల కృష్ణుడి గుడి. చాలా శక్తివంతమైనది. ఈ గుడిలో మీకు, కృష్ణకు జరిగే పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. నిజజీవితంలో కూడా మీరిద్దరూ తప్పక భార్యాభర్తలవుతారు” అంటూ విజయనిర్మలను కవ్విస్తే ఆమె “ఛా! ఏమిటా పిచ్చిమాటలు” అన్నారు. ఆ దేవుని మహిమేమో కాని, వారిద్దరూ కలిసి మూడు నాలుగు సినిమాలు చెయ్యగానే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నారు. “ఆ క్రెడిట్ బాపు గారికే” అంటారు విజయనిర్మల. 1969 మార్చి 24 న తిరుపతిలో ఇద్దరూ పెళ్లి చేసుకుని, పులిదిండి వెళ్లి మరలా గుడిలో దండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్న తరవాత ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అని అందరూ భావించారు. కానీ విజయనిర్మల విషయంలో ఆ సూత్రం తప్పని తేలింది. వారిద్దరూ కలిసి యాభైకి పైగా సినిమాల్లో జంటగా నటించి రికార్డు సృష్టించారు. ఆమెకు దర్శకత్వం వహించాలనే కోరిక ‘సాక్షి’ సినిమాలో నటిస్తున్నప్పుడే అంకురించింది. “వంద సినిమాలు పూర్తయ్యాకే దర్శకత్వం గురించి ఆలోచించు. లేకుంటే రెంటికీ చెడినట్లవుతుంది” అని కృష్ణ ఇచ్చిన సలహాను విజయనిర్మల ఆచరణలో పెట్టింది. అలా దర్శకురాలిగా 1973లో శ్రీకారం చుట్టింది. అదికూడా ‘కవిత’ అనే మళయాళ చిత్రంతో. ఆ చిత్రం విజయాన్ని సాధించడంతో విజయనిర్మలకు ఆత్మస్థైర్యం పెరిగింది. తరవాత తెలుగులో ‘మీనా’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది. ‘మీనా’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి విజయనిర్మలకు దర్శకురాలిగా నీరాజనాలు పలికింది. తరవాత మలయాళం లో నిర్మించిన ‘కవిత’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మించారు. విజయనిర్మలకు టెక్నికల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చిన చిత్రం ‘దేవుడే గెలిచాడు’ సినిమా. తరవాతనుంచి ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించింది విజయనిర్మల. అక్కినేని-కృష్ణ కాంబినేషన్లో ‘హేమాహేమీలు’, శివాజి గణేశన్-కృష్ణ కాంబినేషన్లో లో ‘బెజవాడ బెబ్బులి’, రజనీకాంత్-కృష్ణ కాంబినేషన్లో ‘రామ్-రాబర్ట్-రహీమ్’ చిత్రాలను డైరెక్ట్ చెయ్యడం విజయనిర్మల చేసిన ప్రయోగాలు. మంచి వేగంగల దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న విజయనిర్మల తీసిన చిత్రాల్లో అద్భుత విజయాలతోబాటి కొన్ని పరాజయాలు కూడా లేకపోలేదు. ఆమె విజయకృష్ణ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు నిర్మించారు. వాటికి తన సోదరులు రవికుమార్, రమానంద్, రఘునాథ్ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగులో విజయనిర్మల వందకు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో బంగారు గాజులు, టక్కరిదొంగ-చక్కనిచుక్క, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, అమ్మకోసం, విచిత్ర దాంపత్యం, మోసగాళ్ళకు మోసగాడు, బుల్లోడు బుల్లెమ్మ, పండంటికాపురం, తాత- మనవడు, మీనా, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, కురుక్షేత్రం, హేమాహేమీలు, కలక్టర్ విజయ, గండిపేట రహస్యం, నేరము-శిక్ష కొన్ని మాత్రమే.
2008 లో రఘుపతి వెంకయ్య అవార్డ్ అందుకున్న ఈమె చివరిగా 2009 లో నేరం-శిక్ష సినిమాకు దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap