పిల్లలకు ఒక చాక్లెట్ ఇస్తే ఆనందం.. అదే వారికి ఏదైనా ఒక విద్యను నేర్పించి నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇచ్చి, బాగా చేశావని ప్రశంసించి ఒక చిన్న పెన్ను బహుమతిగా ఇచ్చిన వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందం పేరు బ్రహ్మానందం. సరిగ్గా బాలానందం కళావేదిక కళారంగంలో చిన్నారులకు అవకాశాలు ఇస్తూ వేదికను కల్పించి బహుమతులు తో పాటు, సర్టిఫికెట్ అందజేస్తున్నారు. ఏదైనా కాంపిటేషన్ లోనొీ, మరి ఏదైనా ఉత్సవంలోనొీ చిన్నారులకు వారు నేర్చుకున్న కళను ప్రదర్శించే అవకాశం ఏ కొద్దిమందికో వస్తుంది. అవకాశం వచ్చిన వారికే తిరిగి మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తుంటాయి. కాకుండా భారతీయ సంస్కృతి లో భాగమైన కళల పట్ల పరుగులెడుతున్న చిన్నారులందరికీ బాలానందం కళావేదిక అవకాశాలు ఇస్తూ ముందు తరాల వారికి మన కళలపై ఆసక్తిని పెంపొందిస్తుంది. సినిమా డాన్స్ లు, పాశ్చాత్య సంస్కృతికి వీలైనంత దూరంగా ఉంచేందుకు మన సంస్కృతి లో భాగమైన శాస్త్రీయ, లలిత కళల పట్ల ఆరాధన భావం పెంపొందిస్తున్నారు.
విజయవాడ నగరానికి చెందిన నాట్యాచార్యులు హేమంత్ కుమార్, పద్మశ్రీ హేమంత్ లు నాట్య కళకే పూర్తిగా అంకితమై నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు. తమ పిల్లలు ఇద్దరికి నాట్య కళలో శిక్షణ ఇచ్చి మెరుగులు దిద్దుతున్నారు. భారత భారతి పేరిట కళా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు నాట్య రంగంలో శిక్షణ ఇస్తూ, శిక్షణ తీసుకున్న కళా విద్యార్థులతో బాలానందం వేదికపై ప్రదర్శన అవకాశాలు ఇస్తున్నారు. ఒక్కొక్క కార్యక్రమానికి పదివేల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు చేస్తూ బాలానందం కళావేదిక నిర్వహిస్తున్నాము. 2010 జనవరి 24వ తేదీన ప్రారంభమైన ఈ కళా వేదిక 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగు పెడుతోంది.ఈ సందర్భంగా నాట్యాచార్య హేమంత్ కుమార్ చెప్పిన విశేషాలు……
“మా నాన్న పి. ఆనంద్ పిళ్ళై ఆయనకు ఆరు రకాల నాట్యాలలో ప్రతిభ కలిగిన కళాకారుడు.1967లో పుట్టిన నేను1972 లో నేను నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను.ఆయన దగ్గర నేర్చుకున్న నాట్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశాలు లేవు. ఎక్కువగా జరిగే నాటకాల కార్యక్రమాలలో ముందుగా నాట్యం చేసే అవకాశం ఉంటుంది. నాటకాలు నిర్వహించే సంస్థ నిర్వాహకులను మా అబ్బాయికి నాట్యం ప్రదర్శించే అవకాశం మా అమ్మ బ్రతిమాలింది. ఎన్నో సంస్థలను అడిగితే కాని ఒకటో రెండో అవకాశాలు వస్తాయి. అవకాశం రాకపోతే నిరుత్సాహానికి గురవుతాను. అలాంటి నిరుత్సాహం ఎదురైతే కళల పట్ల పిల్లలకు ఆసక్తి దూరమవుతుంది. అటువంటి నిరుత్సాహాన్ని పిల్లలకు దూరం చేయాలనే సదుద్దేశంతో ఈ బాలానందం బాలల కళావేదిక ఏర్పాటు చేశాను. నేను పద్మశ్రీలు కలిసి ఇప్పటివరకు 3000 వరకు నాట్య ప్రదర్శనలు ఇచ్చాము. ఇక మా ప్రదర్శనలకు స్వస్తి పలికి చిన్నారులకు అవకాశం ఇద్దామని నిర్వహిస్తున్న బాలానందం కార్యక్రమాలు 2010 జనవరి 24వ తేదీ ప్రారంభించాము. ఇప్పటివరకు 100 ప్రదర్శనలు పూర్తి చేశాం.” హేమంత్ కుమార్ చెప్పారు.
-శ్రీనివాస రెడ్డి
Congrats Hemanth kumar garu