డిశంబరు 30 న వడ్డాదిపాపయ్య గారి 26 వ వర్ధంతి సందర్భంగా వారి స్నేహితులలో ముఖ్యులు సుంకర చలపతిరావుగారు తెలిపిన కొన్ని ముఖ్య విషయాలు మీకోసం…
వ.పా., పావనం, వడ్డాదిపాపయ్య అనేపేరు తెలుగు చిత్రకళారంగంతో పరిచయం వున్న వారికీ, పత్రికా పాఠకులకీ సుపరిచితం. 1940-90ల మధ్య కాలంలో పిల్లల పత్రిక ‘చందమామ’, పెద్దల పత్రిక ‘యువ’ తర్వాత స్వాతి పత్రికల్లో వేలాది వర్ణచిత్రాల్ని గీసి, అటు సాహితీ అభిమానుల్ని, ఇటు కళాభిమానుల్ని అలరించిన ఆంధ్రుల అభిమాన చిత్రకారుడు వడ్డాదిపాపయ్య. ఆయన చిత్రాల గురించి తెలిసినంతగా ఆయన్ని గురించి ఎవరకీ తెలియదు. పొగడ్తలకు, ప్రశంసలకు, సన్మానాలకు, ప్రచారాలకు ఆమడ దూరంగా ఉండేవారు.
శ్రీకాకుళం/కశింకోటలో ఆయన్ని చూడటానికి ఎవరైనా వెళ్ళినా నిర్మొహమాటంగా తిప్పి పంపేవారు. అది ఆయన తత్వం. ఆయన బొమ్మలను గాని, ఆయన స్టూడియోని గాని ఎవరికీ చూపించడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి వ.పా. కు స్నేహితులు ఎవరూ లేరా! అంటే… ఉన్నారు. వారు కూడా బహు తక్కువ. అలాంటి వారిలో ముఖ్యులు విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు, చిత్రకళావిమర్శకులు, శ్రీ సుంకరచలపతిరావు. వపాతో వీరిది పాతికేళ్ల స్నేహం. ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, ఇంటర్యూలు తీసుకోవడం, వ.పా. వేసిన చిత్రాలు వీలున్నప్పుడల్లా కశింకోట వెళ్లి చూసి వచ్చేవారు. వ.పా. ఒరిజినల్ చిత్రాలు చూసి తరించే భాగ్యం లభించడం తన అదృష్టం అని చలపతిరావు ఇప్పటికీ గర్వంగా చూసుకుంటారు. వ.పా.లతో స్నేహం జీవితంలో తనకో మధురస్మృతి అంటారు. వ.పా. గొప్ప చిత్రకారుడే కాదు, అంతకు మించిన సాహితీపరుడు కూడా. పోతన భాగవతం ఆయనకు అత్యంత ఇష్టమైన గ్రంధం. 1944లో ‘కథాంజలి’ అనే మాసపత్రికకు దిగంతరేఖ, నాగ కథలు రాసారు. శకుంతల కథ, బుద్దుడుపై రేఖాచిత్రాలతో కథలు రాసారు. అవినీతిపై రాష్ట్రపతి, ప్రధానీ, సర్పంచ్ అనే వర్ణచిత్రాలు గీసారు. జంబూలోకచరిత్ర కథ ద్వారా అవినీతిని ఎండకట్టారు. పురాణాలు, ఇతిహాసాలు, రాగాలు, రుతువులు, సమకాలీన సమస్యలపై ఆయన గీయని చిత్రం లేదని చలపతిరావు చెప్పారు.
వ.పా.తో వున్న పరిచయం పురస్కరించుకొని రంగులరాజు (తెలుగు) ది వేకింగ్ డ్రీమర్ ఇన్ కలర్స్ (ఇంగ్లీషు) గ్రంథాన్ని రచించి ప్రచురించారు. అంతేకాక వ.పా. ‘లేఖల్ని’ పుస్తకంగా ప్రచురించారు చలపతిరావు. యువ, చందమామలో ప్రచరించిన సుమారు 500 చిత్రాలను ఈయన బద్రపరిచారు. 1992లో వ.పా. మరణించినప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఆయన వర్ధంతి’ సభలను నిర్వహిస్తున్నారు. ఇటీవల వ.పా. పై వీరు రాసిన ‘వ.పా.’ జీవితచరిత్ర’ పుస్తకాన్ని హైదరాబాద్ కు చెందిన సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు ప్రచురించారు. ఇందులో వ.పా. జీవిత చరిత్రతో పాటు 30 రంగుల చిత్రాలు కూడా ఉన్నాయి.
వ.పా.తో ముఖాముఖి జరిపిన ఇంటర్యూ ‘ఆడియో కేసెట్’ (40 నిమిషాలు) కూడా వీరి వద్ద ఉంది.
తెలుగుదనానికి ప్రతీకమైన వ.పా. చిత్రాల్ని ‘తెలుగు విశ్వవిద్యాలయం’ సేకరించి బద్రపర్చాలని చలపతిరావుగారి సూచన.
వ.పా. స్నేహితునిగా తెలుగుజాతి గర్వించదగ్గ చిత్రకారుని అజరామరం చేసేందుకు చలపతిరావుగారు చేస్తున్న కృషి ప్రశంసనీయం.
Sunkara Chalapatirao gari mobile no. pls.