విద్యార్థి లోకానికి “లక్ ఫెస్టివల్” విజయవాడ బుక్ ఫెస్టివల్

విజయవాడ నగరంలో జనవరి 1 నుండి 11 వరకు ప్రతీ సంవత్సరం కొలువుదీరే పండుగ
విజయవాడ బుక్ ఫెస్టివల్..

ఈ సంవత్సరం విజయవాడ బుక్ ఫెస్టివల్ సోసైటికి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ ట్రస్ట్  తోడై సుమారు 270 సాల్స్ తో నిర్వహించడం ఓ ప్రత్యేకత అయితే, 30 వ విజయవాడ పుస్తకమహెూత్సవాన్ని గాంధీ గారి మనుమడు ఆచార్య రాజ్మోహన్ గాంధీ ప్రారంభించడం మరో ప్రత్యేకత .

జనవరి వచ్చేసింది… పుస్తకాలు తెచ్చేసింది….

మనిషి మస్తకం నశ్వరం-ఆ మనిషి రచించిన పుస్తకం ఈశ్వరం. తరిగేది క్షరం-తరగనిది అక్షరం. పుస్తక పఠనం ఓ ఆధునిక పూజలాంటిదే. గతంలో పుస్తకాలు ముందేసుకుని ఓ చిరిగిపోయిన సిరి చాపమీద లేదా గోనెసంచి పట్టామీద చతికిలపడి పుస్తకాలు ముందేసుకుని పడీ పడీ చదవడం వలన నాటి చదువుల ఒంట పట్టి నేటికీ మన పెద్దతరం నాలుకలపై ఆ చదువుల నడయాడుతుంటాయి. నేటి విద్యార్థులు కంప్యూటర్ ముందు రాత్రింబవళ్ళు కూర్చుంటున్నారే గాని పుస్తకం చేపట్టి చదవడం నేటి నీటు సమాజంలో మోటుగా మారింది. పుస్తకం చేతపట్టి చదవడం వలన కుదురుగా కాసేపయినా, కూర్చోవడం అలవడి, ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచం నుండి మనకి ఎదురయ్యే అనేక ఇబ్బందులు అధిగమించడానికి వీలవుతుంది. భౌతిక ఎదుగుదలకు ఆహారం మనిషి నైతిక ఎదుగుదలకు అక్షరం ఆధారం అని మనందరికి తెలుసు. ఓ పుస్తకం కొనాలంటే నేటి బిజీ ప్రపంచంలో కోరిక వున్నా, తీరిక లేకపోవడం ఓ పెద్ద సమస్యగా పరిణమించింది. నేటి బీజీ బిజీ గజిబజి రోజుల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, గురువులు రోజుల తరబడి షాపుల వెంటపడి, పుస్తకాలు కొనాలన్నా, కొని పెట్టాలన్నా అదొక అతి పెద్ద ప్రణాళికగా రూపం దాల్చింది. ఈ విధంగా మనందరం సొంత పుస్తకానికి దూరం అవుతున్నాం. గతంలో పుస్తకం హస్తభూషణం అనేవారు. నిజానికి పుస్తకం సమస్త శరీరానికి భూషణం! ఓ వ్యక్తి చేతిలోని పుస్తకం, ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

నేటి విద్యార్థి లోకం నలుగురు కలిసి ఓ పుస్తకం సంపాదించి, దాన్ని చించి చీల్చి చెండాడి చిరాకు చిరాకుగా జిరాక్స్ కాపీలు తీయించి ఆ పుస్తక స్వరూపాన్నే మార్చేసి పరీక్షలు రాసేసి సదరు పోస్టుమార్టం చేసిన పుస్తకాన్ని ఎక్కడో ఖననం చేసేస్తున్నారు. గతంలో ఓ హస్తభూషణంగా భాసిల్లిన పుస్తకం, అందరినీ అక్కున చేర్చుకునే అతి పెద్ద మనసుని చిన్నబుచ్చుకుని నేడు సొమ్మసిల్లి, షాపులు, లైబ్రరీల అరల్లో, అరమరల్లో, తనను పట్టించుకొనే వారి కోసం ఎదురుచూస్తూ… కాలం వెళ్ళబుచ్చుతున్నది. ఇటువంటి తరుణంలో విద్యల వాటిక అయిన విజయవాడ నగరం నడిబొడ్డున పలు పబ్లిషర్ల సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖనం, క్రీడలు శాస్త్ర సాంకేతిక, రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన పలు పుస్తకాలు ఒకే ప్రాంగణంలో కొలువుదీరి డిస్కౌంట్లతో సహా మనకందుబాటులో అందించే పుస్తకా లపండుగ. ఈ ప్రదర్శనలో బాలసాహిత్యం నుండి భారతం దాకా, ఫిక్షన్ నుండి ఫిలాసఫీ దాకా, కమ్యూనిజం నుండి రొమాంటిసిజం దాక, భక్తి, ముక్తి, రక్తి, అనురక్తిలపై పుస్తకాలు లభిస్తాయి. హరిశ్చంద్రుని గురించి చదవాలన్నా అనిల్ అంబానీలను గురించి తెలుసుకోవాలన్నా పుస్తకాలు లభిస్తాయి.

 ఈ ప్రదర్శనలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ప్రచురణకర్తలు, బెంగళూరు, పూనె, అహమ్మదాబాద్ ముంబయి, చెన్నై, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖ ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. వివిధ విదేశీ ప్రచురణ సంస్థలు, వారి డిస్ట్రిబ్యూటర్లు, వారి వారి ప్రచురణలతో పాల్గొంటున్నారు.  తెలుగు కార్టూనిస్టులు కార్టూన్ పుస్తకాలతో పెట్టిన స్టాల్ (255)ప్రత్యేక ఆకర్షణ.  కొనుగోలు చేసిన ప్రతిపుస్తకం వెలపై 10% తగ్గింపు వుంటుంది. నిజంగా విద్యార్థి లోకానికి విద్యా కాంతులు అందజేసే ఓ అక్షర సంక్రాంతి పండుగ. ఈ పండుగను కులమతాలకతీతంగా ఆదర్శంగా జరుపుకొనే ఓ ఆధునిక పండుగగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. చదివితే లైబ్రరీ. లేకుంటే లైబ్రరీ. పాత పుస్తకాల విలువ ఏమిటో మనకు కొత్తకాదు. నేడు గ్రంథాలయాలంటే కేవలం కంప్యూటర్లలో బ్రౌజింగులకు, డౌన్లోడింగ్లకు వాడుతున్నారు. మార్కుల కోసమే కాని, మార్పూల కోసం పుస్తకాలు చదవడం మానేసి, చాలా కాలం అయింది. ఇటువంటి సంస్కృతి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కొక్క మంచి పుస్తకాన్నైనా కొని, తాను చదివి, చదివించటం వలన మన సామాజిక రుగ్మతలన్నింటికీ శాశ్వత పరిష్కారం దొరికి, మనిషి యొక్క హార్దిక, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభ్యుదయానికి దోహదం అవుతుంది. పలు ప్రాంతాలకు కేంద్రంగా నిలిచిన విజయవాడ నగరంలో ఈ పుస్తక పండుగ జయప్రదం కావాలని, దాన్ని చదువరులందరూ సద్వినియోగ పరచుకోవాలని ఆశాద్దాం.. పుస్తకాల ప్రదర్శనతో పాటు, సాహిత్య వేదికపై ప్రతీ రోజూ సాహితీ సమావేసాలు, పుస్తకావిష్కరణలు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొనడం తమకు లభించిన గొప్ప గౌరవంగా రాష్ట్ర, కేంద్ర మంత్రులు, సుప్రసిద్ధ రచయితలూ, మేధావులు, రాజకీయనాయకులు, కవులు, కళాకారులు భావించే స్థితికి ఎదిగింది.

– బి.యం.పి. సింగ్

1 thought on “విద్యార్థి లోకానికి “లక్ ఫెస్టివల్” విజయవాడ బుక్ ఫెస్టివల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap