ఒకతరాన వెండితెరపై శ్రమైకజీవన సౌందర్యానికి, కర్షక నేపథ్యగీతాలకు శ్రీశ్రీ పెట్టింది పేరు. ఈ తరంలో అలాంటి పాటలు రాస్తున్నదెవరూ అనగానే ముందుగా గుర్తొచ్చేది డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ.
”టప..టప..టప.. టప టప టప
చెమటబొట్లు తాళాలై పడుతుంటే
కరిగి కండరాలే.. నరాలే స్వరాలు కడుతుంటే
పాట.. పనితోపాటే పుట్టింది
పనీపాటతోనే జతకట్టింది.. ” అంటూ..
శ్రమలోంచే పాట పుట్టిందంటూ వాడవాడలా మారుమోగుతున్న సుద్దాల తాజాగా ‘శ్రమకావ్యం’తో మరోమారు సృష్టిలోని శ్రమజీవనాన్ని హృద్యంగా దర్శించారు. అంతకుమించి తులనాత్మకంగా ఆవిష్కరించారు. మే1, ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రమగీతాలు, శ్రమజీవనంతో అక్షరబంధాన్ని ఏర్పరుచుకున్న సుద్దాల అశోక్‌తేజ ‘శ్రమైక కావ్యం’తోపాటు ఆయన సినీ,
జీవిత విశేషాలు..
వారసత్వం ఒడిలో
నాన్న సుద్దాల హనుమంతు, అమ్మ జానకమ్మ ఇంట్లో పెద్దబిడ్డగా పుట్టడంవల్ల.. నాన్న దగ్గరకు అనేకమంది కవులు, కళాకారులు, మేధావులు వస్తూ పోతుండేవారు. వాళ్ళ కలయికప్పుడు పాటల గురించి, కొత్త ప్రయోగాలు, ప్రక్రియలు గురించి ఇలా ఎన్నో విషయాలు చర్చించుకునేవారు. అలాంటివన్నీ నేను నాన్న ఒళ్ళో కూర్చుని వినే సదావకాశం మా ఇంట్లో అందరికన్నా నాకే దక్కింది. నాన్నలో ఉన్న వారసత్వం, ఆ పాటల పోరుతత్వం.. చిన్ననాడే రక్తంలోకి ఇంకిపోయి.. అలా ఇంకి ఉన్న భావం నా పెన్నుకి ఇంకులా మారుతుందన్నది వాస్తవం. నా పాటలో మానవీయకోణం, ఆర్ద్రత కనిపించే దానికి అమ్మ కారణం.. అదే ”ఒకటే జననం.. ఒకటే మరణం… గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు” అనే వేగం కనిపిస్తే అది నాన్న నుంచి అబ్బిందే. అమ్మ లాలిత్వం, నాన్న కర్తవ్య శుద్ధి.. ఈ రెండూ పెనవేసుకున్నవే ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో రాసిన రెండు వేలకుపైగా పాటలు. మొదటిసారిగా నాల్గవ తరగతి చదువుతున్నప్పుడు తొమ్మిదేళ్ళ వయసులో జెండాపైన ”ధగధగలాడే జెండా.. నిగనిగలాడే జెండా.. వినవే పేదల గాథ.. చల్లారదు ఆకలి బాధ” అనే పాట రాశాను. నాన్న సాక్షిగా ఆ పాటకు చప్పట్లు దక్కాయి. ”నేనుసైతం” పాటకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు కొట్టిన చప్పట్లలోనూ నాటి చప్పట్లు కలిసి వినపడ్డాయి.
అయామ్ గుడ్ టీచర్
కరీంనగర్ జిల్లా బొమ్మల మేడిపల్లిలో గవర్నమెంట్ టీచర్‌గా ఉండేవాడ్ని. అక్కడ సెవెన్త్ క్లాస్ వరకే ఉండేది. ఇద్దరమే టీచర్లం. నాకు లెక్కలు రావు. అందుకే లెక్కలు తప్ప అన్నీ బోధించేవాడ్ని. నేను తెలుగు పండితుడ్నికాదు. చేసింది ఎంఏ ఫిలాసఫీ. కానీ నాకు తెలుగంటే ప్రాణం. గొప్పగొప్ప కవులు, రచయితలవన్నీ అప్పటికే చదివేశాను. సినిమా రంగంలోకి రాకముందే రెండు వేలకుపైగా పాటలు రాశాను. ”నేలమ్మా.. నేలమ్మా.. నీకు వేలవేల వందనాలమ్మా” లాంటి ఎన్నో మంచి పాటలు అప్పుడు రాసినవే. సినిమాలోకి రాకున్నా.. పాటలు రాస్తూనే ఉండేవాడిని. సినిమాల్లో రాస్తున్న సినిమాయేతర గీతాలెన్నో రాస్తూనే ఉన్నా.
పాటల తండ్రి.. సినారే
నాన్న తర్వాత ప్రభావం చూపించిన గొప్ప రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డిగారే. ఆయన్ని పాటల తండ్రిగా భావిస్తాను. ఐదు, ఆరు తరగతిలో ఉన్నప్పుడు మా ఊరి దగ్గరలోని సీతారామపురంలో ఉండే గుట్టల్లో పిల్లలం ఆడుకునేవాళ్ళం. ”ఈ నల్లని రాళ్ళలో.. ఏ కన్నులు దాగెనో” అని ఆయన రాసిన పాట కూడా అదే వయసులో విన్నా. మేము ఆడుకుని దెబ్బలు తగిలించుకునే ‘ఈ నల్లని రాళ్ళల్లో కన్నులుంటాయని రాశాడేంటబ్బా..?’ అని గొప్పగా ఆశ్చర్యపోయా. సినిమా పాట రాయాలని అప్పుడే అనుకున్నా. తనికెళ్ళభరణి, మేనల్లుడు ఉత్తేజ్ కారణంగా సినిమాలకు పరిచయమయ్యా. తర్వాత ‘ఒసేరు రాములమ్మ’లో పాటలు పెద్ద హిట్టవ్వడంతో ఉద్యమం, ఉత్తేజవంతమైన పాటలు ఆ వరుసలో ఎక్కువ రాయడం జరిగింది. కానీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అన్నిరకాల పాటలూ రాశాను. రాయగలను, రాశాను కూడా (నవ్వుతూ..). సినిమాలో నాకంటూ ఒకదారి ఉండాలని ప్రయత్నించాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీలాంటి మహా గేయకవుల కంటే గొప్పగా రాయాలని కాదు. వారి పదాల్లోని మెత్తదనాన్ని, కత్తిదనాన్ని మేళవించి రాసే ప్రయత్నం చేశాను. వైవిధ్యమైన పాటలెన్నో రాయగలిగాను. శ్రీశ్రీ, వేటూరి కవుల తర్వాత తెలుగు సినిమా తరఫున జాతీయ అవార్డు దక్కించుకోవడం మరో అద్భుతమైన అనుభవం. వారితో సమానమనికాదు, వారి చెంత నిలిచే గౌరవం దక్కినందుకు.
అక్షరానికి ఎల్లలుండవు
సృజనాత్మక అనేది దేనికీ బంధీ అయ్యేది కాదు. ఎవర్నీ ఇబ్బందీ పెట్టేదీకాదు. అది గాలిలా, పైరు గాలిలా, పండు వెన్నెలలా. అగ్నిపర్వతంలోని లావాలా, చందమామ చల్లదనంలా, మల్లెమొగ్గ పరిమళంలా వీటికి జాతిబేధాలు ఉండవు. మల్లెమొగ్గ పరిమళాన్ని ఇరాన్‌లో ఉన్న ముస్ల్లిమ్ తమ్ముడు ఇష్టపడడా?!, ఆఫ్రికాలో ఉన్న ఓ బ్లాక్‌బోరు అగ్నిజ్వాలను చూసి ఆనందపడడా?! కళాకారుడు కూడా అంతే జాతి, ప్రాంతాలకు అతీతుడు. నేను విజయనగరంలో గురజాడ అవార్డు తీసుకున్నా, తెలంగాణలో కొమరంభీమ్ అవార్డు పుచ్చుకున్నా, వైజాగ్ గీతం యూనివర్సిటీలో డాక్టరేట్ గౌరవం దక్కినా.. ఆ అనుభవం అలాంటిదే.
పనీపాటా లేదా అంటే
మా ఆవిడొకసారి.. ”పెళ్ళయి పదేళ్ళయ్యింది.. మీకేం పనీపాటా లేదా… స్కూల్ అవ్వగానే.. ఇంటికి రావొచ్చు కదా.. ఊరికే మీటింగులవీ పెట్టుకుని ఎందుకు లేటుగా వస్తారూ?” అని అడిగింది. ”నా పాటే పని.. పనీపాట లేదంటావేంటి?” అని అలవోకగా అనేశాను. అన్న వెంటనే ఆ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టి.. పరిశోధనలు చేసి పాట అల్లుకున్నా. అలా ”టప..టప..టప” పాట పుట్టింది. పనిలోని అలసటను తీర్చుకోవడానికి పాట పుట్టిందనేది నా నమ్మకం.
”సినిమా పాటలు రాయడం మాత్రమే నా గమ్యం కాదు..
గమనం మాత్రమే. నేను చేరదల్చుకున్న శిఖరానికి వేసుకున్న దారిలో ఒకప్పుడు టీచర్, ఇప్పుడు రైటర్.. రేపు ఇంకేదో కావొచ్చు. గమనం మాత్రమే వృత్తి. గమ్యం వేరే ఉంది. అది శ్రమకావ్యంలాంటి రచనలూ, అమ్మనాన్న పేరుతో కొనసాగుతున్న ఫౌండేషన్ కార్యక్రమాలూ కావొచ్చు.. ఇలాంటివి అనేకం నా గమ్యాలు.. మానవ సంబంధాలతో మరింతగా ముడిపడే కావ్యాలు” అంటూ గమ్యం, గమనం మధ్య తేడాను చక్కగా చెప్పుకొచ్చే సుద్దాల అశోక్‌తేజ పాటల్లో మరింత శ్రమైకజీవనం విరబూయాలని కోరుకుందాం!!
– గంగాధర్ వీర్ల