2019 ఫిబ్రవరి 10, 11 తేదీలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో కృష్ణదేవరాయ మహోత్సవాలు
“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ,తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స!”
అని 500 యేళ్ల క్రితం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆదేశంగా శ్రీ కృష్ణదేవరాయలు పలికిన పలుకులివి.
కర్ణాట, ఆంధ్ర, తమిళ, మలయాళ భూభాగాలను ఏకంచేసి త్రిసముద్రాధీశుడిగా వీరవిక్రమ శౌర్యాన్ని ప్రదర్శిస్తూనే, సరస సంగీత సాహిత్య సాంస్కృతిక సీమల ఏకైక ఏలికగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా భారతీయ సంస్కృతి సౌరభాన్ని, మీదుమిక్కిలి తెలుగు భాషా సంస్కృతులను పరిమళింప చేసిన కారణజన్ముడు కృష్ణదేవరాయలు.
ఒక్క ఓటమి కూడా చవి చూడక అజేయంగా ఆయన చేసిన యుద్దాలు రాజకీయంగానే కాక, భాషా సంస్కృతుల పరంగా కూడా దక్షిణాది ప్రజలను ఏకం చేశాయి. భారతీయ ధర్మం, హైందవ సంప్రదాయాలతోపాటు, కర్ణాటక సంగీతం, భరతనాట్యం ఇంకా ఇతర భారతీయ సాంస్కృతిక వారసత్వాలను కాపాడి, నిలబెట్టిన ఒక మహాయుగంగా రాయలవారి కాలాన్ని చరిత్రకారులు విశ్లేషిస్తారు.
రాయల కాలంలో పునరుజ్జీవనాన్ని పొందిన పౌరాణిక గాథలే ఈనాటికి ప్రబంధాలలో, కావ్యాలలో నిలిచి నేటి తరాలకు తరగని ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక సంపదను మిగిల్చాయి! ఆంధ్ర పంచ మహా కావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన ఆముక్తమాల్యద ఆయన రచన కాగా, అల్లసాని పెద్దనగారి ‘మనుచరిత్ర’, రామరాజ భూషణుడి “వసుచరిత్ర’, తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మహత్మ్యం’ లాంటి అనేక ప్రబంధ కావ్యాలు తెలుగు సాహితీ వైభవానికి ప్రతీకగా నిలిచాయి.
విజయవాడకు 40 కి. మీ. దూరంలో దివిసీమలో కృష్ణానది ఒడ్డున శ్రీకాకుళం ఉంది. అది తెలుగువారి తొలి రాజధాని. ఇక్కడ ఆంధ్రమహావిష్ణు దేవాలయం అలనాటి చారిత్రక వైభవానికి సాక్షి, మాతృభాషకు దేవుడున్నది ఆంధ్రులకే! ఆయనే బాసదేవర! తెలుగు వల్లభుడు! తెలుగు రాయుడు కూడా!
“ఆముక్తమాల్యద మంటపం”లో కూర్చుని రాయలవారు ఆముక్తమాల్యద రచనకు శ్రీకారం చుట్టారు. 13 యేళ్ల క్రితం శ్రీ మండలి బుద్దప్రసాద్ గారు ఈ మంటపంలో రాయలవారి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు. నాటినుండీ, భాషా సాంస్కృతిక శాఖ, దేవదాయ ధర్మదాయ శాఖ, దివి ఐతిహాసిక మండలి కలిసి ఇక్కడ ప్రతీ యేడాదీ కృష్ణదేవరాయ మహోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
2019 ఫిబ్రవరి 10, 11 తేదీలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో కృష్ణదేవరాయ మహోత్సవాలు “తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాలు”గా జరగనున్నాయి. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చా వేదికలు, ప్రదర్శనా ప్రసంగాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సంస్కృతి పట్ల మనకు గల అభిమానానికి క్రియారూపం తీసుకురావటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని భాషా సాంస్కృతిక శాఖ ఆకాంక్ష..
ఈ సందర్భంగా జానపద కళారూపాల ప్రదర్షన, తెలుగు సాంస్కృతిక మూర్తులకు సత్కారం, కృష్ణదేవరాయలు నృత్య రూపకం, సదస్సులు, ప్రముఖుల ప్రసంగాలు వుంటాయి.