విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

‘సాగర్ గిన్నె’ గా కళారంగానికి సుపరిచితులైన వీరి అసలు పేరు గిన్నె వెంకటేశ్వర్లు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామంలో 1965 అక్టోబర్ 2వ తేదిన గిన్నె రాములు, భీసమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు సాగర్ గారు. వీరి బాల్యం పాఠశాల విద్య వారి స్వగ్రామం మూసాపేటలోనే జరిగింది. ఇంటర్ జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో, బి.ఎఫ్.ఏ. హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు, డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటి నందు యం.ఏ, ఎస్.వి.యూనివర్శిటి తిరుపతి నందు పిహెచ్.డి. పూర్తి చేసుకొన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్ తరువాత విద్య ముందుకు సాగలేదు. బాల్యం నుండి స్వతహాగానే చిత్రకళపై ఉన్న మక్కువతో బుక్తి కొరకు 1983లో హైదరాబాద్ వెళ్లి సినీ పబ్లిసిటీ సెక్షన్ (బానర్స్ పెయింటింగ్) లో ఉద్యోగానికి చేరాడు. అక్కడ పనిచేస్తూనే డ్రాయింగ్ లోయర్, హయ్యర్ టీటిసి పూర్తి చేసి వివాహం చేసుకొన్నారు. ఉద్యోగం చేస్తూనే ఒక అబ్బాయి పుట్టాక తెలుగు విశ్వవిద్యాలయం బి.ఎఫ్.ఏ. లో చేరి, కోర్సు పూర్తి చేసారు. 1995 నుండి తెలుగు విశ్వవిద్యాలయంలోనే గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయునిగా పనిచేసారు.
1998 మార్చిలో తిరుపతిలో తి.తి.దే. వారి శిల్పకళాశాలలో సంప్రదాయ చిత్రలేఖన విభాగంలో శాశ్వత ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అదే కళాశాలలో ఇస్టక్టర్ గా పనిచేస్తున్నారు.

1984లో హైదరాబాదు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన చిత్రకళా ప్రదర్శన నిమిత్తము ఒక చిత్రం పెన్సిల్ మాధ్యమంలో చేయాలని ఆరంభించారు. పెన్సిల్ బదులుగా నలుపు రీఫిల్ పెన్‌ చేస్తే తో ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని, అదే చిత్రాన్ని పెన్నును కదిలిస్తూ గీతల ద్వారా వెలుగునీడలు చూపించారు. ఈ సందర్భంలో అదే చిత్రానికి అక్కడక్కడ షేక్ గీతలతోపాటు చుక్కలు కూడా వేసారు. అలా వేస్తున్న సందర్భంలో ఒక చిత్రం పూర్తి వెలుగునీడలు బిందువులద్వారానే వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తితో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారి చిత్రపటాన్ని నలుపు రీఫిల్ చుక్కలతోనే వెలుగునీడలు చూపించారు. ఈ రకంగా బిందుమాధ్యమం ప్రారంభమయ్యింది. కొంతకాలం చాలా చిత్రాలు ఏకవర్ణ బిందు చిత్రాలుగా రూపొందించారు. 1996లో రంగుల రీఫిల్స్ లభ్యమవడంతో రంగు రీఫిల్ బిందువులతో అనేక చిత్రాలకు ప్రాణం పోసి, ఆ చిత్రాల ద్వారా ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

Dot art

మొదట రీఫిల్స్ తో ఐవరీషీట్ పైన చిత్రాలు చేసేవారు. ప్రస్తుతం ఆయిల్ కలర్ పెన్నులతో క్యాన్వాస్ పై చిత్రాలు చేస్తున్నారు. బిందుమాద్యమంలో A4 సైజ్ మొదలు 5.5 x 3.5 అడుగుల వరకు వివిద సైజుల్లో సుమారు 650 పైగా చిత్రాలు రూపొందిచారు.
తిరుపతి, ఢిల్లీ, హైదరాబాదు, బెంగుళూరు, విశాఖపట్నం, ఖజురాహో, విజయవాడ, వరంగల్, భీమవరం, ఏలూరు, జైపూర్, మహబూబ్ నగర్ లాంటి అనేక నగరాల్లో ఇప్పుడు వరకు 27 వన్మేన్ షోస్, 25 గ్రూప్ షోస్ చేసారు. జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయంగా అనేక కళాకార్యశాలలో పాల్గొన్నారు.

సాగర్ గిన్నె చేసిన బిందు చిత్రాల్లో అధిక భాగం మానవమూర్తి (ప్రోట్రేయట్స్) చిత్రాలు, దేవతామూర్తుల చిత్రాలే. 2006 లో వీరు చేసిన నాటి సెంట్రల్ క్యాబినేట్ 120 మంది పోట్రెయిట్ ఒక గ్రంధం ప్రచురించగా, ఆపుస్తకాన్ని నాటి భారత ప్రధాని డా. మన్మో హన్ సింగ్ గారి చేతుల మీదుగా గ్రంధ ఆవిష్కరణ జరిగింది.

Sagar ginne with Former president Pranab

సాగర్ గిన్నె చేసిన బిందు చిత్రాలను చూసిన భారత రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అనేక మంది కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు మరెందరో రాష్ట్ర అధికారులు ముగ్దులై సాగర్‌కు అభినందనలు తెలిపారు. సత్కరించారు కూడా.

పి.హెచ్.డి. కి అంకురార్పణ : సాగర్ గిన్నె గారు తెలుగు విశ్వవిధ్యాలయంలో చదువుకొంటున్న రోజుల్లో 1997లో జానపదకళలపై ప్రొ. జయధీర్ తిరుమలరావుగారి ఆధ్వర్యంలో నకాశి చిత్రకారులపై ఒక సెమినార్ జరిగింది. నాటి సెమినార్లో నకాశి చిత్రకళపై సాగర్ గారు కూడా ఒక పేపర్ సమర్పించారు. అప్పుడే కలిగింది ఈ నకాశి చిత్రకళపై పి.హెచ్.డి. చేయాలన్న ఆలోచన వీరిలో. తిరుపతిలో ఉ ద్యోగం వచ్చాక ఎస్.వి.యూనివర్శిటీ ప్రొ.డి.కిరణ్ క్రాంత్ చౌదరి గారి పరిచయం, వారి ప్రోత్సాహంతో యం.ఏ.పూర్తి చేసుకొని వారి మార్గనిర్దేశకత్వంలోనే ఎస్.వి.యూనివర్శిటీలో 2016లో పి.హెచ్.డి. పూర్తి చేసారు.

వీరి పిహెచ్.డి. పరిశోధన అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని “సంప్రదాయ చిత్రకళలు” (విత్ రెఫరెన్స్ కలంకారి, నకాశి, నిర్మల్), ఈ మూడు కళలపై ఇంతకుముందు ఎవ్వరూ పిహెచ్.డి. చేయలేదు. వీరు సేకరించిన సమాచారమంతా. ఆయా కళాకారుల వద్దకు స్వయంగా వెళ్ళి, రోజుల తరబడి వారి వద్దే ఉండి సమాచారంతో పాటుగా ఛాయా చిత్రాలు కూడా తీసుకొన్నారు. వీరికి ఈ మూడు  కళలపై పరిశోధనకు గాను సుమారు 6 సంవత్సరాలు సమయం పట్టింది. భారతదేశంలోనే గొప్ప పేరున్న యూనివర్శిటీలలో ఒకటైన ఎస్.వి.యూనివర్శిటీలో నిబద్ధతకు మారుపేరుగా ఉన్న సీనియర్ ప్రొఫెసర్ డి. కిరణ్ క్రాంత్ చౌదరిగారి మార్గదర్శకత్వంలో నేను పిహెచ్.డి. పూర్తి చేయడం చాలా సంతృప్తినిచ్చింది?

“సంప్రదాయ చిత్రకళలు” పరిశోధనాత్మక పుస్తకంలో ఏముంది:
సాగర్ గిన్నె గారి పరిశోధన కలంకారి, నకాశి, నిర్మల్ పై అయితే, వీటికంటే ముందుగా అసలు ‘కళ’ అంటే ఏమిటి? అది ఎక్కడ ఎలా ఆవిర్భవించింది? ప్రజలచేత ఏర్పడ్డ కళలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి?. ఆదిమానవుని కాలం నుండి జానపదకళలుగా ఎలా రూపాంతరం చెందాయి? ఇలా ఆదిమానవుని కాలం నుండి ఆధునిక యుగం వరకు చిత్రకళల స్వభావాన్ని ఈ పుస్తకంలో ప్రస్థావించడం జరిగింది.

కళలకు కాణాచి భారతదేశం. దేశంలోని వివిధ రాష్ట్రాలలోని గుహాలయ చిత్రకళలు, దేవాలయ చిత్రకళలు, రాజరికపాలనలోని కళాపోషణ, ఆంధ్రదేశంలో చిత్రకళ వికాసం, చరిత్ర ఇలా వీరి పరిశోధనాంశానికి ముందుగా పుస్తకంలో పొందుపరచడం జరిగింది.

పరిశోధనాంశాలు కలంకారి, నకాశి, నిర్మల్. ఈ మూడు సంప్రదాయ కళావిధానాల గురించి చాలా లోతుగా పరిశోధించడం జరిగింది. ఒక్కొక్క కళావిధానానికి సంబంధించి వాటి చరిత్ర, ఆయా ప్రాంతాలలో అవి ఎలా మొదలయినాయి ? ఎలా ఉండేవి? నేడు ఎలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో వాటి మనుగడ ఎలా ఉండబోతుంది? అనే అంశాలను ప్రస్తావించారు. అలాగే ఆయా కళలు తయారీ విధానం, చిత్రరచనకు వారు వాడే రంగులు, వస్తువులు వాటి తయారీ విధానం లాంటి అనేక అంశాల గురించి విపులంగా విశదీకరించడం జరిగింది. అంతేకాక చిత్ర రచనా విధానానికి సంబంధించిన ఛాయా చిత్రాలు (ఫోటోలు) కూడా క్రమ పద్ధతిలో పొందుపరిచాను. వాడే రంగులు వాటి తయారీకి సంబంధించిన ఛాయా చిత్రాలు కూడా ఉంచారు. ఏ కళాకారుడైనా పరిశీలనాత్మక దృష్టితో వీరు పొందుపరిచిన ఛాయా చిత్రాలు చూస్తే ఆయా కళలపై ఒక అవగాహన ఏర్పడుతుందనడంలో సందేహంలేదు.

జాతీయస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో సంప్రదాయకళలపై పనిచేసిన అనేక ప్రముఖ చిత్రకారులను ఈ పుస్తకంలో పరిచయం చేసారు. అదేవిధంగా కలంకారి, నకాశి, నిర్మల్ కళలపై పారంపర్యంగా పనిచేస్తున్న చాలామంది కళాకారులకు జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలు కూడా వచ్చాయి. వారందరి వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు.

‘తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంప్రదాయ చిత్రకళలపై మీరు చేసిన ఈ పరిశోధన సంపుటి తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల కళాకారులకు కళాభిమానులకు అందుబాటులో ఉండాలంటే ఈ పుస్తకాన్ని మీరు తెలుగులో ముద్రించాలని’ కొందరు కళాకారులు, మిత్రుల సూచనలమేరకు సాగర్ గిన్నె గారు ఈ పుస్తకాన్ని తెలుగులో రంగుల చిత్రాలతో, క్వాలిటీ పేపరుపై ముద్రించడం జరిగింది.

తెలుగులో కళలపై పరిశోధనలు చేసిన వారు బహుకొద్దిమంది వారిలో థిసీస్ ప్రచురించిన వారు చాలా అరుదు… ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇంతటి విలువైన గ్రంథాన్ని ప్రచురించిన డా॥ జి.వి.సాగర్ అభినందనీయులు. ఈ పరిశోధనకు, పుస్తక ప్రచురణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పత్రికా ముఖంగా ధన్యవాధాలు తెలియజేస్తున్నారు డా॥ సాగర్ గిన్నె గారు.
అక్టోబర్ 2 డా॥ సాగర్ గిన్నె గారి పుట్టిన రోజు కావున వారికి 64కళలు పత్రిక తరపున జన్మదిన శుభాకాంక్షలు …
కళాసాగర్ యల్లపు

“సంప్రదాయ చిత్రకళలు” పుస్తక వివరాలు:
సైజ్: 1/4 డెమ్మీ హార్డ్ బవుండ్, పేజీలు: 200, వెల: రూ. 350/-
సెల్: 9493884747, 9440367826

“సంప్రదాయ చిత్రకళలు” గ్రంథం గురించి ప్రముఖ చిత్రకారుల అభిప్రాయాలు...
____________________________________________________________________________

B.A. Reddy, artist

ప్రతి గంధ్రాలయంలోను వుండాల్సిన పుస్తకం ఇది:
మిత్రులు డా. సాగర్ గిన్నె గారి పరిశోధనాత్మక అంశం “సంప్రదాయ చిత్రకళలు” పుస్తకరూపంలో రావడం అందరూ ఆనందించవలసిన విషయం. నేటి చిత్రకారులు సాంప్రదాయ కళలను విస్మరించి సాధన చేస్తున్న తరుణంలో ఈ గ్రంథం రావడం శుభపరిణామం. డా. వెంకటేశ్వర్లుగారు కలంకారి, నకాషి, నిర్మల్ కళారీతులను నిసితంగా పరిశీలించి ఆయా కళాకారులను కలిసి వారి అనుభూతులను కూడా అందించారు. .

కళలపై ఆసక్తి వున్న ప్రతి యొక్కరు చదువవలసిన గ్రంధం ఇది. ప్రతి గంధ్రాలయంలోను, కళాశాలలోను అందుబాటులో వుంచవలసిన అవసరం వుంది. ఈ దిశగా రాష్ట్ర సాంస్కృతిక శాఖలు చొరవ చూపాలి. గంధ్ర ప్రచురణ ఆకర్షణీయమైన అనుభూతిని కల్గిస్తుంది. సాంప్రదాయ, జానపద కళలకు నిలయమైన తెలుగు రాష్ట్రాల కళా ప్రేమికులు ఈ గ్రంథాన్ని ఆదరించగలరని ఆశిద్దాం. ఉన్నత ప్రణామాలతో, విలువైన సమాచారాన్ని అందించిన డా. సాగర్ గిన్నె గారికి హృదయపూర్వక అభినందనలు
డా. బి.ఏ.రెడ్డి, చిత్రకారులు.
______________________________________________________________________________

Devi Prasad, artist

కళాప్రేమికుల వద్ద ఉండవలసిన గ్రంథం:
కళ మానవ జీవితంలో ఒక అవిభాజ్య అంగం. అటువంటి కళలను జీవితంలో అనుసంధానం చేస్తే అది సాంప్రదాయం అవుతుంది. మానవ జన జీవితంలో ఇలాంటి ఆచరణాత్మక సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. వాటి వివరాలు సమగ్రంగా తాను తెలుసుకొని, ఈ పుస్తకం ద్వారా మనకు అందజేసిన మిత్రులు సాగర్ గిన్నె గారి కృషి అభినందనీయం. కళాప్రేమికులందరి వద్దా తప్పనిసరి గా ఉండవలసిన నిధి వంటిదీగ్రంథం.


దేవీప్రసాద్, చిత్రకారులు, గుంటూరు.
______________________________________________________________________________

A. Ramachandraiah, artist

సృజనాత్మకత అన్నది కళాకారుడి ప్రాణం …
ప్రముఖ కళావిమర్శకులు రామన్ గారు చెప్పినట్లు తనలో ఉన్న సృజనాత్మకతను బట్టి కళాకారుడు అభినందనీయుడు. సృజనాత్మకత అన్నది కళాకారుడి ప్రాణం. ఆ కళలో తన హృదయ విశాలతను చూచి ఆనందించడం సహజం, కానీ ఆ కళ పుట్టు పూర్వోత్తరాలు శోధించాలి అన్నది కళాకారునిలోని ప్రత్యేకత. ఆకోవకు చెందిన కళాకారులే జి.వి.సాగర్ గారు. కలంకారి, నకాశి, నిర్మల్ సంప్రదాయ కళలు భారతీయ సంప్రదాయ కళలలో అతి ప్రాముఖ్యమైనవి, ప్రాచీనమైనవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ కళలపై అతి కష్టముతో పరిశోధన జరిపి, ఆ పరిశోధనాంశమును – కలంకారి, నకాశి, నిర్మల్ సంప్రదాయ కళల ఔన్నత్యాన్ని భారతీయ సంప్రదాయ చిత్రకళా చరిత్రలో చిరస్థాయిగా నిలిపారు.

వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము నందు ఆచార్యులు జయధీర్ తిరుమలరావు గారుతో కలసి జానపద సంగోష్ఠి జరపడానికి చేర్యాల వెళ్ళారు. అచ్చటి నకాశి చిత్రకళకు ఆకర్షితులైన సాగర్ గారు ఆ కళాకారుల గురించి ఆ కళ మనుగడను కోల్పోతున్న దాని గూర్చి తపనతో కళాకారుడిగా తనేమైనా చేయవలెనని ఆలోచన వచ్చినది. ఆ ఆలోచనతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆచార్యులు కిరణ్ క్రాంత్ చౌదరి గారితో సంప్రదించి, వారి ఆలోచనతో తెలుగు సంప్రదాయ చిత్రకళలైనటువంటి కలంకారి, నకాశి, నిర్మల్ సంప్రదాయ కళలపై పశోధన చేసి వాటిని ఉన్నత స్థాయిలో నిలిపిన డా॥ జి.వి. సాగర్ గారికి నా అభినందనలతో…

ఆసాది రామచంద్రయ్య
శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల-విశ్రాంత చిత్రకారులు
అధ్యక్షులు : శ్రీ కళాక్షేత్ర చిత్రకళాకారుల సాంఘిక సంక్షేమ సంఘం, తిరుపతి. 

8 thoughts on “విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

  1. Sagar gari parichayam marokasari teliyachesinanduku 64 kalalu ku danyavadalu

    Sagar gariki subhakanksalu mariyu puttina roju subhakanksalu

  2. Good…చక్కని పరిచయంతో కూడిన ఆర్టికల్.ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు పొందిన సాగర్ గారు ధన్యులు..! 👏👏👏

  3. Ginne Sagar gari Article lo amsalu chadivaka, kalala pai Varu chesina parisodhanlu, vari krishini konyadakunda vundalemu. Abhinadaneeyulu.
    Chakkani article andinchina 64 Kalalu Kalasagar garki Dhanyavadamulu.

  4. సాగర్ గారి పుట్టిన రోజు సందర్భసంగా వారి కళా కృషిపై వెలువడిన పై aarticle చాలా బాగుంది .సాంప్రదాయ చిత్రకళలపై వారు చేసిన కృషి వలన వెలువడిన వారి పరిశోధన గ్రంధం నిజంగా ప్రతి కళా కారుడి వద్ద ఉండవలసిన గ్రంధం .నేను ఇదివరకే ఈ గ్రంధాన్ని నా పుస్తక భాండాగారం లోకి సీగేర్చుజోవడం జరిగింది .వారిబిందు చిత్రాలు నిజంగా చాలా బాగున్నాయి .మంచి ఆర్టికల్ అందించిన కళాసాగర్ గారికి .చిత్రకారులుడాక్టర్ సాగర్ గిన్నె గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap