పుస్తకాలు, పత్రికలు లేని ప్రపంచాన్ని నేడు ఊహించుకోలేం. ఈ ప్రపంచంలో పుస్తకం ఓ అద్భుతం. ఎందరెందరో భాషాభిమానం, దేశాభిమానం, సమాజశ్రేయస్సు, ఉద్యమస్ఫూర్తితో పత్రికలు స్థాపించి పాఠకులకు అందుబాటులోకి తెస్తున్నారు. లెక్కకు మిక్కిలిగా వెలువడుతున్న పత్రికలలో చిరకాలం నడిచేవి-పాఠకాభిమానం పొందేవి కొన్నే. పత్రికలను పాఠకాభిమానం పొందేలా సారధ్యం వహించేవాడు సంపాదకుడు. అలాంటి పత్రికా సంపాదకులలో మేటి స్వాతి వీక్లీ సంపాదకులు వేమూరి బలరాం.
తెల్లారగానే దినపత్రిక చూడకపోతే… ప్రాణం కొట్టుకపోతుంది. టీవీల్లో వార్తలు చూసినా సరే… దినపత్రిక పేజీలన్నీ ఓ సారి తిరగేస్తే కాని తృప్తి వుండదు. చాల మందికి, కాఫీలాగే అలవాటయిన దినపత్రికను సాయంత్రం అయ్యేసరికి.. కాలిపోయిన సిగిరెట్ పారేసినట్టు పక్కన పడేస్తారు! నెలరోజులయేసరికి కట్టకట్టి… తూకానికి అమ్మేస్తారు. అదే వారపత్రిక అయితే కనీసం వారం పదిరోజులు బల్లమీదనే వుంటుంది. ఆ తర్వాత అది కూడా కిరాణా కొట్లో పొట్లాలకు వాడేస్తారు. కాని… స్వాతి వారపత్రిక పాతదయినా… కొత్తదయినా చాలా భద్రంగా దాచుకుంటారు. కారణం ఏమిటి? అదే స్వాతి సంపాదకుని ఇంద్రజాలం.
స్వాతి నక్షత్రం గొప్పది, నక్షత్ర బలం ఇంకా గొప్పది స్వాతి బలరాం సంకల్ప బలం ఇంకా ఇంకా గొప్పది!
అందుకే ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా… స్వాతి సపరివార పత్రిక సకుటుంబ పత్రికగా.. బంధుమిత్ర సపరివార సమేతంగా ఇష్టపడి చదివే పత్రికగా.. (కష్టపడి చదివే పత్రికలూ ఉన్నాయి లేండి) తెలుగువారి అలవాట్లలో ఓ అంతర్భాగంగా.. పత్రికా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచి.. పాఠకుల నీరాజనాలు అందుకుంటోంది. ఎందుకందుకోదు? స్వాతి సపరివారపత్రిక-సరస్వతి మానసపుత్రిక గదా… తనకంటూ కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలతో విలువలతో.. అనితర సాధ్యమైన అకుంఠిత దీక్షతో.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. భారతదేశంలో గల 301 మేగ్డయిన్లలో స్వాతి పత్రిక. మూడవ స్థానంలో వుందంటే ఆ క్రెడిట్ పూర్తిగా స్వాతి బలరామ్కే దక్కుతుంది! మన రాష్ట్రానికి ఈ పక్కన వున్న మహారాష్ట్రలో, ఆ పక్కన వున్న కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తెలుగు పత్రిక కోసం భూతద్దం పెట్టుకొని వెత్తుక్కోవలసి వస్తోంది! అటువంటి పరిస్థితిలో అమెరికాలో ఒక్క న్యూజెర్సీలో స్వాతి వారపత్రిక 100 కాపీల వరకూ అమ్మతానని ఓ హిందీవాడు (ఏజెంట్) చెప్పాడంటే దాన్ని బట్టి స్వాతి పాఠకుల సంఖ్య అంచనా వేయవచ్చు. స్వాతి మాసపత్రిక, వారపత్రిక రెండూ కలిసి పాఠకుల సంఖ్య 45 లక్షల 99వేలమంది అని నేషనల్ రీడర్షిప్ స్టడీస్ కౌన్సిల్ సర్వేలో అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ గౌరవం హఠాత్తుగా రాలేదు. ఇవాల్టి వరకూ అంటే 35 సంవత్సరాల కృష్టి, శ్రమ సాధించిన గౌరవం ఇది!… “ఈ 29 సంవత్సరాలలో ఎన్నో విజయాలు సాధించిన… మరెన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను’ అంటారు స్వాతి బలరామ్.
భూమిని నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన బలరామ్… పత్రికను నమ్ముకొని.. ఆ పత్రికను భారతదేశంలోనే 3వ స్థానంలో నిలబెట్టాడు అంటే అది పత్రికా రంగంలో గిన్నీస్ బుక్ రికార్డు’ లాంటిది! ఎందరో కోటీశ్వరులు పత్రికారంగంలో నిలదొక్కుకోలేక… లక్షాధికారులు… ఒకరిద్దరు భిక్షాధికారులు అయిపోయిన కథలు ఎన్నో విన్నాము. కానీ… స్వాతిబలరామ్… పాఠకుల అభిరుచి తెలుసుకోడానికి… ఆంధ్రదేశమంతటా తిరిగి “పాఠకుల నాడి’ తెలుసుకుంటూ-స్వాతి పత్రిక పబ్లిసిటీ బోర్డులను బద్దీకొట్లకు మేకులు కొట్టి తానే పెట్టేవాడంటే ఇవాళ ఎవరైనా నమ్ముతారా?… తెల్లవారుజామున ఎవరూ చూడకుండా ఈ బోర్డులు కొట్టడానికి స్వాతి బలరామ్ తిరిగారంటే ఇవాళ ఎవరైనా నమ్ముతారా?… స్వాతి గురించి అంత కష్టపడ్డాడు కాబట్టే… గత 29 సంవత్సరాలుగా ‘స్వాతి’ పత్రికా రంగంలో ఒక ప్రత్యేకస్థానంలో నిలబడింది! స్వాతి బలరామ్కు పాఠకులే దేవుళ్ళు! వాళ్ళ వాళ్ళ అభిరుచిని ఆయన ఆరాధిస్తాడు! ఆయన బలమంతా పాఠకులు! అందుకే… స్వాతికి పోటీగా ఏ పత్రిక నిలువలేదు! స్వాతి పత్రిక వెనుకనే… స్వాతిబాటలో ఎన్నో పత్రికలు నడుస్తున్నాయి నడుస్తూనే వుంటాయి! స్వాతి సంపాదకునిగా.. స్వాతి బలరామ్ సభలకు రారు! ప్రీవ్యూలకు రారు. కానీ విదేశాల్లో పర్వటిస్తారు. ఎవరితో… మనదేశం ప్రధానమంత్రులు అయిన స్వర్గీయ పి.వి. నరసింహారావు, వాజ్ పేయి, దేవగౌడ, ఐ.కె. గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లాంటి వారితో ప్రభుత్వ ఆహ్వానంతో అధికారికంగా విదేశాల్లో పర్యటించి, ఆ దేశ విశేషాలను స్వాతి పాఠకులకు అందించారు. మన రాష్ట్రపతులు కె.ఆర్. నారాయణ్తో, ఎ.పి.జె అబ్దుల్ కలామ్తో విదేశాల్లో పర్యటించిన ఘనత తెలుగు పత్రికారంగంలో శ్రీ బలరామకి దక్కడం మనందరికీ ఆనందదాయకం !
అలాగే-తెలుగు పత్రికారంగంలో ఏ సంపాదకునికీ దక్కని గౌరవ పురస్కారాలు బలరామ్ అందుకోవడం విశేషం. దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయినా పబ్లిసిటీకి చాలా దూరం. రచయితలంటే ప్రాణం! తెలుగు పత్రికారంగంలో… రచయితను వాడుకునే పత్రికలు ఎక్కువ! గౌరవించే పత్రికలు చాలా తక్కువ! రచయితలకు పారితోషికం ఇచ్చేపత్రికలు మరీ మరీ తక్కువ! కానీ-స్వాతి బలరామ్ మాత్రం-రచయితల పారితోషికం విషయంలో, నూతన రచయితలను ప్రోత్సహించడంలో, పాఠకులను గౌరవించడంలో అందరికంటే ముందు వుంటారు. శ్రీశ్రీ… ఆరుద్ర నుంచి ప్రముఖ రచయితలందరూ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ‘స్వాతి’లో కనిపించని ప్రముఖ రచయితలు లేరు! ఒకరి పేరు చెబితే మరొకరి పేరు మర్చిపోయే ప్రమాదం వుంది. ఇక చిత్రకారుల విషయానికి వస్తే స్వాతి పత్రికకు పద్మశ్రీ బాపు గీసిన తొలి ముఖచిత్రమే స్వాతి లోగోగా మారింది. ఎంత బిజీగా వున్నా స్వాతి కోసం బాపు కార్టూన్లు, బొమ్మలు గీస్తూనే వుంటారు… ఇక స్వాతి ముఖచిత్రాల అందమంతా వడ్డాదిపాపయ్య గారి బొమ్మలోనే వుంది. ఇక స్వాతి కథల్లో.. శీర్షికల్లో.. అంతా కొత్తదనమే! ఈనాడు పత్రికల్లో వస్తున్న శీర్షికలన్నీ… ఆనాటి స్వాతి పత్రికలో వచ్చినవే అంటే తప్పులేదు! స్వాతి పత్రికలన్నీ దొరికితే ఒక్కొక్కటే చూస్తూ వుంటే… దేనికదే కొత్తగా వుంటుంది! అందుకు కారణం స్వాతి బలరామ్… ఒక తపస్సులాగా.. నిరంతరం… తన గదిలో కూర్చొని ‘స్వాతి’ రూపురేఖలు తీర్చిదిద్దుతూ వుంటారు. పత్రిక ప్రింటింగ్, డిస్పాచ్, సర్కులేషన్, రాబడి… అన్నీ బలరామ్ చూసుకుంటారు. అదే ఆయన అదృష్టం.