నాటకోత్సవాలతో మళ్ళీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి వ్యక్తం చేశారు. నాటకోత్సవాల సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు ఆర్ధిక సాయం అందించడం స్ఫూర్తిదాయకం అని ఆయన అభినందించారు.
శుక్రవారం(24-12-21) రవీంద్రభారతి పైడిరాజ్ మూవీ థియేటర్ లో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్, శ్రీసత్యసాయి కళా నికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ నెల 27 నుంచి రవీంద్రభారతిలో నాలుగు రోజుల పాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరగనున్న ఎ.ఆర్. కృష్ణ స్మారక నాటకోత్సవాల ఆహ్వాన పత్రాన్ని డాక్టర్ కె.వి. రమణాచారి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ పూర్వ చైర్మన్ ట్రస్ట్ కార్యదర్శి గుమ్మడి గోపాలకృష్ణ, ట్రస్ట్ ప్రతినిధులు మహ్మద్ రఫీ, ఉప్పాల సతీష్ బాబు పాల్గొన్నారు. నాటకోత్సవాలను దిగ్విజయం చేయాలనీ వారు పిలుపునిచ్చారు.
27వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతిలో డాక్టర్ కె.వి.రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక శాఖామాత్యులు వి.శ్రీనివాస్ గౌడ్, పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు ఈ నాటకోత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. నాటకరంగ ఉద్ధండులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తిని ఎ.ఆర్. కృష్ణ స్మారక పురస్కారంతో సత్కరిస్తారు. సభానంతరం డాక్టర్ రామ్మోహన్ హొళగుండి దర్శకత్వంలో రావుల పుల్లాచారిగారి “అట్ట” నాటికను ప్రదర్శిస్తారు.
28న సాయంత్రం ఆరున్నర గంటలకు దక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ కళాకారులు డాక్టర్ కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో రామప్ప నాటకం ప్రదర్శన ఉంటుంది. 29వ తేదీ సుమిత్ర యూత్ అసోసియేషన్ మధిర కళాకారులు డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు దర్శకత్వంలో కవి బ్రహ్మ తిక్కన సోమయాజి పద్య నాటకం ఉంటుంది. ఇక ముగింపు ఉత్సవాల్లో భాగంగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వం లో ఆధునిక హంగులతో శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శిస్తారు.
-కళాసాగర్