జాతి ఉమ్మడి సంపద అయిన వారసత్వ స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలను పరిరక్షించి భావితరాలకు అందించడంలో అందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర సర్వశిక్ష సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. జనవరి 28 న,మంగళవారం నాడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతిలో ‘వారసత్వ సంపద పరిరక్షణ’ పై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, ఆయన తిలకించారు. కల్చరల్ సెంటర్, సీఈవో, పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు, డా. ఈమని శివనాగిరెడ్డి, గత ఐదు సంవత్సరాలుగా, తాము 270 గ్రామాల్లో నిర్లక్ష్యానికి గురైన వారసత్వ స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలను గుర్తించామని, వాటిని పరిరక్షించడంలో స్థానికులను భాగస్వాములను చేయటానికి చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ’ అన్న అవగాహన కార్యక్రమం గురించి చినవీరభద్రుడుకు వివరించారు. ఈ సందర్భంగా వారసత్వ పరిరక్షణ, శాసనాల అధ్యయనం లాంటి అంశాలను పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని శివనాగిరెడ్డి ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుంకర (వీసా) నాగభూషణం, పురాతన సంస్థ అధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.