ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి (70) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాదు నుంచీ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి కాంచీపురం వరదరాజస్వామి దర్శనార్థం వెళ్లిన ఆమె సోమవారం రాత్రి తమిళనాడులోని అరక్కోణం స్టేషన్ నుంచి ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణమయ్యారు. రైలు రేణిగుంటకు చేరుతుండగా భోంచేస్తూ ఆమె రైల్లోనే కుప్పకూలిపోయారు. రేణిగుంటలో పరీక్షించిన రైల్వే డాక్టర్లు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఓ అంబులెన్స్ను ఏర్పాటు చేసుకుని రాత్రి పది గంటలకు రేణిగుంట నుంచి హైదరాబాదుకు కేబీ లక్ష్మి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఆమెకు ఓ కుమారుడు (ప్రవీణ్ ప్రస్తుతం అమెరికా లో వున్నారు), కుమార్తె (సమీర) ఉన్నారు. కేబీ లక్ష్మిగా చిరపరిచితమైన కొల్లూరు భాగ్యలక్ష్మి దాదాపు ఆర్దశ తాబ్దం పాటు సాహితీ వ్యవసాయం చేశారు. విపుల-చతుర పత్రికల్లో మూడు దశాబ్దాల పాటు ఆమె పనిచేశారు. చలసాని ప్రసాదరావు నిష్క్రమణ తరువాత ఆమే సంపాదకత్వం కూడా వహించారు. వేల కొద్దీ కథలను ఎడిట్ చేశారు. తాను కూడా అనేక కథలు, కవితలు రాశారు. వాటన్నింటినీ ‘మనసున మనసై’, ‘జూకామల్లి’ పేరిట రెండు సంపుటాలుగా వెలువరించారు. కవితలను ‘వీక్షణం’, ‘గమనం’ పేరిట తీసుకొచ్చారు. వీటిలో గమనం అనే సంపుటి సుప్రసిద్ధ సాహితీవేత్త సుధామ చేతిరాతతో వెలువడడం ఓ విశేషం. విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టిన ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎమ్ఏ చేశారు. ఎన్. గోపి పర్యవేక్షణలో అచ్యుతవల్లి కథల పై పీహెచ్డీ చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో వ్యాఖ్యాత్రిగా కొన్నాళ్లు పనిచేశారు. 1967 నుంచి ఆమె యువభారతి వనితా విభాగానికి అధ్యక్షురాలు. అక్కడికి వస్తూండే సాహిత్యాభిమాని కామేశ్వరరావు గారిని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకొన్న వెంటనే రమణాశ్రమం వెళ్లి చలాన్ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం విశేషం. “సాహిత్యంలోని ఏ అంశంపైనైనా, ఎవరి గురించైనా అనర్గళంగా మాట్లాడగలగడం ఆమె ప్రత్యేకత. గొప్ప స్నేహశీలి. తన ఇంటికి కూడా స్నేహ నికుంజ్ అని పేరు పెట్టుకున్నారు. ఉస్మానియాలో కలిసి చదువు కున్నాం. ఆమె కథలన్నీ దాంపత్య జీవన సౌరభాన్ని వేదజల్లే ఆణిముత్యాలు” అని సాహితీవేత్త సుధామ అన్నారు.