పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్

తిరుపతి లో పది రూపాయలకే వైద్యం  చేస్తున్న డాక్టర్ వెంకట్రామా నాయుడు
జలుబుకని చికిత్సకు వెళితే ఆస్తులు అమ్ముకునే లా వ్యవహరించే కార్పొరేట్ ఆస్పత్రులు బలపడుతున్న వేళ … కేవలం 10 రూపాయలకే వైద్యాన్ని అందించాలన్న పట్టుదలతో ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ గురించి మనం తెలుసుకుందాం…
“మనం తినే అన్నం మనల్ని వెక్కిరించకూడదు… ప్రతిరోజూ నిద్రపోయే ముందు నేను ఎవరి సొత్తు అప్పనంగా తినలేదు” అనుకున్నాకే నాకు స్థిమితంగా నిద్రపడుతుంది అంటాడు డాక్టర్ వెంకట రామా నాయుడు అలియాస్ డాక్టర్ రాము తిరుపతి సిపిఎం కార్యాలయం సమీపంలో సుందరయ్య కాలనీ వద్ద ప్రశాంతి వైద్యశాల పేరుతో గత 25 సంవత్సరాలుగా క్లినిక్ నిర్వహిస్తున్నారు ఈ డాక్టర్…
25 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో క్లినిక్ తెరిచిన రోజుల్లో ఐదు రూపాయల ఫీజు తో ప్రారంభించారు పదేళ్ల తర్వాత పది రూపాయలు గా నిర్ణయించారు ఆనాటి నుంచి గత 15 ఏళ్లుగా పది రూపాయల డాక్టర్ గా తిరుపతి లో ప్రసిద్ధి పొందారు. డాక్టర్ వెంకట రామానాయుడు గత 30 ఏళ్లుగా నాకు దగ్గరగా తెలుసు… చిన్న నాటి నుంచి మేమిద్దరం స్నేహితులం కూడా… నేనూ, డాక్టర్ రాము ఒకే ఏరియాలో అంటే తిరుపతి భవానీ నగర్ లో పెరిగాం… చదువు, కరాటే, పిల్లనగ్రోవి వాయించడం లోనూ చిన్ననాటినుంచే ప్రతిభ కనబరిచాడు… ఒక చిన్న గుడిసెలో తమ్ముళ్ళతో కలిసి నివసించేవాడు… ఈ డాక్టర్ చదువుకునే రోజుల్లో ఒకరకంగా పేదరికానికి చిరునామాగా పెరిగాడు…
ఎంతటి పేదరికం అంటే తన అవ్వ ‘ కిరోసిన్’ బుడ్డీ కి పది పైసలు లేక ‘ కిరోసిన్’ పోయించకపోతే వీధిలైట్ల దగ్గర కూర్చొని చదువుకునేంతగా…
చిన్నతనంలో తన ఇంటి ముందు డాక్టర్ చదువులు చదివే వాళ్ళు కోటు వేసుకుని వెళుతుంటే… వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు …. నేను ఎందుకు దరిద్రానికి చేరువు గా ఉన్నాను అని మదన పడని రోజులేదంటాడు…. దాన్ని కసి గా మార్చుకుని చదివిన వెంకట రామానాయుడికి ఎంబిబిఎస్ లో సీటు వచ్చింది…. కేవలం పది వేల రూపాయల కట్టలేక ఆ రోజుల్లో ఆ సీటును వదులుకున్నాడు తనకు తోడుగా ఉండమని చెప్పిన అవ్వ బలవంతంతో ల్యాబ్ లో సహాయకుడిగా చేరాడు… అక్కడ ప్రయోగాలు చేస్తున్న వైద్య విద్యార్థులకు సహాయకుడిగా ఉండటమేమిటి? అని మదన పడేవాడు … ఓ శ్రేయోభిలాషి సలహాతో బీఏఎంఎస్ (ఆయుర్వేద వైద్యులు) ఎంట్రన్స్ రాసి రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు… ఆయుర్వేద డిగ్రీ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలని భావిస్తున్న తరుణంలో.. …చదువు చెప్పిన ఓ గురువు తనతో పిజి సాధించలేని, చేతగాని వాళ్ళు సాకులు చెబుతూ ఉద్యోగం, సద్యోగమని డ్రామాలాడుతారని రెచ్చగొట్టటంతో తనెంటో చూపించాలని రేయింబవళ్ళు నిలికిడి లేకుండా చదివి …. పీజీలో సీటు సాధించి పీజీ పూర్తి చేశాడు… కేవలం 250 రూపాయల స్టైఫండ్ పై ఆధారపడి… ఇంటి నుంచి ఏమీ ఆశించకుండా తెలిసిన వాళ్ళ సహకారంతో చదువు పూర్తి చేసిన ఘనుడు వెంకటరామయ్య….
ఈయన చదువు చూసి వెంకటగిరి రాజా గారి పిఏ తన కూతుర్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు నిజాయితీగా ఈ డాక్టర్ నా దగ్గర వేసుకున్న ప్యాంటు, చొక్కా తప్ప మరేమీ లేవు అన్నీ ఆలోచించుకుని మీ అమ్మాయిని ఇవ్వండి… అని నిజాయితీగా చెప్పుకున్నాడు … ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? డాక్టర్ కు మా పార్టీతో సంబంధం లేకపోయినా…. ఒక మంచి స్నేహితుడుగా ముప్పై ఏళ్లు పైబడిన అనుబంధం మాది… పది రూపాయల ఫీజు ఏమిట్రా!? పడిన బాధలు చాలవా!? ఎప్పుడు తెలుసుకుంటార్రా?! అని బంధువులు, కొందరు స్నేహితులు, పలువురు తనను మానసికంగా వేధించినా, ఇబ్బంది పెట్టినా తాను అనుకున్న పద్ధతిని మార్చుకోనని కరాఖండిగా చెప్పేశారు… తన జీవితంలో తన భార్య కీలకమైన పాత్ర పోషించిందని… పిల్లల చదువులు, ఆర్థికంగా నిలబెట్టడంలో, ఆస్పత్రిలో తనకు సహకరించడం ద్వారా తన కుటుంబ ఎదుగుదలకు మూల స్తంభం గా నిలిచింది అని అంటారు నిజాయితీగా ఈ డాక్టర్… చెప్పటం మరిచాను… ఇప్పుడు వెంకట్రామా నాయుడు కుమార్తె డాక్టర్ కోర్స్ చదువుతుంది, కుమారుడు ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోకి అడిగిడ బోతున్నాడు అనుకున్న లక్ష్యానికి ఎన్ని ఆటంకాలొచ్చినా ఎదురొడ్డి నిలబడి ‘ పది రూపాయల డాక్టర్’ గా ప్రసిద్ధికెక్కిన వెంకట్రామా నాయుడు అలియాస్ డాక్టర్ రాముకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను…
-కందారపు మురళి,
జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటి యు తిరుపతి

1 thought on “పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap