ఆమె నటన భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ తగినది. ఆమె నటించిన బైజు బావరా, పరిణీత, సాహిబ్ బీబీ అవుర్ గులామ్, పాకీజా సినిమాలు బాలీవుడ్ చిత్రాలు వున్నంతకాలం చరిత్రలో నిలిచిపోయేవే. తనకు నచ్చిన, తాను మెచ్చిన, చాలా కష్టం అనిపించిన పాత్ర ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’ లోని ‘చోటీ బహు’ అని ఆమే స్వయంగా చెప్పుకుంది. ఆ మహానటే వెండితెర విషాద రాణి… మరో తెలుగు సావిత్రి … మీనాకుమారి. భర్తను ప్రేమించి, అతనికోసం చివరకు మద్యం తీసుకునేందుకైనా వెనుకాడని భార్యగా ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’ లో, అచ్చమైన బెంగాలీ యువతిలా కనపడే ‘పరిణీత’ లోని లలిత పాత్రలో ఆమె చూపిన భావోద్వేగాలు నటనకు పరాకాష్ట అని చెప్పవచ్చు. తన ముఖలాలిత్యంతో, నటనా కౌశలంతో ఇలాంటి ఎన్నో పాత్రలకు జీవంపోసి, మరెందరో నిర్మాతలకు విజయాలను అందించి, అజరామరమైన కీర్తి ప్రతిష్టలను మాత్రం తనకు మిగుల్చుకొని 38 ఏళ్ళకే నూరేళ్ళు నింపుకొని ఇహలోకాన్ని విడిచివెళ్ళింది ఈ మహానటి మీనాకుమారి. ముంబై, సెయింట్ ఎలిజెబత్ ఆసుపత్రిలో తన ప్రాణాలను విడిచి పెడుతూ “నాకింకా బ్రతకాలని ఉంది’ అంటూ ఆక్రోశించింది. తన సమాధిమీద “విరిగిన వాయులీనంలో, తెగిన పాటతో, పగిలిన గుండెతో సెలవుతీసుకుంటున్నా” అని ముందుగానే రాయించుకుంది. ఈ బహుముఖ ప్రాజ్ఞి ప్రాణాలు విడిచి సరిగ్గా (31-03-2022) 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ విషాద రాణిని గురించి మీకోసం కొన్ని ఆసక్తికర విషయాలు….
బేబీ మీనా గా మెహజబీన్
మీనాకుమారి టాగూర్ వంశానికి చెందిన వనిత. ఆమె అమ్మమ్మ హేమసుందరిదేవి రవీంద్రనాథ్ టాగూర్ సోదరుడు సుకుమార్ టాగూర్ కుమార్తె. జాదూ నందన్ టాగూర్ ను వివాహమాడడంతో ఆమె హేమసుందరి ఠాగూర్ గా మారింది. తన భర్త మరణించడంతో ఆమె అత్తగారు ఆస్తులు ఇవ్వకపోగా, టాగూర్ ఇంటిపేరును కూడా వదలుకోవాలని శాసించడంతో ఆమె కలకత్తా వీడి మీరట్ కు వెళ్లి ఒక నర్సు ఉద్యోగంలో చేరింది. అక్కడే పరిచయమైన ప్యారేలాల్ శంకర్ అనే క్రైస్తవుణ్ణి వివాహం చేసుకుంది. అతడు ఒక ఉర్దూ పత్రికకు పాత్రికేయునిగా ఉండేవాడు. హేమసుందరికి ఇద్దరు కూతుళ్ళు. వారిలో ప్రభావతిదేవి మీనాకుమారికి తల్లి. ప్యారేలాల్ మరణించాక తల్లి బొంబాయి చేరుకొని నాటకాల్లో నటిగా, డ్యాన్సర్ గా పనిచేస్తున్నప్పుడు ఆమెకు పాకిస్తాన్ లోని పంజాబ్ పావిన్స్ కు చెందిన మాస్టర్ ఆలి బక్ష్ అనే సున్నీ ముస్లిం వ్యక్తితో పరిచయమై పెళ్ళికి దారితీసింది. పఠాన్ ను పెళ్లాడడంతో ప్రభావతి పేరు ఇఖ్బాల్ బేగంగా మారిపోయింది. అతడికి అప్పటికే పెళ్ళయి పిల్లలున్నారు. అతడు హార్మోనియం బాగా వాయించేవాడు. కొన్ని సినిమాల్లో చిన్నచితకా పాత్రలు కూడా వేశాడు. ఆగస్టు 01, 1933 న పుట్టిన మీనాకుమారి వీరికి రెండవ సంతానం. మీనాకుమారి అసలు పేరు మెహజబీన్ బానో. ఆమెకు “నాజ్”, “మున్నా” అనే ముద్దు పేర్లున్నాయి. ఆర్ధిక సమస్యల వలన మీనాకుమారి పెద్దగా చదువుకోలేకపోయింది. ఆమెకు ఆకలే జీవితపాఠాలను నేర్పింది. కుటుంబ పోషణ కోసం అక్క ఖుర్షిద్ తో కలిసి సినిమా స్టూడియోల వెంట పరుగులు తీసింది. ఈస్ట్ దాదర్ రైల్వే స్టేషను వద్ద దాదా సాహెబ్ ఫాల్కే రోడ్డులో రూప్ తారా స్టూడియోకి కాసంత దూరంలో ఒక చిన్న గదిలో వీరి నివాసం వుండేది. మీనా స్థానంలో కొడుకు పుడతాడని ఆశించిన తల్లిదండ్రులు ఆమె పట్ల వివక్షత చూపేవారు. ఖుర్షీద్ తోబాటు ఆమె తండ్రి మీనాను సినిమాలలో చేర్చి ఆర్ధిక సమస్యలను తీర్చుకోవాలని ఆమెను ఆరవ ఏటనే విజయభట్ వద్దకు తీసుకెళ్ళాడు. అప్పుడే ప్రకాష్ పిక్చర్స్ వారు విజయభట్ దర్శకత్వంలో “ఫర్జాందే వతన్” (లెదర్ ఫేస్-1939) అనే స్టంట్ సినిమా నిర్మించబోతున్నారు. మీనాకుమారిని అందులో పైడి జైరాజ్ కూతురుగా నటింప జేశారు. కెమెరా ముందు బెరుకు లేకుండా నటిస్తున్న మెహజబీన్ ను చూసి యెంతో మెచ్చుకుంటూ విజయభట్ ఆమె పేరును ‘బేబీ మీనా’ గా మార్చారు. సినిమాలలో బిజీ అవడంతో మీనాకుమారికి స్కూల్ కు వెళ్ళే అవకాశం కూడా దొరకలేదు. ఇంటివద్దే ఉర్దూ, హిందీ భాషలు నేర్చుకుంది. స్టూడియోలోనే విరామం దొరికినప్పుడు ఒక మూలకెళ్ళి కూర్చొని చదువుకుంటూ వుండేది. ఆమెకు ఉర్దూలో కవిత్వం రాసే ప్రజ్ఞ వుంది. కథలు, గజళ్ళు కూడా రాసింది. తరవాతి కాలంలో వాటిని పుస్తకాలుగా అచ్చువేయించింది. ఖయ్యూం సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన గజళ్ళు ఒక లాంగ్ ప్లే రికార్డుగా వెలువడ్డాయి. విజయభట్ సినిమా తరవాత ‘అధూరి కహాని’, ‘పూజా’, ‘ఏక్ హి భూల్’, ‘నయీ రోషిణీ’, ‘కస్తూరి’, ‘విజయ్’, ‘గరీబ్’, ‘ప్రతిజ్ఞ’, ‘లాల్ హవేలీ’ వంటి వివిధ చిత్రాల్లో 1944 వరకు బాలనటిగా నటించింది. బాలనటిగా ఆమె నటించిన చివరి చిత్రం ‘బచ్ పన్ కా ఖేల్’ (1946). అప్పుడు మీనాకుమారికి 13 ఏళ్ళు. బాల నటి నుంచి తారాగా ఎదుగుతున్న మధ్యకాలంలో మీనాకుమారి హోమీవాడియా నిర్మించిన ‘లక్ష్మీనారాయణ్’, ‘వీర్ ఘతోత్కచ్’, ‘హనుమాన్ పాతాళ్ విజయ్’, ‘గణేష్ మహిమ’, ‘అల్లావుదీన్ అవుర్ జాదూ చిరాగ్’ వంటి పౌరాణిక, జానపద సినిమాల్లో నటించింది.
బాలనటి నుంచి హీరోయిన్ గా ఎదిగి
సాధారణంగా బాల నటులుగా రాణించినవారు పెద్దయ్యాక ప్రముఖ నటులుగా ఎదిగిన దాఖలాలు తక్కువే, రేఖా, శ్రీదేవి వంటి వారిని మినహాయిస్తే.. కరిగిపోయే బాల్యంతో వారు కనుమరుగవుతూ వుంటారు. కానీ మీనాకుమారి విషయంలో ఈ సూత్రం తప్పని తేలింది. మీనాతోబాటు మంచి హీరోయిన్ గా ఎదిగిన మరో బాల నటి ‘బేబీ ముంతాజ్’ గా పిలువబడిన ‘మధుబాల’. 14 ఏళ్ళకే తారగా ఎదుగుతున్న తొలిరోజులలోనే మీనాకుమారి తల్లి ఊపిరి తిత్తుల సమస్యతో మరణించింది. మీనాకుమారి పేరుతో నటించిన ఫణి మజుందార్ దర్శకత్వంలో బాంబే టాకీస్ వారు నిర్మించిన ‘తమాషా’ సినిమా పెద్ద హిట్టయింది. అందులో దేవానంద్ హీరో. ఈ చిత్రానికి ఖేమ్ చంద్ ప్రకాష్, మన్నాడే, ఎస్.కె. పాల్ సంయుక్తంగా సంగీత దర్శకత్వం నిర్వహించడం విశేషం. 1952లో విజయ భట్ నిర్మించిన ‘బైజు బావరా’ లో భరత్ భూషణ్ సరసన మీనాకుమారి నటించింది. నౌషాద్ సంగీతంతో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మీనాకుమారి హీరోయిన్ గా సుస్థిర స్థానం చేరుకోగలిగింది. అంతే కాకుండా ఫిలింఫేర్ వారి చేత ఉత్తమ నటి బహుమతి కూడా అందుకుంది. తరవాతి సంవత్సరం నటించిన బిమల్ రాయ్ చిత్రం ‘పరిణీత’లో ‘లలిత’ పాత్రలో నటనకు మరొకసారి ఫిలింఫేర్ వారి ఉత్తమ నటి బహుమతి అందుకుంది. మరో బిమల్ రాయ్ చిత్రం ‘దో భిగా జమీన్’ లో మీనాకుమారి అతిథి పాత్రలో కనిపించింది. 1955లో దిలీప్ కుమార్ సరసన నటించిన ‘ఆజాద్’ (తెలుగులో అగ్గిరాముడు) సినిమాలో ఆమె పేరు ఉత్తమనటి కోసం నామినేట్ అయినా బహుమతి రాలేదు. తరవాత జి.పి. సిప్పీ నిర్మించిన ‘ఆదిల్-ఎ-జహంగీర్’ (1955) సినిమాలో ప్రదీప్ కుమార్ సరసన, కె. అమరనాథ్ నిర్మించిన ‘నయా అందాజ్’, తల్వార్ నిర్మించిన ‘మేమ్ సాబ్’ (1956) సినిమాలలో కిషోర్ కుమార్ సరసన, బి.ఆర్. చోప్రా చిత్రం ‘ఏక్-హి-రాస్తా’(తెలుగులో కుంకుమరేఖ చిత్రం)లో అశోక్ కుమార్ సరసన, హేమచందర్ చిత్రం ‘బంధన్’ లో ప్రదీప్ కుమార్ సరసన మీనాకుమారి నటించింది. ఈ సినిమాలన్నీ విజయ డంకా మ్రోగించాయి. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘శారద’(1957-తెలుగులో ఇలవేల్పు) సినిమాలో రాజకపూర్ సరసన మీనాకుమారి నటించింది. అదే సంవత్సరం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలోనే ‘మిస్ మేరి’ (మిస్సమ్మ) లో నటిస్తే అది సూపర్ డూపర్ హిట్టయింది. తరవాత ‘యాహుది’ (బిమల్ రాయ్-దిలీప్ కుమార్), ‘సహారా’ (లేఖ్ రాజ్ భాక్రి- ఎం.రాజన్), ‘ఫరిస్తా’ (రవీంద్ర దవే- అశోక్ కుమార్), షరారత్ (హెచ్.ఎస్. రావల్- కిషోర్ కుమార్), దేవేంద్ర గోయల్ సినిమా ‘చిరాగ్ కహాఁ రోష్ నీ కహాఁ’ (రాజేంద్రకుమార్- తెలుగులో మాబాబు), కె.ఎ. అబ్బాస్ చిత్రం ‘చార్ దిల్ చార్ రహే’ (షమ్మికపూర్), దులాల్ గుహా ‘దుష్మన్’ (తెలుగులో ఖైదీ బాబాయి), మొదలైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 1960లో కిషోర్ సాహు దర్శకత్వంలో కమల్ అమ్రోహి నిర్మించిన ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ’ సినిమా మీనాకుమారి జీవితంలో పెద్ద మలుపును తెచ్చింది.
మీనా జీవితంలోకి కమల్ అమ్రోహి
సినిమాలో జరిగినట్లే మీనాకుమారి నిజజీవితం కూడా ఒక అసాధారణ మలుపు తిరిగింది. అదే కమల్ అమ్రోహి అనే రచయిత, దర్శకుడు ఆమె జీవితంలోకి ప్రవేశించడం. కమల్ అమ్రోహి తొలిసారి దర్శకత్వం వహించిన బాంబే టాకీస్ వారి ‘మహల్’ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. నటి మధుబాల కు సూపర్ స్టార్డం తెచ్చిపెట్టింది. అందులో హీరోనే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన అశోక్ కుమార్ కమల్ ను మీనాకుమారికి పరిచయం చేశారు. ఎందుకో మీనాకుమారిని తొలిచూపులోనే కమల్ అమ్రోహి ఆకర్షించాడు. అతణ్ణి లాహోర్ నుంచి బొంబాయి తీసుకొనివచ్చి సోహ్రాబ్ మోడీ కి పరిచయం చేసినవారు కుందన్ లాల్ సైగల్. కమల్ అమ్రోహి మినర్వా మూవిటోన్ సంస్థలో చేరి జైలర్, భరోసా, పాగల్ చిత్రాలకు కథారచయితగా, చలియా, పుకార్, మై హరి, మజాఖ్ వంటి సినిమాలకు సంభాషణల రచయితగా పనిచేశాడు. కమల్ అమ్రోహి బాంబే స్టూడియో కి తొలిసారి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘మహల్’ సూపర్ డూపర్ హిట్ కావడంతో అతనికి ఎక్కడలేని పేరుప్రఖ్యాతులు వచ్చిపడ్డాయి. అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్ళయ్యాయి. ఆయన మొదటి భార్య బిల్కీస్ బానో నర్గీస్ తల్లికి సహాయకురాలిగా వుండేది. రెండవ భార్య మెహమూదీ. ఆమెకు ముగ్గురు పిల్లలు. కమల్ అమ్రోహి తన జీవితకాలంలో దర్శకత్వం వహించింది నాలుగే నాలుగు సినిమాలు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అవి ‘మహల్’, ‘దాయిరా’, ‘పాకీజా’, ‘రజియా సుల్తానా’. ‘మజ్నూ’ అనే సినిమాకు కూడా దర్శకత్వం చేపట్టినా అది అసంపూర్ణంగా మిగిలింది. ‘దాయిరా’, ‘పాకీజా’ చిత్రాలతోబాటు ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ’ సినిమాకు కమల్ అమ్రోహి నిర్మాత కూడా.
మలుపు తిరిగిన జీవితం
మీనాకుమారి జీవితం మలుపు తిరగడానికి ఈ సినిమానే కారణం. అయితే దానికి ముందు కొంత డ్రామా నడిచింది. మీనాకుమారి నటించిన ఫణి మజుందార్ చిత్రం ‘తమాషా’ (1952) రషెస్ చూశాక కమల్ మీనాకుమారి మీద ఒక కన్నేసి ఉంచాడు. మఖన్ లాల్ అనే నిర్మాత కమల్ అమ్రోహి దర్శకత్వంలో ‘అనార్కలి’ సినిమా తీయాలని సంకల్పించి, ‘మహల్’ చిత్రంలో నటించిన మధుబాలను హీరోయిన్ గా బుక్ చేశాడు. అయితే ఆమె దిలీప్ కుమార్ ను హీరోగా బుక్ చేయాలని షరతు పెట్టడంతో ఆమెకు ఉద్వాసన పలికి మీనాకుమారికి అవకాశమిచ్చాడు కమల్ అమ్రోహి. 1951 మార్చి లో మీనాకుమారి అగ్రిమెంటు మీద సంతకాలు చేసింది. ఈ మధ్యలో మీనాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి చిక్కి శల్యం కావడంతో, గాలి మార్పుకు ఆమె మహాబలేశ్వర్ వెళ్ళింది. తిరిగి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నాలుగు నెలలు పుణే ఆసుపత్రిలో చేరింది. ఎడమచేతికి బాగా దెబ్బతగిలి ఉంగరపు వేలు, చిటికెన వేలు వంకర్లు పోయాయి. దానితో మీనా నైరాశ్యంతో కుంగిపోయింది. ఈ వార్త తెలిసి కమల్ అమ్రోహి ఢిల్లీ నుంచి పూనా ఆసుపత్రికి వచ్చి మీనా ను పరామర్శించాడు. అతని రాకతో మీనాకుమారి కి స్వాంతన లభించింది. ఇద్దరూ వారం వారం ప్రేమలేఖలు పంచుకునేవారు. మీనాకు అతని వ్యక్తిత్వం నచ్చింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారులూ ఫోనులో మాట్లాడుకుంటూనే వుండేవారు. అనార్కలి సినిమా రెండు షెడ్యూళ్ళు జరిగాక నిర్మాత మఖాన్ లాల్ చేతులెత్తేయడంతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. అయితే మీనాకుమారి, కమల్ అమ్రోహిల సాంగత్యం మాత్రం బలపడుతూనే వుంది. 1952 ఫిబ్రవరి 14 న మీనాకుమారి ఆసుపత్రికని తన చెల్లెల్ని తోడు తీసుకొని వెళ్లి కమల్ స్నేహితుడు బాకర్ ఆలీ సమక్షంలో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తండ్రికి విషయం తెలిసి విడాకులు ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చాడు. కమల్ తీస్తున్న ‘దాయిరా’ సినిమా షూటింగుల్లో పాల్గొనరాదని శాశించాడు. కానీ మీనాకుమారి తండ్రి మాటలు లెక్కచేయకుండా 1953 ఆగస్టు 14 న కమల్ ఇంటికి చేరి సంసారజీవితం సాగించింది. అమ్రోహి అసలు భార్య ఈ విషయాన్ని సహించలేక పిల్లలతో బయటకు వెళ్లిపోయింది. మూడేళ్ళు వారి కాపురం బాగానే గడిచింది.
కమల్ అమ్రోహితో బీటలు వారిన మీనా జీవితం
కమల్ అమ్రోహితో జీవితం పంచుకున్నాక కూడా 1964 వరకూ మీనాకుమారి తీరిక లేకుండా నటిస్తూనేవుంది. బంగారు బాతు ఇంట్లో వుంటే కమల్ కు మరేం కావాలి? పెట్టుబడి మీనాకుమారిది, నిర్మాత పేరు మాత్రం కమల్ అమ్రోహిది. అదే కిషోర్ సాహు దర్శకత్వం వహించిన ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ’ సినిమా. మీనా కుమారి అద్భుతంగా నటించిన సినిమా ఇదేనని చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. తరవాత మరో సూపర్ హిట్ చిత్రం ‘కోహినూర్’ విడుదలై డంకా బజాయించింది. 1962 లో వచ్చిన గురుదత్ సినిమా ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’ లో నటనకు మీనాకుమారికి ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు కూడా ఎంపిక చేశారు. ‘మై చుప్ రహూంగీ’ (తెలుగులో మూగనోము) సినిమాలో నటనకు మీనాకు ఫిలింఫేర్ నామినేషన్ దక్కింది. కానీ బహుమతి రాలేదు. ‘ఆరతి’ సినిమాలో నటనకు BFJA వారి బహుమతి లభించింది. అలాగే శ్రీధర్ నిర్మించిన ‘దిల్ ఏక్ మందిర్’ (తెలుగులో మనసే మందిరం) సినిమాలో నటనకు కూడా BFJA వారు ఉత్తమ నటి బహుమతి అందజేశారు. మీనాకుమారి నటించిన తొలి కలర్ సినిమా ఎ.కె. నాదియాడ్ వాలా నిర్మించిన ‘చిత్రలేఖ’. తరవాత భీగీ రాత్, కాజల్ (ఫిలింఫేర్ బహుమతి లభించిన చిత్రం) ఫూల్ అవుర్ పత్తర్, నూర్జహాన్, బహు బేగం, బహారోం కి మంజిల్, అభిలాషా వంటి సినిమాలలో మీనాకుమారి అద్భుత నటన ప్రదర్శించింది. అయితే కమల్ అమ్రోహి నిర్మించిన ‘దాయిరా’ మాత్రం రెండు రోజులే ఆడి, నష్టాలు మూటకట్టించి అటకెక్కింది. దాంతో కమల్ అమ్రోహి మీనాకుమారి సినిమాలకు డేట్లు చూసే మేనేజర్ అయిపోయాడు. చివరికి కమల్ అమ్రోహి ని సినిమా వేడుకల్లో మీనాకుమారి భర్తగా పరిచయం చేయడం మొదలవడంతో అతడు న్యూనతకు లోనై, మీనా మీద ద్వేషం పెంచుకున్నాడు. బిమల్ రాయ్ నిర్మించిన దేవదాసు సినిమాలో కమల్ నిర్వాకంతో మీనా ‘పార్వతి’ పాత్రను వదలుకోవలసి వచ్చింది. సాహిబ్ బీబీ అవుర్ గులాం సినిమాకు కూడా అడ్డుపడితే, గురుదత్ నేరుగా మీనాకుమారితో మాట్లాడి కాల్షీట్లు తీసుకున్నాడు. కమల్ అమ్రోహి మీనాకుమారికి షరతులు విధించాడు. గృహిణిగా ఉండిపోవాలని, సినిమా షూటింగులు ఆరు గంటలకే ముగించుకొని ఇల్లు చేరాలని, మేకప్ రూమ్ లోనికి ఎవరినీ రానీయరాదని, కారులో మరొకరెవ్వరూ ఎక్కరాదని, ఇతరుల కారులో ఆమె ఎక్కరాదనేవి ఈ షరతులు. అంతే కాదు కమల్ అమ్రోహి తన మిత్రుడు బాకర్ ఆలీ తో మీనాకుమారి కదలికలమీద నిఘా ఏర్పాటు చేశాడు. దర్శక నిర్మాత, ప్రముఖ కవి గుల్జార్ ఆమె మేకప్ రూమ్ లోకి అడుగు పెట్టాడని బాకర్ ఆలీ అడ్డుపడి, మీనా మీద చెయ్యి చేసుకున్నాడు. దాంతో బాధపడిన మీనా పోలీసు ఎస్కార్టు సాయంతో తన చెల్లెలు మధు (హాస్యనటుడు మెహమూద్ భార్య) ఇంటికి వెళ్ళిపోయింది. అలా 1964 మార్చి 5న వీరిద్దరి దాంపత్యం విచ్చిన్నమై పోయింది. కమల్ అమ్రోహి 1956లో మొదలుపెట్టిన అతని కలల ప్రాజెక్టు ‘పాకీజా’ మూలపడిపోయింది. మీనాకుమారి కూడా ఆ సినిమాను పూర్తి చేయదలచుకోలేదు.
మత్తుమందుకు బానిసై…పాకీజా లో నటిస్తూ
చెదరిన హృదయంతో మీనాకుమారి బొంబాయి కార్టర్ రోడ్డులో ఒక అపార్టుమెంటును కొనుగోలు చేసి మరణించేదాకా ఆమె శేషజీవితాన్ని అక్కడే గడిపింది. నిద్రలేమితో బ్రాందీ త్రాగడం అలవాటు చేసుకుంది. అయితే ఈ మందు తీసుకునే అలవాటు ఆమెకు కమల్ తో కాపురం పెట్టినప్పటినుంచే వుంది. ఆ అలవాటు ఒంటరిగా ఉండడంతో మరీ ఎక్కువైంది. ఆ అలవాటే ఆమె జీవితాన్ని క్రమక్రమగా కబళించసాగింది. పగలూ, రాత్రి అనే భేదం లేకుండా రోజుకు రెండు మూడు బాటిళ్ళ మద్యం పుచ్చుకోవడం మొదలెట్టింది. దాంతో మూడు సంవత్సరాల కాలంలోనే ఆమెకు లివర్ సిర్రోసిస్ వ్యాధి తీవ్రత ఎక్కువైంది. పదే పదే ఆసుపత్రి పాలవడంతో లండన్ వెళ్లి మూడు నెలలపాటు చికిత్స తీసుకుంది. స్విట్జర్లాండ్ కు వెళ్లి కొంతకాలం విశ్రాంతి తీసుకుంది. డాక్టర్లు ఆమెను మద్యం ముట్టుకోకూడదని గట్టిగా హెచ్చరించి పంపారు. ఇదిలా వుండగా 1968లో కమల్ అమ్రోహి ఆమెకు ఒక వుత్తరం రాస్తూ ‘పాకీజా’ సినిమాను పూర్తి చేయాల్సి వుంది కనుక సహకరించమని ప్రాధేయపడ్డాడు. చివరికి ఆమె కోరుకున్నట్లు విడాకులు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. నర్గీస్, సునీల్ దత్, ఖయ్యాం, అతని భార్య జగజిత్ కౌర్ కూడా అంత చక్కటి సినిమాను వదలుకోవద్దని, పూర్తి చెయ్యమని సలహా ఇచ్చారు. అలా ఆగిపోయిన ‘పాకీజా’ సినిమా ఐదు సంవత్సరాల తరవాత తిరిగి ప్రారంభమైంది. ఆరోగ్యరీత్యా ఆ పాత్రకు న్యాయం చేయలేనేమోనన్న సదేహం మీనాకు కలగడంతో, కమల్ అమ్రోహి క్లోజప్ సన్నివేశాలను మాత్రం మీనా తో నటింపజేసి లాంగ్ షాట్లను, కొన్ని నృత్య సన్నివేశాలను పద్మాఖన్నా తో పూర్తిచేయించారు. ‘మొఘల్-ఎ-ఆజం’ సినిమా నిర్మాణానికి 12 సంవత్సరాలు పట్టితే, “పాకీజా” చిత్ర నిర్మాణం పూర్తవడానికి ఏకంగా 14 సంవత్సరాలు పట్టింది. వయసు పైబడుతున్న కారణంగా మీనాకుమారి “ఆజ్ హమ్ అపనే దువావోం కా అసర్ దేఖేగే” వంటి పాటలలోని కొన్ని నాట్యభంగిమలు చేయలేకపోవడంతో కమల్ అమ్రోహి లాంగ్ షాట్లలో పద్మాఖన్నా చేత ఆ డ్యాన్స్ చేయిస్తూ, క్లోజప్ షాట్లలో మీనాకుమారిని చూపించారు. ప్రేక్షకులు కనుక్కోకుండా ఉండేందుకు ఒంటిమీద మేలిముసుగుతో వాటిని చిత్రీకరించారు. ఒక ఆర్టిస్టుకి, దర్శకుడికి ఉండే మాటలు తప్ప షూటింగు జరుగుతున్న సమయంలో మీనాకుమారి కమల్ తో మాట్లాడేది కాదు. సంగీత దర్శకుడు గులాం ఆలీ మరణించడంతో నేపథ్య సంగీతాన్ని, అక్కడక్కడా పాటల బిట్లను నౌషాద్ పూర్తిచేశారు. తొలుత బ్లాక్ అండ్ వైట్ లో మొదలెట్టిన ‘పాకీజా’ రీళ్ళను ప్రక్కనబెట్టి, మరలా కలర్ లో నిర్మించారు. కమల్ నుంచి మీనా పారితోషికాన్ని కూడా ఆశించలేదు. ప్రీవ్యూ షో కి కూడా మీనాకుమారి హాజరు కాలేదు. చివరకు 1972లో సినిమా పూర్తై ఫిబ్రవరి 4 న బొంబాయి మరాఠా మందిర్ లో విడుదలైంది. సినిమా సూపర్ హిట్టయింది. రమారమి ఒక నెల తరవాత… అంటే మార్చి 31, 1972 న మీనాకుమారి తనువు చాలించడంతో ప్రజలు తండోపతండాలుగా మీనాకుమారిని చూడడానికి ఎగబడ్డారు. మొఘల్-ఎ-ఆజం తరవాత అంతటి మంచిపేరు ‘పాకీజా’ సినిమాకు దక్కింది. ముప్పై ఏళ్ళలో మీనాకుమారి నటించింది 93 సినిమాలు మాత్రమే. ఆమె నటించిన చివరి సినిమా ‘గోమతీ కే కినారే’. అందులో ‘గంగ’ పాత్రలో రాణించిన మీనాకుమారి స్మృతికి ఆ చిత్రాన్ని అంకితం చేశారు. అలా ఒక ధృవతార నేల రాలింది. ఆమె జీవితం అయిపొయింది. కానీ, ఆమె కథ మాత్రం అయిపోలేదు. రాయాలంటే ఇంకా యెంతో వుంది. అది ఎప్పటికీ మిగిలే వుంటుంది.
మరిన్ని విశేషాలు
భారత ప్రభుత్వం 2011 ఫిబ్రవరి 13 న ఆరుగుగు ప్రసిద్ధ నటీమణుల పోస్టల్ స్టాంపులు, ఫస్ట్ డే కవర్లు విడుదల చేసింది. వాటిలో మీనాకుమారి తోబాటు దేవికారాణి, కానన్ దేవి, నూతన్, లీలా నాయుడు, సావిత్రి స్టాంపులూ వున్నాయి. మీనాకుమారిని హిందీ చలనచిత్ర రంగంలో “సినీ శోక దేవత” (ట్రాజెడీ క్వీన్) అని “మహిళా గురుదత్” అని “భారతీయ సినీ సిండ్రెల్లా” అని కీర్తించేవారు.
తను హీరోయిన్ గా నటించిన ‘మేరే అప్నే’ దర్శకుడు గుల్జార్ అంటే మీనాకుమారికి ప్రత్యేక అభిమానం. మీనాకుమారి పెద్దగా చదువుకోలేదు. కానీ ఆమెకు ఉర్దూ, హిందీ భాషల్లో మంచి పట్టు వుండేది. ఉర్దూ భాషలో కవితలు కూడా రాసేది. ఆ కవిత్వంతోనే మీనాకుమారి దర్శక నిర్మాత, కవి గుల్జార్ కు దగ్గరయ్యింది. కవిత్వంలోని సున్నితమైన అంశాలను విడమరచి చెప్పి ఆమెకు జీవితం మీద ఆశ పెంచిన వ్యక్తి గుల్జార్. ఆమె అపురూపంగా రాసుకొని, భద్రపరచుకున్న డైరీలను గుల్జార్ కు అందజేసింది. తన జీవన ప్రస్థానంలోని చివరి రోజుల్లో సేదతీర్చుకోవడానికి ఆసరా కల్పించిన నటుడు ధర్మేంద్రకు సినీ రంగంలో సుస్థిర స్థానం కల్పించింది. తన తోడబుట్టిన సోదరిలకు ఆస్తులు పంచింది. నటి మధుబాల మీనాకుమారి అభిమాని.
1968లో ‘అభిలాష’ సినిమా నిర్మించిన రమణికలాల్. జె. దవే పారితోషికం క్రింద మీనాకుమారికి ఒక పెద్ద బంగాళా కట్టించి ఇచ్చాడు. అయితే ఆమె చివరి రోజుల్లో ఆ బంగళాను నటి ముంతాజ్ కు చాలా పెద్ద మొత్తానికి అమ్మేసింది, ఆ వచ్చిన డబ్బును తనకోసం వాడుకున్నదా అంటే అదీ లేదు. “గోమతి కే కినారే” లో దర్శకుడిగా పరిచయమైన నిర్మాత సావన్ కుమార్ తక్ చేతిలో పెట్టింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మీనాకుమారి కాలం చేయడంతో సినిమాను ఆమె మరణానంతరం 1972లో విడుదల చేస్తూ మీనాకుమారికి అంకితం చేశారు. అది కాస్తా ఫ్లాప్ అయింది.
1961 ఫిలింఫేర్ బహుమతులకోసం ఉత్తమ నటి విభాగంలో వచ్చిన నామినేషన్లన్నీ మీనాకుమారి నటించిన చిత్రాలనుండే రావడం విశేషం. అవి వరసగా ‘సాహెబ్ బీబీ అవుర్ గులాం’, ‘ఆర్తి’, ‘మై చుప్ రహూంగీ’ చిత్రాలు. అయితే సాహిబ్ బీబీ అవుర్ గులామ్ చిత్రంలో నటనకు మాత్రమే మీనాకుమారికే ఆ బహుమతి దక్కింది.
మీనాకుమారికి తెలుపు వర్ణమంటే చాలా ఇష్టం. తన ఇంటిని ధవళ వర్ణంతోనే అలంకరించేది. ఎక్కువగా తెల్లరంగు చీరలు, దుస్తులు ధరించి వేడుకలకు హాజరదియ్యేది.
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)
ఆచారం షణ్ముఖాచారి GARU.. నమస్తే …ఎన్నో తెలియని విషయాలు తెలియజేసారు. ఇలాగె తెలుగు తారల మీద కూడా మీ నుండి మంచి మంచి వ్యాసాలు అశిస్తున్నాము.