సోషల్ మీడియా రాజ్యమేలుతున్న నేటి సైబర్ ప్రపంచంలో మిణుకుమిణుకుమంటున్న రంగస్తలాన్ని చేతులడ్డుపెట్టి వెలిగిస్తుంది ‘సుమధుర కళానికేతన్ ‘. హాస్యాన్ని ప్రదాన భూమికగా తీసుకొని 24 ఏళ్ళుగా హాస్య నాటిక పోటీలు నిర్వహిస్తూ విజయవాడ నగరంలోనే కాకుండా రెండు తెలుగు రాష్రాల్లోనూ నటీ-నటుల, నాటకాభిమానుల మన్ననలు పొందుతున్న సంస్థ ‘సుమధుర ‘.
జూలై 26 నుండి 28 వరకు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సుమధుర నాటకోత్సవాలు కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ విజయవతంగా ప్రదర్శింపబడ్డాయి.
‘సుమధుర కళానికేతన్ ‘ ప్రస్థానం ….
విజయవాడ నగరంలో గత నాలుగున్నర దశాబ్దాలకు పైగా కళాసేవ చేస్తున్న సంస్థ “సుమధుర కళానికేతన్’. లలిత కళలన్నిటిని సమంగా నిర్వహిస్తూ కళారంగంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సంస్థ ‘సుమధుర కళానికేతన్’.
కేవలం నాటకాలు, నాటికలు ప్రదర్శించడమే కాకుండా ఔత్సాహిక సమాజాలను ప్రోత్సహిస్తూ, గత 40 సం.లుగా వేదికను కల్పిస్తున్న సంస్థ ‘సుమధుర కళానికేతన్’.
దాదాపు 40 నాటకాలను రూపొందించి, వివిధ ప్రాంతాలలో సుమధుర కళాకారులు ప్రదర్శించి, విశేష మన్ననలు పొందడమే కాకుండా అన్నమయ్య, క్షేత్రయ్య, వరూధిని ప్రవరాఖ్య, ఆదిశంకరాచార్య మొదలైన నృత్యరూపకాలను రూపొందించి వివిధ ప్రాంతాలలో ప్రదర్శించడం జరిగినది.
హాస్యనాటిక పోటీలను విజయవంతంగా గత 24 సం.లుగా విజయవాడలో నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ‘సుమధుర కళానికేతన్’. ‘సుమధుర’ నాటకోత్సవాలంటే విజయవాడ నగరంలో ఒక ఉత్సవంగా కళాభిమానులు ఎదురుచూడటం సుమధురకు గర్వకారణం.
సుమధుర కళానికేతనకు ఆప్తులైన స్వర్గీయ జంధ్యాల, కౌతా పూర్ణానందం, శనగల కబీర్దాస్, శీమతి రాధాకుమారి, ఎ.వి.సుబ్బరాజు వార్ల స్మారక పురస్కారాలను సుమధుర అందిస్తున్నది. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో సంగీత, సాహిత్య, నృత్య, నాటక రంగాలకు సంబంధించిన ఎందరో ప్రముఖులున్నారు. వారిలో…
‘కళాతపస్వి కె. విశ్వనాధ్, నాగేష్, కె.వి.మహదేవన్, రావి కొండలరావు, పొట్టి ప్రసాద్, సాక్షి రంగారావు, సింగీతం శ్రీనివాసరావు, మాగంటి మురళీమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాళ్ళపల్లి, సుత్తివేలు, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, గోపినాయుడు, వై.యస్. కృషేశ్వరరావు, భాస్కరచంద్ర, అలీ, సత్యానంద్, నరేష్, ఎన్.ఆర్. నంది, ఆదివిష్ణు, వేటూరి సుందరరామమూర్తి, ఆరుద్ర, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, బి.కె.రాధ, సామవేదం షణ్ముఖశర్మ, పురాణపండ రంగనాథ్, బుట్టా సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంపటి చినసత్యం, యం.సి.దాస్, సిల్వెసర్, అన్నవరపు రామస్వామి, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, కె. విజయలక్ష్మి, ఆలపాటి లక్ష్మి, రత్నకుమారి, అమ్మన విజయలక్ష్మి, శ్రీలక్ష్మి వున్నారు.
ఈ సంవత్సరం 46వ వార్షికోత్సవం మరియు 24వ తెలుగు హాస్యనాటికల పోటీల సందర్భంగా స్వర్గీయ కబీర్ దాస్ అవార్డును రంగస్థల, టి.వి. నటులు శ్రీ గోపరాజు రమణకు, స్వర్గీయ రాధాకుమారి పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, టి.వి., నటి, దర్శకురాలు శ్రీమతి సురభి జమునారాయలుకు, స్వర్గీయ జంధ్యాల స్మారక పురస్కారాన్ని ప్రముఖ సినీ నటులు, దర్శకులు, నిర్మాత శ్రీ మాగంటి బెనర్జీ గారికి పురస్కార ప్రదానం చేసారు.
మూడు రోజుల పాటు ఎనిమిది హాస్య నాటికలు ప్రదర్శించారు. ప్రదర్శించిన ప్రతి నాటకానికి 13 వేల రూపాయలు పారితోషకం తో పాటు, వీటిలో నుండి మూడు నాటికలను ఎన్నికచేసి నగదు బహుమతులందించారు. అందులో మొదటి బహుమతి ‘అమెరికా అల్లుడు ‘ నాటికకు 15 వేలు, రెండవ బహుమతి ‘మరో సింగరాజు లింగరాజు ‘ కు 12 వేలు, మూడవ బహుమతి ‘ఆలీతో సరదాగా ‘ కు 10 వేలు బహుకరించారు. ‘ప్రసన్నకు ప్రేమతో ‘ నాటికకు జ్యూరీ 5 వేలు అందించారు.
యువతను ప్రోత్సహించేందుకు కళాశాల పిల్లలకు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
-బి. ఆంజనేయరాజు