మనకు తెలియని ‘మణి ‘ చందన

స్వాతి వారపత్రిక పూర్వపు మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన ముఖచిత్రంతో గత వారం స్వాతి వీక్లీ వెలువడింది. మణిచందన స్మృతి సంచికగా రూపొందిన ఇందులో ఆమె గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించారు. తన కుమారుడు, కూతురు స్మృతి గా ‘అనిల్ మణి ‘ అవార్డు ను నెలకొల్పనున్నట్లు ఎడిటర్ బలరాం ప్రకటించారు.

మనకు తెలియని ‘మణి ‘ చందన

దేశభాషా పత్రికల్లో స్వాతికి వున్న స్థానం ప్రత్యేకమైనది. తెలుగు పాఠకులు ‘స్వాతి’కి అగ్ర సింహాసనం వేయగా, తెలుగు పాఠకులు అందించిన గుర్తింపును కేంద్ర ప్రభుత్వం గ్రహించి, మరేఇతర దేశ భాషాపత్రికకు ఇవ్వనిగౌరవం ‘స్వాతి’కి అందించింది.

దేశ ప్రముఖుల విదేశీ పర్యటనలలో ‘స్వాతి’కి భాగం కల్పించింది. ‘స్వాతి‘ సంపాదకులకు తొలిగా దక్కిన ఆ విశేషగౌరవాన్ని వారి వారసురాలిగా నాటి అసోసియేట్ ఎడిటర్, ఆ తర్వాతికాలంలో మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన అందుకుంది.

అంతేకాదు విదేశీ ప్రభుత్వాలు అక్కడ జరిగిన, జరుగుతున్న ఘటనలు, కార్యక్రమాలను తిలకించి తెలుగు పాఠకులకు పంచమని ‘స్వాతి’ మణిచందనను ఆహ్వానించిన సందర్భాలున్నాయి.
నాటి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలతో పాటుగా, మలేషియా, సింగపూర్‌కు ప్రత్యేక ఆహ్వానితురాలిగా వెళ్ళింది. ప్రపంచంలోని కీలక రాజ్యాలు దర్శించటం, ఆయా దేశాలు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు కుదుర్చుకునే ఒప్పందాలకు సాక్షిగా ‘స్వాతి’ తరఫున నిలబడిన అదృష్టం మణిచందనది.

సెప్టెంబర్ 11, 2001 అమెరికా చరిత్రలో అత్యంత విషాదకర దినం. అమెరికన్లు గర్వంగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను ఇస్లామిక్ ఉగ్ర వాదులు, హైజాక్ చేసిన విమానాలను ఆయుధాలుగా చేసుకుని కూల్చివేసిన ఆ ఘటన ప్రపంచం ఎన్నడూ మరువలేనిది.

టెలివిజన్‌ తెరలమీద ప్రత్యక్షంగా చూసిన అమెరికన్లు నివ్వెరపోయారు. వారి రక్షణ వ్యవస్థకు కీలకమైన పెంటగన్ భవనం మీద దాడికి విఫలయత్నం జరిగింది. ఒకదేశం పరోక్ష యుద్ద దాడికి గురైనపుడు ఎలా స్పందించాలో అమెరికాను చూసి నేర్చుకోవాలి.
తమదేశంమీద ఉగ్రవాదదాడి జరిపిన వారిని వెంటాడి పట్టుకోవటమో లేక సంహరించటమో చేశారు. అందుకు ఎంతకాలం పట్టినా దానిని పకడ్బందీగా నడిపించారు. అదే సమయంలో దాడిలో మరణించిన అమెరికన్ల పట్ల బాధ్యతతో వ్యవహరించారు.

ఆ 9/11 ఘోర సంఘటన జరిగి సంవత్సరం అయిన సందర్భంగా తమ దేశ పరిస్థితి గురించి ప్రపంచ దేశాలకు తెలియచెప్పే ఉద్దేశ్యంతో వివిధ భాషా పత్రికలవారిని ఆహ్వానించారు. అందులో తెలుగువారి ప్రతినిధి మణిచందన.
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ఆకాశ హర్మ్యాలను ఫోటోలలో చూసిన వారున్నారు. కాని ఆ బిల్డింగ్ విధ్వంసానికి ముందుగా దర్శించిన మీడియా మిత్రులు బహుతక్కువ. సరిగ్గా ఆ విధ్వంసానికి సంవత్సరం ముందు మణిచందన తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాని సందర్శించింది.

ఆ సమయంలో వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్ 104 అంతస్తులను ఒక నిమిషంలో తీసుకువెళ్ళే వేగవంతమైనలిస్ట్ లో ప్రయాణంచేసిన అనుభవం, ఆనందం మణిచందనది. ఆ బిల్డింగ్ పైనుండి న్యూయార్క్ నగరం దర్శించిన జ్ఞాపకాలు ఆమె దొంతరలో వున్నాయి.

సరిగా సంవత్సరం తర్వాత అక్కడలకాశ హార్మ్యం లేదు. పడిపోయిన ఆ బిల్డింగ్ నుండి లక్షకు పైగా ట్రక్కుల శిధిలాలు తొలగించారు. దాదాపు 2 లక్షల టన్నుల స్టీల్‌ని బయటకు తీశారు. ఆ రోజు మొత్తం 2823మంది ఆ బిల్డింగ్ కూల్చివేతలో మరణించారు. ఇప్పుడు అక్కడ భవనంలేదు. దాని తాలూకు చిహ్నంగా ఒక భారీ గొయ్యి వుంది.

దానికి అమెరికన్లు పెట్టుకున్న పేరు ‘గ్రౌండ్ జీరో’ ఒకనాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైభవాన్ని, ఇప్పుడు విషాదపు ముసుగులో మునిగి వున్న గ్రౌండ్ జీరోని దగ్గరగాగమనించే అవకాశం మణిచందనకు దక్కింది.
మణిచందన పత్రికారంగంలోకి, పత్రికానిర్వహణలోకి చేపపిల్ల నీటిలో ఈదుకుంటూ వచ్చినంత సహజంగా వచ్చింది. ఒక పత్రికా ప్రతినిధికి వుండాల్సిన నిశిత పరిశీలన, సమగ్ర పరిజ్ఞానం, జరుగుతున్నవాటి నేపథ్యం, వాటి ప్రభావాలను అంచనా వేయగల చురుకుతనం ఆమెకున్నాయి.
అమెరికా పర్యటనలో తాను గమనించిన అమెరికా ప్రభుత్వ, ప్రజల స్పందనను మణిచందన రెండు వాక్యాలలో అద్భుతంగా చెప్పటం నాడు ఆ వ్యాసం చదివిన తెలుగు వారందరికి గుర్తుంటుంది.“యూనిటీగా వుండటమే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా” అంటూ ఆమె కితాబు ఇచ్చింది..
“సంవత్సర కాలంలో అమెరికా ప్రజలలో మార్పు స్పష్టంగా కనిపించింది. వారిలో ఆందోళనలేదు. పక్కవారిని అనుమానంగా చూడటంలేదు. జరిగిన సంఘటనను సంయమనంతో ఎదుర్కొని, కలిసివుంటే కలదు సుఖం అన్నట్టుగా అందరూ ఒక్కటై ఉగ్రవా దాన్ని సమూలంగా రూపుమాపుదామని సమైక్యగీతం ఆలపిస్తున్న దృఢవిశ్వాసాన్ని వారు మనోఫలకాల పై గమనించాను” అన్నది మణిచందన మాట.
నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వెంట రష్యా వెళ్ళి చారిత్రాత్మక ఆరు ఒప్పందాలకు సాక్షిగా నిలిచిన స్వాతి ప్రతినిధి ఆమె. “రష్యా ఒకప్పటి సోవియట్ యూనియన్. కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వ పాలనలో వుండి భావ ప్రకటన స్వేచ్చకు దూరమైంది.
నేడు కమ్యూనిస్టు పాలన అంతమై ప్రజాస్వామ్య విధానం అమలులోకి వచ్చినా రష్యన్లు తమ మాటల్ని గొంతులోనే అణిచి పెట్టేసుకునేందుకు అలవాటుపడి పోయారు. బహుశ అదే అలవాటులోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోవటం జరుగుతోంది. ఆ ధోరణి నుండి రష్యన్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు” అనే మణిచందన మాటలు మొత్తం రష్యా రాజకీయ సామాజిక పరిస్థితులకు ఆద్యం పట్టింది. .
తక్కువ పదాలతో, గొప్ప విషయాన్ని వివరించ గలిగిన ‘క్లుప్త కలం’ మణిచందనది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే వుందన్న నాటి విషయాన్ని “రష్యాది క్యాష్ డ్రివెన్ ఎకానమీ… నల్లధనం ఎక్కువ”అనే రెండు వాక్యాలతో తేల్చిచెప్పటం ఆమె పరిశీలన గొప్పతనం. మహిళా ప్రతినిధిగా రష్యన్ మహిళలను గమనించింది.. వారి పనితీరు, వారుఅనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు మెండుగా వుండటం మణిచందన మెచ్చిన అంశం. సంతానం కనటంతో మహిళలకు వున్న స్వేచ్చ, నేటి పిల్లలే రేపటి దేశ సంపద అనే మహిళా భావన రెండింటిని ఆమె తన వ్యాసాలలో హైలెట్ చేసింది. కళ్ళ ఎదుట కనిపించిన మంచిని మెచ్చుకున్నట్టే, కనిపించిన వ్యతిరేక అంశాలలోనూ కన్నెర్ర చేయటం మణిచందన చేసింది.

రాజకీయ ప్రముఖుల వెంట ఆహ్వానాలే కాదు స్వాతి ప్రతినిధిగా మణిచందన విదేశాలలో వున్న తెలుగు సాంస్కృతిక, భాషా సంఘాలవారి ఆహ్వానాలను అందుకుని వెళ్ళింది..
మలేషియాలోని తెలుగు సంఘాలు చురుకుగా వ్యవహరిస్తుంటాయి. భాషాభిమానం మెండు.
చాలాకాలం క్రితం, సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడినా, తమ భాషా, సంస్కృతి మూలాలను మరువని, పెంచి పోషించుకుంటున్న మలేషియా తెలుగు సంఘం సేవల గురించి మణిచందన తన అనుభవాలలో చెప్పింది.

వారి తెలుగు పలకరింపులు, తెలుగు వంటకాల వాసనలు నేటికీ నిలిచివున్నాయి. ఒకరకంగా చూసి నప్పుడు తెలుగునాట వుండిపోయిన వారికన్నా విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వారిలోనే తెలుగుతనం ఇంకా బాగుందేమో అనిపించిందన్నారు మణిచందన.
ఎన్ని పర్యటనలు దేశీ ప్రముఖులతో చేసే అవకాశం వచ్చినా వాటిని ఏనాడు తమకు వ్యక్తిగతంగా లభించినవని ఎడిటర్ బలరామ్ గారు భావించలేదు. మణిచందన వారసత్వంగా ఆ అభిప్రాయాన్నే అంది పుచ్చుకుంది. తన పర్యటన అవకాశం నలభైఆరు లక్షలమంది స్వాతి పాఠకదేవుళ్ళ ప్రతినిధిగా దక్కిన గౌరవంగా భావించిన నిగర్వి మణిచందన.

అమెరికా వారి స్వార్థచింతన, స్వప్రయోజనాలకు పెద్దపీట వేసే మనస్తత్వం. రష్యన్లకు భారతదేశం పట్ల వున్న స్నేహభావం, సహకారం అందించే చొరవ, తూర్పు ఆసియా దేశాలలోని తెలుగువారు తమ మాతృదేశంతో ముడివేసుకోవాలనుకుంటున్న భాషా బంధం వాటన్నింటిని తనదైన ప్రత్యేక శైలిలో అందించటం మణిచందనకే చెల్లింది.
మరువలేని పత్రికారంగ ప్రతినిధి మణిచందన. తన నేర్పు, కూర్పు మరింతగా ‘స్వాతి’కి అందిస్తుందని ఆశిస్తున్న వేళ కానరాని లోకానికి వెళ్ళిన మణి చందన గతస్మృతులు, ఆమె వ్యాసశైలిలో, సమాచారంలో నిక్షిప్తమై పాఠకుల ముందున్నది.

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు
(Courtesy Swathi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap