(సెప్టెంబర్ 10 నుండి డిశంబర్ 30 వరకు వడ్డాది పాపయ్య శతజయంతి ఉత్సవాలు)
మన ఇతిహాసాలు, పురాణాలు, ఋతువులు, కాలాలు, రాగాలు, నక్షత్రాలు, పండుగలు, కావ్యకన్నెలు లాంటి సమస్త అంశాలపై చిత్రాలు సృష్టించిన అమర చిత్రకారుడు వడ్డాది పాపయ్య.
చందమామ, యువ, స్వాతి, ఆనందవాణి, రేరాణి తదితర పత్రికల్లో వేలాది చిత్రాలు, వివిధ అంశాలపై తనదైన శైలిలో చిత్రించి, తెలుగు చిత్రకళకు జాతీయస్థాయి కీర్తి తెచ్చిన అమర చిత్రకారుడు వడ్డాది పాపయ్య (వపా) ఆయన కాలధర్మం చెంది మూడు దశాబ్దాలు కావస్తున్నా, నేటికి ఆయన కళాప్రతిభ మసకబారలేదు. ఎందరో ఔత్సాహికులకు ఆయన చిత్రాలు స్ఫూర్తి కల్గిస్తున్నాయి.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పుష్పవిలాపం, ఉమర్ ఆలీషా రచించిన ఉమర్ ఖయ్యం పద్య సంపుటికి వపా అసాధారణ రీతిలో చిత్రాలు గీశారు. వపా చిత్రాలు ఎంత ప్రత్యేకత కల్గివుంటాయో, వారి చిత్రాలకు ఆయన పెట్టే శీర్షికలు అంతకు మించి వుంటాయి. కొన్ని శీర్షికలకు అర్థాలకోసం నిఘంటువును చూడాల్సి వచ్చేది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో సెప్టెంబర్ 10న, 1921లో మహాలక్ష్మి, రామమూర్తి దంపతులకు పుట్టిన వపా, స్వయంకృషితో అసమాన్య చిత్రకారుడుగా చందమామ, యువ, స్వాతి తదితర పత్రికల్లో (1941 నుండి 1991 వరకు) వేల చిత్రాలు గీచి తన ప్రతిభను నిరూపించుకొన్నారు. ఇతిహాసాలు, పురాణాలు, ఋతువులు, రాగాలు, నక్షత్రాలు, పండుగలు, పౌర్ణములు, భావ చిత్రాలు, రూపచిత్రాలు, సామాజిక చిత్రాలు ఇలా అన్ని అంశాలపై చిత్రాలు గీచినవారు మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.
వపా చిత్రాలు తెలిసినంతగా ఆయన జీవిత విషాలు ప్రజలకు తెలియవు. ప్రచారం గిట్టని వ్యక్తిత్వం ఆయనది. ఆయన చేసే కళాసేవా మౌనంగా, అజ్ఞాతంగా చేసేవారు. వీరి చిత్రాలు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు. వపా తన 73వ ఏట డిశంబర్ 30న, 1992లో విశాఖజిల్లా కశింకోటలో కన్నుమూశారు.
ఆ మాహాచిత్రకారుని శతజయంతి ఉత్సవాలను విశాఖ చిత్రకళాపరిషత్, 64కళలు డాట్ కాం వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలోను విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్లలో నిర్వహించనున్నాం. ఈ సందర్భంగా ‘వపాకు వందనం’ పేరుతో ప్రముఖ చిత్రకారుల వ్యాసాలతో, రంగుల చిత్రాలతో శతవసంతాల ప్రత్యేకసంచికను ఆవిష్కరించి, వపా ఒరిజినల్ చిత్రాలతో పాటు కొంత మంది చిత్రకారులు అనుసృజన చేసిన వపా చిత్రాలతో ప్రదర్శనను ఏర్పాటుచేయనున్నాం. తొలిగా విశాఖపట్నం లో ఈనెల మూడోవారంలో జరుగనుంది. ఈ సభలలో ఆయా ప్రాంతాలకు చెందిన చిత్రకారులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆయా సభల్లో వ్యాస రచయితలకు, చిత్రాలను ప్రదర్శించిన కళాకారులకు ‘వపా’ప్రత్యేకసంచిక, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేయబడతాయి. ఈ సభలను కోవిడ్ నిభందనలు అన్నీ పాటించి ఒక్కోచోట ఓక రోజు మాత్రమే నిర్వహించనున్నాం. చిత్రకారులు, వపా అభిమానులు తమకు దగ్గరగా వున్న ప్రాంతాలకు వచ్చేటట్లు ఏర్పాట్లు చేసుకొండి. ఈ కార్యక్రమాలలో స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయాలన్న అలోచనలోవున్నాం.
సుంకర చలపతిరావు
కళాసాగర్ యల్లపు
ప్రదర్శనలు జరుగు తేదీలు తెలుపగలరు !