ఓ కళాకారుని రంగుల ‘కల’

కొంతమంది చిత్రకారులు కంటికి కనిపించేది మాత్రమే చిత్రిక పడతారు. సాధ్యమైతే కొంత డిస్టార్ట్ లు చేస్తారు. సొగసుగా చూపిస్తారు. మరికొందరు అంతర్ముఖులై అంతఃచేతన (సబ్ కాన్షియస్స్)లో విహరించే అపురూప రూపాలకు ఆకృతి ఇస్తుంటారు. అలాంటి కొందరిలో కోటగిరి సంతోష్ ఒకరు. ఈ యువ చిత్రకారుడి కలలు కాంతులు రంగుల కవిత్వంగా చిరంజీవత్వం పొందుతాయి. ఆయా వ్యక్తుల వాస్తవాంశాల పరావర్తనం స్వప్న జగత్లో సాక్షాత్కారమవుతుందని గట్టిగా విశ్వసించే వినూత్న భావాల చిత్రకారుడాయన. అంతర్ముఖత్వమంటే ఇష్ట మని, అక్కడ తేలియాడే కలలు, వాస్తవికత అధివాస్తవికత్తె ఆవి ర్బవిస్తుందని, అదే తన కాన్వాసుపై ‘డ్రీమ్ స్కేప్స్’గా రూపాం తరం చెందుతాయని విస్పష్టంగా వివరించే చిత్రకారుడాయన. తనలోకి తాను తొంగి చూసుకుని ఆ యవనికపై కదలాడే బొమ్మలే ప్రాణం పోసుకుని, రంగులు అద్దుకుని నవనవోన్నేషంగా దర్శనమిస్తాయంటారాయన.

మనసు పలికే మార్మికత ఆ మార్మికత మధ్యన గల అను భూతి, భావావేశం, మెరుపు అలలను కుంచెతో తడిపి కాన్వా సుపై ఆకృతులను సృష్టిస్తానని ధీమాగా చెబుతున్నారాయన. తన పరిసరాలు, ప్రకృతి తనను ఆవహించి అధిగమించేందుకు ఆస్కారమిస్తానని, ఆ సందర్భంలో, ఆ ఒరిపిడిలో నూతన భావం.. రంగుల మిశ్రమం, నాజూకుతనం నవనవలాడుతూ నాట్యమాడుతుందని అంటారాయన.
ఈ భావ వ్యక్తీకరణ అంతా వాస్తవ ప్రపంచానికి దూరంగా అనిపిస్తుంది. అదేదో కవితా లోకంగా కనిపిస్తుంది. ఊహా జగ త్లో విహరిస్తున్న భావన కలుగుతుంది. అవును, నిజమే! కోట గిరి సంతోష్ ఈ ‘అంతర్ముఖత్వం’లోని ఆధునిక ప్రపంచాన్ని నమ్ముకుని, ఆ మార్మిక ప్రపంచంలో విహరిస్తూ, స్వప్న జగత్లోని సుకుమారాన్ని, అక్కడ తాను దర్శించిన చెట్లు, పక్షులు, జంతువులు, మానవ ముఖాలు, మరికొన్ని అధివాస్తవిక అంశాలను మిక్స్డ్ మీడియం ద్వారా వీక్షకుల కళ్లకే కాదు, పంచేంద్రియాలకు పని కల్పిస్తాడు. ఆ అల్లికతోనే అందర్నీ ఆకర్షిస్తాడు. అదే అతని పనితనం, నైపుణ్యం.
చిత్ర రచనలో ఉపమానాలను విద్యుల్లతలుగా, రంగుల విద్వత్ వెల్లువలా చాటిచెప్పడం అందరికి సాధ్యమయ్యే విషయం కాదు. ప్రయోగాలకు ప్రాణం పెట్టే తత్వంగల కోటగిరి సంతోష్కది అలవోకగా అబ్బింది. అబ్బిన ఆ ‘విద్య’తో అసంఖ్యాక చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. (నిజమైన) బంగారం, వెండి కాగితాలను తన వుడ్ ఎన్ గ్రోవింగ్ చిత్రాల భావాల లోతులను తెలిపేం దుకు ప్రయత్నించడమంటే అధి ఖరీదైన ప్రయోగమే కదా? ప్రకృతిలో మనిషి ఓ భాగం.. కాబట్టి మనిషి అంతఃచేతనలో ప్రకృతి ప్రభావం బలంగా ఉంటుందని గట్టిగా విశ్వసిస్తూ, ఆ విషయాన్ని కాన్వాసుపై చిత్రిక పట్టడం, ఆ చిత్రాలకు ప్రత్యేక టెక్చర్, ట్రీటిమెంట్ ఇస్తూ తనదైన బలమైన ముద్రను కనబరుస్తున్నారు. ఇదే ఇప్పుడాయన సిగ్నేచర్ శైలిగా రూపొందింది.
కాన్వాస్పైనే గాక వుడ్ ఎన్ గ్రోవింగ్ (వుడ్ కట్ కాదు) ద్వారా చిత్రరచన చేయడం ఆయనకు అత్యంత ఇష్టమైన విధానం. ఇందులోనే బంగారం – వెండి, రైస్పేపర్, ఆక్రలిక్ ఎనామిల్ రంగులతో ఓ కొత్త ప్రయోగానికి తెర తీశారు. ఈ రకమైన చిత్ర రచనకు అనేక మాధ్యమాల, రంగుల, సంవిధానాలు తెలిసుండాలి. చిత్రకళా రంగంలో కనిపించే ప్రతి వస్తువు.. రంగు.. వాటి స్వభావం సంపూర్ణంగా తెలిసి ఉన్నప్పుడే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవు తాయి. ముఖ్యంగా గవాష్, ఎగ్ టెంపోరా లాంటి వినూత్న మాధ్యమాల ఆను పానులు అన్నీ క్షుణ్ణంగా అవగాహనలో ఉండాలి. ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ తన అధివాస్తవికత (సర్రియలిజం) వస్తువుకు బాగా నప్పుతోందని ఆయన అంటున్నారు.

యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం మదనపల్లి అనే గ్రామంలోని ఓ గీత కార్మికుడి కుటుంబంలో 1979 సంవత్సరంలో పుట్టిన సంతోష్ తల నిండా ఇన్ని వినూత్న భావాలా?.. విప్లవాత్మక విధానాలా?.. రంగులతో ఆడుకునే నైపు ణ్యమా?.. ‘డ్రీమ్స్కేప్స్’ను సృష్టించే తత్వమా?.. అంతర్ముఖుడై అధివాస్తవిక తను కాన్వాసుపై పలికించడమా?.. అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఆయన చిత్రాల నిండా ఎన్నో ప్రతీకలు, ప్రతిరూపాలు, చిత్ర ఉపమానాలు, ఉపమేయాలతో సరికొత్త అర్గాలను వెతుక్కోమని ఆహ్వానించే తత్వం ప్రస్పు టంగా కనిపిస్తోంది. వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేందుకు ‘ధాతువుల (బంగారం – వెండి వగైరా)ను ఆదరువుగా తీసుకుని చేసే అభివ్యక్తీకరణ అరుదైనది.. అపురూపమైనది.
ఆకులు పక్షులు కావడం.. పక్షులు ఆకుల అవతారమెత్తడం సృజనకు పరాకాష్ట. అలాగే మహిళ – పులి ఆకృతి ఒకటిగా, ‘అద్వైతం’గా గోచరమవడం భిన్న రూపాలను ఒకటిగా వ్యక్తీకరించడం ఓ అపురూప దృశ్యమాలికలా కని _పిస్తుంది. ప్రకృతి.. ఏనుగు – భవనాల నేపథ్యంలో చూపి, ఆ ఏనుగు ఎగురు తున్న భావన కల్పించడం వాటిని పోల్చుకుని (ఉపమానం) కొత్త భావానికి ద్వారాలు తెరవమని వీక్షకుడికి సూచించడం అంత సాధారణ విషయం కాదు.
వీటి మూలాలు ఇంప్రెషనిజం, పోస్ట్ ఇంప్రెషనిజంలో కనిపిస్తాయి. ఈ రెండు ‘ఇజాలు’ తనకెంతో ఇష్టమని, సిజాన్, మానె లాంటి పాశ్చాత్య చిత్రకా రుల ప్రభావం, అలాగే విన్సెంట్ వాంగాగ్, గాగిన్ లాంటి మాస్టర్స్ శైలి ప్రభావం తన అంతఃచేతనలో నిలిచిపోయిందని కోటగిరి సంతోష్ సంతోషంగా చెబుతారు. వాంగాగ్ పొద్దుతిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) తన స్వీయ చిత్తరవు (సెల్స్ పోట్రేట్)పై సంతోష్ వేసుకున్నారంటే వారి ప్రభావం ఏ మేరకుందో ఊహించవచ్చు. అంతర్ముఖత్వంతో అద్భుత నవ్య – నైరూప్య – డ్రీమ్స్కేప్స్ బొమ్మలు గీసిన ఈ చిత్రకారుడు తనలోని పసితనాన్ని కూడా నిద్రలేపి ‘డాల్ సీరీస్’ పేర అనేక బొమ్మలు గీశారు. అవన్నీ పిల్లలు గీసినట్టు, పిల్లల వస్తు సముదాయంతో, పిల్లలతో గీసి తనలోని మరో కోణాన్ని వీక్షకుల ముందు ఆవిష్కరించారు. తన కొడుకు – కూతురు (చిన్నవాళ్లు) చేష్టలే ప్రేరణగా ఈ చిత్రాలు గీశానని ఆయన చెప్పారు. అటు చిన్నపిల్లల అనాట మీకి అవసరమైన రేఖలను రంగులను, వస్తువును ఎంపిక చేసుకుని గీయడం ఇటు అంతర్ముఖత్వంలోని అధివాస్తవిక రూపాలకు ఆకృతి నివ్వడం – రంగుల మిశ్రమంతో, గొప్ప టెక్చర్తో, బంగారం వెండి కాగితాలుపయోగించి వినూత్న ప్రయోగాలతో మెప్పించడం కోటగిరి సంతోష్కే చెల్లిందనిపిస్తోంది.

చాలామంది చిత్రకారులకు ‘న్యూడ్’ బొమ్మలు గీయడం తమ వృత్తిలో భాగం. సంతోష్ సైతం మహిళా న్యూడ్ బొమ్మలు గీసినా అవి ‘డిస్టార్టివ్’గా కనిపిస్తాయి. తల పక్షి రూపంలో ఉంటే మిగతా దేహమంతా మహిళది కావటం.. ఇలా అనేక విధాలుగా కనిపిస్తాయి. వీటిని గోల్డ్ ఫాయిల్ (బంగారు కాగితం)తో మిక్స్డ్ మీడియాలో చేయడం విశేషం. చార్ కోల్ డ్రాయింగ్స్ తోపాటు పెన్నుతో ఆలోచనలు రేకెత్తించే అసంఖ్యాక డ్రాయింగ్స్ ఆయన వేశారు. ఈ విశిష్ట యువ చిత్రకారుడు 1999 – 2003 మధ్య జెఎన్టి యులో బిఎఫ్ఏ చేశారు. అక్కడ లాండ్స్కేప్, కలర్ డిజైన్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. చిత్రలేఖనంలోని అన్ని శాఖల్లో ప్రాథమిక అంశాలు అభ్యాసం చేశారు. ఈ ‘విద్య’ను మరింత మెరుగుపరచుకునేందుకు అదే కాలేజీలో 2009 సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలపాటు ఎంఎఫ్ఏ చేశారు. ఈ చదువులకు సమాంతరంగా చిత్రకళకు సంబంధించిన వివిధ పనులు చేశారు. ఉదాహరణగా.. ఇంటీరియర్ డిజైనర్ దగ్గర పని చేయడం, పోస్టర్ డిజైనర్గా సేవలందించడం, ‘కలర్ చిప్స్’ సంస్థలో యానిమేటర్గా విధులు నిర్వర్తిం చడం. ఇలా చేసిన ప్రతి పని తన అవగాహన పెంపుదలకు దోహదపడిందని, వివిధ అంశాల అధ్యయనానికి అవకాశం లభించిందని, ఆ అనుభవాన్ని ఇప్పుడు తన అంతర్ముఖత్వం సీరీస్ బొమ్మల్లో ఉపయోగించుకుంటున్నానని ఆయన అంటున్నారు. చెన్నైలోని ఫోరం ఆర్ట్ గ్యాలరీలో 2017లో తన సోలో చిత్ర ప్రదర్శన నిర్వ హించారు. అప్పటి నుంచి ఆ గ్యాలరీ సంతోష్కు వెన్నుదన్నుగా నిలిచి ఆదరి స్తోంది. అలాగే హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ (చిత్రమయి)లో, బెంగు ళూరులోని సరా అరక్కల్ గ్యాలరీలో, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో తన వ్యష్టి, సమిష్టి చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఓ అంతర్జాతీయ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా ఆయన పని చేస్తు న్నారు.
అంకిత భావం, కష్టాలు లేకుండా చిత్రకళ లేదు.. అన్న ఓ ఫ్రెంచ్ చిత్రకళ విమర్శకుడి మాట కోటగిరి సంతోష్కు సరిగ్గా అన్వయమవుతుంది.
– వుప్పల నరసింహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap