కవి దేవిప్రియ ప్రేమకథ ….

కొందరి గురించి చెప్పుకునేటప్పుడు.. మనసుని, శరీరాన్ని కొత్తగా , వైవిధ్యంగా మలచుకోవాలి. ఈ మాటేదో కొత్తగా ఉందే.. అనుకోవచ్చు. కానీ, కొందరితో కరచాలనాలు చేయడానికి సిద్ధపడాలంటే.. మనలో మనంగా, మన మనసులోనూ కొత్తదనాన్ని నింపుకోవాలి. అది ఎంతగా అంటే.. వొళ్ళంతా పూలపరిమళాలను అద్దుకోవాలి. అంతకీ చాలకపోతే.. కాసిన్ని నక్షత్రాలను అప్పుతెచ్చుకుని.. కాసేపైనా వాటిని జేబులో ఉంచుకోవాలి. ఇంకా నీలినింగిలో తేలియాడే మబ్బుల్ని, చందమామ తునకల్ని, పచ్చనిచేలల్లో.. అల్లరిచిల్లరగా తిరుగాడే పిల్లగాలుల్ని, భూమిపై ఆమాంతంగా వాలి.. చిత్తడి చిత్తడి చేసే చినుకు పలుకుల్ని.. ఇలా ప్రకృతితో చిన్నపిల్లల్లా మమేకమైపోవాలి. అలా అయితేనే కొందరితో కరచాలనాలు దొరుకుతాయి. వారి మనసు పొరల్లో దాచుకున్న అనుభూతుల్లోని అరుదైన జ్ఞాపకాలను కాసిన్ని పంచుకునే, తెలుసుకునే అవకాశాలు దక్కుతాయి. నిజంగానే అలాంటి వ్యక్తులు.. అరుదుగానే తారసపడతారు. గుండెవిప్పి అంతే అరుదుగానే మాట్లాడతారు. పైకి పొడిపొడిగా చెప్తున్నట్టు తోచినా.. మనసును గభాల్న తడిచేస్తారు. అలాంటి అనుభవమే.. కవి దేవిప్రియతో సాగిన చల్లని సాయంకాలపు కబుర్ల సెలయేరు.

ఈ నిత్యనవ్వనపు సెలయేరులో మనకు తెలియని ప్రేమైక సవ్వడులు, అంతర్వాహినిగా ధ్వనించే మానసిక బంధాలు, ఎప్పటికీ తరగని, ఎప్పటికీ తడుముతూ, తరుముతూ వచ్చే బాల్యస్మృతులు, రెండు హృదయాల మధ్య అల్లుకున్న కవిత్వోదయపు పరిమళాలు.. ఇలా రూపాలు అనేకం. సుదీర్ఘ జీవన సహచరి ప్రయాణంలో రాజీ’పడ్డ’, రాజీలేని దేవిప్రియ జీవన మాధుర్యంలోని కొన్ని ముత్యపు తుంపరలు ఇవి. చదవండి.. జగమెరిగిన కవి దేవిప్రియ ‘జీవన’ మాధుర్యం.

ఏ కవికైనా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తనదైనశైలిలో ఆవిష్కరించడం సులువే. కానీ తనని తాను ఆవిష్కరించుకునే విషయంలో కష్టపడతాడు. ఆమాటకొస్తే తనలోని మనిషిని, మనసుని ఎందుకు బయటపెట్టుకోవడం..? అనే భావిస్తాడు. ఎందుకంటే.. తనలోని మనిషి తనకు తెలిసినవాడై ఉంటే చాలు, తనలోనికి మరొకరు జొరబడి చూడాలనుకోవడం ఎందుకులే.. అనే చిన్నపాటి స్వార్థమైనా కావొచ్చు. అందుకే, చాలామంది కవులు, సృజనపరులు తమ వ్యక్తిగత జీవితపు స్పందనల్ని మదిలోపల్నే పదిలంగా దాచుకుంటారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి, ఆకర్షణ, వికర్షణ మరింకేదైనా కావొచ్చు. అవన్నీ తమతోనే ఉండాలని కోరుకుంటారు. కవి దేవిప్రియ అందుకు అతీతమేమీకాదు. కానీ, కవిత్వంలో శిఖరాయమానమైన కీర్తిని పొందిన ఆయన మనసుని ఎలాగోలా కదిలించాలనే ప్రయత్నంలో.. ఆయన మనసూ కాసేపు.. వెనక్కివాలుతూ.. తడిబారిన కళ్ళతో పలికిన మాటలివి.

అంతర్గత ప్రపంచం
నిజం చెప్పాలంటే.. సుదీర్ఘమైన నా కవితా జీవితంలో అనేక ఇంటర్వ్యూల్లో.. సాహిత్యపరమైన విషయాలే మాట్లాడానుగానీ ఎప్పుడూ.. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పలేదు.. చెప్పాలనీ అనుకోలేదు. ఇక్కడో విషయం మీకు చెప్పాలి. పర్సనల్‌ లైఫ్‌ అంటే.. నేను, భార్య, పిల్లలు.. అనే విషయాలు మాత్రమే కాదు. మనలో ప్రతి ఒక్కరిలో అంతర్గత ప్రపంచం ఒకటి ఉంటుంది. అది బయటకు కనిపించే సౌందర్యాలు, సౌఖ్యాలు, సౌకర్యాలు, వర్తమాన చర్యలు, వెసులుబాటుతో గడిపే అంశాలు మాత్రమే కావు. మనలోని, మనకు మాత్రమే తెలిసిన, గడిపిన ప్రపంచమూ వ్యక్తిగత జీవితమే. ఇక నా వ్యక్తిగత ప్రేమ విషయాలు, నా భార్య రాజీతో ముడిపడ్డ అంశాల గురించి చెప్పేముందు.. అంతకుముందు జరిగిన కొన్ని విషయాలు తడుముకోవాలి.

సృజనపరుల లోకం వేరు
కవులు, కళాకారులు, సృజనపరులు అనేవారు.. ఇతరుల కంటే.. ఎక్కువగా తమదైన లోకంలో విహరిస్తారనే అనుకుంటా. తెలియకుండానే.. తమ ఊహాల్ని తమలో తాము విస్తరించుకుంటారు. తమదైన ప్రపంచాన్ని చాలా లేతప్రాయంలోనే కిటికీ తెరిచి మరీ చూస్తారు. వాటినే కలవరిస్తారు. కలలూగంటారు. లోలోనగల రొమాన్స్‌, కలలు, ఊహలు.. అనేవి.. మనసులోని ప్రతిచర్యలు. ఇక్కడ రొమాన్స్‌ అనేమాట.. బాహ్యపు స్పందనకాదు. అంతర్గత భావనే. అది మాటల్లో చెప్పలేం. అలా నవయవ్వనపు ప్రయాణంలో కొన్ని అనుభవాలు, అనుభూతులు అనివార్యంగా ఎన్‌కౌంటర్లుగా దాడిచేస్తాయి (నవ్వుతూ).

ఎన్‌కౌంటర్లూ ఎదుర్కొన్నవాడినే
నా జీవితంలో.. తప్పించుకోలేని, తప్పించుకున్నవైన కొన్ని ఎన్‌కౌంటర్లూ ఉన్నాయి. ఇక్కడ ఎన్‌కౌంటర్లంటే.. మనసుపై ఎక్కుపెట్టిన భావ సముదాయమూ కావొచ్చు. మరొకరివల్ల కలిగిన అనుభవాలూ కావొచ్చు. ఆ అనుభవాల్లో నేను పొందిన భావస్వేచ్ఛ కావొచ్చు. అవన్నీ.. నేను ఎన్‌కౌంటర్లగానే భావిస్తాను. తొలిప్రేమ ఎక్కడ మొదలైంది.. అని నన్ను అడిగితే.. ఆ ఎన్‌కౌంటర్ల గురించి కచ్ఛితంగా.. తడుముకోకుండా ఉండలేను. ఎన్‌కౌంటర్లంటే.. తుపాకులు, పిస్తోళ్ళుకాదు.. (నవ్వుతూ).. ఒకరకమైన (ఇన్‌ప్యాక్ట్యువేషన్స్‌) ఆకర్షణలూ కావొచ్చు. ప్రేమలాంటి అనుభవమూ కావొచ్చు. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇటీవల గుంటూరు వెళ్ళిన సందర్భంలో చాలారోజుల తర్వాత అక్కడ నేను చిన్నప్పుడే తిరిగిన ప్రదేశాలు చూసినప్పుడు.. అనుకోకుండానే నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. ఒక అమ్మాయి తెలియకుండానే నాకు గుర్తొచ్చేసింది. ఆ అమ్మాయిపేరు బాలత్రిపుర సుందరీదేవి. ఎనిమిది, తొమ్మిదోక్లాసుల్లో ఉండేటప్పటి ఆకర్షణ అది. రెండు జడలు, పట్టుపరికిణీ వేసుకుని ఎంతో అందంగా ఉండేది. బ్రాహ్మలమ్మాయి. నేనూ.. చిన్నపిల్లాడ్నేకానీ, ఆ అమ్మాయంటే.. ఎందుకో తెలియని ఆకర్షణ ఉండేది. సైకిల్‌ వేసుకుని ఆ పిల్ల ఇంటిదాకా పోవడం. నాలాగే మరొక అబ్బాయి.. ఆ అమ్మాయిని వెంబడించడం.. గమ్మత్తుగా ఉండేవి. అంతటి చిన్నవయసులో అది ఆకర్షణ అనలేం. ప్రేమ అని అసలే అనలేం. దాన్నే నేను మనసుపై ఎవరో చేసిన ఎన్‌కౌంటర్‌ అంటాను.

జీవితపు పరుగు ప్రయాణంలో
మద్రాసులో రైటర్‌గా సినిమాలకు పనిచేసేటప్పుడూ.. కొన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇద్దరు అమ్మాయిల (ఒకరు అప్పటికే పెద్ద పేరున్న డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, మరొకరు తర్వాత కాలంలో ఓ స్టార్‌ హీరోయిన్‌) తో ప్రేమ, పెళ్ళి అనే మాటలుదాకా పరిచయాలు సాగాయి. అయితే, అవన్నీ నేను నేనుగా.. ఆహ్వానించుకున్నవి కావు. వారితో నడవాలనీ అనుకోలేదు. వారి ప్రమేయంవల్లనో, లేక నాకే తెలియని ఇష్టంవల్లనో.. కొంతకాలం సావాసం కొనసాగింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలూ ఉన్నాయి. తర్వాత వారిద్దరూ..చాలా పెద్దస్టార్లు అయ్యారు.. అది వేరే విషయం అనుకోండి. కానీ, మనసు ఎక్కడో.. ఎవరితోనో సిద్ధమై ఉన్నప్పుడు.. ఇలాంటివన్నీ తాత్కాలిక ప్రేరణాంశాలుగానే మిగిలిపోతాయేమో. ఇలాంటి అనుభవాలన్నీ జీవితంలో ఒక పరుగులాంటి ప్రయాణమైతే, ఆ పరుగు ప్రయాణంలో.. నన్ను నేనే తెలుసుకోడానికి, నియంత్రించుకోడానికి ఈ ఎన్‌కౌంటర్లన్నీ కొన్ని అవకాశాలుగా వచ్చిపోయీ ఉండొచ్చు. బహుశా.. నా సహచరి రాజ్యలక్ష్మిని చేరుకోడానికీి.. అవన్నీ నన్ను నిలువరించిన హర్డిల్స్‌ అనుకుంటా.

విహాంగాలై.. భాగ్యనగరాన వాలి
ఇద్దరిదీ ఒకే ఊరు (గుంటూరు). రాజ్యలక్ష్మి వారి ఫ్మామిలీ కూడా మా పొరుగునే ఉండేవారు. అలా పరిచయం మాది. వాళ్లనాన్న పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో సీఐగా పనిచేసేవారు. మానాన్న హెడ్‌కానిస్టేబుల్‌. ఆర్థిక అంతరాలతోపాటు.. సంస్కృతీ సంప్రదాయాలూ వేరే. కానీ, పరిచయాలు, ప్రేమగా.. ఒక్కటి కావాలనే బంధంగా మారాయి. అయితే, నేను స్థిరపడ్డాకనే పెళ్ళి అనుకునేవాడ్ని. ఎందుకంటే మద్రాసు అనుభవాలు నాకు కొన్ని పాఠాలు నేర్పాయి. కానీ, అనివార్యంగా రాజీ ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఇద్దరం కూడబలుక్కుని.. గత్యంతరంలేని పరిస్థితుల్లో బస్సులో హైదరాబాద్‌ వచ్చేశాం.

అప్పటికే కవి మిత్రులుగా ఉన్న శివారెడ్డి ఇంటికి వెళ్ళాం. ముందుగా షాక్‌కి గురైనా.. శివారెడ్డి దంపతులు అక్కున చేర్చుకుని, వారి స్నేహితుల సమక్షంలో పెళ్ళి చేయడం.. దాదాపు తొమ్మిదినెలలపాటు వారి ఇంట్లోనే గడపడం.. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఓ జ్ఞాపకం. ఆ కొత్తజీవితంలో రాజ్యలక్ష్మి నాపై చూపించిన ఓర్పు, పరిణతి, ప్రేమ నన్ను జీవితంలో నన్నుగా నిలబెట్టాయనే చెప్తా.

ఆమె.. నేనూ
నలభై ఏళ్ళ వైవాహిక జీవితంలో మా మధ్య బంధాన్ని ఎలా వర్ణించను..?! అన్నీ తానైయ్యింది. నన్ను, నా అభిరుచుల్నీ అంతే ప్రేమించింది. పిల్లల్నీ తనే తీర్చిదిద్దింది. నా చుట్టూ ఉన్న స్నేహప్రపంచాన్నీ.. నా కంటే ఎక్కువగా ఆదరించింది.. అభిమానించింది. కవిగా, జర్నలిస్ట్‌గా, వృత్తిపరంగా నాకు నేనుగా రేపటి రోజుకోసం ఆలోచించకుండా ఆవేశంగా నిర్ణయాలు తీసుకున్నా.. ఏరోజూ బాధపడలేదు సరికదా.. ఆ సమయంలోనే నాకు అండగా ఉండేది. తనకంటే ముందుగా.. నేను వెళ్ళిపోతే.. ఎలా అనుకునేవాడ్ని కానీ, తానే.. నన్ను విడిచి వెళ్ళిపోతుందని ఊహించలేదు. తన జ్ఞాపకాలు ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నాయి.
ఆ పావలా బిళ్ళంత బొట్టు
ఆమె జ్ఞాపకంగా మిగిలిందిప్పుడు
మెటానమీ.. మాట్లాడబోతే
పచ్చరంగు మట్టిగాజుల చేతులు మరోజ్ఞాపకం
ఆ చేతులు అందించిన సెగలు కక్కుతున్న కాఫీ పొగలలో
చెదిరిన ఆమె కాటుక రేఖల
నగిషీల ప్రతిబింబం ఇంకో జ్ఞాపకం
గోరింట చూపుడు వేలు ఇంకో జ్ఞాపకం!! ..
అంటూ సాగే దేవిప్రియ అక్షరాల్లో తన సహచరి రాజ్యలక్ష్మిపై గల ప్రేమ ఓతడి ఆరని ప్రేమకావ్యం. కవిగుండెల్లో ఉదయించిన ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?!

– సంభాషణ: గంగాధర్‌ వీర్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap