దర్శక ధీరుడు – ‘విజయ’బాపినీడు

తెలుగు సినీ రంగంలో సినీ రచయితగా, సినీ దర్శకునిగా, నిర్మాతగా, పత్రికా అధిపతిగా విజయపథంలో పయనించిన విజయ బాపినీడుగారు అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 12 న కన్నుమూసారు.

క్రియేటివిటీ కుర్చీలో కూర్చుని పనిచేసుకోనివ్వదు. విజయబాపినీడు విషయంలో అదే జరిగింది. డిగ్రీ చదివిన వెంటనే పంచాయితీ బోర్టులో ఉద్యోగం వచ్చింది బాపినీడుకి. ఆ తర్వాత డిప్యూటీ తాసీల్దారుగా ప్రమోషనూ వచ్చింది. అయినా అందులో ఆయన నిలవలేదు. 
చలో మద్రాసు అనేశాడు. 
పత్రికా నిర్వహణ…ఆ తర్వాత సినిమాలు ఇలా జీవితం సాగింది. హిట్లు…ఫట్లు…విమర్శలు…పొగడ్తలు…అన్నిటినీ భరించాడాయన. చిన్న సినిమాలతో మొదలెట్టి పెద్ద సినిమాలకు ఎదిగాడు … 
విజయబాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. లైఫ్ పార్ట్ నర్ విజయ పేరుతోనే పత్రిక ప్రారంభించి విజయబాపినీడుగా జనం హృదయాల్లో నిల్చిపోయారు. 
పశ్చమగోదావరి జిల్లా చాటపర్రు గ్రామం నుంచి మొదలైన విజయబాపినీడు జీవితంలో తొలి ఉద్యోగం వచ్చింది మిత్రుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి చలవతోనే. అదే రవీంద్రనాథ్ చౌదరి పెట్టుబడితోనే సినిమా నిర్మాతగా దర్శకుడుగా జండా ఎగరేశారు బాపినీడు. 
కథను నడపడంలో నైపుణ్యమే కాదు…మాస్ ను ఎట్రాక్ట్ చేసే అంశాలేమిటనే విషయంలోనూ స్పష్టత ఎక్కువగా ఉండడమే విజయబాపినీడు సక్సస్ సూత్రం.

కడుపు నిండిన బేరం కావడం వల్ల విజయబాపినీడు మొదట్లో డిటెక్టివ్ నవల్స్ రాసేవారు. అందులో చీరవిడిచిన వీర వనిత చాలా పాపులర్. ఆర్ధికంగా సెటిల్ కావడానికి థర్డ్ రేట్ పత్రికలతో కెరీర్ మొదలెట్టారు.. అలా వచ్చినవే రమణి, రాధిక. ఆ తర్వాత విజయ ప్రారంభించారు. విజయ పత్రికే కాదు…ఆ పేరుతో తీసిన సినిమా కూడా పెద్ద హిట్టే. 
ఈ రోజు వెబ్ సైట్స్ టైప్ లో ఆనాడే సినిమాలకు రేటింగ్స్ ఇచ్చేవారు విజయబాపినీడు. విజయ మంత్లీలో మూవీ రెవ్యూలతో పాటు రేటింగ్స్ ఇచ్చేవారు. అదే టైమ్ లో బిగ్ మూవీస్ మీద కామెంట్ చేశారు. ఎన్.టి.ఆర్ కిచ్చే రెమ్యూనరేషన్ తో రెండు మూడు చిన్న సినిమాలు తీయచ్చనేశారు. అప్పటికి రామారావుగారి రెమ్యూనరేషన్ మహా అయితే ఐదు ఆరు లక్షలుండేదేమో. విచిత్రంగా అదే విజయబాపినీడు చిరంజీవికి దాదాపు డెబ్బై లక్షల దాకా ఇచ్చి మరీ సినిమాలు తీశారు. గ్యాంగ్ లీడర్ లాంటి మెగా హిట్సూ కొట్టారు. 
పావిజయ పత్రికతో టే బొమ్మరిల్లు చిన్నపిల్లల పత్రిక కూడా నడిపేవారు బాపినీడు. 

దాసరి సుబ్రహ్మణ్యం గారి మృత్యులోయ లాంటి అద్భుతమైన సీరియల్స్ తో బొమ్మరిల్లు పిల్లలను విశేషంగా ఆకట్టుకునేది. నిర్మాతగా మారి అదే టైటిల్ తో ఓ అద్భుతమైన ఫ్యామ్లీ డ్రామా తీసి భారీ వసూళ్లు సాధించారు బాపినీడు. 
పండంటి కాపురం సినిమా లాంటి కథనే ఇంకాస్త నావల్ గా తయారు చేసుకుని బొమ్మరిల్లు తీశారు. 
విజయబాపినీడు సినిమా తీయాలనుకున్న టైమ్ లో దాసరి మంచి స్వింగ్ మీదున్నారు. వెంటనే ఆయన్ను కల్సి యవ్వనం కాటేస్తే కథను ఖాయం చేసి కృష్ణంరాజు, జయచిత్ర, నరసింహరాజు తదితరులతో తెరకెక్కించారు. అదే టైమ్ లో మన్మథలీలై పేరుతో తమిళ్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన బాలచందర్ సినిమా రైట్స్ తీసుకుని తెలుగులో డబ్ చేశారు. 
డబ్బింగ్ సినిమా ఎలా చేయాలో ప్రపంచానికి చాటి చెప్పారు. స్ట్రెయిట్ సినిమా లెవెల్లో తీసిన ఆ సినిమా తెలుగులో బారీ విజయం సాధించింది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ సంస్ధను నిలబెట్టింది. 
విజయబాపినీడు తీసిన తొలి చిత్రం యవ్వనం కాటేసిందే అయినా…పేరు తెచ్చిన సినిమా మాత్రం మన్మథలీలే. మన్మథలీల సినిమా ఒరిజినల్ ను చాలా ఎడిట్ చేసి కొన్ని సీన్లు ముందుకు మార్చి…ఇలా తెలుగు ఆడియన్స్ కు నచ్చేలా దాదాపు స్ట్రెయిట్ మూవీకి పడ్డంత కష్టం పడ్డారు విజయబాపినీడు. కమల్ హసన్ కు చక్రవర్తి…కమల్ దగ్గరుండే ముసలి సెక్రటరీకి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం విశేషం. 
బొట్టు కాటుక టైమ్ లో విజయబాపినీడుకు చిరంజీవి పరిచయం అయ్యారు. బొట్టు కాటుక సినిమాలో నూతన్ ప్రసాద్ గెటప్ చూసిన చిరంజీవి అదే విషయమై విజయబాపినీడుతో మాట్లాడారు. అలా మొదలైన పరిచయం ఆ తర్వాత సినిమా చిరంజీవితోనే తీసేలా చేసింది. చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్ లో పట్నం వచ్చిన పతివ్రతలు టైటిల్ తో వచ్చిన ఆ సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. 
విజయబాపినీడు కమర్షియల్ సినిమాలే చేశారు. జనం కోరుకునే చిత్రాలే తీశారు. కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండానే ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. తన సినిమాల్లో కామెడీ ఉండేలా చూసుకునేవారు. అలాగే ఓ తరహా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు జాగ్రత్తలు పాటిస్తూనే శృంగారాన్నీ తగుపాళ్లలో కలిపేవారు. కొన్ని సెన్సిబుల్ ఇంట్రస్టింగ్ అంశాలూ ప్రస్తావించేవారు. అవి కూడా శృంగారపరిధిలోనే ఉండేలా చూసుకునేవారు. అదే ఆయన సక్సస్ సీక్రెట్. 
పట్నం వచ్చిన పతివ్రతలు తర్వాత అనుకోకుండా తనే డైరక్టర్ అయిపోయారు బాపినీడు. మౌళి బిజీ కావడంతో తనే డైరక్ట్ చేయాల్సి వచ్చింది. అదే మగమహారాజు. ఫ్యామ్లీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తే కాసులు గ్యారంటీ అని నమ్మేవారు విజయబాపినీడు. ఆయన సినిమాలన్నిట్లోనూ మధ్యతరగతి కుటుంబ నేపధ్యం తప్పనిసరిగా ఉంటుంది. ఆనాటి సామాజిక పరిస్ధితుల నేపధ్యంలో ఫ్యామ్లీస్ ని ఎట్రాక్ట్ చేయడమే సేఫెస్ట్ మెధడ్ గా భావించేవారాయన. ఆ బ్యాలెన్స్ తప్పిన సందర్భాల్లోనే అపజయాలు చవిచూడాల్సి వచ్చింది. 
పట్నం వచ్చిన పతివ్రతలు తర్వాత శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా మగమహారాజు. మౌళినే డైరక్ట్ చేయాల్సిన ఈ సినిమా అనుకోకుండా విజయబాపినీడుని డైరక్టర్ ని చేసింది. డేట్స్ క్లాష్ రావడంతో బాపినీడే మెగాఫోన్ పట్టుకున్నారు. మళ్లీ ఫ్యామ్లీ డ్రామా. దాదాపు బొమ్మరిల్లు లాంటి కథే. ఇంటిని చక్కదిద్ది మగమహారాజు అనిపించుకున్న ఓ పెద్ద కొడుకు కథతో తెరకెక్కిన ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాదించింది. 
చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో మగమహారాజు కూడా ఒకటి. ఆ సినిమాతోనే చిరంజీవి సన్నిహిత వర్గాల్లో ఒకడుగా మారిపోయారు విజయబాపినీడు. టైటిల్స్ సెట్ చేయడంలో విజయబాపినీడు కొంచెం డిఫరెంటు. కేవలం టైటిల్ తోనే బిజినెస్ చేసేయడం ఆయన స్టైల్. చిరంజీవి తో మగమహారాజు తర్వాత ప్రారంభించిన మహానగరంలో మాయగాడు టైటిల్ కీ అంతటి క్రేజే వచ్చింది. సినిమా కొంచెం కన్ఫూజ్ చేసినా ఓపెనింగ్స్ మాత్రం కుమ్మేశారు. 
బొమ్మరిల్లు నుంచి మురళీమోహన్ తోనే సినిమాలు తీసిన విజయబాపినీడు పట్నం వచ్చిన పతివ్రతలు తర్వాత చిరంజీవితో కంటిన్యూ అయ్యారు. చిరంజీవితో పాటే శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బడ్జట్ కూడా పెరగడం ప్రారంభమైంది. చిన్న సినిమాలతో మొదలైన ప్రయాణం క్రమంగా బిగ్ మూవీస్ కి చేరింది. చిరంజీవితో విజయబాపినీడు తీసిన మరో బిగ్ సక్సస్ ఖైదీ నంబర్ 786. చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. 
చిరంజీవి తో విజయబాపినీడు సాన్నిహిత్యం ఎంతదాకా వెళ్లిందంటే..చిరంజీవి కోసం ఓ భారీ పత్రిక పెట్టేదాకా. చిరంజీవి టైటిల్ తో ఓ పత్రిక తీసుకొచ్చి..దానిలో అన్నీ చిరంజీవికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ స్టోరీస్ ఉండేలా ప్లాన్ చేశారు విజయబాపినీడు. క్రేజీ మ్యాగజైన్ గా చిరంజీవి పత్రిక ప్రారంభమైన టైమ్ లోనే చిరంజీవితో ఓ భారీ విజయాన్ని నమోదు చేశారు బాపినీడు. 
చిరంజీవికి సంబంధించిన సమాచారంతోనే ఒక పత్రిక తీసుకురావడం విజయబాపినీడు ముందుచూపుకు నిదర్శనం. ప్రస్తుతం ఎవరికి వారు వెబ్ సైట్లు పెట్టీ…ట్విట్లర్ సాయంతోటీ జనాలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్ధితిని అప్పట్లోనే ఊహించిన బాపినీడు చిరంజీవి అనే పత్రిక తీసుకువచ్చారు. సక్సస్ ఫుల్ గా నడిపారు. అదే టైమ్ లో చిరంజీవిని స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి అపజయాలు చుట్టుముట్టాయి. ఆ టైమ్ లో గ్యాంగ్ లీడర్ సంధించారు బాపినీడు. సినిమా మామూలు సక్సస్ కొట్టలేదు. బాక్స్ బద్దలైపోయింది. 
చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో గ్యాంగ్ లీడర్ ది స్పెషల్ పేజ్. ఎందుకంటే ఈ సినిమా శతదినోత్సవం కూడా చాలా నావల్ గా ప్లాన్ చేశారు బాపినీడు. ఒకే రోజు విజయవాడ, హైద్రాబాద్, విశాఖపట్నాల్లో ప్లాన్ చేసి సక్సస్ ఫుల్ గా చేయించేశారు. అసలు గ్యాంగ్ లీడర్ కు ముందు అనుకున్న టైటిల్ అరె ఓ సాంబ. నిజానికి గ్యాంగ్ లీడర్ అని టైటిల్ ఎందుకు పెట్టావ్ అరి ఒ దశలో చిరంజీవి ప్రశ్నించారు. ఫ్లామ్లీ ని గ్యాంగ్ కు సింబలైజ్ చేసి లీడర్ అనే పదాన్ని జస్టిఫై చేశారు బాపినీడు. ప్రతి పాటా సూపర్ హిట్ కొట్టడం విశేషం. 
విజయబాపినీడు తో ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చేవారు చిరంజీవి. ఆయన మీద నమ్మకం అంతటిది. అల్లు అరవింద్ బ్యానర్ గీతాఆర్ట్స్ నిర్మించిన చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు బాపినీడు. ఈ నమ్మకాన్ని గ్యాంగ్ లీడర్ ఎక్కడికో తీసుకెళ్లింది. బాపినీడు ప్లానింగ్ తో పాటు టేకింగ్ మీద కూడా చిరంజీవికి బారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవి. పాటల దగ్గర నుంచి చాలా చాలా కేర్ తీసుకునేవారు విజయబాపినీడు. 
ఫైట్స్ విషయంలోనూ గ్యాంగ్ లీడర్ ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీనే. ఒకేసారి వందమందితో తలబడడం అనేదాన్ని చాలా ఎఫెక్టివ్ గా చూపించారు బాపినీడు. ఆ స్టైల్ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనపడదరు. ఒక మాస్ హీరో నుంచి ఆడియన్స్ ఏమి ఆశిస్తారో…ఏం చూడాలని కోరుకుంటారో…అవన్నీ తన సినిమాల్లో పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు బాపినీడు. 
ఎంతటి నిర్మాతకైనా దర్శకుడికైనా అపజయాలు తప్పవు. కె.వి.రెడ్డి లాంటి వాడికి కూడా కెరీర్ చివరి రోజుల్లో సరైన హిట్ తగల్లేదు. విజయబాపినీడు కీ తప్పలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బిగ్ బాస్ సినిమా బాక్సాఫీసు దగ్గర డీలా పడింది. ఆ తర్వాత చేసిన ఒకటి రెండు ప్రయత్నాలు కూడా కలసి రాలేదు. చిరంజీవితో మరో సినిమా చేయాలన్న ఆలోచనలూ కలసి రాలేదు. ప్రియమిత్రుడు రవీంద్రనాథ్ చౌదరి భౌతికంగా దూరం అయిన తర్వాత ఎందుచేతో విజయబాపినీడుకి విజయం ముఖం చాటేసింది. 
గ్యాంగ్ లీడర్ సినిమా పూర్తి అవుతున్న టైమ్ లో ఒక విచిత్రం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ అధినేత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి. ఆ తర్వాత నేదురుమిల్లి జనార్ధనరెడ్డి కాబినెట్ లోనూ మంత్రి పదవి వరించింది. ఆ సందర్భంగా ప్రమాణస్వీకారం చేస్తూ…వేదిక మీదే మరణించారు రవీంద్రనాథ్ చౌదరి. ఆయన మరణానంతరం గ్యాంగ్ లీడర్ విడుదలైంది. 
మాగంటి రవీంద్రనాథ్ మరణం తర్వాత శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా బిగ్ బాస్. దాదాపు ఆ బ్యానర్ లో అదే చివరి చిత్రం కూడా. చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని విజయబాపినీడు పెట్టిన బిగ్ బాస్ టైటిల్ కు అనూహ్య స్పందన వచ్చింది. గ్యాంగ్ లీడర్ విజయాన్ని మరపించే చిత్రం అవుతుందన్నారు అంతా. 
1995లో విడుదలైన బిగ్ బాస్ బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలం చెందింది. 
సాంకేతికంగా కూడా శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ వారి గత చిత్రాల స్తాయిలో కనిపించదు బిగ్ బాస్. బిగ్ బాస్ పరాజయం తర్వాత విజయబాపినీడు కూడా ఒకటి రెండు చిత్రాలు తీశారుగానీ అవీ కలసిరాలేదు. చిరంజీవితో ఎలాగైనా సినిమా చేసి హిట్ కొట్టి రిటైర్ కావాలనే ఆయన కల తీరనే లేదు.
ప్రతి పుట్టిన రోజుకీ చిరంజీవి ఒక మాట చెప్పేవారు. ఈ ఏడాది విజయబాపినీడుగారికి ఓ సినిమా చేయాల్సి ఉంది అని…ఆ హడావిడి ముగిసిన తర్వాత మామూలే. ఒక దశలో విజయబాపినీడు బ్యానర్ లో చిరంజీవి హీరోగా చిత్రం అని వార్తలు వచ్చాయి. దర్శకుడు గా వి.ఎన్.ఆదిత్య పేరు వినిపించింది. అయితే అదీ ముందుకు సాగలేదు. ఈ లోగా చిరంజీవి సినిమాలు వదిలేశారు కూడా. చిరంజీవితో ఇలాంటి ఆశాభంగం పొందిన నిర్మాతల్లో దేవీవర ప్రసాద్ తర్వాత విజయబాపినీడు పేరు చెప్పవచ్చు. 

– భరద్వాజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap