దేవేంద్రాచారికి పెద్దిబొట్ల సుబ్బరామయ్య స్మారక పురస్కారం

ప్రసిద్ధ కథా నవలా రచయిత సుంకోజి దేవేంద్రాచారి కి పెద్దిభొట్ల సుబ్బరామయ్య సాహితీ పురస్కారాన్ని ప్రకటించారు .
తెలుగు సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన సీనియర్ సాహితీవేత్త పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పేరిట అందచేస్తున్న ఈ స్మారక పురస్కారానికి చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలానికి చెందిన సుంకోజి దేవేంద్రాచారి ఎంపికయ్యారు.
డిసెంబర్ పదహైదు శనివారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగే కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయిత భమిడిపాటి జగన్నాథరావు గారి చేతుల మీదుగా పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కుటుంబ సభ్యుల ద్వారా దేవేంద్రాచారి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

తెలుగు సాహిత్య రంగంలో రెండు దశాబ్దాలకు పైగా కథ ,కవిత్వం, నవల ప్రక్రియల్లో విశేషంగా కృషి చేస్తున్న దేవేంద్రాచారి పలు సాహిత్య పురస్కారాలను అవార్డులను పొందారు.
ఇప్పటి వరకు వీరు వంద కథలు, రెండు వందల కవితలు, ఏడు నవలలు రాశారు. ప్రముఖ వారపత్రిక నవ్యలో నవ్య నీరాజనం పేరిట ఇరవై అయిదు మంది సాహితీ వేత్తలను ఇంటర్వ్యూ చేశారు.
జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు అవార్డులను పొందారు. జిల్లాస్థాయి ఉత్తమ యువ రచయిత,రాష్ట్రస్థాయి ఉత్తమ యువ రచయిత పురస్కారాలతో పాటు కలకత్తాలో ప్రఖ్యాత భారతీయ భాషా పరిషత్ యువ పురస్కారాన్ని పొందారు. రంగినేని ఎల్లమ్మ సాహితీ పురస్కారాన్ని ,బీఎస్ రాములు విశాల సాహితీ పురస్కారాన్ని, గురజాడ కథా పురస్కారాన్ని ,హోసూరు ఉగాది పురస్కారాన్ని, తెలుగు భాషా పురస్కారాన్ని పొందారు. ఏఎస్ సుందర రాజులు స్మారక పురస్కారాన్ని ఉత్తమ జర్నలిస్టుగా అందుకున్నారు.

గ్రామీణ క్రీడలపై ఆసక్తికరంగా వారు రాసిన మన మంచి ఆటలు పుస్తకం వీరికి గుర్తింపును తీసుకువచ్చింది. 2007 లో అన్నంగుడ్డ కథా సంపుటిని, 2011 లో “దృశ్యాలు మూడు ఒక ఆవిష్కరణ” కథా సంపుటిని,
2015 లో ఒక మేఘం కథా సంపుటిని వెలువరించారు. 2012 లో “నీరు నేలా మనిషి” నవలను,2018 లో “రెక్కాడిన0త కాలం” నవలను వెలువరించారు. రవీంద్రనాథ్టాగూర్ నూట యాభై వ జయంతోత్సవాల సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై 2010 లో వీరు శాంతినికేతన్ వెళ్ళివచ్చారు.
ఒక్కో భాష నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయగా వీరు తెలుగు భాషా ప్రతినిధిగా శాంతినికేతన్ సందర్శించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ కథా సంధ్య పేరుతో 2014 లో నిర్వహించిన కార్యక్రమంలో అన్నంగుడ్డ కథను చదివి
వినిపించి, తన సాహితీ అనుభవాలను వివరించారు.

కథలు, నవలల పోటీల్లో వీరి రచనలు అనేకం బహుమతులు పొందాయి. ఆటా తానా అవార్డులను, నవ తెలంగాణ పత్రిక నిర్వహించిన కథల పోటీలో కథకు మొదటి బహుమతిని, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నవలల పోటీలో ” రెక్కాడిన0త కాలం “నవలకు బహుమతిని, తానా నవలల పోటీలో ” నీరు నెలా మనిషి ” కి బహుమతిని పొందారు.
ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రిక కడప జిల్లా ఎడిషన్ ఇంచార్జిగా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link