మన బుడుగ్గాడికి అరవై నాలుగు ఏళ్ళు అని మీకు తెల్సా .. అనగా ఈ సంవత్సరం షష్టి పూర్తి అయి పైన నాలుగేళ్లు మాట. నాకు తెలీక అడుగుతాను.. ఆడికి వయసెక్కడ పెరుగుతోంది.. ఇంకో వందేళ్ళు దాటినా వాడు మన అందరికీ బుడుగే.. మనం కూడా చిన్నప్పుడు బుడుగులమే.. కానీ మనకు వయసు పెరిగినా ఈ బుడుగ్గాడి అల్లరికి మాత్రం అస్సలు పెరుగదు. బహుశా అమృతం తాగాడేమో? లేదా మన బుడుగు వెంకట రమణ గారు అమృతం లో తన కలం అద్ది మరీ వ్రాసారేమో? అలాగే బాపు గారు కూడా అమృతంతో కుంచెనద్ది గీసారేమో? అందుకే వీడు నిత్య నూతనుడు .. అంటే ఎవర్ గ్రీన్ అంటాము కదా అలా అన్నమాట.
భామ్మని, బాబాయిని, విశ్వనాథాన్ని .. పక్కింటి పిన్ని గారిని.. జట్కా వాడిని, రాధను.. గోపాలాన్ని.. చివరకు తన చిన్ని గర్ల్ ఫ్రెండ్ సీగేన పెసూనామ్బని కూడా వదలక సాధిస్తాడు.. వీడికి ఇంత చిన్న వయసులో ఎంత లౌక్యం తెల్సు? ఎవరి దగ్గర ఎలా మెలగాలో తెల్సు. ఎంత అల్లరి చేసినా రాధను గోపాలాన్ని ఏడిపించినా చివరకు భామ్మ రషిస్తుందన్న ధీమా.. బుడుగ్గాడు ఎంతటి అల్లరి వాడు.. ఇంతమందిని సాధించేసాడు. అసలేమైనా వాడు చిన్నవాడా చితకవాడా .. అసలే వాడంతటి వాడు వాడు.
మా ఇంట్లో బుడుగులు ఉన్నారు వాళ్ళదీ ఇదే తంతు.. అయినా ఈ బుడుగులకు ఏం తక్కువ లేదు.. ప్రతి ఇంట్లోను ఉన్నారు.. ఇంకా వస్తూనే ఉంటారు, ఈ వెధవ ఖానా బుడుగులను ఏం అనకండే.. అలా అంటే ఈ మాస్టారు బుడుగుకి ఖోపం వచ్చేస్తుంది మరి. బుడుగులకు ఖోపం వస్తే వాళ్లను రషించడానికి వారి వెనుకాల బామ్మలున్నారు మరి.
ఇంతకీ మీ ఇళ్లలో బుడుగు పుస్తకం ఉందా లేదా? రామాయణం , భగవద్గీత , భాగవతం, భారతం ఇత్యాది పుస్తకాలూ ఎంత ముఖ్యమో మన ఇళ్లలో అల్లరి కృష్ణుడంతటి వాడైన బుడుగు పుస్తకమూ ఉండాలి సుమీ…
(బుడుగు పుస్తకం వచ్చి అరవై నాలుగు ఏళ్లయిన సందర్బంగా… 64కళలు.కాం లో సరదాగా ….)