ఆర్ష సూఫీ సిద్ధాంతాల మేలు కలయికగా రూపుదిద్దుకొన్న మానవతా మందిరం .. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా.. పిఠాపురంలో నెలకొనిఉన్న విశ్వ ఆధ్యాత్మిక పీఠంలో.. మానవతా స్ఫూర్తి అడుగడుగునా కన్పిస్తుంది.కులం, మతం, వర్గం,వర్ణం, జాతి, భాష వంటి అనేక అడ్డంకులను అధిగమించి.. మనుషులంతా ఒక్కటేనన్నమానవీయ సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది ఈ ఆధ్యాత్మిక పీఠం. అన్నిమతాల సారమూ ఒక్కటే నన్న, మహనీయుల హితోక్తిని ఆచరణలో వెల్లడి చేస్తోంది ఈ ఆధ్యాత్మిక పీఠం. అంతేకాదు.. మతం అనే ఆలోచనను కూడా అధిగమించి ముందుకు సాగుతూ.. “మానవత్వమే ఈశ్వరత్వం” అనే ఉత్కృష్టమైన భావనను నిర్ద్వందంగా ప్రతిపాదిస్తోంది ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం.
ఇంతకన్నా మించి..”భగవంతుడు ఒక్కడే”అన్న సనాతమైన ధార్మిక సిద్ధాంతాన్ని ఆచరణ పూర్వకంగా..తమ జీవితాలే సందేశంగా దాదాపుగా ఐదువందల ఏళ్ల నుండి కృషి చేస్తున్నారు ఈ పీఠం అధిపతులు.ప్రస్తుత పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా ఒకవైపు తన పూర్వుల మార్గాన్ని అనుసరిస్తూనే..మరొక వైపు అంతకన్నా మిన్నగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టి..పీఠాన్ని జనులకి మరింత చేరువ చేసారు..చేస్తున్నారు. ఆక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ,సామాజిక సేవ వంటి అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ..భక్తులను చైతన్య పరుస్తూ..క్రియాశీలకంగా ఉండేలా వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు డా.ఉమర్ ఆలీషా గారు.అందమైన రూపం.మంచి వర్చస్సు,ముఖంలో ప్రశాంతత, మాటల్లో మంచితనం,ఆచరణలో నిబద్ధత,ఆలోచనల్లో నవ్యత…ఇవన్ని ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారి ప్రత్యేకతలు.
విశ్వ ఆధ్యాత్మిక పీఠం చరిత్ర
ఒకనాడు ఈ ఆధ్యాత్మిక పీఠాధిపతి బాగ్దాద్ లో ఉండేవారట.క్రమంగా ఈ పీఠం పర్షియా చేరింది.అక్కడినుండి భారత దేశం తన గమ్యస్థానంగా నిర్ణయించుకొని..క్రీ.శ.1472లో దేశ రాజధానికి ఆనాటి పెద్దలు.ఆనాటికి డిల్లిని బహ్లుల్ ఖాన్ లోడి పరిపాలిస్తున్నాడు.డిల్లిలో విశ్వ ఆధ్యాత్మిక పీఠం తన శాంతి సందేశాన్ని ప్రజలలో వ్యాప్తి చేస్తూ వచ్చింది.క్రమంగా లోడీల పాలన ముగిసింది.దేశం మొగలాయీల పాలన లోకి వచ్చింది.ఆకాలంలోనూ.. ఈ పీఠం తన కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చిందిట.మొగల్ చక్రవర్తి షాజహాన్..పెద్ద కుమారుడైన దారా షుకో,ఆతని చెల్లెలు జేబున్నిసాలను కూడా ఈపీఠాధిపతులు ఆశీర్వదించారు.కొంతకాలానికి ఈ పీఠం దక్షిణాదికి తరలి వచ్చింది.తూర్పు గోదావరిలోని తుని,కొట్టం జాగీరులు ఈ పీఠానికి లభించాయి.అందువల్ల విశ్వ ఆధ్యాత్మిక పీఠం గోల్కొండను వదిలి,తుని రావడం జరిగింది.కొంతకాలం సంచార పీఠంగా ఉన్న ఈ పీఠం..కాలక్రమంలో పిఠాపురాన్నితన స్థిర నివాసం చేసుకొంది. క్రమంగా దేశ విదేశాలలో ఉన్న వేలాదిమంది భక్తులకు ఇది గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమయ్యింది.
పీఠాధిపతులు-మార్గదర్శులు
తొలినుండి ఈ ఆధ్యాత్మిక పీఠం ఉత్తములైన మహనీయుల మార్గదర్శకత్వంలో సాగుతూ వచ్చింది.బ్రహ్మర్షి మదీన్ కబీర్ షా గారు తొలి పీఠాధిపతి.వీరు మదీనా నుండి వచ్చిన తత్వవేత్తగా సుప్రసిద్ధులు.వీరి తరువాత మదార్ షా గారు,హసన్మియాషా గారు ,కహెనెషావలి గారు,మొహియుద్దీన్ బాద్షా గారు వరుసగా పీఠాధిపతులై ..విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్నిఉన్నత పధంలోకి నడిపించారు.
ఆరవ పీఠాధిపతి ఉమర్ ఆలీషా గారు వీరందరికన్నా ఒక అడుగు ముందుకు వేశారు.భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు,ఆయన మంచి కవి,రచయిత.నాటక కర్త,గొప్ప వక్త.శతావధాని.వీటితో పాటుగా భారత పార్లమెంటు సభ్యులు కూడా.దేశంలోని ప్రముఖులు అందరితో వారు ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించేవారు.1936లో వీరికి ఇంటర్నేషనల్ అకాడమి ఆఫ్ అమెరికా వారు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఇచ్చి గౌరవించారు. అటుతరువాత హుస్సేన్ షా గారు,వారి అనంతరం మొహియదిన్ బాద్షగారు విశ్వ ఆధ్యాత్మిక పీఠానికి అధిపతులై ప్రజలలో సమతా భావాన్ని,త్యాగశీలతని పెంపొందించడానికి ఎంతగానో కృషి చేసారు.
పీఠం విశిష్టత
ఈ పీఠంలో..సర్వమత సమ్మతమైన ఏకేశ్వరోపాసన,ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో,లౌకిక తాత్విక సంమిశ్రితంగా అనుభవంలో నిరూపణ కాబడే ఆధ్యాత్మిక తత్త్వం ప్రబోధించబడుతుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం,విశ్వశాంతి సుస్థిరతలకు తోడ్పడడం అనే ఆశయాలు ఈ పీఠానికి ప్రాతిపదికలు.మానవుడిని ఉన్నతుడిగా తీర్చిదిద్దడమే ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ప్రధాన లక్ష్యం. సద్గురు ప్రబోధిత మహా మంత్రం పొందిన సాధకునికి సూక్ష్మమైన, సులభమైన త్రయీ సాధన విధానంలో.. అనుభవ పూర్వకంగా ఆధ్యాత్మిక విద్య నేర్పి,విశ్వరూపిగా,సాయుజ్యునిగా తీర్చి దిద్దుతుంది ఈ పీఠం.
అంతే కాదు..భగవంతుడు మనలోనే ఉన్నాడు ..మోక్షం మనలోనే ఉంది .. అందుకే సద్గురువును ఆశ్రయించి “నేను”అనే రహస్యాన్ని గ్రహించే ఆత్మజ్ఞానిగా పరిణామం చెందమని.. ఎంతో విలువైన మానవ జన్మను సార్ధకం చేసుకోమని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం బోధిస్తోంది. దానితో పాటుగా.. ఆత్మ జ్ఞానం కోసం ఏ సభ్యుడు తన సంసారాన్ని, తన బాధ్యతలను, తన వృత్తిని విస్మరించవలసిన అవసరం లేదని వివరిస్తుంది ఈ ఆధ్యాత్మిక పీఠం.
మహా మంత్రం
ఈ పీఠంలో మహామంత్రం పొందిన క్షణం నుండి .. తుది శ్వాస విడిచేవరకూతన జీవిత బాధ్యతలను, వృత్తి ఉద్యోగాలను నిర్వహిస్తూనే..మనసులో మహా మంత్రాన్ని మననం చేసుకోవచ్చు.దానితో శరీరంలోని జీవాణువుల్లో ఈశ్వర రస స్వరూప శక్తి ప్రసరించబడుతుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక కష్టాలు, బాధలు, సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. ఈ మహామంత్రం పర్వదినాలలో మాత్రమే పీఠాధిపతి చేత ఉపదేశించబడుతుంది.
పర్వదినాలు
జనవరి1, జనవరి23, ఫిబ్రవరి 9,10,11, మార్చి మొదటి సోమవారం శ్రీ కహెనేషావలి సద్గురువుల ఆరాధన,ఉగాది సభ, వైశాఖ సభ, గురుపౌర్ణమి సభ,సెప్టెంబర్9, సప్తమ పీఠాధిపతి శ్రీ హుస్సేన్ షా గారి జన్మదినోత్సవ సభ, కార్తీక పౌర్ణమి సభ వంటివి ఈ పీఠంలో నిర్వహించే పర్వదినాలు.వీటితో బాటుగా ప్రతి గురువారం పీఠంలో సభ జరుగుతుంది.గురు దర్శనం లభిస్తుంది.
ప్రచురణలు
విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం .. ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. శ్రీ ఉమర్ ఆలీషా గ్రంధ మండలి ప్రచురించిన ఎన్నో గ్రంధాలు అనేక అంశాలపై జ్ఞాన సముపార్జనా సాధనాలుగా ఎంతగానో ఉపయుక్త మవుతున్నాయి. ప్రతినెల తత్వ జ్ఞానం ఆధ్యాత్మిక పత్రిక వెలువడుతోంది.
ప్రస్తుత పీఠాధిపతి
డా. ఉమర్ ఆలీషా గారు ఈ పీఠానికి ప్రస్తుత అధిపతి. సహృదయం,సౌజన్యం కలబోసిన మంచి మనిషి.సూఫీ తత్వవేత్త. విద్యాధికులు.హోమియో వైద్యంలో పట్టభద్రులు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. మానవసేవలోనే భగవంతుడు ఉన్నాడని.. అందువల్ల మానవ సేవే.. మాధవ సేవ అని మనసారా నమ్మి..ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఆనాటి నుండి ఈ ట్రస్ట్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, దాతృత్వ సేవల రూపాలలో ఈ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వేలాదిమందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దింది ఈ ట్రస్ట్.ఆరు గ్రామాలలో నిరంతర విద్యా కేంద్రాల నిర్వహణ జరుగుతోంది.బాల కార్మికులను పాఠశాలల్లో చేర్చడం జరిగింది.పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలను అందిస్తోంది ఈ ఉమర్ ఆలీషా ట్రస్ట్.
ఇక ..వైద్య సేవల గురించి చెప్పాల్సివస్తే, ఈ ట్రస్ట్ చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం.చికున్ గున్యా వ్యాధి ప్రబలినప్పుడు ..47 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.సైన్ ఫ్లూ వ్యాధి నిర్మూలనకు హోమియోపతి మందుల పంపిణి శిబిరాలను నిర్వహించి,లక్షలాది మందికి వ్యాధి నిరోధక మందులు అందించింది. రక్తదాన శిబిరాలను నిర్వహించింది.. నిర్వహిస్తోంది. మహిళాభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోవలసి వస్తే.. ఉమర్ ఆలీషా ట్రస్ట్ 5300 మంది మహిళలకు కుట్టు పనిలో శిక్షణ ఇచ్చింది. 197 స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు కృషి చేసింది. పర్యావరణ పరిరక్షణ ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఒక మంచి కార్యక్రమం. లోకంలో పచ్చదనం నింపాలనే ఉన్నతమైన సంకల్పంతో.. మొక్కలు నాటడానికి సంకల్పించింది ఉమర్ ఆలీషా ట్రస్ట్. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ నాటిన మొక్కలు ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు.కేవలం మొక్కలు నాటడమే కాదు.. వాటిని పరిరక్షించడంలో కూడా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు నిర్వహిస్తున్న పాత్ర చెప్పుకోదగ్గది. అంతేకాదు..పేదలకు బియ్యం పంపిణీ, బట్టల పంపిణీవంటి కార్యక్రమాలను, వేసవిలో చలివేంద్రాలను నిర్వహిస్తూ సామాజిక సేవారంగంలో తనదైన పాత్ర పోషిస్తోంది ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్.ఇలా.. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క పరిధిని విస్తరింప చేసి.. సమాజ సేవలోనే ఈశ్వరుడిని సాక్షాత్కరింపజేసుకోవడమనే ఉత్తమమైన ఆలోచనను దర్శింప చేసారు.. చేస్తున్నారు ప్రస్తుత పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా గారు.
డా. ఉమర్ ఆలీషా గారి కృషిని,మంచి ప్రయత్నాలను గుర్తించిన ఎన్నో సంస్థలు వారిని పురస్కారాలతో గౌరవించాయి.2006లో అమెరికాలోని రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007లో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ భారత మాత ముద్దుబిడ్డ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారి ఉగాది పురస్కారం 2013లో వీరికి లభించింది. సావిత్రి బాయి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ వారి సావిత్రి బాయి ఫూలే జీవిత సాఫల్య పురస్కారం వీరిని 2016లో వరించింది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వీరికి 2016ఆత్మీయ పురస్కారం ప్రదానం చేసింది. వీటన్నిటికి తోడుగా 2017 లో ఎ.పి.గ్రీన్ అవార్డ్, 2018 లో జీవ వైవిధ్య పురస్కారం డా. ఉమర్ ఆలీషా గారు అందుకొన్నారు.
దేశ విదేశాలలో నిరంతరం పర్యటిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిపెట్టడంతో పాటుగా వారికి సామాజిక బాధ్యతని గుర్తు చేయడంలో డా.ఉమర్ ఆలీషా గారు నిర్వహిస్తున్న పాత్ర చాల గొప్పది. అందుకే అశేష జనావళికి ఆయన అంత ఆత్మీయులయ్యారు.వీరి నేతృత్వంలో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం..మానవాళి సంక్షేమానికి మరింత కృషి చేస్తుందని.. కృషి చేయాలనీ ఆకాంక్షిద్దాము. మతం పేరు మీదుగా మనుషులు విడిపోతున్న ఈ కాలంలో.. మతాతీతంగా మనుషుల్ని మానవతా స్ఫూర్తితో కలిపి ఉంచే.. ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఎంతగానో వర్ధిల్లాలి. అదే నా ఆశ,ఆకాంక్ష.
-వాడ్రేవు సుందర్రావు (నంది గరుడ అవార్డుల గ్రహీత, తణుకు)
చాలా అధ్బుతం గా ఉంది. ఈ సమాజంలో మత సంఘర్షణలను పూర్తి గా రూపు మాపాలని సమాజంలో చాలా అధ్బుత మైన పాత్ర పోషిస్తున్న పీఠం కూ,గురువర్యులకూ మన నమస్సుమాంజలి.ధన్యవాధములు
Very heart touching and inspiring article by Sri Vadrevu SundaraRao garu. He wrote in such way that the impeccable selfless services of Sri Viswa Viznana Vidya Adhyathmika Peetham will inspire the reader to do social service and inculcate a feeling of ” All pervading God is one”. ThanQ sir for the wonderful presentation.