రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు?

1935లో హైదరాబాదు, ఆ తరువాత సెప్టెంబర్ 10 నాడు మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. 1937 సెప్టెంబర్ 30 నాడు తిరువాన్కూర్ సంస్థానం ఒక రేడియో కేంద్రాన్ని నెలకొల్పింది.
హైదరాబాదు నుంచీ, మద్రాసు నగర పాలక సంస్థ రేడియో నుంచి ప్రసారమైన తెలుగు రేడియో కార్యక్రమాల వివరాలు లభ్యం కావడం లేదు. కనుక రేడియోలో తెలుగు ప్రసారాల ప్రస్తావన గురించి తెలుసుకోవడానికి 1938 జూన్ 16 నాడు మొదలయిన మద్రాసు రేడియో కేంద్రం చరిత్రను పరిశీలించాలి. ఆ నాడు ఆ కేంద్రాన్ని అప్పటి మద్రాసు గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు ( Lord Erskine) రాష్ట్ర ప్రధాన మంత్రి (ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ముఖ్యమంత్రి) చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటుచేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ వస్తున్నప్పటికీ, రాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన ప్రారంభోపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అనే ప్రస్తావించారు.
ఆ కేంద్రం ఆ సాయంకాలం ఐదున్నరకు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించిన ‘శ్రీ గణపతిని సేవింప రారే’ అనే తెలుగు కృతిని తిరువెణ్ కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా మొదలయింది. రాజాజీ ప్రారంభోపన్యాసం తరువాత సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గాత్ర కచేరీ, తిరిగి సుబ్రహ్మణ్యపిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి. ఆ వెంటనే రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము – రేడియో’ అనే విషయం గురించి, సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. (జస్టిస్ పార్టీ నాయకులలో ఒకరయిన నాయుడు గారు 1939 ఏప్రిల్ ఒకటి నుంచి 14 దాకా ఉమ్మడి మద్రాసు ప్రధానిగా పనిచేశారు) మద్రాసు రేడియో కేంద్రం నుంచి తొలి ప్రసంగం చేసిన ఖ్యాతి కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆయన అప్పుడు చేసిన ప్రసంగం లోని మొదటి వాక్యాలు ” నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వుండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్ లో రేడియో అనెదరు.”
రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ‘ఆకాశవాణి’ వాడిన సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికీ ప్రసార సాధనాలకు వర్తిస్తాయి. ఆయన ఇలా చెప్పారు.”యెంత మంచి వస్తువయిననూ మంచిదే కాక చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షములవారు తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు, వైరులను (విపక్షాలను) తక్కువచేసి చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశము నందు అన్నింటికంటే విద్యావ్యాప్తి చాలా ముఖ్యము. కనుక, ఆకాశ వాణిని సర్వజనోపయోగకరమైన విషయములందును, ఆనందము కలుగచేయు పనుల యందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని నా హెచ్చరిక”.
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap