ఆకాశంలో సగం అని నినదించే అతివలు కుంచెలు చేతబట్టి తమ సృజనకు పదునుపట్టి కాన్వాసులపై కనువిందు చేసే రమనీయ చిత్రాలనే కాదు, అనేక సామాజిక సమస్యలకు చిత్ర రూపం కల్పించారు. ఆకాశంలో సగం – అవకాశంలో సగం కాదు – మహిళా శక్తి విశ్వవ్యాప్తం అని చాటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సృజనాత్మక సమితి మరియు కొలుసు ఫైన్ ఆర్ట్స్ స్టూడియో వారు ‘స్త్రీ శక్తి ‘ పేరుతో విజయవాడ లోని సంగీత కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించే వర్క్ షాప్, చిత్రకళా ప్రదర్శన మార్చి 7 న ప్రారంభమైంది. కార్యక్రమాలను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ దీర్దాసి విజయభాస్కర్ ప్రారంభించి, మాట్లాడుతూ స్త్రీ శక్తి విశ్వవ్యాప్తమని, భాషా సాంస్కృతిక శాఖ తెలుగువారి సంస్కృతి సంప్ర దాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. చిత్రకళాప్రదర్శన మూడు రోజులపాటు సాగుతుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న చిత్రకారిణులను సత్కరించారు.
కార్యక్రమంలో వివిధ అకాడమీలకు చెందిన చైర్మన్లు గుమ్మడి గోపాల కృష్ణ (నాటక అకాడమీ), కొలకలూరి ఇనాక్ (ఏపీ, సాహిత్య అకాడమీ) వందేమాతరం శ్రీనివాస్, ఎసీవీ సత్యనారాయణ (సంగీత నృత్య అకాడమీ), పొట్లూరి హరికృష్ణ(జానపద అకాడమీ) పాల్గొని నిర్వహకులను, చిత్రకారిణులను అభినందించారు. కార్యక్రమాలను కొలుసు ఫైన్ ఆర్ట్స్ స్టూడియో నిర్వాహకులు కొలుసు సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.
స్త్రీల సమస్యలే ఇతివృత్తాలు …
రాష్ట్రంలోని 13 జిల్లాలనుంచి వచ్చిన 50 మంది చిత్రకారిణులు- మహిళలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఈవ్ టీజింగ్, గృహహింస, స్త్రీ శక్తి, మాతృత్యంలోని మాధుర్యం, మేధోవలస, ఆలోచనల ప్రతిబింబం, ప్రకృతితోమమేకం తదితర అంశాలతో వేసిన చిత్రాలు వీక్షకులను ఆలోచింపజేసాయి.