దేశం గర్వించే గొప్ప దర్శకుడు – నర్సింగ్ రావు

ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు, స్వరకర్త, పెయింటర్‌, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి బి. నరసింగరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు !

తెలంగాణాలోని ప్రజ్ఞాపూర్‌లో 1946 డిసెంబర్ 26 న జన్మించిన నర్సింగ్ రావు అణచివేతకు గురైన ప్రజల పక్షాన నిలబడ్డారు. ఆంధ్ర ఆధిపత్యాన్ని ధిక్కరించి తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా ఉన్నారు.

తెలంగాణ సాంస్కృతిక వికాస ఉద్యమకారుడు, ప్రముఖ సృజనశీలి, ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన బి. నర్సింగ్ రావు గురించిన అవగాహన నేటి తరానికి ఎంతో అవసరం. బహుళ కళారంగాల్లో తన దైన గుర్తింపు సాధించిన అరుదైన అసాధారణ మనిషి నర్సింగ్ రావు.

బహుళ కళారూపాల్లో తన సృజనను ఉచ్ఛస్థాయిలో చూపిన ఆయన జీవిత ప్రయాణాన్ని చూస్తే ఇది అతిశయోక్తి అనీ అనిపించవు. సృజనాత్మక రంగాల్లోఅనేక రూపాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయన థియేటర్, సినిమా, సంగీతం, సాహిత్యం, పెయింటింగ్, శిల్పం, ఫొటోగ్రఫీ, ఫోక్‌లోర్, ఆంథ్రపాలజీ, ఎత్నోగ్రఫీ వంటి క్షేత్రాల్లో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నరు.
…….
1984లో ఆయన ‘రంగుల కల’ సినిమాను ముంబయిలోని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివ్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ భారత సినిమాలపై ఓ పుస్తకాన్ని ప్రచురించింది. అందులో రచయిత ఉమాదా చునా రాసిన ప్రముఖ వ్యాసంలో నర్సింగ్ రావును సాంస్కృతిక వికాస పురుషుడు అని పేర్కొంది. ఈ పదం ఆయన అసాధారణ జీవితానికి సరిగ్గా సరిపోలుతుంది.
…..
ఈయన మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్లో జన్మించిన ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా వాటి ప్రభావం, ప్రత్యేక ముద్ర మాత్రం విశ్వానికి వ్యాపించింది. తెలంగాణ జీవన చిత్రాలనే తన సినిమాలుగా రూపొందించిన అచ్చమైన స్వచ్ఛమైన ప్రజాకళాకారుడు. ఆయన తీసిన ఒక్కో సినిమా ‘తెలంగాణ సినిమా’కు ఓ గ్రామర్, బలమైన పునాదిని సృష్టించింది.
…..
రంగుల కల, దాసి (1988 సినిమా), మట్టి మనుషులు, సినిమాలే అందుకు ఉదాహరణ. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించింది. నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, అనేక అంతర్జాతీయ గౌరవాలు పొందారు. మా భూమి సినిమాను 1979 లో కైరో, సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్స్, కార్లోవీ ఫిల్మ్ ఫెస్టివల్ లో వారీ ప్రదర్శించారు. 1989లో దాసి, 1991లో మట్టి మనుషులు మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లొమా గెలిచింది. మా ఊరు హంగేరి అంతర్జాతీయ ఉత్సవంలో మీడియా వేవ్ అవార్డును గెలుచుకుంది. ఈయన దర్శకత్వం వహించిన హరివిల్లు (ఫిచర్ ఫిల్మ్) 2003 లో 56వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైనది.
……
పది జాతీయ, తొమ్మిది రాష్ట్ర అవార్డులు సహా అంతర్జాతీయంగా అసంఖ్యాక పురస్కారాలను బి నర్సింగ్ రావు పొందారు. తెలంగాణ పై ఉన్న గాఢమైన ప్రేమనే ఆయనను సృజనాత్మకంగా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదం చేశాయని అర్థం అవుతాయి. ఎందుకంటే.. ఆయన సృజన మొత్తం కూడా తెలంగాణ ప్రాంతం, అరుదైన సాంస్కృతిక సంపద, తెలంగాణ ప్రజలు, మైమరిపించే జానపదాల చుట్టే బి. నర్సింగ్ రావు క్రియేటివిటీ తిరుగుతూ ఉంటుంది.

  • అరుదయిన పురస్కారాలు అందుకున్న వ్యక్తి….
    2007లో హైదరాబాద్‌లో నిర్వహించిన డైమండ్ జూబిలీ వేడుకల్లో ఎక్స్‌లెన్స్ అవార్డును బి నర్సింగ్ రావుకు ప్రదానం చేశారు. కైరో (2004), బుడాపెస్ట్ (1999), బెర్గామో, ఇటలీ (1994), బెర్లిన్, మాస్కో, చెకోస్లోవేకియా, మ్యూనిచ్‌లలో భారత సినిమా ఫెస్టివల్స్‌లో గౌరవించారు. ఫ్రాన్స్, స్లోవేకియా, స్విట్జర్లాండ్, కెనడా, స్వీడన్,ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇరాక్, జర్మనీ, ఇటలీ, రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ సినిమా వేడుకల్లో బి నర్సింగ్ రావు సినిమాలు ప్రదర్శించారు.
  • ఫెడరేషన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ సింగపూర్ బోర్డ్ సభ్యుడుగా….
    ఆయనలోని బహుళ కళాకారుల సామర్థ్యానికి గుర్తుగానే ప్రముఖ ఫెడరేషన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ సింగపూర్ బి నర్సింగ్ రావును 2021లో బోర్డులోకి తీసుకుంది. 160 దేశాల సభ్యత్వం కలిగిన ఈ సంస్థలో కేవలం 12 సెలెబ్రిటీలు మాత్రమే గౌరవ సలహాదారులుగా నియామకం కావడం గమనార్హం. ఇది బి నర్సింగ్ రావు విశేషమైన వ్యక్తిత్వానికి, ఆయన విజయాలకు నిదర్శంగా ఉంటుంది. మొరాకో, ఫిలిప్పీన్స్‌ల నుంచి డాక్టరేట్ పొందిన ఆయనను సింగపూర్, యూకేలు గౌరవించాయి. కజక్‌స్తాన్, వెనెజులాలు వాటి అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి. మా భూమి, రంగులకల, దాసి,మట్టి మనుషఉలు, హరివిల్లు వంటి సామాజిక అంశాలపై తీసిన సినిమాలకు గాను ఆయనను గౌరవించని అంతర్జాతీయ సంస్థ లేదు.
  • చిత్రసమాహారం…
    *డైరెక్టర్ గా…
    1) రంగుల కల (1983)
    2) ది కార్నివాల్ (డాక్యుమెంటరీ, 1984)
    3) ది సిటీ (డాక్యుమెంటరీ, 1985)
    4) మా ఊరు (డాక్యుమెంటరీ, 1987)
    5) దాసి (1988)
    6) మట్టి మనుషులు (1990)
    7) హరివిల్లు (2003)
  • స్క్రీన్ ప్లే రచయితగా…
    1) మా భూమి (అనుకరణ / డైలాగ్, 1979)
    2) దాసి (రచయిత, 1988)
    3) హరివిల్లు (అనుకరణ / కథ, 2003)
    *సంగీత దర్శకుడు గా…
    1) మా భూమి (1979)
    2) హరివిల్లు (2003)
    *నిర్మాతగా….
    1)మా భూమి (1979)
    2) దాసి (1988)
  • నటుడిగా…
    రంగులకల (1983)
    “””””””””””””””””””””””””””””””””””””””””'”””””””””””””‘”””””””””””‘”””””””””””‘”””””””””””
    దొరికితే కాల్చేస్తారు..రెండేళ్లు అండర్‌గ్రౌండ్‌.. కట్‌ చేస్తే.. దేశం గర్వించే గొప్ప దర్శకుడు – ఖదీర్‌
    “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””‘”””””””””””‘”””””””””””
    తెలుగు సినిమా ఇప్పుడు సెకండ్‌ హాఫ్‌కు వచ్చింది. ఈ సెకండ్‌ హాఫ్‌ తెలంగాణ సినిమాది. తెలంగాణ హీరో, తెలంగాణ హీరోయిన్, తెలంగాణ పల్లె, తెలంగాణ పలుకుబడి. తెలంగాణ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అయ్యింది. ఇకపై తెలంగాణ లేకుండా తెలుగు సినిమా మనజాలదు. ఈ కొమ్మరెమ్మల పూలు ఫలాలకు ఒకప్పుడు పాదు కట్టినది బి.నరసింగరావు.‘ఈ మట్టికి ఒక చరిత్ర ఉంది. ఈ మాటకు ఒక మిఠాస్‌ ఉంది. ఇక్కడి పేదకు ఒక గాథ ఉంది. ఇక్కడి ఆగ్రహానికి ఒక ఆయుధం ఉంది’ అని తెలుగు సినిమాలోకి తెలంగాణ జీవనాన్ని మొదటగా తీసుకువచ్చిన దర్శక నిర్మాత బి.నరసింగరావు. న్యూ సినిమా, ఆర్ట్‌ సినిమా, నియో రియలిస్టిక్‌ సినిమా, పారలెల్‌ సినిమా, ఆఫ్‌బీట్‌ సినిమా.. ఇలా రకరకాల పేర్లతో నవ సినిమా ఉద్యమం ప్రపంచమంతా వికసిస్తున్నప్పుడు ఆ ప్రభాతం వైపు చూపుడువేలు తిప్పి అటుగా దృష్టి ఇచ్చిన దార్శనికుడు బి.నరసింగరావు. ఆయన వల్ల తెలుగు సినిమా తల ఎత్తుకు తిరిగింది. ఆయనకి తెలంగాణ సినిమా తల వొంచి నమస్కరిస్తుంది.

    ప్రజలు వెలుతురులో ఉండాలనుకునేవాడు ఒక్కోసారి చీకటిలో దాక్కోక తప్పదు.బి. నరసింగరావు పరిస్థితి అలాగే ఉంది 1975లో.
    ……
    ‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది’ అనుకునేవారు అడవుల్లోకి మళ్లారు. ‘కుంచెతో కలంతో కూడా ప్రజలను రాజ్యాధికారం వైపు నడిపించవచ్చు’ అని మరికొందరు జనం మధ్య ఉండిపోయారు. కళ అంటే ప్రజాకళ.. కళాకారుడికి ఉండవలసిన దృక్పథం అభ్యుదయ దృక్పథం.. రచన కూడా ఉద్యమమే.. నాలుగు వాక్యాల కవిత కూడా డైనమైటే.. అనుకునే కళాకారులు తయారవుతున్న సమయం అది. దీని కంటే ముందు ‘ఆర్ట్‌ లవర్స్‌’ పేరుతో ఒక సమూహాన్ని సిద్ధం చేసి సామన్యుల వద్దకు నాటకాన్ని విస్తృతంగా తీసుకెళుతున్న బి.నరసింగరావు 1974 నాటికి ప్రభుత్వానికి ‘వాంటెడ్‌’ అయ్యారు. ‘దొరికితే కాల్చేస్తారు. లేదా జైల్లో వేస్తారు’ అని తెలిసిపోయింది.
  • బి.నరసింగరావు చేసిన నేరం?
    ప్రజల్ని చైతన్యపరచడం. ప్రజలు చైతన్యం కావడం పాలకులకు నచ్చదు. ‘పొత్తుల వ్యవసాయం’, ‘సమాధి’, ‘బీదలపాట్లు’, ‘కొత్తమనిషి’ వంటి నాటకాలు స్వయంగా రాసి, నటిస్తూ, ‘మీ పరిస్థితి ఇలా ఉంది.. మీరిలా చేయాలి’ అని ‘నూరి పోస్తున్న’ బి.నరసింగరావు కనుకనే ప్రభుత్వానికి ‘వాంటెడ్‌’ అయ్యారు.
    ……
    1974–75. రెండేళ్లు. ‘అండర్‌గ్రౌండ్‌’. హైదరాబాద్‌లోనే అజ్ఞాత జీవితం. ఉదయం ఐదున్నరలోపు ఎవరినైనా కలిస్తే కలవాలి. రాత్రి తొమ్మిది తర్వాత మళ్లీ. సూర్యుడు తిరుగాడే సమయంలో తిరుగాడ్డానికి వీల్లేదు. పగలంతా గదిలో బందిఖానా అయి ఉన్న నరసింగరావులో ఎన్నో ఆలోచనలు. ‘నేను కళాకారుణ్ణి.. నా కళ జనం చూడాలి.. దానికి స్పందన నేను చూడాలి.. అడవిలోకో అండర్‌గ్రౌండ్‌లోకో వెళ్లేలా నా కళా జీవితం ఉండకూడదు.. నా కళ వెలుతురులో ఉండాలి’.. అనే నిర్ణయానికి వచ్చారు. 1976లో అండర్‌గ్రౌండ్‌ నుంచి బయటకొచ్చాక ఆయన పెట్టుకున్న మూడు ఆప్షన్లు.. భగత్‌ సింగ్‌ గురించి ఒపెరా మాదిరిగా రవీంద్ర భారతిలో ఆరు నెలలు వరుసగా నాటకం ఆడటం లేదా ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ లాంటి మేగజీన్‌ను నడపడం లేదా సినిమా తీయడం.

    అసలు దొరల కుటుంబంలో బంగారు చెమ్చాతో పుట్టిన బి.నరసింగరావు సినిమాల్లో చూపినట్టుగా గుర్రం ఎక్కి తిరుగుతూ అమాయకులను భయభ్రాంతం చేస్తుండాలి గాని ఈ నాటకాలు, పాటలు, పదుగురితో కలసి చాయ్‌ సిగరెట్ల మధ్య సాహిత్యాన్ని చర్చించడాలు.. ఏమిటిలా.. ఎందుకిలా?

    ‘లెక్కలు వచ్చేవి కావు. ఎక్కాలు చెప్పలేకపోయేవాణ్ణి. మా నాన్న ఎంత పెద్ద పట్వారీ అయినా లెక్కల పంతులు ఎండలో ఒంటికాలి మీద నిలబెట్టేవాడు. పదో క్లాసు పాస్‌ అవడం కూడా కష్టమైంది. అందరూ చదివే చదువు వల్ల కాదనిపించింది. అందుకే ఆ తర్వాత ఫైన్‌ ఆర్ట్స్‌లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ చదివాను’ అంటారు బి.నరసింగరావు. గజ్వేల్‌ (మెదక్‌)కు దగ్గరగా ఉన్న ప్రజ్ఞాపూర్‌ బి.నరసింగరావుది. కాని ఆ తర్వాతి జీవితం అంతా హైదరాబాద్‌లో ‘అల్వాల్‌’లో గడిచింది. ‘హైదరాబాద్‌లోని రీగల్‌ థియేటర్‌లో నా చిన్నప్పుడు చూసిన తొలి సినిమా ‘మేనరికం’ (1953). ఆ తర్వాత హిందీ ‘సువర్ణసుందరి’ చూశాను. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కాలేజ్‌కి వెళ్లనే లేదు. దాని పక్కనే ఉండే థియేటర్లలో ఉండేవాణ్ణి’ అంటారాయన.

    పుస్తకాల పిచ్చి కూడా అలాగే పట్టింది. ‘మా నాన్నగారి గదిలో చాలా పుస్తకాలు ఉండేవి. ఒకసారి వాటిని చదవడం మొదలెట్టి 40 రోజుల్లో 60 పుస్తకాలు చదివాను. ఆ తర్వాత కోఠి లైబ్రరీలో మకాం వేశాను. టెక్ట్స్‌బుక్స్‌ కన్నా ఈ పుస్తకాలు నాకు నచ్చాయి. అధికారం, దర్పం కన్నా గోడ మీద పడే ఉదయపు ఎండ నన్ను ఎక్కువ సంతోషపెట్టేది’ అని గుర్తు చేసుకున్నారాయన.
    సాహిత్యం, సినిమాలు, నాటకాలు, చిత్రలేఖనం.. ఇవన్నీ బి.నరసింగరావును చేర్చవలసిన చోటుకే చేర్చాయి– సినిమాకు– తన భూమికి– మాభూమికి.
    సందర్భవశాన మన దేశ దాదాపు తొలి నియో రియలిస్టిక్‌ సినిమా ‘దో బిఘా జమీన్‌’ (1953) భూమి సమస్యనే చర్చించింది. పేదవాడికి దక్కని భూమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూవేవ్‌ సినిమా, న్యూ సినిమా మొదలయ్యిందే పేదల గురించి పీడకుల గురించి మాట్లాడటానికి. నిర్మాతల, నటీనటుల గుప్పిట్లో ఉండే కాలక్షేప సినిమాను దర్శకుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తెలియని ముఖాలతో, మామూలు మనుషులనే నటులుగా చేసి తక్కువ ఖర్చు, తక్కువ వనరులతో ప్రయోజన్మాతక సినిమాను చెప్పడమే న్యూ సినిమా.

    సత్యజిత్‌ రే వచ్చి ‘పథేర్‌ పాంచాలి’ (1955) తీసి ఆర్ట్‌ సినిమా అనే మాటను దేశానికి పరిచయం చేశాడు. అయితే ఒక ధోరణిగా ఆర్డ్‌/పారలెల్‌ ఫిల్మ్స్‌ రావాలంటే 1970లు రావాల్సి వచ్చింది. హిందీలో ఎం.ఎస్‌.సత్యు ‘గరం హవా’ (1973), శ్యాం బెనగళ్‌ ‘అంకుర్‌’ (1974) పారలెల్‌ సినిమాను తీసుకొచ్చాయి. మరోవైపు మలయాళంలో ఆదూర్‌ గోపాల్‌కృష్ణన్‌ వచ్చి ‘స్వయంవరం’ (1972) తీశాడు. కన్నడంలో మన తెలుగు పఠాభి ‘సంస్కార’ (1970) తీశాడు. కాని గమనించవలసిన విషయం ఏమిటంటే తెలుగులో పారలెల్‌ సినిమా ముగ్గురు బయటి దర్శకుల వల్ల వచ్చింది. మృణాల్‌సేన్‌ ‘ఒక ఊరి కథ’ (1977), శ్యామ్‌ బెనగళ్‌ ‘అనుగ్రహం’ (1977), గౌతమ్‌ ఘౌష్‌ ‘మాభూమి’ (1979). ఈ ‘మాభూమి’ బి. నరసింగరావు చెమటా, నెత్తురు, తెలంగాణ సినిమాకు ఆయన తెరవాలనుకున్న తొలివాకిలి.

    నవయుగ డిస్ట్రిబ్యూటర్స్‌ ప్రసాదరావు గారి అబ్బాయి రవీంద్రనాథ్‌ నా క్లాస్‌మేట్‌. వాడు కూడా ఎమర్జన్సీ టైమ్‌లో కోల్‌కతా వెళ్లి అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. తిరిగి వచ్చాక వాణ్ణి ప్రొడక్షన్‌లో పెట్టారు. మృణాల్‌సేన్‌ ‘ఒక ఊరి కథ’కు వాడు పని చేస్తుంటే నేను వెళ్లేవాణ్ణి. అప్పటికే నాకు సినిమా తీయాలని ఉంది. దర్శకత్వం చేయాలని ఉంది. కాని ఎలా తీయాలో తెలియదు. ఒక లక్ష రూపాయల్లో సినిమా తీయమని మృణాల్‌సేన్‌ను అడిగితే అంత తక్కువలో నేను చేయలేను.. కొత్త కుర్రాడొకడున్నాడు..అతన్ని ఉపయోగించుకో అని గౌతమ్‌ ఘోష్‌ను పంపారు.

    తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం నేపథ్యం ఉన్న కిషన్‌ చందర్‌ నవల ‘జబ్‌ ధర్తీ జాగే’ను తీసుకున్నాం. గౌతమ్‌ ఘోష్‌ దానికి రాసుకొచ్చిన స్క్రీన్‌ప్లే నాకు నచ్చలేదు. మళ్లీ కూచుని అందరం రాశాం. దర్శకత్వం ఎలా చేయాలో తెలుసుకుందామంటే గౌతం ఘోష్‌ నేర్పే మనిషి కాదు. అందుకని అతని వెంటే తిరుగుతూ అబ్సర్వ్‌ చేస్తూ సినిమా తీయడం తెలుసుకున్నాను’ అంటారు బి. నరసింగరావు.

    1980లో తెలుగులో రిలీజైన రెండు సినిమాలు ‘శంకరాభరణం’, ‘మాభూమి’ సంచలనం సృష్టించాయి. కె. విశ్వనాథ్‌తో ప్రయోగం అంతో ఇంతో సేఫ్‌. కాని తెలంగాణ సినిమా కొత్తవాళ్లతో తీసి విడుదల చేయడం చాలా రిస్క్‌. ‘లక్ష అనుకున్న బడ్జెట్‌ ఐదున్నర లక్షలు అయ్యింది. ఆస్తి అమ్మాల్సి వచ్చింది. మొత్తం ఔట్‌డోర్‌లో తీయడం వల్ల ఎన్నో సమస్యలు. అందరూ పడి దెబ్బలు తగిలించుకునేవారే. రోజుకు ఒక అయొడిన్‌ సీసా అయిపోయేది’ అన్నారు బి.నరసింగరావు. కాని ఆ శ్రమ వృథా పోలేదు. ‘మాభూమి’ తెలంగాణ కథకు, సినిమాకు అరుగు కట్టింది. దాని మీద బంగారు నందిని కూచోబెట్టింది. హైదరాబాద్‌లో వంద రోజులు ఆడి అందరినీ చకితులను చేసింది. ఇదే సినిమాతో గద్దర్‌ని బి. నరసింగరావు యుద్ధనౌకను చేసి జనంలోకి వదిలారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పెద్ద హిట్‌.

    ‘రంగుల కల.. దర్శకుడిగా నా మొదటి సినిమా. మన దేశంలో మోడర్న్‌ పెయింటర్‌ మీద అప్పటికి ఒక్క సినిమా లేదు. జీవితంలో, కళలో ఒకేసారి దారి తెన్నూ వెతుక్కునే చిత్రకారుల కథ అది. కళ ప్రజల పక్షం ఉండాలి సరే. కళాకారుడు ఏ విధంగా బతకాలి. అతణ్ణి ఎక్స్‌ప్లాయిట్‌ చేసే వర్గాల కళారాధనలో బోలుతనం ఎంత.. ఇవన్నీ చర్చించాను. పస్తుల చిత్రకారుల 1980ల స్థితికి దర్పణం ఆ సినిమా’ అన్నారు బి. నరసింగరావు. ‘రంగుల కల’ (1983)లో బి. నరసింగరావు హీరో. హైదరాబాద్‌ నగరం ఇందులో ఒక పాత్రధారి. ఒక స్లమ్‌లో నివసించే చిత్రకారుడిగా ఆయన నటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రూప హీరోయిన్‌. గద్దర్‌ పాడిన ‘భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న’ పాట రేడియోలో నిత్యం మోగిపోయింది.

    ‘సీనియర్‌ జర్నలిస్ట్‌ జి.కృష్ణగారు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. అప్పుడాయనొక మాట చెప్పారు– నరసింగరావు.. 1940ల్లో నేనొక దొరల గడీకి వెళ్లాను. అక్కడ ఒక దాసి నా కాళ్ల మీద నీళ్లు పోసి కడగడానికి వచ్చింది. నా కాళ్లు నేను కడుక్కోలేనా అన్నాను. ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో కడిగించుకుంటారు మీరు కాళ్లకే ఇబ్బంది పడితే ఎలా అంది. అలా కడిగించుకునే మనుషులు ఎలాంటి వాళ్లు– అన్నారు. ఆ మాట నా మనసులో పడింది. మా నాన్న హయాంకు మా ఇంట్లో దాసీలు లేరు. నేను చూళ్లేదు. నేను నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్లి మనింట్లో దాసీలు ఉండేవారా అనంటే నిన్ను చిన్నప్పుడు చూసుకున్న లచ్చవ్వ దాసీయే కదా అంది. లచ్చవ్వ నా చిన్నప్పటికి ముసలిదైపోయింది. అంటే మా తాతల కాలంలో ఉండేవారన్న మాట. అక్కడి నుంచే దాసి సినిమా కథ పుట్టింది’ అన్నారు బి. నరసింగరావు.
    ……
    1988లో వచ్చిన ‘దాసి’ తెలంగాణ సినిమా కీర్తిని, తద్వారా బి. నరసింగరావు కీర్తిని ప్రపంచానికి చాటింది. ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోని అనేక సినిమా స్కూళ్లలో ఆ సినిమా సిలబస్‌. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆ సినిమా చూసి కదిలిపోయి బి. నరసింగరావుకు ఫ్యాన్‌గా మారారు. తనకు ఆత్మీయులను చేసుకున్నారు. ఏమిటి ‘దాసి’ గొప్పతనం? అది వేదనను సహజంగా చెప్పింది. మనుషులు క్రూరత్వాన్ని సాధారణ విషయంగా భావించేలా జీవిస్తుంటారు.
    ఎదుటివారిని హింసించడం వారి ఖర్మ వల్లే అనుకుంటారు. పశ్చాత్తాపం ఎరగని ఇలాంటి మనుషులు ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూనే ఉన్నారు. నటి అర్చన ఈ సినిమా మొత్తం ఒకటి రెండు చీరల్లో కనిపిస్తుంది. ఆమెతో దొర గడిపినా ఆమె హోదా ఏమీ మారదు. వంట గదిలో చాలా ఘోరమైన బొచ్చెలో తిండి పెడతారు. ఆమెకు కడుపు వస్తే అది వెలి కడుపు. దొరసానికి కడుపు రాకపోయినా పర్లేదు కాని దాసిదానికి రాకూడదు. ‘కడుపు తీయించు’ అని దొరసాని హుకుం జారీ చేస్తే గడిలోని ముసలి దాసి పచ్చి బొప్పాయి కాయని కత్తి పీట మీద రెండుగా కోస్తుంది. ప్రేక్షకులకు గుండె ఝల్లుమంటుంది. తీవ్రమైన హింస అతి మామూలుగా ఉంటుందని బి. నరసింగరావు చూపుతారు. నేటికీ ‘దాసి’ చూడకపోతే తెలుగువారు ఒక కాలాన్ని ఒక జీవన వేదనని తెలుసుకోనట్టే. అందుకే ముసోరి ట్రైనింగ్‌లో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్‌లకు ఈ సినిమా చూపిస్తారు.
    ……
    బి. నరసింగరావుకు సినిమా ఆదాయ మార్గం కాదు. కాంబినేషన్‌ సెట్‌ చేసి అడ్వాన్సులు తీసుకోవడం కాదు. ఏరియా వారి కలెక్షన్లు కాదు. సినిమా అనేది బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ‘నా సినిమాలు చూశాక అవి చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి’ అంటారాయన. బి. నరసింగరావు తీసిన ‘మట్టి మనుషులు’ భవన నిర్మాణ కూలీల వ్యథాత్మక జీవితాన్ని చూపిస్తుంది. ఆ సినిమాలో కూలీల పై సాగే భౌతిక దోపిడి ఒక ఎత్తయితే వారిలో స్త్రీల పై సాగే లైంగిక దోపిడి మరో ఎత్తు. ‘మట్టి మనుషులు’ చూస్తే భవన నిర్మాణ కూలీల పట్ల సగటు మనిషి వైఖరి మారుతుంది. ఇదే కాదు హైదరాబాద్‌ నగరం మీద ‘ది సిటీ’, ఊరి జీవనం మీద ‘మా ఊరు’ డాక్యుమెంటరీలు తీసినా గాఢంగా ముద్రవేసే జీవన దృశ్యాలు. ‘మా ఊరు’ అయితే భావి తరాల కోసం దాచి పెట్టిన తాళపత్రగ్రంథం.

    బి. నరసింగరావు ఇప్పుడు డెబ్బయిల వయసు దాటారు. కాని నిత్యం సినిమా గురించో చిత్రకళ గురించో ఏదైనా కవిత్వం గురించో కథ గురించో పని చేస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్‌తో వేలకొలది ఫొటోలు తీస్తూ ప్రతి కొత్త సాంకేతిక పరికరం సాంస్కృతికంగా ఎలా ఉపయోగపడుతుందో చూస్తుంటారు. ఆయన తెలంగాణ సినిమాకు భూమిక ఏర్పరచకపోతే ఇవాళ ఊరూరా ప్రదర్శించిన ‘బలగం’ లాంటి సినిమాలు ఇప్పటికీ సాధ్యమయ్యేవి కావు. ‘తెలంగాణ ఏర్పడ్డాక సాంస్కృతికంగా చేయవలసింది చాలా ఉంది’ అంటారాయన. ‘అందుకై ప్రత్యేకంగా ఎవరితోనూ తలపడాలని నేను అనుకోను. కాని తలపడే సందర్భం వస్తే సిద్ధంగా ఉంటాను’ అన్నారాయన.
    …….
    ఆరగడుగుల పై చిలుకు ఎత్తుతో తన నివాసంలో ఆయన తెలంగాణ సినిమా భీష్మాచార్యుడిలా కనిపించారు. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత యు.ఆర్‌.అనంతమూర్తి ‘దాసి’ చూసి పొంగిపోతూ ‘మై కంట్రీ ఈజ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ’ అన్నారట. నిజమే. ఈ గొప్ప దర్శకుణ్ణి చూసి దేశం గర్విస్తూనే ఉంటుంది.

ఖదీర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap