డి.వి. సుబ్బారావు విశ్వరూపం!

పుట్రేవు వారి పరివారం అదృష్టవంతులు. నిజంగా వారిని అభినందించాలి. హైదరాబాద్, రవీంద్రభారతి లో గురువారం(21-12-23) ప్రముఖ రంగస్థల నటులు కీర్తిశేషులు పుట్రేవు రాధాకృష్ణమూర్తి గారి 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయనకు అత్యంత ఇష్టమైన నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. పుట్రేవు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ వేడుకలో పాల్గొని కళాకారులను గౌరవించుకోవడం ఆకట్టుకుంది.

పుట్రేవు రాధాకృష్ణమూర్తి కుటుంబ సభ్యులు కలసి పురాకృతి అనే రంగస్థల కళావేదిక ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ 9వ వార్షికోత్సవం, రాధాకృష్ణమూర్తి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డివి సుబ్బారావు బృందం సత్యహరిశ్చంద్ర పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించి ఆహా అనిపించారు. వారణాసి నుంచి కాటి సీను వరకు నాటకం ఆద్యంతం సుబ్బారావు వన్ మ్యాన్ షో గా సాగి తాత డివి సుబ్బారావును గుర్తు చేశారు. నేను పదేళ్ల క్రితం సుబ్బారావు నాటకం చూశాను. అప్పట్లో కూడా బాగా రాగ రంజితంగా పద్యాలు పాడాడు కానీ, రంగస్థలాన్ని ఉపయోగించుకోవడం, పాత్రపరంగా దృష్టి పెట్టని అపరిపక్వత కనిపించి అప్పట్లో ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చాను. పైగా ఓపెన్ థియేటర్ కు, ఇండోర్ థియేటర్ తేడా కూడా తెలియక అప్పట్లో ఇబ్బంది పడ్డారు. నా సూచనలు అప్పట్లో విన్నారో లేదో తెలియదు కానీ, నిన్న డివి సుబ్బారావు ప్రదర్శన చూసాక ఎంతో తృప్తి అనిపించింది. అతను పద్యాలు పాడిన తీరు భలే ఆకట్టుకుంది. కొన్ని పద్యాలకు రొడ్డకొట్టుడు రాగాలు కాకుండా మార్చి పాడిన తీరు విపరీతంగా ఆకర్షించింది. విరుపులు, ఉచ్చారణ, నటన హావ భావాలు అన్నీ ప్రత్యేకతను సంతరించుకుని మొత్తానికి విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రేక్షకులు పులకరించి పరవశించిపోయారు. రవీంద్రభారతి సమయం దాటిపోయినా అరగంట అదనంగా ప్రేక్షకుల కోరిక మేరకు రాత్రి 11 గంటల వరకు నాటకం కొనసాగింది.

ఇక మిగిలిన పాత్రలు పోషించిన వారి గురించి పెద్దగా చెప్పుకోనక్కర లేదు. డివి సుబ్బారావు ప్రతిభ వల్ల మిగిలిన నటుల లోటు పాట్లు కొట్టుకుపోయాయి. చంద్రమతి గా విజయనగరం కళాకారిణి కె వి పద్మావతి, నక్షత్రకుడు గా బి.శాంతయ్య (మధిర), కాల కౌశికుడి గా వి.సూర్యప్రకాష్ (హైదరాబాద్), వీర బాహుడుగా వంకాయల మారుతి ప్రసాద్ (విశాఖపట్నం), విశ్వామిత్రుడు గా తోట వెంకటేష్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. సమయాభావం దృష్టిలో పెట్టుకోకుండా మారుతీ ప్రసాద్ వీర బాహుడిగా చేసిన సాగదీతకు ప్రేక్షకులు అడ్డుకున్నారు. వీరదాసుడు సుబ్బారావును త్వరగా స్మశాన సన్నివేశంలోకి వచ్చేయాలని కోరారు. కాటి సీను లో సుబ్బారావు అద్భుతంగా పద్య రాగాలతో నటనా వైవిధ్యంతో రక్తి కట్టించి ప్రశంసలు ఈలలు అభినందనలు అందుకున్నారు. చాలా కాలం తరువాత మంచి పద్యాలు జుర్రుకున్న ఆనందం కలిగింది.
వేటపాలెం డివి సుబ్బారావు నాటకం అని పెద్దగా ప్రచారం కల్పించకపోవడం తో నాలాంటి అదృష్టవంతులం ఒక 80 మంది మాత్రమే ఆద్యంతం ఈ ఆనందాన్ని ఆస్వాదించుకున్నాం. అందులో 50 మంది పుట్రేవు పరివారం మాత్రమే. నాటకాన్ని మధ్యలో ఆపవద్దని, సమయభావం వల్ల ఎవ్వరూ వన్స్ మోర్ లు కోరవద్దని, చదివింపులు కూడా నాటకం ముగిసిన తరువాత మాత్రమే ఇవ్వాలని నిర్వాహకులు ముందస్తు షరతు పెట్టడం బాగా నచ్చింది. కోపల్లె నరసింహమూర్తి, రాజశేఖర్, ల్యాంకో రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున ఆనందం తో సుబ్బారావుకు చదివించుకున్నారు. క్లారినెట్ తో ఇ. కృష్ణ (గుడివాడ), హార్మోనియంతో బి. వెంకట్రావు (గుంటూరు), కె. త్రినాధ్ (విజయనగరం) అద్భుతంగా వాద్య సహకారం అందించారు. డోలక్ ఓం ప్రకాష్ కు పాపం మైక్ సహకరించలేదు.

డి.వి. సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఉండి కూడా అక్కడున్న రాజకీయ పరిస్థితులు వల్ల సరైన సహకారం లేకపోవడం వల్ల ఏం చేయలేని అసమర్ధత స్థితిలో వున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, వ్యక్తిగతంగా తన తాత గారు పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ తరఫున కరోనా సమయంలో ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న కళాకారులకు 8 లక్షల వరకు సాయం అందించినట్లు తెలిపారు. సంగమం సంజయ్ కిషోర్ తన ప్రచురణ గ్రంధాలను డివి సుబ్బారావుకు బహూకరించారు. మల్లాది వెంకట రమణ సమన్వయం చేశారు.

డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap