‘అభినయ మయూరి’ జయసుధ

కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రదానం చేసి సత్కరిస్తారు. గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖనటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి ‘అభినయ మయూరి’ బిరుదు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు విచ్చేశారు. సీనియర్ నటి జమున, అలనాటి హీరోయిన్ రాధిక, ఎమ్మెల్యే రోజా, జీవిత, శారద, సుమధుర గాయని పి. సుశీల, నటులు మురళీ మోహన్, రాజశేఖర్, శరత్ కుమార్, బ్రహ్మానందం లతో పాటు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాసరావులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళాబంధు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాను అంటే.. ఈ కార్యక్రమాలు టీవీల ద్వారా చూసి అందరూ ఆనందిస్తారని. ప్రేక్షకుల ఆనందం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతీ సంవత్సరం పుట్టిన రోజున ఇటువంటి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. పుట్టినరోజు ఓ పవిత్రమైన రోజు.. అటువంటి రోజు మనం మన జీవితంలో ఏం సాధించాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం.. అనే విషయాలను గుర్తు చేసుకోవాలి. విశాఖను దత్తత తీసుకుని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని దేవాలయాల అర్చకులను పిలిపించి ఆశీర్వదించడం.. వాళ్ల చేత ఈ ప్రదేశాన్ని పునీతం చేయించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కళను ప్రేమిస్తాను.. కళను ఆరాధిస్తాను.. కళను గౌరవిస్తాను. అందుకే కళాకారులకు సత్కారం చేస్తున్నాను. శివాజీ గణేశన్, అక్కినేని నాగేశ్వరారావు.. ఇలా ఎందరో నటీనటులను సత్కరించినట్లుగా దాదాపు 46 ఏళ్ల పాటు వివిధ పాత్రల్లో జీవించి, పాత్రల్లో లీనం అయిపోయిన జయసుధకు ‘అభినయ మయూరి ‘ అవార్డును ఇస్తూ సత్కరిస్తున్నా” అని చెప్పారు. మురళీ మోహన్ మాట్లాడుతూ.. “కృష్ణదేవరాయులు.. సుబ్బరామి రెడ్డి రూపంలో మళ్లీ పుట్టాడా? అనిపిస్తుంది. ఎంతోమంది కళాకారులను, రాజకీయనాయకులను ఒకే వేదికపైకి తీసుకు రావడం చిన్న విషయం కాదు. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుబ్బిరామిరెడ్డిని అభినందించాల్సిందే. జయసుధ గారికి సత్కారం చేస్తూ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు జయసుధ గారి ముఖ కవళికలను గమనించేవారు. మనం భారీ డైలాగులు చెప్పినా కూడా జయసుధ ఒక్క ఎక్స్ప్రెషన్తో డామినేట్ చేస్తుందని అనేవారు” అన్నారు.

‘అభినయ మయూరి’ని కావడం చెప్పలేనంత ఆనందం!

చివరిగా సన్మాన గ్రహీత సహజ నటి, అభినయ మయూరి జయసుధ మాట్లాడుతూ.. “ప్రతీ సంవత్సరం సుబ్బిరామిరెడ్డి గారి పుట్టినరోజుకు వస్తుంటాం.. కానీ, ఈ సంవత్సరం నన్ను ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. వారి మీద ఎంతో గౌరవంతో ఇక్కడికి అనేకమంది వచ్చారు. సినిమాల్లో గుర్తింపు వచ్చిన తరువాత నా మొదటి ఫ్యాన్స్ అసోసియేషన్ వైజాగ్ లోనే ఏర్పాటయింది. ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారు. అలాంటి విశాఖలో గొప్ప బిరుదు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంది ప్రముఖుల మధ్య నాకు ‘అభినయ మయూరి’ బిరుదు ప్రదానం చేయడం మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉంది. టీఎస్సార్ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారు. విశాఖను ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరు. విజయనిర్మల గారిని ఎంతో మిస్ అవుతున్నాను. “పండంటి కాపురం’లో జమున గారి కూతురిగా నటించాను. ఆమె ముందు అవార్డు అందుకోవడం నా అదృష్టం” అని అన్నారు.

1 thought on “‘అభినయ మయూరి’ జయసుధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap