అజో-విభొ-కందాళం సంస్థ-2024 పురస్కారాలు

ప్రతిభామూర్తి జీవితకాల సాధన, విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన, సరిలేరు నీకెవ్వరు పురస్కారం, 2024 సం. పురస్కారాలు అజో-విభొ-కందాళం సంస్థ ప్రకటించింది.
అజో-విభొ-కందాళం సంస్థ 1994లో ఏర్పడింది. గత 30 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ పట్టణాలలో సాహిత్య-సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

“ప్రతిభామూర్తి జీవితకాల సాధన” పురస్కారం – యల్లపు ముకుంద రామారావు
“విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన” పురస్కారం – డా. రేవూరి అనంత పద్మనాభరావు
“సరిలేరు నీకెవ్వరు: విశిష్ట గిరిజన కథా సాహిత్య పురస్కారం” – మల్లిపురం జగదీష్

“ప్రతిభామూర్తి జీవితకాల సాధన” పురస్కారానికి లక్ష రూపాయలు, “విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన” పురస్కారానికి 50 వేల రూపాయలు, “సరిలేరు నీకెవ్వరు” విశిష్ట గిరిజన కథా సాహిత్య పురస్కారానికి 50 వేల రూపాయలు నగదుతో పాటు జ్ఞాపిక తో 2024 జనవరి 7 తేదీన – విశాఖపట్నం లో జరిగే సభలో సత్కరిస్తారు.

“ప్రతిభామూర్తి జీవితకాల సాధన” పురస్కార గ్రహీత – యల్లపు ముకుంద రామారావు సంక్షిప్త పరిచయం: యల్లపు ముకుంద రామారావు గారు నవంబర్ 9, 1944 లో ఎరుకలమ్మ, యల్లయ్య నాయుడు దంపతులకు ఖరగపూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఖరగపూర్, పట్టభద్రత అనకాపల్లి, స్నాతకోన్నతవిద్య గణితశాస్త్రంలో మధ్యప్రదేశ్ సాగర్ విశ్వవిద్యాలయం, ఐ.ఐ.టి. ఖరగపూర్, కంప్యూటర్ విద్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ సాగించారు. నేడు వాడుకలో వున్న రైల్వే రిజర్వేషన్ రూపకల్పనలో ముఖ్యభూమిక వహించారు. బహుళ జాతీయ సాఫ్ట్వేర్ వ్యవస్థలలో పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.
అనువాదరంగంలో ముకుంద రామారావుగారి కృషి అనితరసాధ్యం. అదేగాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు… కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి తెలుగువారు ఆస్వాదించడానికి బృహత్ గ్రంథాలు వెలువరించారు. “శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వసారాన్ని తెలుగులోకి వడగట్టి అందించారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన కవుల విశిష్ట కవితలను “నోబెల్ కవిత్వం”గా తెలుగులోకి అనువదించి ప్రకటించారు. ఒరియా కవితాస్రష్ట, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ సీతాకాంత మహాపాత్ర సుప్రసిద్ధ కావ్యం “భరతవర్షం” ఆంధ్రీకరించారు. అనేక భాషల ప్రధమ కావ్యంగా గుర్తింపు పొందిన పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాన్ని “చర్యాపదాలు” పేరుతో అనువదించి మహాయాన బౌద్ధ సిద్ధాచార్యుల ఉపదేశాన్ని తెలుగు సాహిత్యానికి అందజేశారు. బెంగాలీ బౌల్ కవిత్వాన్ని, అస్సామీ మియా కవిత్వాన్ని తెలుగువారికి పరిచయం చేశారు. కవిత్వ పరుసవేది విద్య సహజంగా అలవరుచుకున్న ముకుంద రామారావుగారు స్వీయ కవితలను కూడా 8 సంపుటాలుగా వెలువరించారు. ముకుంద రామారావు గారు బహుభాషావేత్త నిరంతరాధ్యయనశీలి భారతీయ భాషా కవిత్వాలతోపాటు, ప్రపంచ సాహిత్యంలో కవిత్వాన్ని తెలుగువారికి అనితరసాధ్యంగా పరిచయం చేస్తున్న అపురూప సాహితీవేత్త. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, భాషా పురస్కారంతోపాటు అనేక విశిష్ట సంస్థల పురస్కారాలు వీరిని వరించాయి.
………………………………………………………………………………….

‘విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన” పురస్కార గ్రహీత – డా. రేవూరి అనంత పద్మనాభరావు సంక్షిప్త పరిచయం: డా. రేవూరి అనంత పద్మనాభరావు గారు జనవరి 29, 1947 రథసప్తమి పర్వదినాన నెల్లూరు జిల్లా చెన్నూరు గ్రామంలో శారదాంబ, లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించారు. 1967లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగు ఎం.ఎ. పట్టాతోపాటు స్వర్ణ పతక గ్రహీతయైన రేవూరి వారు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా 1975 వరకు, తదనంతరం 2005 వరకు ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ ఉన్నత పదవులు చేపట్టి, దూరదర్శన్ అదనపు డైరెక్టర్ జనరల్గా పదవీవిరమణ చేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపకల్పనలో ప్రధానపాత్ర వహించారు. అష్టావధాని, కథకులు, నవలా రచయిత, అనువాదకులు, విమర్శకులు, వ్యాఖ్యాత, గ్రంథ పరిష్కర్త అయిన డా. పద్మనాభరావు గారు తెలుగు విశ్వవిద్యాలయ అనువాద పురస్కారం (1993), కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం (2000) పొందారు. విభిన్న సాహిత్య ప్రక్రియలలో నేటివరకు వీరు 120 గ్రంథాలు ప్రచురించారు. వీరి సాహిత్యంపై ఐదు విశ్వవిద్యాలయాలనుండి పరిశోధకులు ఎమ్.ఫిల్, పిహెచ్.డి. పట్టాలు పొందారు.
……………………………………………………………………………….

“సరిలేరు నీకెవ్వరు” విశిష్ట గిరిజన కథా సాహిత్య పురస్కార గ్రహీత – మల్లిపురం జగదీష్ సంక్షిప్త పరిచయం: ఆదివాసి సమాజం నుండి వచ్చి గిరిజన జీవితాల్లో ఇదివరకెవరూ స్పృశించని కోణాల్ని కథలుగా, కవితలుగా మలచి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న విలక్షణ రచయిత మల్లిపురం జగదీష్ గారు నవంబర్ 14, 1973లో పాలవలస ఆవిడ గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లాలో సుబ్బలక్ష్మి, రామారావు దంపతులకు జన్మించారు. రెండు కథా సంపుటాలు “శిలకోల”, “గురి”, ఒక కవితా సంపుటి “దుర్ల” వెలువరించారు. వీరి “మన్నెం ముచ్చట్లు” త్వరలో పుస్తక రూపంలో రానుంది. ఆదివాసీలను అడవికి దూరం చేస్తున్న శక్తుల గురించి, అడవిబిడ్డల నిత్యజీవిత పోరాటాల గురించి అర్థం చేసుకోవాలంటే జగదీష్ సాహిత్యం ఒక దిక్సూచిలా ఉపకరిస్తుందని విజ్ఞుల అభిప్రాయం. రంగినేని స్మారక కథా పురస్కారం, విమలాశాంతి స్మారక పురస్కారం, మాడభూషి రంగాచారి స్మారక సాహిత్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది మరియు గిడుగు రామమూర్తి పురస్కారాలు వీరు పొందిన పురస్కారాలలో కొన్ని. జగదీష్రు గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల, కురుపాంలో ఆంగ్ల భాషాధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap